రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత యీ సీరీస్ కొనసాగిస్తున్నాను. పూర్వభాగాల కోసం కింది లింక్ క్లిక్ చేయగోర్తాను.
1953లో డిఎంకె కొత్త కార్యక్రమం చేపట్టింది. కాటన్ మిల్లులు చౌకగా బట్టలు అందించగలగడంతో చేనేత కార్మికులు దెబ్బ తినేశారు. చేనేత కార్మికులు అరుప్పుకోట్టయ్ నుండి శ్రీ విల్లిపుత్తూరు వరకు పాదయాత్ర సాగించి తమ సమస్యలను ప్రజల దృష్టికి తెచ్చారు. ఇది అణ్నాను ఆకర్షించింది. కాంగ్రెస్ పార్టీ చరఖా ద్వారా పాప్యులర్ అయినట్లు, మనమూ చేనేత ద్వారా ప్రజల్లోకి చొచ్చుకుపోవచ్చు అని అంచనా వేశాడు. జనవరి 4, 1953ను ''చేనేతకు చేయూత దినం''గా ప్రకటించి ఆ రోజు అణ్నా, అతని కార్యకర్తలు తిరుచ్చి వీధుల్లో చేనేత వస్త్రాలు అమ్మారు. చేనేత కార్మికుల కన్నీళ్లు తుడవడానికే యిది అని ఉపన్యాసాలిచ్చారు. దానికి మంచి స్పందన వచ్చింది. అప్పణ్నుంచి చేనేతను ప్రమోట్ చేయడం పార్టీ ఉద్దేశాలలో ఒకటిగా మారిపోయింది.
1953లోనే మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పడాలని కాంగ్రెస్ పార్టీ 1908లోనే తీర్మానం చేసింది. మద్రాసు రాష్ట్రంలోనే తెలుగు ప్రాంతాల కోసం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ విడిగా పనిచేసేది. అయితే స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ భాషల వారీగా రాష్ట్రాలు విడగొడితే కలహాలు వస్తాయని భయపడి, రాష్ట్రవిభజనను వాయిదా వేయించసాగాడు. కానీ ఆంధ్రోద్యమం కొనసాగింది. దేశంలో పలుప్రాంతాల్లో యిటువంటి ఉద్యమాలు వచ్చాయి. అన్ని డిమాండ్లను పరిశీలించాలంటూ మొదటి ఎస్సార్సీని నియమించారు. చివరకు 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. చిత్తూరు జిల్లా ఆంధ్రకు వెళుతుందని ప్రకటించారు. ప్రఖ్యాత తమిళనాయకుడు, తమిళ అరసు కళగం పార్టీ వ్యవస్థాపకుడు ఎం.పి.శివజ్ఞానంకు తన స్వగ్రామమైన తిరుత్తణి (చిత్తూరు జిల్లాలో వుంది) ఆంధ్రకు వెళ్లడం యిష్టం లేకపోయింది. తిరుపతితో సహా చిత్తూరు జిల్లా మద్రాసులోనే వుండాలంటూ ఆందోళన చేపట్టాడు. తిరుత్తణిలో వచ్చే పోయే రైళ్లను కొన్ని రోజుల పాటు ఆపించాడు. అణ్నా ఆ ఉద్యమానికి మద్దతు యిచ్చాడు – పరిమితంగానే. జిల్లా కమిటీ శివజ్ఞానంకు మద్దతు యిస్తే చాలన్నాడు. రాష్ట్రస్థాయిలో చేసి తెలుగువారికి కోపం తెప్పించడం అనవసరం అనుకున్నాడు. చివరికి చిత్తూరు జిల్లాను విడగొట్టి తిరుపతిని ఆంధ్రకు, తిరుత్తణిని మద్రాసుకు యిచ్చారు.
1953 ఏప్రిల్‌లో తిరుచ్చిలో జరిగిన సమావేశంలో అణ్నా ఉత్తరాది వ్యాపారస్తులకు వ్యతిరేక ఉద్యమాన్ని ప్రకటించాడు. అప్పుడే దాల్మియాపురం ఆందోళన జరిగింది. దాని గురించి, దానిలో కరుణానిధి పాత్ర గురించి తమిళ రాజకీయాలు – 24లో రాశాను. ఈ సమావేశంలోనే ఎమ్జీయార్ డిఎంకెలో చేరాడు. అది డిఎంకెకు పెద్దవరంగా భాసించింది. కరుణానిధి, ఎమ్జీయార్‌ల మధ్య స్నేహం ఎలా వెల్లివిరిసిందో గత అధ్యాయాల్లో రాశాను. ''రాజకుమారి'' సినిమాకై పని చేసినప్పుడు యిద్దరూ కలిశారు. దాని తర్వాత ఎమ్జీయార్‌కు చిన్న పాత్రలే లభించాయి. ''మంత్రికుమారి'' (1950) కి స్క్రిప్టు రాసేటప్పుడు ఎమ్జీయార్‌కు ముఖ్యపాత్ర యివ్వాలని కరుణానిధి షరతు విధించి సాధించాడు. ''మరుదనాట్టు ఇళవరసి'' సినిమా వచ్చేసరికి కరుణానిధి చేత డైలాగులు రాయించాలని ఎమ్జీయార్ నిర్మాతలను ఒప్పించాడు. ఎమ్జీయార్‌ను పేదల పక్షపాతిగా, ధర్మవీరుడిగా, విప్లవనాయకుడిగా తెరపై తీర్చిదిద్దడమే కాక కరుణానిధి 1952 ఏప్రిల్‌లో ఎమ్జీయార్ నటిస్తున్న నాటక ప్రదర్శనకు హాజరై ''పురచ్చి నడిగర్'' (విప్లవ నటుడు) అనే బిరుదు యిచ్చాడు. 20 ఏళ్ల తర్వాత ఎమ్జీయార్ సొంతంగా పార్టీ పెట్టినపుడు అది ''పురచ్చి తలైవర్'' (విప్లవనాయకుడు)గా రూపాంతరం చెందింది. జయలలిత అదే బాటలో ''పురచ్చి తలైవి'' (విప్లవ నాయకురాలు) అని పిలిపించుకుంటోంది. కరుణానిధి చేసిన సన్మానానికి పులకితుడైన ఎమ్జీయార్ ''గాంధీవాదిగా నేను ఖాదీని ధరిస్తున్నా పెరియార్, అణ్నా ఆదర్శాలకై పాటుపడతాను'' అని ప్రకటించాడు. ఏడాది తర్వాత ఆ పార్టీలో చేరాడు కూడా.
ఎమ్జీయార్ చేరడంతో అతని అభిమానులందరూ డిఎంకె పార్టీ ఓటర్లుగా మారారు. వారి సభలకు ఎమ్జీయార్ వస్తే అతన్ని చూడడానికి జనాలు ఎగబడేవారు. డిఎంకె అభిమానులు ఎమ్జీయార్ సినిమాలను తప్పనిసరిగా చూసేవారు. ఈ విధంగా వారి మైత్రి ఉభయతారకంగా మారింది. అణ్నా ఎంత మేధావి అయినా ఎమ్జీయార్ స్టార్ కాబట్టి డిఎంకెను ఎమ్జీయార్ పార్టీగా, డిఎంకె పతాకాన్ని ఎమ్జీయార్ పతాకంగా సాధారణ ప్రజ పరిగణించారు. ''మలై కల్లన్ '' (1954- తెలుగులో ''అగ్గిరాముడు''గా తీశారు) ''మధురై వీరన్'' (1956) కరుణానిధి స్క్రిప్టుతో, ఎమ్జీయార్ హీరోయిజంతో పెద్ద హిట్లయి, ఎమ్జీయార్ పేరు యింటింటా మారుమ్రోగింది. స్వీయదర్శకత్వంలో సొంతంగా నిర్మించిన ''నాడోడి మన్నన్'' (తెలుగులో ''అనగా అనగా ఒక రాజు'' పేరుతో డబ్ అయింది) సినిమాలో ఎమ్జీయార్ డిఎంకె ఎజండా అయిన ఉచిత విద్య, దున్నేవాడికే భూమి సిద్ధాంతాలను చొప్పించాడు. అంతేకాదు, డిఎంకె జండాను రాజరికపు రోజుల్లో జండాగా చూపించాడు. ఇక అప్పణ్నుంచి దానికి ఎమ్జీయార్ జండా అనే పేరు వచ్చేసింది. ఓ సారి ఒక కారులో అణ్నా, ఎమ్జీయార్ ప్రయాణిస్తున్నారు. కారుకి డిఎంకె జండా కట్టి వుంది. చుట్టూ మూగిన ప్రజలు ''ఎమ్జీయార్ జండా'' అంటూ కేకలు వేయడంతో అణ్నా అనుచరుడు అణ్నాతో యిదేమన్యాయం? అని ప్రశ్నించాడు. అణ్నా చిరునవ్వుతో ''నీ కర్థం కావటం లేదు. ఎమ్జీయార్‌కు వచ్చే పాప్యులారిటీ అంతా పార్టీకి బలంగా మారుతుంది.'' అని జవాబిచ్చాడు. అంతేకాదు, ఆ సినిమా విజయోత్సవ సభలో ఎమ్జీయార్‌ను ఉద్దేశించి ''చెట్టుమీద ముగ్గిన పండును చూశా. ఎవరి ఒళ్లో పడుతుందా అని ఆతృతగా చూశాను. అదృష్టవశాత్తూ అది నా ఒళ్లో పడింది. వెంటనే దాన్ని నా గుండెల్లో భద్రంగా దాచుకున్నాను.'' అని ఉపన్యసించాడు. అప్పణ్నుంచి ఎమ్జీయార్‌ను అణ్నా 'ఇదయక్కని' అని వ్యవహరించసాగారు. తర్వాతి రోజుల్లో ఆ పేరుతో ఎమ్జీయార్ సినిమా వచ్చింది కూడా.
డిఎంకె పార్టీలో ఎమ్జీయార్ స్థానం బలపడిన కొద్దీ శివాజీ గణేశన్ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఎమ్జీయార్ పార్టీలో చేరిన 1953 నాటి సభలోనే శివాజీ ''అణ్నా ఆదేశిస్తే నేను సినిమా కాంట్రాక్టులన్నీ చింపి పారేసి, పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా అంకితమవుతాను.'' అన్నాడు. అయినా శివాజీపై దుష్ప్రచారం చాలా జరిగింది. తన స్నేహితుడైనా భీమ్ సింగ్ వెంట అతను తిరుపతి వెళితే ''తిరుపతి గణేశా, గోవింద గోవింద'' అని గోడలపై నినాదాలు రాశారు. నాస్తికత్వం ప్రచారం చేసే డిఎంకె సభ్యుడిగా శివాజీ తిరుపతి వెళ్లడమేమిటని ఎగతాళి. ఇదంతా తనను పార్టీ నుంచి తరిమివేయాలనే లక్ష్యంతో కావాలని తనపై పన్నిన కుట్ర అని శివాజీ వాపోయాడు. ఏది ఏమైనా కొన్నాళ్ల తర్వాత చూస్తే శివాజీ కాంగ్రెసు పార్టీలో చేరాడు. ఇలా ఎమ్జీయార్ కాంగ్రెసు నుండి డిఎంకెకు వస్తే శివాజీ దానికి వ్యతిరేక దిశలో పయనించాడు. కాంగ్రెసులోకి వెళ్లాక శివాజీ దేవుడిపై తన నమ్మకాన్ని బాహాటంగా చాటుకున్నాడు. ఎమ్జీయార్ తన నమ్మకాన్ని రహస్యంగా దాచుకుని డిఎంకె సిద్ధాంతాలను పాటిస్తున్నట్టు బూటకమాడాడు. సొంత పార్టీ పెట్టి తను ముఖ్యమంత్రి అయ్యాక ఆ ముసుగు కూడా తీసిపారేసి గుళ్లకు దానాలు, ధర్మాలు చేశాడు. డిఎంకె కార్యకర్తలు నాస్తికత్వం విషయంలో యిలా ఓవరాక్షన్ చేస్తున్నా అణ్నా మాత్రం సంయమనం పాటించేవాడు. 1953లో పెరియార్ 'దేవుడి ఏమీ చేతకానివాడ'ని నిరూపించడానికి వినాయకుడి విగ్రహాలు విరక్కొట్టే ఉద్యమం చేపట్టాడు. మీ పార్టీ కూడా పాల్గొంటుందా అని అణ్నాని అడిగితే ''మేం వినాయక విగ్రహాలూ పగలకొట్టం, వాటి ఎదురుగా కొబ్బరికాయలూ పగలకొట్టం'' అని జవాబిచ్చాడు. ఫలితం లేకుండా ఉత్తిపుణ్యాన ఎవరితోనూ చెడగొట్టుకోకూడదన్న పాఠం ఆయన అప్పటికే నేర్చుకున్నాడు. – (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)