''అచ్ఛే దిన్- బురే దిన్'' వ్యాసంలో తీస్తా సెతల్వాడ్, ఆమె భర్త ఎదుర్కుంటున్న కేసుల గురించి కొంత రాశాను. ఆమె నడిపే ఎన్జిఓ సిజెపి, మ్యూజియం గురించి నిధులు సేకరించిన సబ్రంగ్ ట్రస్టు గురించి మరిన్ని వివరాలు తెలియవచ్చాయి. అవి పాఠకులతో పంచుకోవడానికి, ఆ వ్యాసం సందర్భంగా నాపై వచ్చిన విమర్శలకు నా వివరణ యివ్వడానికి యిది రాస్తున్నాను. పనిలో పనిగా యితర వ్యాసాలపై వచ్చిన విమర్శలనూ ప్రస్తావిస్తాను, అప్రస్తుత ప్రసంగం అని తోస్తే మన్నించండి. దీనిపైనా వ్యాఖ్యలు చేయవచ్చు కానీ అన్ని భాగాలూ పూర్తిగా చదివిన తర్వాతనే ఆ పని చేయండి.
ఆ వ్యాసంలో నేను ఎక్కడా తీస్తా నడిపే ఎన్జిఓ గొప్పదని సర్టిఫికెట్టు యివ్వలేదని గమనించాలి. వారు ఎదుర్కుంటున్న కేసులేమిటి, ఎవరు పెట్టారు, దానిపై కోర్టుల్లో జరిగిన వాదోపవాదాలేమిటి, పోలీసులు ఏం చేస్తున్నారు యివే రాశాను. ఏ ఎన్జిఓ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అనే భావనే నాది. సత్యార్థి విషయంలో కూడా దానిపై వచ్చిన విమర్శలు రాశాను. మోదీ అధికారంలోకి వస్తూండగానే ఎన్జిఓలను నియంత్రించాలని అనుకున్నారు. అప్పుడు చాలా కథనాలు వచ్చాయి. వాటిని సేకరించి వ్యాసం రాద్దామని చూస్తే సీరీస్ రాయనిదే కుదరదనిపించింది. ఉన్నవి పూర్తి చేయకుండా సీరీస్ అంటే తంతారని భయపడి ఆగిపోయాను. ఎన్జిఓలలో 90% ఏదో ఒక వివాదంలో యిరుక్కున్నవే. అవన్నీ ఒకళ్లో, యిద్దరో వ్యక్తుల చుట్టూనే తిరుగుతాయి. వాళ్లకు వేరే జీవనోపాధి వుండదు, అందుకని అనాథల పేర, బాధితుల పేర సేకరించిన డబ్బును వారి ఖర్చులకు వాడుకుంటారు. చాలా కేసుల్లో ఎన్జిఓ ఆఫీసు వాళ్ల యిల్లే అయివుంటుంది. రోజంతా దీనికే సమయాన్ని వెచ్చించినపుడు మరి బతుకుతెరువు ఎలా? రోమన్ తెలుగు ప్రచార సమితి నడిపినపుడు దేశవిదేశాలలోని తెలుగు సంఘాల అడ్రసులు సంపాదించాను. 99% కేసుల్లో అన్నీ ఎవరో ఒక వ్యక్తి నడిపేవే. పెద్దపెద్ద ఫౌండేషన్లు కూడా మనం అనుకున్నట్టు సాగవు. చిన్నప్పుడు బాలలకు సహాయం చేస్తున్నాను అనుకుంటూ 'క్రై' వారి గ్రీటింగ్ కార్డులు కొనేవాణ్ని. తర్వాత తెలిసింది – వాళ్లకు వచ్చిన విరాళాల్లో సింహభాగం అధికారుల భారీ జీతాలకే పోతుందిట, పిల్లలకు దక్కేది తక్కువట. అప్పణ్నుంచి ఎవరికైనా సరే విరాళాలు వస్తురూపేణా యిస్తున్నాను, క్యాష్ అయితే డైరక్టుగా యిస్తున్నాను తప్ప సంస్థలకు యివ్వడం మానేశాను. ఇక ఎన్జిఓల పేరు చెప్పి బ్లాక్‌మెయిలింగ్ చేసే సందర్భాలూ బోలెడు చూశాను. ఇన్ని చూసినవాణ్ని తీస్తా ఎన్జిఓకు నేనెందుకు కారెక్టరు సర్టిఫికెట్టు యిస్తాను?
ఒక పాఠకుడు ''ఈనాడు''లో పడిన వీరేంద్ర కపూర్ వ్యాసం అనువాదం లింకు చూడమన్నారు. ముందే చదివాను. కిరణ్ బేదీ బిజెపిలో చేరినప్పుడు అరవింద్, కిరణ్ ఒకే తానులో గుడ్డలంటూ వారు నడిపే ఎన్జిఓలను విమర్శిస్తూ ఆయన రాసిన వ్యాసమూ చదివాను. కిరణ్ బేదీ గురించి రాస్తూ ఆమె ఎన్జిఓ కూడా ఆమె యింటి నుంచే నడుస్తుందని, ఆమె లెక్చర్లు యివ్వడానికి విమానంలో వెళ్లినపుడు నిర్వాహకుల వద్ద ఎక్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్టు డబ్బు పుచ్చుకుని, వెళ్లడం మాత్రం ఎకానమీ క్లాసులో వెళ్లిందని, ఆ విషయం బయటపడినప్పుడు రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తన ఎన్జిఓ ఖాతాలో వేశానని చెప్పుకుందని గుర్తుచేశాడు. ఈ వ్యాసం అనువాదం ''ఈనాడు''లో వచ్చిందో లేదో (కిరణ్ బిజెపి అభ్యర్థి కదా), దాన్ని ఆ పాఠకుడు చదివారో లేదో నాకు తెలియదు. ఎన్జిఓలలో చాలా భాగం యిలాటివే అయినా తీస్తా కేసులో గుజరాత్ హై కోర్టు న్యాయమూర్తి జె బి పార్దీవాలా 'ఈ సిజెపి ఒన్ మ్యాన్-ఒన్ వుమన్ షో' అన్నాడు. హై కోర్టు ముందు గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్న మహేశ్ జెఠ్మలానీ వీళ్లు నిధులు దుర్వినియోగం చేశారన్నది సాక్ష్యంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరుకు యిన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయలేదని అన్నాడు. తీస్తా తరఫు న్యాయవాది మిహిర్ ఠాకూర్ 'చేయకపోవడమేం, అవీ, వోచర్లు, యితర డాక్యుమెంట్లు అన్నీ సబ్మిట్ చేశారు' అని వాదించాడు. అయితే ఆ వాదనను ఫిబ్రవరి 6న, వాదనలు ముగిసిన తర్వాత చేశాడట. అందువలన దాన్ని లెక్కలోకి తీసుకోకూడదని జడ్జిగారు నిర్ణయించారు.
అంతటితో ఆగకుండా 'వీళ్లు బీదవారికై ఉద్దేశించిన నిధులను దుర్వినియోగం చేశారు. బాధితుల కోసం సేకరించిన నిధులతో వీళ్లు జల్సా చేయడమేమిటి?' అన్నాడు. బెయిల్ తిరస్కరించి, అరెస్టు చేయడానికి పోలీసులకు అనుమతి యిచ్చాడు. బెయిల్ పిటిషన్‌ను ఆయన తిరస్కరిస్తాడని గుజరాత్ పోలీసులకు ముందే ఎలా తెలుసో మనకు తెలియదు కానీ వాళ్లు ముందే ముంబయి వచ్చి కూర్చున్నారు. 'బెయిల్‌పై తీర్పు అహ్మదాబాద్‌లో వెలువడినది సాయంత్రం నాలుగున్నరకి, కానీ గుజరాత్ పోలీసులు ముంబయిలోని తీస్తా యింటికి మిట్టమధ్యాహ్నమే వచ్చి కూర్చున్నారు' అంటాడు కపిల్ సిబ్బల్. అయితే తీస్తా వాళ్లు అవేళ అరెస్టు తప్పించుకున్నారు, సుప్రీం కోర్టులో బెయిల్ దొరుకుతుందనే ఆశతో! సిజెపి, సబ్రంగ్ ట్రస్టు ఇన్నాళ్లగా తమ ఎక్కవుంట్లను చారిటీ కమిషనర్‌కు, హోం శాఖకు, ఇన్‌కమ్‌టాక్స్ శాఖకు, దాతలకు, ఆడిటర్లకు సబ్మిట్ చేస్తూనే వుందని, వాళ్లెవరూ ఎన్నడూ అభ్యంతర పెట్టలేదనీ ముంబయిలోని మానవహక్కుల సంఘం నేత సంధ్య అనే ఆవిడ చెప్పారు.
వివాదగ్రస్తమైన మ్యూజియం విరాళాల గురించిన వివరాలేమిటంటే – 2007లో ఆ సొసైటీ స్థలంలో స్మారకచిహ్నంగా మ్యూజియం కడదామని అనుకున్నారు. 2008లో సొసైటీ సరేనంది. ఆ పని కోసమే సబ్రంగ్ ట్రస్టు అని ప్రారంభించారు. 80 మంది ఆర్టిస్టులు ముందుకు వచ్చి వారి చిత్రాలను దానం చేసి 'ఆర్ట్ ఫర్ హ్యుమానిటీ' పేర ముంబయిలో ప్రదర్శనకు అమ్మకానికి పెట్టి నిధులు సంపాదించి యిచ్చారు. ''వీక్'' ప్రకారం చిత్రాల అమ్మకం ద్వారా వచ్చినది రూ. 4 లక్షలుట (''ఫ్రంట్‌లైన్'' ప్రకారం వచ్చినది రూ. 1 కోటి! – రిపోర్టెడ్‌లీ అని చేర్చారు) ''అవుట్‌లుక్'' ప్రకారం బొమ్మల ద్వారా రూ. 4 లక్షలు, విదేశాల నుంచి మరో 50 వేలు వచ్చాయట. వీటిలో ఏది నిజమో తెలియదు కానీ ఆ ట్రస్టు రూ.8 కోట్లకు మించి వసూలు చేసినట్లు ఎఫ్ఐఆర్లో రాశారు. ''అవుట్‌లుక్'' ప్రకారం సిజెపి, సబ్రంగ్ కలిసి గత పదేళ్లలో సేకరించిన డబ్బు రూ. 9.74 కోట్లు. దానిలో రూ.38.5 లక్షల గురించే వివాదమని అంటుందా పత్రిక. నా ఉద్దేశంలో మనం అన్ని చోట్ల నుండి సమాచారం సేకరించాలి, అన్నీ విన్నాక ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాలి, కొత్త సమాచారం వచ్చినపుడు అవసరమైతే అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఒక వ్యక్తికి పలుకోణాలుంటాయి. ఒక కోణంలో సమాజానికి మంచి చేయవచ్చు, మరో కోణంలో చెడు చేయవచ్చు. ఏ వ్యక్తి పుట్టిన దగ్గర్నుంచి చచ్చేదాకా ఒక్కలా వుండడు. అతనేం చేసినా సమర్థిస్తూనే వుండాలి అనుకునేవాడు మానసికంగా బానిస. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)