మామూలుగా అయితే బడ్జెట్ గురించి పెద్దగా చర్చించుకోనక్కరలేదు. ఎందుకంటే ఒకప్పుడు బడ్జెట్ అంటే పాలకులు చాలా గౌరవంగా చూసేవారు. పోనుపోను బడ్జెట్ దారి బడ్జెట్దే, పన్నుల దారి పన్నులదే అవుతోంది. పన్నులు లేని బడ్జెట్ అని చెప్పుకుంటారు, మర్నాడే పన్నులు వేస్తారు. బడ్జెట్లో చెప్పని, నిధులు కేటాయించని ప్రజాకర్షక పథకాలు బోల్డు ప్రకటిస్తారు. ఏడాది చివరకి వచ్చేసరికి బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు ఎక్కడా పోలిక కుదరటం లేదు. అందుచేత బడ్జెట్ పైపైన చూడడం, నోరు చప్పరించడం జరుగుతోంది. అధికారపార్టీవాళ్లు దాన్ని ఆకాశానికి ఎత్తేస్తారు, ఇలాటి బడ్జెట్ ప్రపంచ చరిత్రలో కానరాదు అంటారు. ఇక ప్రతిపక్షాలు పెదవి విరుస్తారు. (అదేమిటో వాళ్ల పెదవి ఎప్పుడూ విరగడానికి సిద్ధంగా వుంటుంది), అంకెల గారడీ అంటారు. ఫలానా ఫలానా వర్గాలను పట్టించుకోదంటారు – అక్కడకి తక్కిన వర్గాలకు కేటాయించినవన్నీ అమలై పోతున్నట్లే! తెలంగాణ బడ్జెట్‌పై ఆసక్తి ఎందుకు పెరిగిందంటే యిది కొత్త రాష్ట్రపు బడ్జెట్, కోటి ఆశలు చూపించి కొత్తగా అధికారం అందుకున్న ఉద్యమపార్టీ సమర్పిస్తున్న బడ్జెట్. ఎలా వుంటుందాని పైపైన అయినా పరామర్శించి చూడాల్సిన సంగతి.
సిఎందో మాట, ఎఫ్ఎందో మాట
బడ్జెట్‌కు ముందు ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ చాలా గొప్ప కబుర్లు చెప్పారు. 'తెలంగాణ పేదరాష్ట్రం కాదు, ఇక్కడ నిధులు, వనరులు లేక కాదు, రాష్ట్రం విడిపోయాక పెద్దగా ఆదాయం తగ్గింది ఏమీ లేదు. తగ్గిందన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఎక్సయిజ్, వాణిజ్య.. తదితర రంగాల్లో గతంలో వచ్చినట్లే వస్తోంది.' అని చెప్పారు. ఆంధ్ర కిస్తానన్నట్లే ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక రాష్ట్ర హోదా యివ్వకపోతే నిలదొక్కుకోలేమంటూ ముఖ్యమంత్రి కేంద్రానికి సమర్పించిన నివేదికకు యిది పూర్తి విరుద్ధంగా వుంది. హైదరాబాదు జేబులో పెట్టుకుని కూడా యీ బీద అరుపులేమిటి అన్న అరుణ్ జైట్లేతో కెసియార్ 'హైదరాబాదు ఆదాయం గురించి అధికారులు చెప్పినవన్నీ అసత్యాలు, అతిశయోక్తులు. విడిపోయాక యిప్పటికే 3 వేల కంపెనీలు తరలి వెళ్లిపోయాయి, మీరు ఆంధ్రకు రాయితీలు ప్రకటిస్తే యింకా వెళ్లిపోతాయి. మా పరిస్థితి ఘోరం అయిపోతుంది.' అని వాదించారు. మరి రాజేందర్ చూస్తే స్వర్గాధిపత్యం వున్న దేవేంద్రుడిలా మాట్లాడారు.
చివరకు బడ్జెట్ అంకెలు చూశాం. 2014-15 ఉమ్మడి రాష్ట్రపు తాత్కాలిక బడ్జెట్ 1.83 లక్షలకు ప్రతిపాదిస్తే యిప్పుడు ఆంధ్ర 1.11 లక్షల కోట్లకు, తెలంగాణ 1.01 లక్షల కోట్లకు మొత్తం 2.22 లక్షల కోట్లకు బడ్జెట్లు తెచ్చారు. అంటే 21% ఎక్కువ అన్నమాట. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి అధ్వాన్నమై పోయిందని ఆంధ్ర ముఖ్యమంత్రి మొత్తుకుంటూనే వున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కష్టాల్లో వున్నాం, ఓర్చుకోవాలి, అంటున్నారు. కేంద్రం సహకరించటం లేదని విమర్శిస్తున్నారు. కానీ బడ్జెట్ చూడబోతే 21% అధికంగా ప్లాన్ చేశారు. విభజన తర్వాత మన పరిస్థితి బాగుపడిందని ఆర్థికమంత్రులు తప్ప వేరెవరూ అనుకోవటం లేదు. ఇప్పుడు హుదూద్ తర్వాత ఆంధ్ర బడ్జెట్ అతలాకుతలం అయిపోయి వుంటుంది. ఎందుకంటే అలాటి బీభత్సానికి దానిలో ప్రొవిజన్ పెట్టి వుండరు. ఇంకో తుపాను గుమ్మంలో కాచుకుని వుంది. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఐదు నెలలు ఆలస్యంగా ముందుకు తెచ్చారు. ఆలస్యానికి కారణం ఏమిటో రాజేందర్ చెప్పలేదు కానీ దీన్ని అమలు చేయడానికి ఐదు నెలలు మాత్రమే వున్నాయి. గమ్యం చూస్తే కళ్లు తిరిగేట్లుంది. దసరా దాకా పనే మొదలు పెట్టలేదని ముఖ్యమంత్రే చెప్పారు. ఇప్పుడు ఐదు నెలల్లో పది నెలల పని పూర్తి చేయగలరా?
సంక్షేమానికే నిధులన్నీ పోతే అభివృద్ధి ఎలా?
అభివృద్ధి సాధిస్తాం అంటూనే తెలంగాణ ప్రభుత్వం అనేకానేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తోంది. బడ్జెట్ కూడా అదే ధోరణిలో వుంది. 48.34% ప్లాన్డ్ ఎక్స్‌పెండిచర్‌తో అభివృద్ధికి ఎలా సాగిస్తారో నాకు అర్థం కాదు. ఆంధ్ర అయితే మరీ అన్యాయం. అక్కడ యిది 23.85% మాత్రమే. ఎన్నికల సంవత్సరంలో ప్రజాకర్షక పథకాల కోసం నిధులు కేటాయిస్తే అర్థం చేసుకోగలం. మొదటి సంవత్సరం నుండి నిధుల్లో సింహభాగం వాటికే పోతే ఎలా? తక్కిన దానిలో కూడా జీతభత్యాలకు చాలా పోయిన తర్వాత డెవలప్మెంట్కు మిగిలేది ఏముంటుంది? మీరేనా పాప్యులర్ పథకాలు చేపట్టేది, మేం చేయలేమా అంటూ పదవీకాలం దాదాపు ముగిసిపోయిన హైదరాబాదు కార్పోరేషన్ వాళ్లు రూ. 4000 ల దాకా ఆస్తి పన్ను రద్దు చేసి పారేశారివాళ. దానికి రూ.100 కోట్లు కావాలి, ప్రభుత్వాన్ని అడుగుతాం అంటున్నారు. ఇవ్వకపోతే కెసియార్‌కు చెడ్డపేరు, యిస్తే మజ్లిస్‌కు మంచిపేరు.
వీటన్నిటికీ డబ్బు కావాలి. కొత్త పన్నులు వేయరట. ఆదాయం ఎక్కణ్నుంచి వస్తుంది? ఇప్పటిదాకా వున్న పన్నులు సరిగ్గా వసూలు కావాలంటే సిబ్బంది వుండాలి. ఇప్పటిదాకా ఐయేయస్ దగ్గర నుంచి గుమాస్తాల దాకా ఎవరు అసమదీయులో, ఎవరు తసమదీయులో తేలలేదు. వీళ్లు వెళ్లి అడిగినా యివ్వడానికి కొత్త పరిశ్రమలు రావాలి, వ్యవసాయోత్పాదన పెరగాలి, సర్వీసు రంగం బలపడాలి. తెలంగాణలో సృష్టిస్తున్న విషవాతావరణం వలన కంపెనీల రావటం లేదని కొట్టవస్తున్నట్లు కనబడుతోంది. కరంటు కోతల వలన పరిశ్రమలు తరలిపోతున్నాయి. సర్వీసు రంగం కుంటుపడుతోంది. చిన్న దుకాణాల వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. ఇవాళ వున్నవే రేపు వుంటాయన్న నమ్మకం లేకుంటే కొత్తవి ఎలా వస్తాయి? ఈ సంక్షేమాలకు నిధులు ఎక్కణ్నుంచి వస్తాయన్నది పెద్ద ప్రశ్న. రూ. 2800 కోట్లు యిప్పటికే సేకరించారు. మరో రూ.6000 కోట్లు సమీకరించాలట. గలరా? తెలంగాణ పరిస్థితి యింత 'ఆశాజనకంగా' వున్నపుడు అప్పులు యిచ్చే ధైర్యవంతులు ఎందరుంటారు?
కుదేలైన వ్యవసాయ రంగం
వ్యవసాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తెలంగాణ కోసం జరిగాయంటున్న ఆత్మహత్యల గురించి అంత అల్లరి చేసిన తెరాస యీరోజు రైతుల ఆత్మహత్యల గురించి కిమ్మనటం లేదు. అంతా మీడియా సృష్టి, ప్రతిపక్షాల కాకిగోల అంటోంది. ఈ సారి పంట దెబ్బ తిందని హరీశ్ రావుగారు నిత్యం చెపుతూనే వున్నారు. జరగాల్సిన రబీ సాగులో 44% మాత్రమే జరిగిందట. వర్షపాతం కొరత 35%. 377 మండలాల్లో వర్షాభావం. కరువు ఛాయలు కనబడుతున్నాయి. వచ్చేసారి పంట వేసుకోవద్దని మన ఫామ్‌హౌస్ ఫేమ్ కెసియార్ రైతులకు సలహా యిచ్చారు. ఆయన రంగురంగుల కాప్సికమ్ పంట వేస్తున్నారో లేదో! వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాల ఆర్థికస్థితి చితికిపోతే రాష్ట్రస్థితి ఎలా మెరుగు పడుతుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసిన 'తెలంగాణ పునరావిష్కరణ – సామాజిక ఆర్థిక దార్శనికత' అనే పేపరులో చెప్పిన అంశాలు చూడండి – తీవ్రమైన విద్యుత్ కొరత, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా లేదు, అంపూర్తిగా భారీ నీటి ప్రాజెక్టులు, పాల ఉత్పత్తిలో జాతీయ సగటు కంటె తక్కువ, పలు జిల్లాలు ఆర్థికంగా వెనుకబడి వున్నాయి…! ఇలాటి నేపథ్యం వుండగా భవిష్యత్తు ఆశాజనకంగా మన కెవ్వరికీ కనబడటం లేదు కానీ ఆర్థికమంత్రికి ఎలా కనబడింది? పది జిల్లాల రాష్ట్రానికి లక్ష కోట్ల బడ్జెట్ అంటే షోకుగా కనబడుతుందని పెద్ద పెద్ద అంకెలు చూపించారు. మిగులు బడ్జెట్ వుండవలసిన తెలంగాణను 17 వేల కోట్ల లోటు బడ్జెట్లోకి తెచ్చారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో యిది 4.79%. ఎఫ్ఆర్బిఎం చట్టం 3%కి మించకూడదని చెప్తోంది. మినహాయింపు వస్తుందని మా ధీమా అంటున్నారు ఈటెల. ఏం చూసుకునో!? బహిరంగ మార్కెట్ నుండి రూ.15,713 కోట్లు అప్పు చేస్తామంటున్నారు. ఇచ్చేవాడికి ఈటెలకున్నంత ధీమా వుంటుందో లేదో!
విద్యుత్ లేనిదే జీవితంలో వెలుగే లేదు
అభివృద్ధంతా విద్యుత్‌తో ముడిపడి వుంది. తెలంగాణకు లేనిదే విద్యుత్. మూడేళ్ల దాకా కిక్కురుమనద్దని కెసియార్ హుకుం జారీ చేశారు. జూన్ నుంచి యిన్నాళ్లూ వూరుకుని, యిప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందు ఛత్తీస్‌గఢ్‌కి వెళ్లి ఒప్పందం చేసి వచ్చారు. ఆ విద్యుల్లత ఎన్నాళ్లకు దయచేస్తుందో ప్రభుత్వం నుండి ప్రకటన లేదు. తెరాస ఎంపీ రెండేళ్లంటారు, అబ్బే 30 నెలలని ఓ పత్రిక అంటుంది, మూడేళ్లకు ముందు రానేరాదు అని మరో పత్రిక చెపుతోంది. తీగలు వేయడానికి మావోయిస్టులు అడ్డం వస్తారని, రారని, పరిపరివిధాల చెప్తున్నారు. 'కరంటు తీగ' సినిమా తమను ఎద్దేవా చేయడానికే ఆంధ్రోళ్లు యిప్పుడు రిలీజ్ చేశారని తెరాస సర్కారు అనుకుంటోందేమో తెలియదు. ఇంతా చేస్తే రేటు విషయం మాట్లాడుకోలేదట. రేటు తేలకుండా ఒప్పందం ఎలా ఖరారు అవుతుందో నాకు అర్థం కాదు. విద్యుత్ ఒప్పందాలు యిలాగే వుంటాయా? విజ్ఞులు చెప్పాలి.
మూడేళ్ల తర్వాత ఉత్పత్తి ఖఱ్చు చూసుకుని అప్పుడు రేటు చెప్తామని ఛత్తీస్‌గఢ్ వాళ్లన్నారంటే కొంప మునిగిందే! అప్పుడు ఏ ప్రభుత్వం వుంటుందో, గోదావరి జలాల పంపకాల్లో గొడవలు వచ్చి రేటు పెంచేస్తుందేమో ఎవరికెఱుక? వెళ్లి కాకతీయ కనక్షన్ కబుర్లు చెపితే 'వెళ్లవోయ్ కాకతీయుల పాలన ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. మాలాటి కనక్షన్ యింకో నాలుగు రాష్ట్రాలతో వుంది. వెళ్లి వాళ్లనడుగు' అని విదిలించేయవచ్చు. బాబులాగ అధికారంలోకి రాగానే తక్కువ రేట్లో విద్యుత్ కొనేసి బుక్ చేసేసుకోలేదేం అన్న సూటి ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక కెసియార్ 'నాకు ముందుచూపు వుందో లేదో కానీ దొంగ చూపు లేదు' అని చెప్పుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్ వాళ్లకు ఆ రెండు చూపులూ వున్నాయేమోనని నా భయం. వాళ్లు యిచ్చేవరకు మనం అధిక ధరలకు ఎంతో కొంత విద్యుత్ కొంటూనే వుండాలి. దానికి బడ్జెట్లో ప్రొవిజన్ ఎక్కడుంది? విద్యుత్‌కై కేటాయించినది రూ. 4637 కోట్లు. ప్రణాళికేతర వ్యయం కింద యిచ్చినది రూ.3242 కోట్లు. దానిలో రైతులకు యిచ్చే విద్యుత్ సబ్సిడీకి రూ.3000 కోట్లు పోతుంది. విద్యుత్ సబ్సిడీలకే యీ ఏడాది రూ.5630 కోట్లు కావాలని ట్రాన్స్‌కో చెప్పగా యిచ్చినది యిది. మౌలిక వసతుల కల్పనకు, ఉన్న పరిశ్రమల నిర్వహణకు, రైతులకు, గృహస్తులకు అందరికీ దానిలోనే సరిపెట్టాలి. సరిపడుతుందా?
విద్య, వైద్యంకు అరకొర కేటాయింపులు, పోలీసులకు భారీ..
మెట్రో విషయంలో ఆస్తుల సేకరణ, బాధితులకు పరిహారం, రహదారుల విస్తరణ, అడ్డంగా వున్న విద్యుత్ స్తంభాల తొలగింపులకు రూ.500 కోట్లు కావాల్సి వుంది. గతంలో రూ. 84 కోట్లు కేటాయించారు, యిప్పుడు తక్కిన రూ.416 కోట్లు కేటాయించారు. మరి అలైన్మెంట్ మార్పుకు అయ్యే అదనపు ఖర్చు కోసం నిధులేవి? ఇక ఆ గొడవ వదిలిపెట్టినట్లేనా? ఆరోగ్యశ్రీకి యిచ్చే నిధులు దాదాపు మూడో వంతుకి తగ్గించారు. అన్యాయం అనిపించినా ప్రైమరీ హెల్త్ సెంటర్లను బలోపేతం చేస్తామంటున్నారు. అది జరిగితే చాలా మంచిది. ఆరోగ్యశ్రీ దురుపయోగం చాలా ఎక్కువగా వుంది. ప్రభుత్వాసుపత్రులను పరిపుష్టం చేస్తే దీర్ఘకాలికంగా పనికి వస్తుంది. జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం వైద్య, ఆరోగ్య రంగానికి 7% నిధులు కేటాయించాలి. కానీ తెరాస ప్రభుత్వం కేటాయించినది 4% మాత్రమే! గతప్రభుత్వాలు యిలాగే వ్యవహరించాయి. తెరాస మినహాయింపు కాదు.
వైద్యం లాగానే విద్య కూడా నిర్లక్ష్యానికి గురైంది. బడ్జెట్లో 11% విద్యకు యిచ్చారు. అంటే 2.12% తగ్గాయి. ఈ రూ. 11 వేల కోట్లలో కేంద్ర నిధులు రూ.3418 కోట్లు. కెసియార్ పెట్ ప్రాజెక్టు 'కేజీ టు పీజీ ఉచిత విద్య'కు విదిలించినది పాతిక కోట్లే. వచ్చే ఏడాది నుంచి ఎక్కువ యిస్తామని వూరడిస్తున్నారు. ఓకే, వెయిట్ చేద్దాం. మరి యిప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకై పెట్టిన ఫాస్ట్ పథకానికి మాత్రం సరిపడా నిధులు యిచ్చారా? లేదే. ఇచ్చిన రూ. 2734 కోట్లలో పాత బకాయిలకు రూ.1587 కోట్లు పోతుంది. స్కాలర్షిప్పులకు రూ.6-7 వేల కోట్లు కావాలిట. వందలాది కాలేజీలకు గుర్తింపు తీసేసి డబ్బు మిగులుద్దామని చూస్తే సుప్రీం కోర్టు పడనివ్వలేదు. అన్ని కాలేజీలకు పాత బకాయిలు సర్దేటప్పటికి యీ ఏడాది విద్యార్థులకు మిగిలేది – సున్నకు సున్న, హళ్లికి హళ్లి! విద్యను పెట్టుబడిగా చూడాలని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేధావులందరూ చెప్తూనే వచ్చారు. పాత ప్రభుత్వాలను తప్పుపట్టారు. ఈ రోజు కెసియార్ చేస్తున్నదేమిటి? పోలీసు శాఖకు ప్రణాళికేతర బడ్జెట్‌గా యిచ్చినది రూ.2804 కోట్లు. ఇప్పటికే వాళ్లకు బోల్డంత ఇన్నోవాలు యిచ్చారు. వాటివలన కొత్తగా ఒనగూడిన ప్రయోజనం ఏమిటో ఎవరైనా ఆడిట్ చేశారా? రోడ్ల పక్కన పార్క్ చేసి లోపల సెల్ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చోవడానికి తప్ప వేరే ఏ ప్రయోజనం సాధారణ ప్రజలకు కనబడటం లేదు.
భూములమ్మి సంపాదిస్తారట
భూములు అమ్మి రూ.6500 కోట్లు సంపాదిస్తామని అంటున్నారు. అమ్మడానికి వైయస్సార్ మిగిల్చినవెన్ని? జలయజ్ఞం అంటూ నిధుల కోసం హైదరాబాదు భూములన్నీ అమ్మేశారు. మిగిలినవి వివాదాల్లో వున్నాయనుకుంటా! హైదరాబాదు రియల్ ఎస్టేటు పూర్తిగా పడుకుంది. ఇప్పట్లో లేస్తుందన్న నమ్మకమూ లేదు. అలాటప్పుడు నాలుగు నెలల్లో యింత డబ్బు వస్తుందా? అయినకాడికి అమ్మేస్తారా? రియల్ ఎస్టేటు బూమ్ వున్నపుడే వైయస్సార్ రూ. 10 వేల కోట్లు వస్తాయని లెక్కలేస్తే రూ. 6 వేల కోట్లు వచ్చాయట. అప్పటికంటె రెట్టింపు భూములను అమ్మితేనే యీ అంకె చేరగలరు. అలా అమ్మేస్తే పరిశ్రమలను ఆకర్షించడానికి మిగులు భూమి మిగలదు. అసలు తెలంగాణలో ఆకర్షణే ప్రభుత్వ భూములు. నిజాంగారి ధర్మమాని ప్రయివేటు భూమి తక్కువ, ప్రభుత్వ భూమి ఎక్కువ (అన్నీ ఆయనే వుంచేసుకున్నాడులా వుంది). అందుకే ఉమ్మడి ప్రభుత్వాలన్నీ యిక్కడే పరిశ్రమలు పెట్టాయి. కోస్తా, రాయలసీమల్లో అయితే ప్రయివేటు భూమి కొనాలి, ఖర్చు, లిటిగేషన్. ఇప్పుడు ఆంధ్ర రాజధాని ల్యాండ్ పూలింగ్ వివాదాలు చూస్తూంటే అర్థమౌతోందిగా – అక్కడ భూమి సేకరణ ఎంత కష్టమో! తెలంగాణలో వున్న ప్రభుత్వ భూమిని చూపించే గత ప్రభుత్వాలు పెట్టుబడిదారులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తెగ నమ్మేస్తే ఆ ఎడ్వాంటేజ్ పోతుంది.
దీనికి, దళితుల యిళ్లకు లింకు పెడితే ఎలా వుంటుందో మరి! 'దళితులకు భూములిద్దామంటే దొరకటం లేదు. పల్లెల్లో వున్న మీ భూములు ప్రభుత్వానికి అమ్మండి' అని కెసియార్ ఎన్నారైలను అడుగుతున్నారు. వాళ్లు స్పందించటం లేదు. డబ్బిచ్చే బదులు హైదరాబాదులో వున్న భూములను మార్పిడి చేసుకోండి అంటే యీ అమ్మకాల బాధ వుండదు కదా. అయినా ఆ పథకం జోరుగా అమలవుతుందంటారా? ఇళ్ల నిర్మాణానికి రూ.1041 కోట్లు అంటూ టూ బెడ్రూమ్ యిళ్ల పథకానికి యిచ్చినది రూ. 85 కోట్లు. ఎన్ని వస్తాయో మరి? ఈ సందేహంతోనే కాబోలు ఈటెల తన బడ్జెట్ ప్రసంగంలో యీ అంకె చెప్పలేదు.
సన్నాసుల నుంచి నిధులు వస్తాయా? బూడిద వస్తుందా?
కేంద్రం నుంచి పన్నులు, గ్రాంట్లు, అప్పులు రూ. 42,250 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. దానిలో రూ.1833 కోట్లు అప్పురూపంలో రావాలిట. 'సన్నాసులు' పాలిస్తున్న (ఈ పదం పేటెంట్ కెసియార్దే! ప్రధాని దగ్గర్నుంచి కృష్ణా ట్రైబ్యునల్ చైర్మన్ వరకు అందరూ ఆయన దృష్టిలో సన్నాసులే) కేంద్రం అంత యిస్తుందని ఆశించడం విడ్డూరంగా లేదూ!? కెసియార్ ధైర్యం ఒకటే – కేంద్రం యివ్వకపోతే స్థానిక బిజెపిని తిట్టవచ్చు. మీరు తెలంగాణ బిడ్డలే అయితే మోదీ యింటి దగ్గర ధర్నా చేసి నిధులు పట్టుకుని వచ్చి మా చేతిలో పోయండి అని. దానితో పాటు కేంద్రం యివ్వకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నాడు అనవచ్చు. లేకపోతే కేంద్రంలో వున్న ఆంధ్ర అధికారులు ఫైళ్లు గాయబ్ చేశారనవచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు – తెలంగాణలోని ఆంధ్ర ప్రాంతపు బ్యాంకు మేనేజర్లు రైతులకు కావాలని ఋణాలు యివ్వటం లేదట. బ్యాంకులు పెట్టినదే ఋణాలిచ్చి వడ్డీ సంపాదించుకోవడానికి. స్థానికులెవరికీ లోన్లు యివ్వకపోతే బ్యాంకు మేనేజ్మెంట్ వూరుకుంటుందా? రాష్ట్రమంత్రులే యిలా మాట్లాడుతూంటే బెంగ పుడుతుంది – వీళ్ల చేతిలోనా మన భవిష్యత్తు వున్నది అని!
పోనీ వీళ్లు తెలంగాణ రైతులకు చేస్తున్నదేమిటి? ఎకరాకి కోటి రూ.లు సంపాదించే ఆదర్శరైతు ముఖ్యమంత్రిగా వుండగా వ్యవసాయానికి బడ్జెట్లో కేటాయించినది రూ.7531 కోట్లు. అయితే దానిలో ఋణమాఫీకి పోయేది రూ.4250 కోట్లు. పారిశ్రామిక, సేవా రంగాలు పూర్తిగా హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలనే కేంద్రీకృతం అయింది అంటూనే బడ్జెట్లో నగరానికే ఎక్కువ నిధులు కేటాయించారు. పట్టణాలకు, గ్రామాలకు నిధుల పంపిణీ జరగలేదు. ప్రపంచపు విత్తన కేంద్రంగా తీర్చిదిద్దుతాం అంటూనే ఆ పథకానికి నిధులు పెద్దగా యివ్వలేదు. చెఱువుల అనుసంధానం, వాటర్ గ్రిడ్, రోడ్లు వేయడాలు, 42 ఏరియా ఆసుపత్రులకు కోటి రూ.ల చొప్పున కేటాయింపు వంటి మంచి ఐడియాలు వున్నాయి. ఇవి ఎలా అమలయ్యాయో తెలుసుకోవడానికి ఐదు నెలలు పడుతుంది.
ఏడాది చివరకు ఎలా వుంటాం?
చివరిగా ఒక్కమాట చెప్పాలి – సమైక్యపాలనలో తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది అంటూ అసత్యాలతో ఉద్యమం నడిపినవారే యిప్పుడు అధికారంలోకి వచ్చి విడుదల చేసిన 'సామాజిక ఆర్థిక సర్వే' కొన్ని వాస్తవాలు చెప్పింది – 2004-05లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.24,409 కాగా 2013-14 నాటికి అది రూ.93,515. ఇన్ఫ్లేషన్ లెక్కలోకి తీసుకున్నా యిది గొప్ప ప్రగతే. మానవాభివృద్ధి సూచిలో 2004-05లో 13 వ స్థానంలో వున్న తెలంగాణ 2011-12 నాటికి 10 వ స్థానానికి వచ్చింది. 2012-13లో 26 లక్షల హెక్టార్లకు సాగునీరు అందగా 2013-14 నాటికి 32 లక్షలకు చేరింది. అంటే 24% పెరుగుదల. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరు రాలేదని పదేపదే చెప్పిన మేధావే యిప్పుడు మన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వమే రిలీజ్ చేసిన పత్రం యిది. భారీ పరిశ్రమలు ఉన్న రాష్ట్రాల్లో దేశంలో తెలంగాణ 8 వ స్థానంలో వుంది. ఇవి కొన్ని మాత్రమే. గొర్రెల పెంపకంలో మొదటి స్థానం, కోళ్ల పెంపకంలో 5 వ స్థానం, పశుపోషణలో 10 వ స్థానం, మేకల పెంపకంలో 12 వ స్థానం..
ఇలా ఎలా చూసినా తెలంగాణ పరిస్థితి గత అర్ధశతాబ్దిలో మెరుగు పడిందనే ఒప్పుకోవాలి. అంతెందుకు ఇండియా టుడే వాళ్లు దేశంలోనే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వున్న రాష్ట్రంగా తెలంగాణను ఎంపిక చేసి ఎవార్డు యిస్తూంటే కెటియార్ వెళ్లి తీసుకున్నారు. ఆయన రోషం వుంటే తిరస్కరించాల్సి వుంది. 'ఇది అబద్ధపు ఎవార్డు, మా తెలంగాణకు దోపిడీ గురైంది. మమ్మల్ని ఆంధ్రులు సర్వనాశనం చేశారు. మాది వెనకబడిన రాష్ట్రం. ప్రత్యేక ప్రతిపత్తి యివ్వకపోతే సొంతకాళ్లపై నిలబడలేని రాష్ట్రం, ఇలాటి అవార్డు యిస్తే జనం ముందు మా పరువేం కాను?' అని ఘాటైన ఉత్తరం రాయవలసినది. తెరాస పాలనకు ముందు వున్న పరిస్థితి ఏమిటో యిప్పుడు వాళ్లే చెప్పుకున్నారు కదా. 2015 మార్చి 31 నాటికి జాతీయ స్థాయిలో తెలంగాణ పరిస్థితి దీని కంటె మెరుగుపడిందో లేదో వేచి చూదాం. అప్పుడు యీ బడ్జెట్ ఆచరణలో సఫలమైందో, విఫలమైందో ప్రతి ఒక్కరికీ ఎవరూ చెప్పకుండానే తెలిసిపోతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2014)