మజ్లిస్ వారు తెలంగాణ చిహ్నంలో చార్మినార్ వుండాలంటున్నారు. దానికి తోడు ఉర్దూని రెండో అధికారభాషగా చేయాలంటున్నారు. నాకు తెలిసి ఉర్దూకి యిప్పటికే ఆ స్థాయి వుంది. అమలు కావడం లేదంతే. గతంలో ఆర్టీసీ బస్సులపై ఉర్దూలో కూడా బోర్డులు పెట్టేవారు. ఇప్పుడు సిటీ బస్సులు, రూటు బస్సులు, ఎంఎంటియస్.. ఎక్కడా ఉర్దూ కనబడటం లేదు. ఎందుకంటే ఉర్దూ మీడియంలో చదివేవారు తగ్గిపోతున్నారు. ఉద్యోగాలు కావాలంటే తెలుగు రావాలని, రెండో భాషగా తెలుగో, స్పెషల్ ఇంగ్లీషో తీసుకుంటున్నారు. ఉర్దూ ఉపాధ్యాయులు కూడా తగ్గిపోతున్నారనుకుంటా. విభజన తర్వాత తెలంగాణలో మజ్లిస్ బలం పెరుగుతుందని అందరూ అనుకున్నా, గొంగళీ అక్కడే వుండిపోయింది. అయినా యీ డిమాండ్లు చేయడానికి వారికి ధైర్యం ఎందుకు వచ్చిందంటే తెరాసవారు వారికి పిలిచి పీట వేస్తున్నారు. సమైక్యవాదానికి కట్టుబడిన మజ్లిస్‌కి, తెరాసకు ఎప్పుడూ సఖ్యత లేదు. నగరంలో మజ్లిస్ ఒక్కటే మాకు వ్యతిరేకంగా వుంది కానీ గ్రామాల్లో, పట్టణాల్లో వున్న ముస్లిములంతా మా వెంటే వున్నారు అని తెరాస చెప్పుకుంటూ వచ్చింది. అలాటిది ఎన్నికల అనంతరం యింత ప్రేమ ఎలా పుట్టుకుని వచ్చింది? అంటే హైదరాబాదులో తెరాసకు తగిలిన దెబ్బ! అక్కడ 13.5% ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే చావుదెబ్బ తిన్న కాంగ్రెసు కంటె 1% ఎక్కువ! హైదరాబాదు వాసులు తమ రక్షణకు టిడిపి-బిజెపినే నమ్ముకున్నారు. వాళ్లిద్దరికీ కలిపి 33% వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో కూడా తెరాస పరిస్థితి మరీ అంత బాగా లేదు. 2009 ఎన్నికలలో తెరాసతో చేతులు కలిపి దెబ్బ తిన్న టిడిపి యీసారి ఆంధ్రమూలాల వారిని రక్షిస్తామంటూ ప్రచారం చేసుకుని వారి విశ్వాసాన్ని, తద్వారా ఓట్లను చూరగొంది.
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలలో టిడిపిని కంట్రోలు చేయడానికి కెసియార్‌కు తోచిన ఏకైక ఉపాయం – మజ్లిస్‌తో దోస్తీ. కావాలంటే కాబినెట్‌లో పదవులు యిస్తామన్నారట. మజ్లిస్ ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం అవుతాడని కూడా ప్రచారం జరిగింది. మజ్లిస్‌వారు నో థ్యాంక్స్ అన్నారు. లోపలకి ఎందుకు రావడం? బయటనుండే ఆడిస్తాం అన్నారు. ఇదిగో, దీనితో మొదలుపెట్టారు. ఎక్కడిదాకా వెళతారో తెలియదు. వైయస్ హయాంలో మజ్లిస్‌వారు చెలరేగి ప్రభుత్వాధికారులను కూడా చావబాదారు. ప్రత్యర్థుల సంగతి సరేసరి. ఎన్నికలలో దుడ్డుకర్రతో స్వైరవిహారం చేశారు. అడిగేవాడు లేడు. కిరణ్ కాస్త కట్టడి చేశారు. మజ్లిస్‌వారికి సోనియాతో వున్న సఖ్యత వలన ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ సౌలభ్యం లేదు. బిజెపిలో వినే నాథుడు లేడు. ఇప్పటికైనా కాస్త తగ్గుతారేమో ననుకుంటే తెరాస నెత్తికెక్కించుకుంటోంది. తెరాసకు సొంతంగా మెజారిటీ సీట్లు యిచ్చాడు ఓటరు. మజ్లిస్‌మీదో, వైకాపా మీదో ఆధారపడవలసిన అవసరం కల్పించలేదు. అయినా కేవలం – చంద్రబాబును, బిజెపిని అడ్డుకోవడానికి తెరాస యీ మార్గం పట్టింది. తెలంగాణ ఏర్పడితే బిజెపి బలపడుతుందని మజ్లిస్ గగ్గోలు పెట్టింది. ఇంకా అలా జరగలేదు. కేంద్రంలో బిజెపి మద్దతుతో యిక్కడా పుంజుకుంటుందన్న భయంతో మజ్లిస్ తెరాసకు చేరువౌతోంది. 2009లో ఊరికి ముందే ఎన్‌డిఏ పంచన చేరబోయిన కెసియార్ యీ రోజు వారికి ఆప్తుడిగా కనబడుతున్నాడు. రేపు ఆయన మోదీకి శరణంటే వీళ్లేం చేస్తారో చూడాలి.
చార్మినార్‌ను తెలంగాణ చిహ్నంలో పెట్టాలని మజ్లిస్ అడిగింది కాబట్టి బిజెపి వెంటనే ఖండించింది. అది ఇస్లాం మతచిహ్నం, చార్‌మినార్ ఒక అంతస్తులో మసీదు వుంది అంటోంది. మరి దాని పునాదిలో 'భాగ్యలక్ష్మి' (!?) ఆలయం వుందని బిజెపి నాయకులు వాదిస్తున్నారు కాబట్టి దాన్ని హిందూచిహ్నం అనుకోవచ్చుగా! అనుకోవడం లేదు. ఓ సారెప్పుడో మజ్లిస్ పార్టీయే చార్మినార్ బొమ్మ వాడకాన్ని అడ్డుకుంటూ అది మా మతచిహ్నం అని వాదించిందట. ఇంతకీ అది మతచిహ్నమా? ఇస్లాంకు మూర్తిపూజ పనికిరాదు. అందుకని ప్రవక్త బొమ్మకానీ, విగ్రహం కానీ, ప్రతీకగానీ కనబడదు. ఎన్టీయార్ తన విదేశీయాత్రల్లో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తుగా చార్మినార్ బొమ్మల్ని సువెనీర్లగా యిచ్చేవారు. ఎందుకంటే అది వ్యాధిపై మనిషి విజయానికి ప్రతీక. చార్మినార్ ఎందుకు కట్టారనేది ఒకసారి చదువుకుంటే మతంతో సంబంధం లేదని తెలుస్తుంది. హైదరాబాదు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినారే! చంద్రబాబు వచ్చాక హైదరాబాదును ఐటీ సెంటర్‌గా రూపుదిద్దే క్రమంలో హైదరాబాదుకు ప్రతీకగా హైటెక్ సిటీ చూపించసాగారు. ఇప్పుడు కెసియార్ తెలంగాణ చిహ్నంలో ఆ కట్టడాన్ని వాడితే చూసిన ప్రతీవాడికీ బాబు గుర్తుకు వస్తాడు. అది కెసియార్ సహించలేరు. తెలంగాణ గుర్తుగా కాకతీయ తోరణం పెట్టుకోవచ్చు. కానీ కమ్మ కులస్తులు తమ వ్యాపార వ్యవహారాలకు కాకతీయ పేరు విస్తారంగా వాడి సొంతం చేసేసుకున్నారు. నిజానికి కాకతీయులు స్వతహాగా బోయ, పుళింద కులస్తులు. జైనమతంలోకి మారి, మళ్లీ హిందువులై, అన్ని కులాల వారితో సంపర్కం పెట్టుకుని, బంధుత్వాలు కలుపుకుని ఎదిగారు, విస్తరించారు. కానీ యిప్పుడు కాకతీయ గుర్తు వాడగానే కమ్మలు, తద్వారా టిడిపి ప్రజల మెదళ్లలో మెదులుతుందని కెసియార్ సందేహించి దాన్ని వదిలేస్తే –
ఇక మిగిలినది శాతవాహనులు. కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాలలో వారి స్వతంత్రాధికారానికి అంకురార్పణ జరిగిందంటున్నారు కాబట్టి శాతవాహనులను తెలంగాణ సొంతం చేసుకోవచ్చు. కాకతీయులకున్నంత పాప్యులారిటీ శాతవాహనులకు లేదు కాబట్టి కాకతీయ తోరణం వాడక తప్పదు. ఎందుకంటే శాతవాహనులతో చిన్న చిక్కు వుంది. కొన్ని పురాణాలు వారిని 'ఆంధ్రభృత్యులు'గా వర్ణించాయి. ఆంధ్రులంటే తెలుగువారనే అర్థంలో వాడినంత కాలం ఫర్వాలేదు కానీ, యిప్పుడు ఆంధ్రపదాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నారు కాబట్టి ఆ పదం యిప్పుడు చాలా చికాకుగా వినిపించవచ్చు. ముఖ్యంగా కెసియార్ ఆంధ్రరాష్ట్రంతో అనునిత్యం గొడవలు దిగడానికి నిశ్చయించుకున్న యీ తరుణంలో! రాష్ట్ర విభజన బిల్లులో ఆయన తమకు అనుకూలంగా వున్నవి మాత్రం తీసుకుంటున్నారు. అనుకూలం కానివి వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగస్తుల విభజన అనేది రాజ్యాంగప్రకారం జరగాలి అంటే 'అబ్బే, ఆప్షన్లు వుండడానికి వీల్లేదు' అంటారు. ఆర్గనైజేషన్లు విడగొట్టినపుడు, కలిపినప్పుడు కొన్ని పద్ధతులుంటాయి. వాటిల్లో ఉద్యోగుల చిత్తం నడవదు. మేనేజ్‌మెంట్ నిర్ణయమే ఫైనల్. నచ్చకపోతే ఉద్యోగం వదులుకోవాలి. విఠల్‌గారి కేసులో ఆయన జూనియర్ అయ్యారు. ఆ విభాగంలో ఆ క్యాడర్‌లో తెలంగాణ ఉద్యోగులు ఎక్కువమంది వున్నారు. తెలంగాణకు ఎలాట్ చేయగా మిగిలినవారిని ఆంధ్రకు కేటాయించారు. ఆయన జూనియర్ కాబట్టి అటు వెళ్లాల్సిందే. అబ్బే నేను లీడర్ని, నాకు మినహాయింపు యివ్వాలి అనడం నియమవిరుద్ధం. ఇవన్నీ బయటకు వచ్చినపుడు 'సెక్రటేరియట్‌లో 90% మంది ఉద్యోగులు ఆంధ్రులే' వంటి ప్రకటనలు ఎంత అబద్ధమో తేలుతోంది. అదే నిజమైతే విఠల్‌గారు అటు వెళ్లవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? కెసియార్ ఏ నియమాన్నీ పాటించదలచుకోలేదు. అంతా తాము చెప్పినట్లే జరగాలని పట్టుబడుతున్నారు. తెలంగాణ ఉద్యోగవర్గాలను ఆకట్టుకోవడానికి త్వరలో ఆంధ్రా ఉద్యోగీ భాగో నినాదం యిచ్చినా ఆశ్చర్యపడను.
ఇప్పుడు పోలవరం వివాదం మొదలుపెట్టారు. బిల్లుకు అనుబంధంగానే ఆర్డినెన్సు తయారైంది. ఎటొచ్చీ ఎన్నికల కోడ్ రావడంతో కొత్త ప్రభుత్వాన్ని కూడా అడిగి సంతకం పెడదామని ప్రణబ్ ఆగారు. రాజ్యసభలో యీ విషయమై వాదించిన వెంకయ్యనాయుడు కొత్త ప్రభుత్వంలో మంత్రిగా వుండడంతో ఆయన చొరవ తీసుకుని కాబినెట్‌లో చెప్పి అంగీకరింపచేసి, ప్రణబ్ చేత సంతకం చేయించారు. దానికి రాద్ధాంతం దేనికి? పోలవరం డిజైన్ మార్చాలి అని యిప్పుడు అనడమేమిటి? 1980లో సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్రూవ్ చేసిన డిజైన్ అది. ఎన్నోసార్లు దానిపై చర్చలు జరిగాయి. టెండర్లు పిలిచారు. కెసియార్‌కు సన్నిహితులైన కాంట్రాక్టర్లు బిడ్ చేశారు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం ఆ ప్రాజెక్టు తన బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పి పని మొదలుపెట్టింది. విభజనకు సంబంధించిన ప్రతీ విషయంలో 'కేంద్రమే అన్నీ చూస్తుంది, యిక్కడి రాష్ట్రప్రభుత్వం ఒట్టి ఆటల్లో అరటిపండు' అంటూ వచ్చిన కెసియార్ యీరోజు హఠాత్తుగా రాష్ట్రప్రభుత్వానికి అధికారాలు ఎక్కణ్నుంచి తెస్తున్నారు? అన్నీ కేంద్రానికి అప్పగించారు కాబట్టే కదా తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అడ్డం తిరిగితే ఒప్పుతుందా?
గ్రామాలు కాకుండా మండలాలు కలపడం సవ్యమైన పని. ఎందుకంటే పునరావాసం అనేది పక్కనున్న గ్రామాల్లో కల్పించాలి. ఎక్కడో వేరేచోట అంటే యిబ్బంది పడతారు. భద్రాద్రి రాముడి గుడి తెలంగాణలో, ఆస్తులు ఆంధ్రలో… అని సెటైర్లు వేస్తున్నారు. తిరుపతి వెంకన్న ఉండేది ఆంధ్రలో, ఆస్తులు తెలంగాణలో లేవా? పలు రాష్ట్రాల్లో లేవా? ఏమైంది? పోలవరం నిర్వాసితుల అంశం యీనాటిదా? ఆర్టికల్ 111 హరీశ్‌రావు కాబినెట్ మంత్రిగా వున్నపుడే వెలువడింది కదా! పోలవరం కట్టే మాటైతే మాకు తెలంగాణయే వద్దు అనలేకపోయారా, కెసియార్? బిల్లు సగం సగం అమలు చేస్తామంటే ఎవరొప్పుకుంటారు? అయినా గిరిజనుల పునరావాసం గురించి మాట్లాడేవారు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు వేసినా, విస్తరణ చేపట్టినా కూడా బాధితులంటారు. కొందరి స్థలాలు పోతాయి. ఇళ్లు కూలతాయి. అందుకని రోడ్డు వేయడం మానేస్తారా? ఉడ్‌హౌస్ కొటేషన్‌తో చెప్పాలంటే – గుడ్డు పగలకుండా ఆమ్లెట్ వేయలేం. మనమంతా పల్లెల్ని విడిచి నగరాలకు వచ్చేశాం. ఇక్కడంతా రద్దీ అయిపోయింది, పల్లెలకు వెనక్కి వెళ్లండి అని ప్రభుత్వం అంటే అమ్మో పల్లెల్లో వైద్యసౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు అని గునుస్తున్నాం. గిరిజనులు మాత్రం అడవుల్లోనే వుండిపోవాలా? వాళ్లకు కరంటు అక్కరలేదా? మందులు అక్కరలేదా?
'వాళ్లు తెలంగాణలో వుంటామంటున్నారు, వాళ్ల గోడు వినండి' అని కొందరు సామాజిక కార్యకర్తల మొసలి కన్నీరొకటి. విభజనవాదులకు వ్యతిరేకంగా ఓటేసి తమ అభిప్రాయాన్ని తెలిపిన హైదరాబాదువాసులు 'మేం విడిగా వుందామనుకుంటున్నాం, హైదరాబాదును యూటీ చేయండి' అంటూ ప్రదర్శన నిర్వహిస్తూ అప్పుడూ యిదే మాట చెప్తారా? రాష్ట్రప్రజల అభీష్టం ఏమిటో విభజన బిల్లు తిరస్కరించి రాష్ట్ర ఎసెంబ్లీ చాటి చెప్పింది. అయినా దాన్ని పట్టించుకోకుండా పార్లమెంటు దాన్ని చట్టంగా చేసింది. అప్పుడు హర్షించినవారు ఇప్పుడు కొందరు గిరిజనులు యిలా అనుకున్నారని, అలా అనుకున్నారనీ వగచడం హాస్యాస్పదం. అయినా గ్రామాలు కాకుండా మండలాలు కలపాలన్న ఐడియా బిజెపిదే. రాజ్యసభలో దాని గురించే మాట్లాడారు. అధికారంలోకి రాగానే దాన్నే అమలు చేశారు. దీనిలో కుట్ర ఏముంది? చంద్రబాబు చేసిన మోసం ఏముంది? ఇదంతా ప్యాకేజీలో భాగమే. పోలవరం ముంపుగ్రామాలతో బాటు దిగువ సీలేరు ప్రాజెక్టు కూడా పోతోందని యిప్పుడనుకుంటే ఏం లాభం? ఇలాటి చిలక్కొట్టుళ్లు ఎన్ని కలిపితే హైదరాబాదు ఆదాయంలో వాటా పోగొట్టుకున్న ఆంధ్రకు లోటు తీరుతుంది? ఆరంభమే ఆంధ్రకు 18 వేల కోట్ల రెవెన్యూ లోటు, తెలంగాణకు 7500 వేల కోట్ల రెవెన్యూ మిగులు. కెసియార్ కంటికి యివన్నీ ఆనవా?
'భద్రాచలం తీసుకోండి, హైదరాబాదు మాకు వదిలేయండి' అని గతంలో అన్న కెసియార్ యిప్పుడు దీన్ని రాజకీయం చేద్దామని నిశ్చయించుకున్నారు. తను తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడేవారు ఎవరూ లేరన్న బిల్డప్ యివ్వడానికి ఎవర్నీ, ఏ పార్టీని సంప్రదించకుండా తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధాని వద్దకో, రాష్ట్రపతి వద్దకో వెళితే అదో అందం. అందరం కలిసి బంగరు తెలంగాణ నిర్మిద్దాం అని కబుర్లు చెప్పడమే తప్ప, ఆచరణలో అది చూపించలేదు. అందుకే పార్టీలేవీ బంద్‌కు మద్దతు యివ్వలేదు. సిపిఐ ఒక్కటీ మాత్రమే గొంతు కలిపింది. మేం చేసినవన్నీ తప్పులే అని ఆ పార్టీ సమావేశంలో యీ మధ్యే నాయకత్వం ఒప్పుకుంది. మళ్లీ అలాటి తప్పులే చేస్తోంది. వ్రతం చెడ్డా ఫలమూ దక్కటం లేదు. ఇక్కడా క్షవరమే, పార్లమెంటులోనూ క్షవరమే. జాతీయపార్టీ గుర్తింపు పోగొట్టుకుంది. తలతిక్క నిర్ణయాలు తీసుకున్న నారాయణ వంటి నాయకులకు శిక్ష వేయకుండా కబుర్లతో సమావేశాలు సరిపెడితే యిలాగే వుంటుంది.
ఏ పార్టీ కలిసిరాకపోయినా తెరాసకు ఫర్వాలేదు. తల్లిని చంపి, బిడ్డను బతికించారన్న మోదీ తన తెలంగాణ వ్యతిరేకతను నిరూపించుకున్నారని ధ్వజమెత్తింది. దీనిపై టిడిపి స్టాండ్ ఏమిటో చెప్పాలంటూ కవ్విస్తోంది. కాంగ్రెస్, వైకాపాలకు మాత్రం యిలాటి ఛాలెంజ్ విసరలేదు. అవి కూడా తెలంగాణలో పార్టీలే కదా. కానీ టిడిపిపైనే తెరాస గురి. పోలవరం కట్టాలి అని టి-టిడిపి అంటే తెలంగాణ ద్రోహి అనాలని తెరాస ప్లాన్. బాబే యిదంతా చేశారన్న ప్రచారం చేస్తే, తెలంగాణలో టిడిపి దెబ్బ తినడం మాట ఎలా వున్నా, ఆంధ్రలో రక్షకుడిగా బాబు యిమేజి పెరగడం ఖాయం. కెసియార్‌ను అదుపు చేయగల మొనగాడు చంద్రబాబు ఒక్కడే అనే నమ్మకం అక్కడ బలపడుతుంది. ఆంధ్రతో అనుబంధం వున్న తెలంగాణవాసుల్లో దాని మద్దతు పెరుగుతుంది. ఆ బలంతో తెలంగాణలో తెరాసను ఛాలెంజ్ చేసి బలహీనపరచవచ్చు. రాజకీయంగా బలహీనపడిన కొద్దీ కెసియార్ మజ్లిస్‌కు మరింతగా చేరువౌతారు. ఈనాటి ఆర్డినెన్సు వ్యతిరేక పోరాటంలో సిపిఐతో పాటు తెరాస భాషలో మాట్లాడిన మరో పార్టీ మజ్లిస్. వాళ్లు బంద్‌లకు వ్యతిరేకం కాబట్టి (రోజువారీ సంపాదనపై ఆధారపడిన పాతబస్తీ వాసులు బంద్ అంటే మండిపడతారు) బంద్‌కు మద్దతు యివ్వలేదు కానీ మండలాల బదిలీకి ఒవైసీ అభ్యంతరపెడుతూ లేఖ యిచ్చారు. ఇలా మజ్లిస్‌కు దగ్గరవుతూ పోతే వాళ్లు చెప్పినదానికల్లా కెసియార్ తలూపుతారు. అప్పుడు తెలంగాణ చిహ్నంగా చార్మినార్ వుండడం మాత్రమే కాదు, కాశీం రజ్వీ విగ్రహం టాంక్ బండ్‌పై వెలిసినా వెలవవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)