రివ్యూ: గ్రీన్ సిగ్నల్
రేటింగ్: 1/5
బ్యానర్: మారుతి టాకీస్, ఎస్.ఎల్.వి. సినిమా
తారాగణం: మానస్, రేవంత్, అశుతోష్, డింపుల్, శిల్పి శర్మ తదితరులు
సంగీతం: జెబి
కూర్పు: ఉద్ధవ్
ఛాయాగ్రహణం: ఆర్.ఎం. స్వామి
నిర్మాత: రుద్రపాటి రమణారావు
రచన, దర్శకత్వం: విజయ్ మద్దాల
విడుదల తేదీ: మే 30, 2014
గత వారం ‘మనం’లాంటి క్లాసిక్ చూసిన సినీ ప్రియులకి… ఈవారం ‘గ్రీన్ సిగ్నల్’ అనే ‘సిక్’ సినిమా చూడాల్సిన పరిస్థితి. టూ ఎక్స్‌ట్రీమ్స్ అన్నమాట. అన్నిట్లోను మంచి, చెడు ఉంటాయని చెప్పడంలో ఇది టాలీవుడ్ స్టయిల్ అనుకోవాలి. మంచి సినిమాని ఎంజాయ్ చేసిన వారికి బ్యాడ్ సినిమా ఎక్స్‌పీరియన్స్ కూడా తెలియజేస్తుండాలని కొందరు కంకణం కట్టుకుని ఇలాంటివి తీస్తుంటారేమో అనిపిస్తుంది. పచ్చ లైటు పడ్డప్పుడు సేఫ్ అనేది మన నమ్మకం. కానీ అన్ని గ్రీన్ సిగ్నల్సూ సేఫ్ జోన్లు కావని, ఇలాంటి యాక్సిడెంట్ ప్రన్ గ్రీన్ లైట్లూ ఉంటాయనేది దీంట్లోని అంతర్లీన సందేశం.
కథేంటి?
నలుగురు బ్యాచ్‌లర్ కుర్రాళ్ల కథ ఇది. నలుగురూ (మానస్, రేవంత్, అశుతోష్, గోపాల్ సాయి) తమ సోల్‌మేట్స్‌ని వెతుక్కునే ప్రక్రియలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు, తమకి తారసపడిన అమ్మాయిలతో ఎలాంటి వేషాలు వేసారు, చివరకు ఏం తెలుసుకున్నారు.. అనేది గ్రీన్ సిగ్నల్ ప్లాట్. వీరికి ఎదురుపడే ఆ అమ్మాయిలతో (మనాలి, డింపుల్, శిల్పి, రక్షిత) ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్‌లు, రియలైజేషన్లు వగైరా సరంజామాతో సాగిపోయే ఈ కథలో ఒక గే కపుల్‌ని కూడా ఇరికించారు.
కళాకారుల పనితీరు:
క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అనేదే లేని ఇలాంటి సినిమాల్లో దర్శకుడు ఏం చెప్తే అది చేసుకుపోవడమే తప్ప తమదైన టచ్ ఇవ్వడానికి ఆర్టిస్టులకి ఎలాంటి స్కోప్ ఉండదు. ఇలాంటి హెల్ప్‌లెస్ సిట్యువేషన్‌లో పడ్డ ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్‌ని క్రిటిసైజ్ చేయడం కూడా అనవసరం. నటీనటుల ఫెయిల్యూర్ కూడా దర్శకుడి అకౌంట్‌లోకే వెళ్లాల్సిన సినిమా ఇది. తన కథలోని పాత్రలని సరిగ్గా తీర్చిదిద్దకుండా కొత్త నటీనటులని తెచ్చి వాటిలో జీవం నింపమని అడిగితే పాపం వాళ్లు మాత్రం ఏం చేస్తారు. ఉన్నంతలో మానస్ ఫర్వాలేదనిపించాడు. డింపుల్‌కి ఇంతకుముందు రెండు, మూడు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కనుక ఆమె కూడా బానే చేసింది. హీరోయిన్లు ప్రధానంగా అందాల ప్రదర్శనకే పరిమితమయ్యారు.
సాంకేతిక వర్గం పనితీరు:
జెబి అందించిన సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. పాటలన్నీ ఇంటర్వెల్స్‌గా పనికొస్తాయి తప్ప వాటి వల్ల సినిమాకి యాడ్ అయ్యే అడ్వాంటేజ్ ఏమీ లేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే కర్ణ కఠోరం. సినిమాటోగ్రఫీ బడ్జెట్‌కి తగ్గట్టే లో క్వాలిటీతో ఉంది. ఒక క్యాపబుల్ డైరెక్టర్ తన పని తాను చేయడంతో పాటు అందరి నుంచి బెస్ట్ అవుట్‌పుట్ తెచ్చుకుంటాడు. డైరెక్టర్‌లో స్టఫ్ లేకపోతే క్వాలిటీ టెక్నీషియన్స్‌ని ఇచ్చినా అవుట్‌పుట్ యావరేజ్‌గానే ఉంటుంది. ఇక ఈ యావరేజ్ టెక్నికల్ టీమ్‌తో బెస్ట్ రాబట్టుకోవాలంటే దర్శకుడికి సాదా సీదా టాలెంట్ ఉంటే చాలదు. కానీ విజయ్ మద్దాలకి ఉన్న ప్రతిభ సరిపోలేదు. నటీనటుల నుంచి నాసిరకం నటన రాబట్టుకున్నట్టే… తన సాంకేతిక వర్గం నుంచి కూడా మంచి అవుట్‌పుట్ తెచ్చుకోలేకపోయాడు. కనీసం తనవంతుగా కథనైనా సవ్యంగా నడిపించాడా అంటే అదీ లేదు. హిందీ సినిమాల నుంచి కాపీ కొట్టిన అంశాలని కూడా పొందిగ్గా ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు. స్క్రీన్‌ప్లే పరంగా దర్శకుడు పూర్తిగా ఫ్లాప్ అవడంతో గ్రీన్ సిగ్నల్ కాస్తా ప్రేక్షకుల పాలిట యాక్సిడెంట్ జోన్‌గా మారింది.
హైలైట్స్:
- ఒక్క హైలైట్ పాయింట్ లేకపోవడం ఈ సినిమాకి సంబంధించి అతి పెద్ద హైలైట్!
డ్రాబ్యాక్స్:
- సినిమాలో అన్నీ డ్రాబ్యాక్సే. కానీ ఇది కూడా హైలైటే అనుకోవాలేమో.
విశ్లేషణ:
నేటి యూత్ లైఫ్ స్టయిల్, వారి లవ్ లైఫ్.. అంటూ ఒక బ్రాండ్ ‘యూత్‌ఫుల్’ సినిమాలు తీయడం ఈమధ్య టాలీవుడ్‌కి రెగ్యులర్ ఫీచర్ అయిపోయింది. మారుతి అంటించిన ఈ జాఢ్యాన్ని ఇంకా అతని పేరు మీద చలామణీ చేయాలని చూస్తున్నారు చాలా మంది. ఈ సినిమాకి కూడా మారుతి పేరు జత చేసారు. ఆరంభంలోని కొన్ని సన్నివేశాలు, ‘ప్యార్ కా పంచ్‌నామా’నుంచి కాపీ కొట్టిన కొన్ని సీన్లు ఈ రకం సినిమాల్ని ఎంజాయ్ చేసేవారిలో కొందరిని ఎంటర్‌టైన్ చేయవచ్చు.
అయితే కథ ముందుకు వెళ్లే కొద్దీ ‘గ్రీన్ సిగ్నల్’ని ఎంజాయ్ చేయడం ఆ బాపతు జనం వల్ల కూడా కాదు. ద్వితీయార్థం అయితే వాకౌట్ చేస్తారా… నాకౌట్ పంచ్ ఇమ్మంటారా అన్నట్టు పరీక్షిస్తుంది. యూత్‌ఫుల్ సినిమా అంటే కథనంతో సంబంధం లేకుండా నాలుగు కుళ్లు జోకులు, నేస్టీ రొమాన్సులు పెట్టేస్తే చాలనే అపనమ్మకం ఏమిటో అర్థం కాదు. ప్రేమదేశం, నువ్వే కావాలి లాంటివి కూడా యూత్ సినిమాలే కదా. అంత చక్కని కథ, కథనాలు ఉన్న వాటిని బెంచ్ మార్క్స్‌గా పెట్టుకోకుండా చీప్‌గా డబ్బులు దండుకున్న బూతు బ్రాండ్ సినిమాల ప్రమాణాలని ఎందుకు ఫాలో కావాలి?
ఈ టైప్ సినిమాలు ఏవో ఒకటి రెండు సొమ్ము చేసుకున్నాయని గొర్రెల మందలా వాటినే ఫాలో అయిపోయిన దర్శకులు ఇప్పటికే చాలా మంది బోర్లా పడ్డారు. అలాంటి సినిమాలు తీసిన వాళ్లే ఆ మచ్చలు చెరిపేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఇక కొత్తగా ఆ రూట్లోకి వెళ్లి ఏం బావుకుందామని ఈ తాపత్రయమో అర్థం కాదు.
బోటమ్ లైన్: గ్రీన్ సిగ్నల్ – యాక్సిడెంట్ గ్యారెంటీ
-జి.కె.