ఎమ్బీయస్‌: తోడికోడళ్లు – 1/2

జవాబులు – ''గుండెలు తీసిన మొనగాడు'' 100 రోజులు ఆడిందని, పెద్ద హిట్‌ అని, కాంతారావుగారు భయపడి ముందు అమ్ముకోవడం వలన నష్టపోయారని తనతో చెప్పారని ఒక పాఠకుడు రాశారు. కాంతారావుగారు తన ఆత్మకథలోనే…

జవాబులు – ''గుండెలు తీసిన మొనగాడు'' 100 రోజులు ఆడిందని, పెద్ద హిట్‌ అని, కాంతారావుగారు భయపడి ముందు అమ్ముకోవడం వలన నష్టపోయారని తనతో చెప్పారని ఒక పాఠకుడు రాశారు. కాంతారావుగారు తన ఆత్మకథలోనే రాసుకున్నారు – '12 లక్షలు పెట్టి తీసి బయ్యర్స్‌ కోసం నాలుగు నెలలు ఎదురు చూశాను… నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్‌ చక్రవర్తి చెప్పిన మాటలు విని, నా బుద్ధి వక్రించి, అతని స్క్రిప్టుతో ఆ సినిమా తీశాను. ''గుమ్‌నామ్‌'' ఆధారంగా అప్పటికే ''అవే కళ్లు'' వచ్చింది. దాన్ని ఆదరించిన ప్రేక్షకులు మళ్లీ మళ్లీ అదే సబ్జెక్టును చూడడానికి యిష్టపడలేదు. అది నాకు 16 లక్షల అప్పును, విషాదానుభూతిని మిగిల్చింది' అని. సినిమా బాగా ఆడి వుంటే తర్వాతి సినిమాకు బయ్యర్లు పెట్టుబడి పెట్టేవారు. అది జరగలేదు. నేను సినిమాను హాల్లో చూశాను. నీరసంగా నడిచింది. రెండు, మూడు వారాలకు మించి ఎక్కడా ఆడినట్లు లేదు. హీరోగా ఆయన మార్కెట్‌ అప్పటికే అంతరించింది.

1957 నాటి ''తోడికోడళ్లు'' అనే అన్నపూర్ణా వారి సినిమాకి మూలం శరత్‌బాబు రాసిన ''నిష్కృతి''అనే నవల. ఇది తీసిన 23 ఏళ్ల తర్వాత అదే ''నిష్కృతి'' నవల ఆధారంగా తయారైన ''అప్నే పరాయే'' అనే కలర్‌ హిందీ సినిమాతో పోల్చి చెప్తాను. దర్శకుడు బాసూ చటర్జీ బెంగాలీవాడు కాబట్టి మూలానికి అతి దగ్గరగా తీశాడు. అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు పెట్టారంతే. డైలాగులు కూడా నవలలోవే పెట్టారు. అయితే తెలుగులో క్యారెక్టరు స్వభావాలు మార్చేసి, హీరో యిమేజ్‌ని పెంచి, చాలా చక్కగా తీశారు. ఈ బెంగాలీ నవలను తెలుగులోకి అనువదించిన చక్రపాణిగారు 'ఆ నవల తెలుగు సినిమాకు ఎలా పనికి వస్తుంది?' అని ఆశ్చర్యపడితే ఎలా పనికివస్తుందో చేసి చూపించారు దుక్కిపాటి మధుసూదనరావుగారు. కథలోకి వెళదాం.

ఇది ముగ్గురు అన్నదమ్ముల కథ. పెద్దాయన ఉత్పల్‌ దత్‌ ప్లీడర్‌. ఇంటివిషయాల్లో మతిమరుపు మనిషే కానీ ప్రాక్టీసులో గట్టివాడు. బాగా సంపాదిస్తున్నాడు. ఆయనకు భార్య, నలుగురైదుగురు పిల్లలు వున్నారు. ఆయనకు ఓ సొంత తమ్ముడు గిరీశ్‌ కర్నాడ్‌ వున్నాడు. అతనూ ప్లీడరీ పాసయి పట్నాలో ప్రాక్టీసు చేస్తున్నాడు. వీళ్ల పినతండ్రి కొడుకు చందర్‌ (అమోల్‌ పాలేకర్‌) వీళ్ల దగ్గరే పెరిగాడు. ప్లీడరీ పరీక్షకు రెండు మూడుసార్లు వెళ్లి తప్పాడు. వ్యాపారం చేస్తానని అన్నగారి దగ్గర డబ్బు తీసుకుని వ్యాపారం చేయబోయాడు. కలిసిరాలేదు. అతను మంచివాడే కానీ అప్రయోజకుడు. అన్నగారు, వదినగారు అంటే అతనికి దైవంతో సమానం.

పెద్దాయన భార్య అదోరకం మనిషి. మనిషి మంచిదే కానీ నోటికి ఎంత తోస్తే అంత అనేస్తుంది. తర్వాత బాధపడుతుంది. చందర్‌ అన్నా, అతని భార్య షీలా (షబానా ఆజ్మీ) అన్నా మహా యిష్టం. షీలాను పదేళ్ల వయసులో ఓ పేద కుటుంబం నుంచి యీ యింటికి తీసుకుని వచ్చింది. పెంచి పెద్ద చేసి, చందర్‌ కిచ్చి పెళ్లి చేసింది. ఇంటి బాధ్యతంతా అప్పగించేసింది. పిల్లలందరికీ ఈవిడ వద్దనే చనువు. ముఖ్యంగా చందర్‌ కొడుక్కి. ఒకరిని విడిచి మరొకరు వుండలేరు. ఆ యింట్లో అజమాయిషీ అంతా షీలాదే. పిల్లల్నందర్నీ క్రమశిక్షణతో పెంచుతుంది. తనంటే పిల్లలందరికీ హడల్‌. ఆఖరి తమ్ముడే కథానాయకుడు. కానీ కథానాయకుడి లక్షణాలు యిసుమంతైనా లేవు. ఇలా పాటలు పాడుతూ బద్ధకంగా కూచోవడమే పని. నవలలో లేనిది హిందీ సినిమాలో కాస్త కలిపారు యిక్కడ. అతని భార్య ఏమైనా పని చేయమని పోరుతుంది. కానీ అన్నగారు చెప్పలేదు కదా అని యితను హ్యాపీగా కూచున్నాడు. ఏమైనా అంటే నా జీవితంలో అన్నగారు ముందు వచ్చారు, తర్వాత నువ్వు వచ్చావ్‌. అన్నగారి మాటే వేదవాక్కు అంటాడు. కనీసం మెట్రిక్‌ చదవమని అన్నా అతను పట్టించుకోడు.

పరిస్థితి యిలా వుండగా పెద్దాయన సొంత తమ్ముడు పట్నానుండి కలకత్తా వచ్చేశాడు ప్రాక్టీస్‌ పెడదామని. అతని భార్య ఫారిన్‌లో చదువుకున్నది. పిల్లాణ్ని ఫేషనబుల్‌గా పెంచింది. వాడికి అహంకారం జాస్తి. చిన్నా పెద్దా లేదు. సూటూ బూటూతో దిగాడు. మిగతాపిల్లలను చిన్నచూపు చూశాడు. వంటింట్లోకి చెప్పులతో వచ్చాడు. ఇవన్నీ చిన్నకోడలు సహించలేదు. వాడికి డిసిప్లిన్‌ నేర్పబోయింది. పిల్లలు అతన్ని వెలివేశారు. మధ్యావిడకి అహం పొడుచుకు వచ్చింది. అసలు వాళ్లం మేం వుండగా కొసరువాళ్లు యిలా యింట్లో పాతుకుపోయి తేరగా తినడమే కాక అధికారం కూడా చలాయించడమేమిటని. పిల్లలను చిన్నావిడే రెచ్చగొడుతోందని యాగీ చేయడం మొదలెట్టింది. 

ఇప్పుడు తెలుగు వెర్షన్‌ చూద్దాం. దీనిలో చేసిన ప్రధానమైన మార్పులు ఏమిటంటే ఆఖరి తమ్ముణ్ని అసలైన కథానాయకుణ్ని చేశారు. నాగేశ్వరరావు వేశారు. మూడో కోడలు పాత్ర వేసినది సావిత్రి. కథానాయకుడు చదువూ సంధ్యా లేనివాడు కాడు. చిన్నప్పుడే పెళ్లి చేసేశారు కాబట్టి చదువు వెనకబడింది. పరీక్షకు కట్టాడు. ఫస్ట్‌క్లాసులో పాసయ్యాడు. అయితే అతనికి అభ్యుదయ భావాలు ఎక్కువ. అన్యాయం సహించలేడు. వేరే చోట ఉద్యోగం చేస్తే చిక్కుల్లో పడతాడని అన్నగారు తన రైసుమిల్లును చూడమన్నాడు. అక్కడ జరుగుతున్న మోసాలు చూసి యితను సహించలేకపోతూంటాడు. ఏమైనా చెప్దామంటే అన్నగారు వినిపించుకోడు. అతను అయోమయం మనిషి. తన ప్రాక్టీసే తప్ప యింటి విషయాలు పట్టవు. ఆ పాత్ర వేసినది ఎస్వీ రంగారావు. ఆయన భార్య పెద్ద తోడికోడలు కన్నాంబ వేశారు.

ఇక రెండో అన్నగారి విషయంలో కూడా చాలా మార్పు చేశారు. నవలలో లాగ యితను చదువుకున్నవాడు, లాయరు కాదు. ఒట్టి పల్లెటూరి మొద్దు. రేలంగి వేశారు. అతని భార్యగా వేసినది సూర్యకాంతం. గయ్యాళి గంప. ఆమెకూ చదువురాదు. వాళ్ల పిల్లవాడు రాలుగాయి. పల్లెటూళ్లో వీళ్లకున్న ఆస్తిపాస్తులు చూస్తూ అక్కడే పడివున్నారు. అక్కడ అతను పేకాట తప్ప వేరేమీ నేర్చుకోలేదు. పండక్కి అన్నగారింటికి పట్నం వచ్చాక మధ్యావిడ సూర్యకాంతానికి కళ్లు కుట్టాయి. సొంత తమ్ముడైన తన భర్త పల్లెల్లో గొడ్డూగోదా మధ్య వుంటూంటే కజిన్‌ అయిన మూడో అతను హాయిగా ఏ పనీ పాటా లేకుండా అన్నగారి ఆస్తి అనుభవిస్తూ కూచోవడం, అతని భార్య పెత్తనం చలాయించడం తాళాల గుత్తి ఆమె వద్దనే వుండడం ఆమెను మండించింది. నవలలో లాగానే కుట్రలు పన్నింది.  ఆమె బుద్ధి యింకా చెడగొట్టడానికి తెలుగులో యింకో పాత్రను ప్రవేశపెట్టారు.

రైసు మిల్లు నడపమని రంగారావు తన దూరపుబంధువు జగ్గయ్యకు అప్పగిస్తే అతను అక్కడ చేసేవన్నీ అక్రమాలే. బెడ్డలు కలపడం, పల్లెటూళ్లో వుండే వ్యాపారి చదలవాడతో కలిసి రైతులను మోసం చేసి డబ్బు పంచుకోవడం యిలాటివి చేస్తున్నాడు. అక్కడ జరిగే అక్రమాలను సరిచేయబోయిన నాగేశ్వరరావును జగ్గయ్య పూచికపుల్లలా తీసిపారేశాడు. రంగారావు అయోమయం మనిషని అతనికి తెలుసు. నాగేశ్వరరావు బొత్తిగా ఆదర్శవాది అనీ, లోకం తీరు తెలియదని అన్నగారి ఉద్దేశం. అందుచేత అతని మాట పట్టించుకోడు. నాగేశ్వరరావు నిస్సహాయంగా వూరుకోవలసి వస్తుంది. ఇదంతా ఒరిజినల్లో లేదు. తెలుగులో కల్పించినదే. సూర్యకాంతంలో అసూయ రగిలించడానికి ఇంకో ఘట్టం కూడా తెలుగులో కల్పించారు. దసరా సమయంలో మేస్టారు వచ్చి సావిత్రిని మెచ్చుకున్నాడు. చూశారా అంటూ సూర్యకాంతం కన్నాంబకు ఫిర్యాదు చేయబోతే ఆమె సావిత్రి వచ్చాకనే అదృష్టం కలిసి వచ్చిందని చెప్పింది. 

కానీ ఈ సదభిప్రాయం ఎంతోకాలం నిలవలేదు. మధ్యావిడ నిరంతరం చెప్పే చెప్పుడు మాటలు విని ఓ సారి క్షణిక కోపంలో పెద్దావిడ చిన్నావిడను యింట్లోంచి పొమ్మనమంది. భర్త దగ్గరకి వెళ్లి చందర్‌ పనీపాటా లేకుండా కూచుంటే ఎంతకాలం మేపాలి అంది. అయితే వాడిని పిల్లలకు ట్యూషన్‌ చెప్పమను అన్నాడు పెద్దాయన. ఇదంతా విని షీలా భర్త దగ్గర ఏడ్చింది. కానీ భర్త ఏమీ పట్టించుకోలేదు. పెద్దవాళ్లు ఏమన్నా ఫర్వాలేదన్నాడు తప్ప తను కదలలేదు. తెలుగులో కథానాయకుణ్ని యింత పౌరుషహీనుడిగా చూపలేదు. అంతా విని నాగేశ్వరరావు యింట్లోంచి వెళ్లిపోదామన్నాడు కానీ సావిత్రి వుండిపోదామంది. పెద్దవాళ్లు ఓ మాట అన్నా పడాలి అని హితవు చెప్పింది. 

అప్పటికి అలా అంది కానీ తనే వెళ్లిపోదామని అనే పరిస్థితి కల్పించింది మధ్యావిడ. మనం మనం ఒకటి, చందర్‌ వాళ్లు పరాయివాళ్లు అంది పెద్దావిడతో. పెద్దావిడ దాన్ని ఖండించకపోవడంతో షీలాకి కోపం వచ్చింది. 'బీదవాళ్లం కదా, మా బుద్ధి పెడబుద్ధి పడుతుందేమో యినప్పెట్టె తాళం చెవులు నీ వద్దే దాచుకో' అంటూ దురుసుగా మాట్లాడి యిచ్చేసింది. పెద్దావిడ కోపంతో అనాలోచితంగా 'ఇప్పటిదాకా ఎంత తిన్నావో లెక్కలు చెప్పు' అంటూ నోరు పారేసుకుంది. షీలా తాళం చెవులు పడేసి వెళ్లిపోయింది. నవలలో, హిందీ సినిమాలో పెద్దావిడ తాళం చెవులగుత్తి తనదగ్గరే పెట్టుకుంటుంది.

కానీ తెలుగులో అది చూసిన సూర్యకాంతం తాళం చెవి తీసి బొడ్లో పెట్టేసుకుంది. ఇది దరిమిలా ఆమె యినప్పెట్టె దోచి భర్తకు యిచ్చి అతనూ, తనూ నాశనం కావడానికి దారితీస్తుంది. ఇది తెలుగులో చేసిన మార్పు. తాళం చెవి యిచ్చేశాక చిన్నావిడ యింట్లోంచి పోదామంటుంది. వెళ్లి పెద్దబావగారికి పల్లెలో వున్న యింటికి వెళదామంటుంది. భర్త ఓ పట్టాన కదలడు. ఆమె పోరు భరించలేక సరేనంటాడు. కానీ తెలుగులో పౌరుషంగా వుంటాడు. పల్లెటూరికి వెళ్లి వాళ్లమీద పడి తిందామనుకోడు. అన్నగారే వెళ్లమని చెప్తే సరేనంటాడు.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]