ఎమ్బీయస్‌ : మహారాష్ట్రలో టోల్‌ గేట్ల వ్యవహారం

రాజ్‌ థాకరే మొదలుపెట్టిన టోల్‌ గేట్‌ వ్యతిరేక ఉద్యమం హింసాయుతంగా మొదలైనా సమాజానికి కొంత మేలు చేసింది. ఇకనైనా టోల్‌ గేట్‌ కంట్రోలు అథారిటీ ఏర్పడాలని అందరూ భావిస్తున్నారు. పిపిపి పథకం కింద, బిఓటి…

రాజ్‌ థాకరే మొదలుపెట్టిన టోల్‌ గేట్‌ వ్యతిరేక ఉద్యమం హింసాయుతంగా మొదలైనా సమాజానికి కొంత మేలు చేసింది. ఇకనైనా టోల్‌ గేట్‌ కంట్రోలు అథారిటీ ఏర్పడాలని అందరూ భావిస్తున్నారు. పిపిపి పథకం కింద, బిఓటి కింద కాంట్రాక్టర్లు రోడ్లు వేసిన తర్వాత దానిపై కొన్నేళ్లపాటు టోల్‌ వసూలు చేసుకునే అధికారం ప్రభుత్వం వారికి యిస్తుంది. ఆ అధికారాన్ని వాళ్లు వేరేవారికి సబ్‌ కాంట్రాక్టుకి యిచ్చేస్తున్నారు. ఎంత వసూలు చేయాలి, ఎన్నేళ్లు వసూలు చేయాలి అన్నదాన్ని ప్రజలకు తెలుపరు. అందువలన వారు గడువు దాటిపోయినా వసూలు చేసేస్తున్నారు. నాకు తెలిసిన ఉదాహరణ చెప్తాను – ఒక దినపత్రికకు సంబంధించిన కారు విశాఖ జిల్లాలో ఒక వూళ్లో టోల్‌ గేట్‌ వద్ద ఎప్పుడూ టోల్‌ కట్టేది కాదు. పత్రిక పేరు చెప్తే పోనిచ్చేసేవారు. ఒకరోజు ఒక కొత్త ఉద్యోగి వుండి ఠఠ్‌ కట్టాల్సిందే అన్నాడు. ఒళ్లు మండిన పత్రికోద్యోగి స్థానిక  విలేకరిని యీ టోల్‌ గేట్‌ కథేమిటో వెలికి తీయమన్నాడు. తీస్తే వాళ్లు వసూలు చేయవలసిన గడువు తీరిపోయి రెండేళ్లయిందని తేలింది. వెంటనే టోల్‌ గేట్‌ ఎత్తేశారు. దోపిడీ తప్పడంతో ఈ వివాదంలో ప్రజలు సుఖపడ్డారు. దేశవ్యాప్తంగా యిలాటివి ఎన్నో వున్నాయని తేలింది. అందువలన 2013 బజెట్‌ ఉపన్యాసంలో చిదంబరం హైవే సెక్టార్‌కు రెగ్యులేటర్‌ పెడతామని హామీ యిచ్చారు కానీ నెరవేర్చలేదు. 

విదేశాల్లో ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు విధానం వుంటుంది. గేట్‌ దాటుతూండగా సిసి కెమెరా కారు నెంబరును ఫోటో తీస్తుంది. కట్టాల్సిన టోల్‌ కారుకి అనుసంధానం చేసిన క్రెడిట్‌ కార్డుకి ఆటోమెటిక్‌గా డెబిట్‌ అయిపోతుంది. మన దేశంలో వాహనాలను నిలబెట్టి మాన్యువల్‌గా టోల్‌ వసూలు చేయడం వలన ఎన్నో పనిగంటలు, పెట్రోలు ఖర్చవుతున్నాయి. ఏడాదిలో యిలా వృథా అయ్యే మొత్తం రూ.87 వేల కోట్లని ఐఐఎమ్‌ కలకత్తావారు లెక్కకట్టారు. హరియాణాలోని ఆమ్‌ ఆద్మీవారు తమ రాష్ట్రంలో టోల్‌ కలక్షన్‌పై శ్వేతపత్రాన్ని విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరారు. చాలా మంది కాంట్రాక్టర్లను గడువుకి మించి ఎందుకు వసూలు చేస్తున్నారని అడిగితే ''ఈ రోడ్డుపై బోల్డు ట్రాఫిక్‌ వుంటుందని ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి కాంట్రాక్టు రాయించుకుంది. కానీ రోడ్డు వేశాక చూస్తే అంత ట్రాఫిక్‌ లేదు. అందుకని మా ఖర్చు మేం రాబట్టుకునేదాకా వసూలు చేస్తున్నాం'' అని సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగిన ఆందోళనకు స్పందించక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ''22 టోల్‌ యూనిట్లను రాష్ట్రప్రభుత్వం కాంట్రాక్టర్ల నుండి కొనేసి, ప్రజలకు భారం లేకుండా చేస్తుంది.'' అని హామీ యిచ్చారు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2014)

[email protected]