మోహన : హిదాయతుల్లా గారి కాగితం పారేసుకున్నా

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా  Advertisement హిదాయతుల్లా గారి కాగితం పారేసుకున్నా… నేను ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా గారి సెక్రటరీగా పని చేసే రోజుల్లో రాష్ట్రపతిగా వున్న జైల్‌ సింగ్‌ గారికి హృద్రోగం…

అనుభవాలూ – జ్ఞాపకాలూ: డా|| మోహన్‌ కందా 

హిదాయతుల్లా గారి కాగితం పారేసుకున్నా…

నేను ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా గారి సెక్రటరీగా పని చేసే రోజుల్లో రాష్ట్రపతిగా వున్న జైల్‌ సింగ్‌ గారికి హృద్రోగం వచ్చి శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్‌ తర్వాత 45 రోజుల విశ్రాంతి తీసుకోవాలి, ఆఫీసుకి వెళ్లకూడదు అన్నారు. అందువలన ఆయన రాష్ట్రపతిగా వ్యవహరించ లేకపోయారు. ఆ సమయంలో హిదాయతుల్లా గారిని వారి స్థానంలో విధులు నిర్వహించమని కోరారు. ఆయన ఇన్‌చార్జి ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాగా వ్యవహరించే రోజుల్లో రోజూ రాష్ట్రపతి భవన్‌కి వెళ్లేవారు. 

నేను కూడా ఆయనతో బాటు వెళ్లి ఒక గంటసేపు రాష్ట్రపతి భవన్‌ ఆఫీసులో కూర్చుని కాగితాలు చూసి వస్తూండేవాణ్ని. 

ఒక రోజు విదేశంలో వున్న మన ఎంబసీ నుండి వచ్చి ఒక  సీక్రెట్‌ కమ్యూనికేషన్‌ కనబడలేదు. ముందు రోజు అది నా టేబుల్‌ డ్రాయర్‌లోనే వుంది. మర్నాటి కల్లా మాయం. విదేశాంగశాఖ నుండి వచ్చిన రహస్య లేఖ అంతర్ధానం అయిందంటే దానికి బాధ్యులందరి పైనా చర్య తీసుకుంటారు. 

నా టేబుల్‌ నుండి మాయమైంది కాబట్టి నా పై చర్య తప్పదు. ఉద్యోగం మాట ఎలా వున్నా ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. అన్ని కాగితాలూ వుండి యిదొక్కటే కనబడకుండా పోవడ మేమిటి?

అన్నీ వెతికాను, మళ్లీ వెతికాను, మళ్లీ మళ్లీ వెతికాను, మర్నాడు వెతికాను, ఆ మర్నాడు వెతికాను.

పొరపాటున యింటికి పట్టుకెళ్లానా అని యింట్లోనూ వెతికాను. ఆఫీసులో అన్ని టేబుళ్లు, బీరువాలు, ఫైళ్లు అల్లకల్లోలం చేసి చూశాను. 

ఎక్కడా కనబడలేదు. రాష్ట్రపతి భవన్‌లో ఎప్పణ్నుంచో పని చేస్తున్న సిబ్బందికి ఆనుపానులు తెలుస్తాయి కదాని అందర్నీ అడిగి చూశాను. ఎవరూ చూడలేదన్నారు. తెలియదన్నారు. పైగా అలా కాగితాలు పారేసుకుంటే ఎలా అని ఆశ్చర్యపడ్డారు.

దాని గురించి పెద్ద రాద్ధాంతం జరగసాగింది.

హిదాయతుల్లా గారికి చెప్పాలా? వద్దా? నేను చెప్పకపోతే వేరే ఎవరైనా వెళ్లి చెపితే యింకా అసహ్యంగా వుంటుంది.

xxxxxx

భారతదేశ ఉపాధ్యకక్షుడి వద్ద పనిచేయకపోతే యిలాటి యిబ్బందులు వుండకపోవును కదా అనిపిస్తోందా? నేనేమీ అక్కడకు ఏరికోరి వెళ్లలేదు. అదంతా శారదా ముఖర్జీగారి చలవ! 

అసలు సర్వీసెస్‌లో వున్నవాళ్లెవరికీ సాధారణంగా యిలాటి ఉద్యోగాలపై మోజు వుండదు. కార్యక్షేత్రంలో చురుగ్గా వుందామనే అనుకుంటారు. 1977లో గుంటూరులో కలక్టరుగా వుండగా గవర్నరు శారదా ముఖర్జీ నాగార్జునకొండ మ్యూజియం పర్యటన సమయంలో ఆవిడ కళ్లల్లో పడ్డాను. తన వద్ద సెక్రటరీగా రావాలని పట్టుబట్టిందావిడ. తప్పలేదు. గుజరాత్‌ గవర్నరుగా ఆవిడకు బదిలీ కావడంతో మళ్లీ యాక్టివ్‌ సర్వీస్‌కు వెళ్లిపోవచ్చని ఆశపడ్డాను. అయితే ఆవిడ వెళుతూ వెళుతూ తర్వాత వచ్చిన కె సి అబ్రహాం గారికి నా గురించి చెప్పడంతో 'నువ్వు వెళ్లడానికి వీల్లేదు' అని ఆయన పంతం పట్టారు. 

'ఈ వయసులో యిటువంటి ఉద్యోగాల్లో కూరుకుపోతే నా కెరియర్‌ ఏమవుతుందో ఆలోచించండి' అని ఆయన్ను బతిమాలాను. చివరకు ఒక ఏడాది పాటు ఆయన వద్ద కొనసాగేట్లు, ఆ తర్వాత ఆయన వదిలిపెట్టేట్లు ఒప్పందం కుదిరింది. ఏడాది పూర్తయ్యాక కూడా అబ్రహాం గారికి నన్ను వదలబుద్ధి కాలేదు. ''నేను వుండేవరకు యీ పోస్టులో కొనసాగవచ్చుకదా'' అన్నారు. నేను చేతులు జోడించాను.

ఆయన అర్థం చేసుకుని, పుత్రవాత్సల్యంతో ఆ చేతులు పట్టుకుని ''నీ బాధ నాకు తెలుసు. నీ కెరియర్‌కు నేను అడ్డు రాను. రిలీవ్‌ చేస్తాను.'' అన్నారు. అప్పుడు కృష్ణా జిల్లాకు కలక్టరుగా పోస్టింగ్‌ వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌నుండి వెళ్లిపోయినా శారదా ముఖర్జీగారు నన్ను మర్చిపోలేదు. 1980లో ఆవిడ ఢిల్లీ వెళ్లినపుడు వైస్‌ ప్రెసిడెంటుగా వున్న హిదాయతుల్లా గారిని చూడబోయారు. ఆయన ఆఫీసు తీరూ తెన్నూ లేకపోవడం చూసి ఆవిడ బాధపడింది. 

''నాకు తెలిసున్న ఒక సమర్థుడైన అధికారి వున్నాడు. నా దగ్గర సెక్రటరీగా పని చేశాడు. అతనైతే యివన్నీ ఓ క్రమపద్ధతిలో  పెట్టేస్తాడు.'' అని సిఫార్సు చేశారు.

''వైస్‌ ప్రెసిడెంట్‌ ఆఫీసులో ఐయేయస్‌ అధికారికి పోస్టింగ్‌ లేదు కదా'' అన్నారాయన.

''మీరు చెప్పి ప్రత్యేకంగా వేయించుకోండి'' అని సలహా యిచ్చారావిడ.

హిదాయతుల్లా గారికి నేనెవరో తెలియదు. అయినా శారదా ముఖర్జీగారి మాట మీద గురికి తోడు నేను ఒక జడ్జిగారబ్బాయినన్న సంగతి ఆయనను ఆకట్టుకుంది. మనవాడే అనుకున్నారులాగుంది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అంజయ్యగారికి నన్ను సెంట్రల్‌ సర్వీసెస్‌కు తనకు సెక్రటరీగా పంపమని కోరారు. 

అంజయ్యగారికి నేను కందా మోహన్‌గా, భీమశంకరం గారి అబ్బాయిగా తెలుసు. కానీ హిదాయతుల్లా గారు ఎవరో 'కండా'ను అడుగుతున్నారనుకుని  'ఓ యస్‌' అనేశారు. చీఫ్‌ సెక్రటరీ గారికి చెప్పేశారు. 

నాకు పోస్టింగ్‌ వచ్చాక చెప్పడానికి వెళితే ''నువ్వెక్కడికి వెళ్తున్నావ్‌? వెళ్లవలసినది వాడెవడో కదా!'' అన్నారు ఆశ్చర్యపడుతూ. 

ఈ విధంగా నాకు తెలియకుండా చాలా విషయాలు జరిగిపోయాయి. ఫిషరీస్‌ కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరక్టరుగా ఎంతో తృప్తిగా వుద్యోగం చేసుకుంటున్న నన్ను మళ్లీ నాన్‌-యాక్టివ్‌ పోస్టుకి పంపేశారు.

xxxxxx

మొదట చెప్పిన సందర్భాలు జీవితంలో ఎదురవుతూంటాయి. వీటిని తట్టుకోవాలంటే కావలసినది దేవుని యందు అచంచల భక్తి, మానసిక స్థయిర్యం. 

భక్తికి అడ్డు వచ్చేది అహంకారం కాబట్టి మొదటగా మనం గుర్తించవలసినది మనం అనంతసృష్టిలో ఒక పిపీలికమాత్రులమేనని. నేను యోగా చేసిన తర్వాత చివరిగా శవాసనం వేసినపుడు నాలో యీ భావం మాటిమాటికీ మెదలుతుంది. ఎవరైనా విమానం లోంచి హైదరాబాదును చూశారనుకోండి. ఎంత కనబడుతుంది? దానిలో ఓ మూల, ఓ యింట్లో చాప మీద పడుకుని వున్న నేను ఎంత వుంటాను? చుక్కంత..? విమానం కాకుండా రాకెట్‌లోంచి చూస్తే…? అప్పుడు భూమే బంతి అంత కనబడుతుంది. దేశం కాస్త.. దానిలో.. హైదరాబాదు.. దానిలో మళ్లీ మా యిల్లు.. చుక్కలో చుక్కంత! ఇంకా పైకి వెళ్లి సూర్యుడి దగ్గరకు వెళ్లి చూస్తే మన పరిమాణం మరీ కుచించుకుపోతుంది. అంటే అనంత విశ్వంలో పాల్‌ డేవీస్‌ ''పేల్‌ బ్లూ డాట్‌'' అనే పుస్తకంలో రాసినట్టు మన భూమే పాలిపోయిన నీలపు చుక్కలా కనబడుతుంది. ఇక మనం ఆక్రమించే చోటు అణువాతి పరిమాణువన్నమాట. ఇదంతా ప్రస్తుతకాలాన్ని లెక్కలోకి తీసుకుంటే. మన యూనివర్స్‌ సుమారు 13.7 వందల కోట్ల కాంతి సంవత్సరాలుగా వుంది. ఇంకా ఎన్నో కోట్ల కాంతి సంవత్సరాలు వుండబోతోంది. అంత కాలప్రమాణంలో మన జీవితకాలం అనే పరిమాణం ఎంత చిన్నది? అంటే టైమ్‌ డైమన్షన్‌లో కూడా మనం ఒక శకలం అన్నమాట. ఒక చిచ్చుబుడ్డి వెలిగించినపుడు ఒక్క వెలుగు వెలిగి ఆరిపోయే ఒకానొక నిప్పురవ్వ లాటి వాళ్లమన్నమాట. కాస్మాలజీ, థియరీ ఆఫ్‌ రెలెటివిటీ చదవడం వలన కాబోలు యింతటి అల్పులమైన మనకు అహంకారం అనవసరం అనిపిస్తుంది. 

నా విషయమే తీసుకుంటే ఏడో నెలలోనే పుట్టినవాణ్ని. పుడుతూనే పోవలసినవాణ్ని. అసలు జీవించడానికి, పెరగడానికి హక్కు లేనివాడిని అన్నమాట. అలాటివాణ్ని – పుట్టాను, పెరిగాను, ఆరోగ్యంగా పెరిగాను, ఏ సుఖమైనా సరే చేయి చాస్తే అందేటట్లు అమర్చాడు దేవుడు. మంచి చదువు, మంచి ఉద్యోగం, హోదా, ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి, ఏ అవకరమూ లేకుండా పుట్టిన పిల్లలు, వాళ్లు బాగా చదువుకోవడం, స్థిరపడడం, తగిన వాళ్లను పెళ్లాడడం… యిలా ఆలోచిస్తే నేను దేవుడికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలో అనిపిస్తుంది. ఇన్ని యిచ్చినా చాలనట్టు మనం కోరికలు కోరుతూ పోవడం అన్యాయం కదా! కోరుకోవడం సరే ఆ కోరిక గురించి ఆలోచించడం కూడా అది తప్పే కాదు, పాపం కూడా! మనకు ప్రాప్తం వున్నదే మనకు దక్కుతుంది. దాంతోనే ఉల్లాసంగా వుండాలి. పైన చెప్పిన కష్టాలు వచ్చినపుడు యీసురోమని ఏడ్చుకుని, యిలాటి చోట ఎందుకు పడేశావురా దేవుడా అని ఆయన్ని నిందించి… యిది సరైన పద్ధతి కాదు. ఇది మా నాన్నగారు నాకు చెప్పిన సిద్ధాంతం. ఉద్యోగంలో మొదటి పోస్టింగ్‌ లో చేరబోతూ ఆయన దగ్గరకి వెళ్లి అడిగాను – ''వెళ్లి కాపురం కూడా పెట్టబోతున్నాను. ఉద్యోగం, కాపురం రెండూ కొత్తవే. జీవితంలో అడుగు పెట్టబోతున్నాను. నీ సలహా ఏమిటి?'' అని. 

''పెద్దగా చెప్పేందుకు ఏమీ లేదు. ఏది ఏమైనా సరే ఎప్పుడూ సంతోషంగానే వుండడానికి నిశ్చయించుకో. ఇట్‌ ఈజ్‌ ఎ సిన్‌ టు బి అన్‌హ్యాపీ. విచారంగా వుండడం పాపం. అలాటివాడు సమాజానికి మచ్చ. నువ్వు తృప్తిగా, హాయిగా జీవితం గడిపితే అన్నీ బాగుంటాయి. సంఘం పట్ల  అది నీ విధి, కర్తవ్యం'' అని చెప్పారు. అది నా ఆలోచనాసరళిపై చాలా ప్రభావం చూపింది.

xxxxxx

నేను సహారా ఎడారిలో తిరిగి చూశాను. జెనీవాలో మంచు పడుతుంటే కూడా తిరిగాను. రెండు చోట్లా అనిపించింది –  చూశావా, దేవుడి ప్రపంచం ఎంత వింతగా వుంటుందో! అని. ఆ వేడీ, ఆ శీతలం – రెండూ దేవుడే, కానీ ఆయన ఆ రెండూ కాదు కూడా! ఆయన అగ్ని కాదు, జలము కాదూ, కానీ రెండూ ఆయనే. కన్నుపొడుచుకున్నా కనబడని చీకటీ ఆయనే, కళ్లు బైర్లు కమ్మించే వెలుగూ ఆయనే.. కానీ రెండూ ఆయన కావు. అతి సూక్ష్మమూ, అతి విరాట్‌ స్వరూపమూ ఆయనే, కానీ ఆయన రెండూ కాదు. నేను నిత్యం పారాయణ చేసే లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రంలో వస్తుంది – 'ఆద్యంత శూన్యం, అజం, అవ్యయం, అప్రమేయం' అని,  ఆది, అంతము లేనివాడు, పుట్టనివాడు, గిట్టనివాడు, నిరూపించబడనక్కర లేనివాడు' అని అర్థం. దేవుణ్ని ఎలా నిరూపిస్తాం? క్రికెట్‌ స్టేడియంలో కూర్చుని అటూ యిటూ చూస్తే 'ఈ 80 వేలమందీ దేవుడు సృష్టించిన వారే కదా' అనిపిస్తుంది. గురువుగారి పాదాల వద్ద కూర్చుని ఆయన చెప్పినది వింటూ వుంటే 'ఆహా యింతటి మేధావి, జ్ఞాని కూడా దేవుడి సృష్టే కదా' అనిపిస్తుంది. క్వాంటిటీ, క్వాలిటీ .. రెండిటా దేవుడే దిట్ట. స్థల, కాల, బుద్ధి పరిమాణాల దృష్ట్యా పరిమితులు అపారంగా వున్న మనం దేవుడిపై అంచనాలు వేసుకుంటూ పోవడం చాలా కష్టం. దేవుడే యిచ్చిన పరికరాలైన పంచేంద్రియాలతో ఆయన్ని తూచడం, కొలవడం మానేసి, కొలుచుకోవడం ఉత్తమం.

కొలుచుకునే వారిలో నేనూ ఒకణ్ని. కొందరు దేవుణ్ని నమ్ముతారు కానీ పూజాపునస్కారాలు చేయరు. నేను చేస్తాను. హిదాయతుల్లా గారి వద్ద సెక్యూరిటీ ఆఫీసరుగా పని చేసిన ఠాకూర్‌ జగదీశ్‌ సింగ్‌ గారు నాకు హనుమాన్‌ చాలీసా నేర్పించారు. అది కాక శ్రీరామ రక్షా స్తోత్రం, ఆదిత్యహృదయం లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్రం, వేంకటేశ్వర సుప్రభాతం కూడా చదువుతుంటాను. ఒకసారి అనారోగ్యం చేస్తే అప్పణ్నుంచి ప్రతి మంగళ, గురు, శనివారాలు తలస్నానం చేసి హనుమంతుడి మంత్రం, లలితా సహస్రనామ స్తోత్రంలో కొంతభాగం చదువుతాను. 

బియస్సీ ప్రాక్టికల్స్‌లో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి క్లాస్‌ మిస్‌ కావడంతో, అహం దెబ్బతిని, మొదటిసారిగా దేవుడు గుర్తుకు వచ్చాడు. అదే రోజుల్లో మోటార్‌ సైకిల్‌ యాక్సిడెంట్‌ కూడా జరిగింది. టాంక్‌ బండ్‌ మీద యూ టర్న్‌ తీసుకుంటూ వుంటే హోం మినిస్టర్‌గారి ఆర్డర్లీగా పని చేసే పోలీసతను వెనక్కాల నుంచి వచ్చి కొట్టేశాడు. కింద పడిపోయి కాలు విరిగింది. కోలుకున్నాక తిరుపతి నడుచుకుంటూ వెళ్లాను. ఆ తర్వాత ఎమ్‌ఎస్‌సిలో చేరాక, చూస్తూండగానే నా వ్యక్తిత్వం మారిపోయింది. కారణమేమిటో నాకే బోధపడనంత యిదిగా మ్యాథమాటిక్స్‌లో షైన్‌ అయ్యాను. నేను రాణించడమే కాదు, నా క్లాస్‌మేట్స్‌కు కూడా లెక్కలు చెప్పగలిగేవాణ్ని. హైస్కూలులో నాకు లెక్కలు చెప్పిన గురువులు ప్రైవేట్‌గా ఎమ్‌ఏ (మ్యాథమాటిక్స్‌)కి కడితే నేను రాత్రి వాళ్లింటికి వెళ్లి ఆ రోజు కాలేజీలో నేర్చుకున్న పాఠాలు నేర్పేవాణ్ని. చివరకు ఎమ్‌ఎస్‌సి యూనివర్శిటీ ఫస్ట్‌ రావడమే కాక, అప్పటిదాకా ఎవరికీ రానన్ని మార్కులు సంపాదించి రికార్డు నెలకొల్పాను. ఇదంతా దేవుని చలవే అని నా నమ్మకం.

ఈ పూజాపునస్కారాల వలన నాకు ఒనగూడిన ప్రయోజనం ఏమిటి? అంటే దేవుడి సృష్టిలో నేను నిమిత్తమాత్రుణ్ని, నా లాగే తక్కిన అందరూ అనే భావన మనసులో నాటుకుపోయింది. పనివాడినైనా సరే లోకువగా చూసినా ఫరవాలేదనే ఆలోచనే నాకు రాదు. అలాగే ఎవరి వద్దనైనా చేతులు కట్టుకుని వాళ్లు ఏం చెపితే అది చేయాలి అని కూడా అనిపించదు. గౌరవం అంటారా – అది చిన్నా పెద్దా అందరి మీదా కలుగుతుంది. చిన్నప్పుడు మా యింట్లో పనివాడుగా వున్న రాముడు దగ్గర్నుంచి…! కలగకపోతే చిన్నయినా కలగదు, పెద్దయినా కలగదు.

అంతేకాదు, పరిస్థితులతో రాజీ పడడం కూడా అలవడింది. వయసు వచ్చేకొద్దీ కోరికలు వదుల్చుకుంటూ పోతాం. అందువలన నిరాశలు, ఫ్రస్ట్రేషన్స్‌ తగ్గిపోతాయి. ఏ ఉద్యోగమైనా, ఏ బాధ్యతైనా మిమ్మల్ని భయపెట్టదు. 'సిటింగ్‌ లైట్లీ ఆన్‌ యువర్‌ షోల్డర్స్‌' అంటారు చూడండి, అది మీకు భుజస్కంధాలపై ఓ పెద్ద భారం అనిపించదన్నమాట. ఈనాడు యీ కాగితం కనిపించకపోవడం కూడా దేవుని లీలలో భాగమే అనుకుని ఊరడిల్లి, ఏ అఘాయిత్యమూ తలపెట్టలేదు. మరీ చింతించలేదు. మానవ ప్రయత్నంగా నా వెతుకులాట నేను కొనసాగిస్తూనే వున్నాను.

xxxxxx

చివరకు ఏమైతే అది అయిందని హిదాయతుల్లా గారికి చెప్పాను. 

ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్‌ సిబ్బందే కావాలని అల్లరి పెడుతున్నారని గ్రహించారు. రాష్ట్రపతి భవన్‌లో వుండే అధికారుల ద్వారా సంకేతాలను పంపించారు – యిలాటి చేష్టలు మాని ఆ కాగితాన్ని తిరిగి యిచ్చేయమని! స్పందన లేదు. 

ఆయన రాష్ట్రపతి భవన్‌ విడిచి తిరిగి తన పదవికి వెళ్లిపోయే రోజు దగ్గర పడింది. 

ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. వాళ్లకు బుద్ధి చెప్పడానికి నిశ్చయించు కున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో సెక్రటరీగా వున్న వి.కె.ధార్‌ గారు ఆంధ్రా క్యాడర్‌ సీనియర్‌ ఐయేయస్‌ ఆఫీసరు. పెద్దాయన. నాకు మంచి మిత్రుడు.

ఆ సాయంత్రం ధార్‌గార్ని పిలిచి హిదాయతుల్లా గారు చెప్పారు – ''రేపు పొద్దున్నతో నా 45 రోజులు పూర్తవుతాయి. ఈ కాగితం ఎవరో మీ వాళ్ల దగ్గరే వుంది. అది నాకు తెలుసు. రేపు పొద్దున్న కల్లా అది తెచ్చి యిచ్చారా సరేసరి. లేకపోతే సిబిఐను పిలిచి రాష్ట్రపతి భవన్‌ సోదా చేయమని చెప్తాను.'' అని.

ధార్‌ గారు నిర్ఘాంతపోయారు – ''దేశ ప్రథమపౌరుడి కార్యాలయంలో సిబిఐ సోదానా!?'' 

''అవును. అదే చేయబోతున్నాను. అది ఎంత సంప్రదాయవిరుద్ధమైనా కానీయండి. మీ వాళ్ల ప్రవర్తనతో విసిగిపోయాను.'' అని హిదాయతుల్లా గారు చాలా ఆగ్రహంగా చెప్పారు. 

హ్యేట్సాఫ్‌ టు హిదాయతుల్లా, వెళ్లవలసిన సంకేతం చాలా బలంగా వెళ్లింది. ఈయన అనుకున్నది చేసేట్టు వున్నాడని భయపడ్డారు.

మర్నాడు నేను ఆఫీసుకి వచ్చి డ్రాయరు తెరిచేసరికి దానిలో ఆ కాగితం వుంది! 

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version