ఎమ్బీయస్‌ : కర్ణాటకలో డబ్బింగు వ్యతిరేక పోరాటం

మన రాష్ట్రంలో డబ్బింగు సినిమాలను, డబ్బింగు టీవీ సీరియళ్లను నిషేధించాలని, కనీసం నియంత్రించాలని పోరాటం సాగుతోంది. కర్ణాటకలో సంగతి వేరు. అక్కడ అటువంటి నిషేధం ఎప్పటినుండో సాగుతోంది. దాన్ని ఎత్తివేయాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా…

మన రాష్ట్రంలో డబ్బింగు సినిమాలను, డబ్బింగు టీవీ సీరియళ్లను నిషేధించాలని, కనీసం నియంత్రించాలని పోరాటం సాగుతోంది. కర్ణాటకలో సంగతి వేరు. అక్కడ అటువంటి నిషేధం ఎప్పటినుండో సాగుతోంది. దాన్ని ఎత్తివేయాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా యిప్పుడు పోరాటం సాగుతోంది. 1960లలో కన్నడ సినిమా పరిశ్రమ కుంటుపడింది. ఇతర భాషా చిత్రాల నాణ్యత బాగుంటుందని భావించిన కన్నడ ప్రజలు వాటి డబ్బింగు సినిమాలు చూసేవారు. ఆనాటి మేటి హీరో, కన్నడ కంఠీరవ బిరుదాంకితుడు రాజ్‌కుమార్‌, ఎ ఎన్‌ కృష్ణమూర్తి అనే రచయితతో కలిసి డబ్బింగు సినిమాలు నిషేధించాలని ఉద్యమించారు. అప్పుడు ప్రజలు యితర భాషాచిత్రాలను డైరక్టుగానే చూడసాగారు. ఇదీ బాగా లేదని ఏడాదిలో యిన్ని రోజులు కన్నడ సినిమాలు ఆడితీరాలని సినిమా థియేటర్ల వారిపై ఒత్తిడి తెచ్చారు ఉద్యమకారులు. అలా ఆడిస్తే గిట్టుబాటు కాదనుకున్న థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 50 ఏళ్లగా అప్రకటిత నిషేధం అమల్లో వుంది. ఇతర భాషా చిత్రాలు కానీ, టీవీ సీరియళ్లు కానీ కన్నడంలోకి డబ్‌ కావు. దీనివలన కన్నడ సినిమాల సంఖ్య పెరిగింది. 1960లలో ఏడాదికి 8-10 సినిమాలు వస్తే, 1970ల నాటికి అది 30-40 అయింది. ఇప్పుడు 130-150 తీస్తున్నారు. సక్సెస్‌ రేట్‌ మాత్రం 5-10% వుంటోంది. 

ఆమిర్‌ ఖాన్‌ ''సత్యమేవ జయతే'' సీరియల్‌ను కన్నడంలోకి డబ్‌ చేయించి తమ సువర్ణ టీవీలో చూపించడానికి స్టార్‌ టీవీ ప్రయత్నించింది. కన్నడ నిర్మాతల సంఘం, దర్శకుల సంఘం, నటీనటుల సంఘం దాన్ని అడ్డుకున్నాయి. వాళ్లు సిసిఐ (కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా)కు ఫిర్యాదు చేశారు. వాళ్లు యీ సంఘాలకు నోటీసులు యిచ్చారు. దీనికి జవాబుగా కన్నడ చిత్రపరిశ్రమ న్యాయస్థానానికి వెళ్లలేదు. పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించింది. దానికి నాయకత్వం వహించినది రాజ్‌కుమార్‌ కుమారుడు శివరాజ్‌. మేధావులుగా పేరుబడిన గిరీశ్‌ కర్నాడ్‌, అనంతమూర్తితో సహా కన్నడ సాహిత్యకారులు, కళాకారులు యీ నిషేధం కొనసాగాలనే కోరుతున్నారు. ''ఎవరైనా వచ్చి మీ గుమ్మం ముందు రోడ్డు మీద కారు పార్క్‌ చేశాడనుకోండి. రోడ్డు మనది కాకపోయినా కారు తీసేయమంటాం. ఇదీ అలాటిదే.'' అన్నాడు ఓ నిర్మాత. తెలుగు టీవీ పరిశ్రమలోని కళాకారులు యిలాటి నిషేధానికై ఎంతో ప్రయత్నిస్తున్నా విజయం సాధించకపోవడానికి, కర్ణాటకలో విజయం సాధించడానికి కారణం ఏమిటో తెలుసా? మన దగ్గర సినీ హీరోలే టీవీ యజమానులు, డబ్బింగు సినిమా నిర్మాతలు, పంపిణీదారులు! కర్ణాటకలో ఆ పరిస్థితి లేదు.  

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]