ఎమ్బీయస్‌ : యుపిలో అమిత్‌ షా కృషి

ఈ ఎన్నికలలో యుపిలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ ఘనత అమిత్‌ షా కార్యశైలిదే. అతని సామర్థ్యం తెలిసిన మోదీ స్వయంగా అతన్ని ఎంపిక చేసి యుపికి యిన్‌చార్జిగా పంపించాడు. వాళ్లిద్దరికీ 30…

ఈ ఎన్నికలలో యుపిలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ ఘనత అమిత్‌ షా కార్యశైలిదే. అతని సామర్థ్యం తెలిసిన మోదీ స్వయంగా అతన్ని ఎంపిక చేసి యుపికి యిన్‌చార్జిగా పంపించాడు. వాళ్లిద్దరికీ 30 ఏళ్ల పరిచయం. శంకర్‌ సింగ్‌ వాఘేలా గుజరాత్‌లో బిజెపి అధ్యకక్షుడిగా వున్నపుడు మోదీ అమిత్‌ను అతనికి పరిచయం చేశాడు. అమిత్‌ తన దీక్షతో, సామర్థ్యంతో ఎదుగుతూ వచ్చాడు. వాజపేయి, ఆడ్వాణీ గుజరాత్‌నుండి పోటీ చేసినపుడు వారి ప్రచారభారం నెత్తిన వేసుకుని వారి ప్రశంసలు పొందాడు. మోదీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాబినెట్‌లో అతని కుడిభుజంగా మెలిగాడు. చెప్పిన పని చక్కపెట్టుకుని వచ్చాడు. సొహ్రాబుద్దీన్‌ బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో సిబిఐ చార్జిషీటుకు గురై, అరెస్టయి, ప్రస్తుతం పెరోల్‌పై తిరుగుతున్నాడు. 

గత మేలో యుపికి రాగానే అక్కడి పరిస్థితి అధ్యయనం చేశాడు. కులం ప్రాధాన్యత వహిస్తున్న యుపిలో దళితులు బియస్పీవైపు, బిసిలు ఎస్పీవైపు వుండడం చూశాడు. బిజెపికి వున్న అగ్రవర్ణాల సపోర్టు చాలదనుకుని, బిసి ఓట్లు ఎస్పీ నుండి లాక్కోవడానికి ప్రణాళికలు రచించాడు. మోదీ బిసి కులస్తుడన్న సంగతిని హైలైట్‌ చేస్తూ బిసి నాయకులను బిజెపిలోకి తీసుకురావడానికి చూశాడు. లక్నోకు వెళ్లి రెండు సార్లు బిజెపి లోంచి బయటకు వెళ్లిపోయిన బిసి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కళ్యాణసింగ్‌ను కలిసి బేరమాడాడు. తన లోధ్‌ కులస్తులు ఎక్కువగా వున్న ఆలీగఢ్‌, హత్రాస్‌, బులంద్‌ షహర్‌లలో తను చెప్పిన కాండిడేట్లకు టిక్కెట్లు యివ్వాలన్న అతని డిమాండ్‌కు ఒప్పుకున్నాడు. ఆ ప్రకారం మార్చిలో కళ్యాణ్‌ సింగ్‌ బిజెపిలో చేరడం, వెంటనే పార్టీ ఉపాధ్యకక్షుడు కావడం జరిగింది. ఈ సారి ఎన్నికలలో బిజెపి కశ్యప్‌, కూర్మి, రాజభర్‌, కుశావహా, తదితర కులాలకు చెందిన బిసిలకు 20 సీట్లు యిచ్చింది. ఇంతవరకు బాగానే వుంది కానీ దీని కారణంగా బిజెపిని సమర్థిస్తూ వచ్చిన బ్రాహ్మణ, రాజపుత్ర కులాల వారికి కోపం వచ్చింది. వారణాశి, లక్నో నియోజకవర్గాల నుండి మురళీ మనోహర్‌ జోషి, లాల్జీ టాండన్‌ వంటి సీనియర్‌ నాయకులను తప్పించి మోదీ, రాజ్‌నాథ్‌లకు యిచ్చేముందు కనీసం వారిని సంప్రదించకపోవడం అవమానంగా భావించారు. మోదీ పేరు చెప్పి అమిత్‌ వారిని నోరు మూయించాడు. లాల్జీ టాండన్‌ను కలిసి 'రాజ్‌ నాథ్‌ ప్రచార బాధ్యత నీదే. లక్నోలో మోదీ సభకు నిర్వహణ నీదే' అని నచ్చచెప్పాడు. 

కళ్యాణ్‌సింగ్‌ను వెనక్కి తీసుకురావడంతో ఇప్పటికే పార్టీలో వున్న బిసి నాయకులు ఓం ప్రకాశ్‌ సింగ్‌, వినయ్‌ కతియార్‌లకు ఆగ్రహం వచ్చింది. 'గుజరాత్‌లో కట్టే పటేల్‌ విగ్రహానికి యినుము సేకరించే పని నీదే' అని ఓం ప్రకాశ్‌ను బుజ్జగించాడు. ఆరెస్సెస్‌ నాయకులనే కాదు, అనుబంధ సంస్థలైన అఖిల భారత విద్యార్థి పరిషత్‌, హిందూ జాగరణ్‌ మంచ్‌ నాయకులను కూడా కలిసి వారి మధ్య సమావేశాలు ఏర్పరచి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ తగ్గించాడు. ఇతని ప్రయత్నాల వలన ఆరెస్సెస్‌ నాయకుడు సురేశ్‌ సోనీ ఆరెస్సెస్‌, బిజెపి నాయకుల మధ్య సమన్వయసభను లక్నోలో ఏర్పాటు చేశాడు. అమిత్‌ ప్రతీ నియోజకవర్గానికీ వెళ్లి 'మోదీ గెలుపు ఖాయం' అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచాడు. ఇప్పటివరకు 40 భారీ సభలు ఏర్పరచాడు. 400 ప్రచార రథాలు సిద్ధం చేశాడు. 1.40 లక్షల బూత్‌ కమిటీలు ఏర్పడాలని ఆదేశించాడు. ఒక్కో కమిటీలో 10 మంది సభ్యులుంటారు. వారు బిజెపి  ఓటర్లను గుర్తించి వారిని బూత్‌కు తీసుకుని రావాలి. ఇలా గ్రౌండ్‌ వర్క్‌ చేస్తూనే హిందూత్వ పేరుపై ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఒకటి బెడిసికొట్టి ఎలక్షన్‌ కమిషన్‌ అతన్ని ప్రచారానికి వెళ్లవద్దని ఆర్డరేసింది. వెళ్లకపోతే చేసినదంతా వ్యర్థమవుతుందన్న భయంతో క్షమాపణ చెప్పి నిషేధం ఎత్తి వేయించుకున్నాడు. ఎస్పీకి చెందిన ఆజం ఖాన్‌ మాత్రం ఆ తెలివి ప్రదర్శించలేదు.

ఇదంతా చదివి యీ సారి బిజెపి యుపిలో 80 సీట్లూ గెలిచేస్తుందని అనుకోవడానికి లేదు. తక్కిన రాష్ట్రాలలో జరిగినట్లే యిక్కడా బిజెపి యితర పార్టీల నుండి నాయకులను ఫిరాయింపు చేసుకుని తన కార్యకర్తలను నొప్పించింది. దోమారియాగంజ్‌ నుండి పోటీ చేస్తున్న జగదంబికా పాల్‌ కాంగ్రెసు నుండి రాగా, ఫిరోజాబాద్‌ అభ్యర్థి ఎస్‌ పి సింగ్‌ బాఘేల్‌ బియస్పీ నుండి రాగా, ఫతేపూర్‌ సిక్రి అభ్యర్థి చౌధురీ బాబూలాల్‌ ఆర్‌ఎల్‌డి నుండి వచ్చారు. గోండా అభ్యర్థి కీర్తివర్ధన్‌ సింగ్‌, అలహాబాద్‌ అభ్యర్థి శ్యామా చరణ్‌ గుప్తా, కైసర్‌గంజ్‌ అభ్యర్థి భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ఎస్పీ నుండి వచ్చారు. ఈ గోడదూకుళ్ల ప్రభావం ఏ మేరకు వుంటుందో వేచి చూడాలి. 

-ఎమ్బీయస్‌ ప్రసాద్ 

[email protected]