చిన్న సినిమా రూపు రేఖల్ని రాత్రికి రాత్రి మార్చేసిన దర్శకుడు మారుతి. యాభై లక్షలతో సినిమానా? ఆ సినిమాకు కోట్ల కలెక్షన్లా? ఈ ఆలోచన పెద్ద నిర్మాతల బుర్రలోకి సైతం ఎక్కించాడు. అదే సమయంలో బూతు జోకులు, బూతు సీన్లు చుట్టేసి, సినిమా అంటే సరిపోతుందా? ఇది యువతను తప్పుదారి పట్టించడం కాదా? అన్న విమర్శలు. ఇవిలా వుండగానే రెండుసినిమాలు చకచకా చేసేసాడు. మూడో సినిమాగా 'ప్రేమకథాచిత్రమ్' అంటూ ఓ కొత్త జోనర్ చూపించాడు. హర్రర్ లో కామెడీ మిక్స్ చేసి. కానీ మళ్లీ కాంట్రావర్సీ..ఎవరి పేరు ప్రతిష్టలనో తన ఖాతాలో వేసుకున్నాడంటూ. వాటిని పట్టించుకోకుండా, చిన్న సినిమాలు తీయగల దర్శకులకు మారుతి ప్రెజెంట్స్ అంటూ అండగా నిలిచాడు. మళ్లీ అక్కడా తలకాయనొప్పులే. వాళ్లు తీసిన బూతులు, రాతలు, ఈయనగారి ఖాతాలోనే. ఇదెక్కడ తంటా అనుకునే లోగా, అంతలోనే మళ్లీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోతో రాధ సినిమా ప్రకటన. కానీ అంతలోనే ఆ కథ నాదంటూ వివాదం. దాంతో సినిమా ఆగిపోయింది.
ఇలా ప్రతి అడుగులోనూ ఓ విజయం..ఓ వివాదం.. అదే దర్శకుడు మారుతి సినిమా యాత్ర సాగుతున్న వైనం. తాజాగా అల్లు శిరీష్ తో కొత్తజంట సినిమా రూపొందించాడీ దర్శకుడు. ఈ సందర్భంగా ఆయనతో గ్రేట్ ఆంధ్రా ఇంటర్వూ.
ప్ర.వివాదాలు లేని విజయాలు మీ జీవితంలో వుండవా?
జ. అసలు నా జీవితంలో అన్నీ అపజయాలే. అదృష్టం, విజయం అనేది వుంటాయనే తెలియదు. తొలిసారి విజయాన్ని చవిచూసింది 'ఈ రోజుల్లో' సినిమాతో. అప్పుడే తొలిసారి అనిపించింది నాకూ అదృష్టం వుంది అని.
ప్ర.అసలు ఎందుకిన్ని వివాదాలు?
జ.నాకైతే తెలియదు. విజయం వరిస్తుంటే వివాదాలు వస్తాయేమో?
ప్ర.వాటిని పట్టించుకుని, రాకుండా చూసుకునేలా ప్లాన్ చేసుకోలేరా?
జ.అసలు వాటి గురించే ఆలోచించను. నా పనే నాది.
ప్ర.పోనీ వివాదల సంగతి సరే, విజయాలను కూడా వదిలేస్తారా?
జ. విజయం నా తలకెక్కనివ్వను. సెలబ్రిటీ అన్న దాన్ని నా గుమ్మంలోకి రానివ్వను. నా ఇల్లు, నాలోకం, నా పని అంతే.
ప్ర.ప్రేమకథాచిత్రమ్ సంగతి అందరికీ తెలుసు. రాధ వ్యవహారం ఏమిటి? మీకు కథలు కరువయ్యాయా?
జ.నా దగ్గర వున్న కథలు అన్నీ తీసేసరికి కనీసం మరో పదేళ్లు పడుతుంది. అన్ని కథలున్నాయి. నా దగ్గర. అసలు నేను వెంకటేష్ బాబుకు కథ చెబితే కదా, నా కథ కాపీ కొట్టారని అనడానికి. నేను ఎవరికీ కథ చెప్పాను. నిర్మాతలకు ముందే చెబుతాను. నేను కథ మొత్తం రాసుకునే డైరక్టర్ ను కాదు. లైన్ చెబుతాను. దాన్ని అలా అలా పెంచుకుంటూ వెళతాను. బౌండ్ స్క్రిప్ట్ కావాలంటే నా వల్ల కాదు అని.
ప్ర.మరి ఇప్పుడే అన్నారు మీ దగ్గర బోలెడు కథలున్నాయని.
జ.కథలు అంటే లైన్ అన్నమాట. అమీర్ పేట నుంచి కోఠీ వెళ్లడం అన్నది లైన్. అయితే ఎలా వెళ్లాలన్నది పూర్తి కథ. అది నేను ముందు డిసైడ్ కాను. సినిమా తీస్తున్నకొద్దీ మారుతుంటుంది. కథ కొత్తగా తయారువుతుంది.చివరికి షేప్ కు వస్తుంది.
ప్ర,కొత్త జంట కూడా ఇలాగే తయారైందా?
జ.అవును. మూతపడే దశలో వున్న ఓ టీవీ చానెల్ ను ఎలా బాగు చేసారు అన్నది లైన్. అందులో రకరకాల క్యారెక్టర్లు,. వాటి బిహేవియర్లు..అన్నీ కలిసి,కథగా మారాయి.
ప్ర.మీరు మారుతి ప్రజెంట్స్ అన్నది వ్యాపారంగా మార్చేసారని, దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారనీ..
జ.ఈ రోజుల్లో సినిమాకు ఎందరో సాయం చేసారు. నేను అలాగే సాయం చేస్తానని కొంతమందికి మాట ఇచ్చాను. అంతే తప్ప మరేమీ కాదు.
ప్ర.కానీ ఆ సినిమా జయాపజయాలు మీ ఖాతాలోకే వస్త్తాయి కదా?
జ.నిజమే. నేను బూతులు వద్దు అని వాళ్లకి చెబుతున్నాను. మీరు అవే చెప్పి, హిట్ కొట్టారు.మేమూ కొడతాం అంటున్నారు. నేనేం చెబుతాను ఇంక. అందుకే ఇప్పటికి ఇచ్చిన మాట మేరకు మరో ఒకటి రెండు సినిమాలు మారుతి ప్రెజెంట్స్ అంటూ వస్తాయి. ఆ తరువాత ఎవరికీ ఆ పేరు ఇవ్వను.
ప్ర.వాళ్లన్నట్లే మీరు బూతు సినిమాలు తీసి, వారిని వద్దంటే ఎలా?
జ.అందరూ నేను బూతు సినిమాలు తీసానని అనడం అలవాటైపోయింది. బూతులు వున్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తే, నా సినిమా తరువాత పదుల సంఖ్యలో వచ్చిన సినిమాలు అన్నీ హిట్ అయి వుండాలి కదా? ఎక్కడయ్యాయి. అంతెందుకు నా పేరుతో ప్రెజెంట్స్ అన్నా జనం నమ్మారా? అంటే అర్థం ఏమిటి? కథలో, సినిమాలో దమ్ము వుండాలి. బూతులా, నీతులా అన్నది తరువాత.
ప్ర,అంటే ఇకపై మీ పేరు వున్న చోట క్లీన్ సినిమాలే వుంటాయా?
జ.తప్పకుండా. కొత్త జంట పూర్తి క్లీన్ సినిమా.
ప్ర,తెలుగు సినిమా రంగంలో ఏ దర్శకులు మీలా ఇంత త్వరగా ప్రెజెంట్స్ అంటూ హడావుడి పడలేదు..ఎక్కడో ఒకటీ అరా తప్పితే.తీసుకుంటే వాళ్ల సినిమాలు వాళ్లు తీసుకున్నారు. మీకెలా అనిపిస్తోంది.
జ.నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్లు ఎందుకు అలా ప్రెజెంట్స్ అంటూ ఒకరికి చేయి ఇవ్వలేదో. ఆ తలకాయనొప్పులు ఇప్పడు నాకూ అనుభవంలోకి వచ్చాయి. వారు ముందే జాగ్రత్త పడ్డారు.
ప్ర.అల్లు శిరీష్ తొలి సినిమా పెద్దగా విఫలమైంది. అతగాడి నటన కూడా కొంతవరకు కారణమైంది. మరి మీరు ఎలా ధైర్యం చేసారు?
జ. అందుకే నేను గౌరవం సినిమా చూడలేదు. శిరీష్ ను నా స్టయిల్ లో నేను హీరోగా చూపించాను అంతే. అతను కూడా బాగా చేసాడు.
ప్ర.అంటే హీరోగా నిలదొక్కుకుంటాడన్న నమ్మకం కలిగిందా?
జ.మంచి నటుడవుతాడని మాత్రం చెప్పగలను. బన్నీ కూడా అంతేగా. సినిమా సినిమాకు మంచి నటన కనబర్చాలని చూస్తాడు ఇప్పటికీ. శిరీష్ కూడా అంతే.
ప్ర.బన్నీ అంటే గుర్తు వచ్చింది. మీకు మంచి ఫ్రెండ్ కదా? మీ ఇద్దరి సినిమా ఎప్పడు?
జ.బన్నీకి నా దగ్గర వున్న ప్రతి లైన్ తెలుసు. తను సినిమా వెంట సినిమా జాగ్రత్తగా చేస్తాడు. అందువల్ల బన్నీతో నా సినిమా అన్నది ఎప్పుడైనా వుండచ్చు. దానికి టైమ్ అన్నది ప్రత్యేకంగా వుండదు
ప్ర.రెజీనా కు ఈ సినిమా చాలా అవసరం కదా?
జ.ఈ సినిమా ప్రత్యేకించి రెజీనాకు మంచి లిఫ్ట్ అవుతుంది. ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి.
ప్ర.ఈ సినిమాలో కూడా మీరు కామెడీని బాగా నమ్ముకున్నట్లుంది
జ.అదేమీ కాదు. యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్, ఫిల్డ్ విత్ కామెడీ
ప్ర.కొత్త జంట బడ్జెట్ గీత దాటిందని వినికిడి
జ.బ్యానర్ వ్యాల్యూ కూడా వుండాలి కదా? నేను కోటి రూపాయిల లోపు సినిమా తీస్తాను సరే. కానీ ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ సినిమా అంటే ఓ స్థాయిలో ఊహించుకుంటారు కదా?
ప్ర.మరి శిరీష్ రేంజ్ కూడా చూడాలి కదా?
జ.కానీ ఇక్కడ మారుతి కూడా వున్నాడు కదా. సినిమా టేబుల్ ప్రాఫిట్. అందులో సందేహ పడాల్సింది లేదు.
ప్ర.నితిన్ తో సినిమా వుంటుందని?
జ.లైన్ చెప్పాను,. ఆయనకు నచ్చింది. కథ తయారు చేసే పనిలో వున్నాను.
ప్ర.ఆ పైన.
జ.ఇంకా అంతవరకు ఆలోచన చేయలేదు. ఈ ప్రెజెంట్స్ అన్నీ అయిపోవాలి. ఆ తరువాత ప్రశాంతంగా చేసుకుంటాను.
ప్ర.ఆల్ ది. బెస్ట్..
జ.థాంక్యూ
చాణక్య