సినిమా రివ్యూ: అనామిక

రివ్యూ: అనామిక రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: వయాకామ్‌ 18, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ తారాగణం: నయనతార, వైభవ్‌, పశుపతి, హర్షవర్ధన్‌ రాణే తదితరులు సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: కీరవాణి కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌…

రివ్యూ: అనామిక
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: వయాకామ్‌ 18, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌
తారాగణం: నయనతార, వైభవ్‌, పశుపతి, హర్షవర్ధన్‌ రాణే తదితరులు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: కీరవాణి
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌
నిర్మాణం: వయాకామ్‌ 18, లాగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
విడుదల తేదీ: మే 01, 2014

హిందీలో విజయవంతమైన ‘కహానీ’ చిత్రం హిందీ సినిమాల్తో పరిచయం ఉన్న తెలుగు వారు అందరికీ ముందే తెలిసి ఉంటుంది. విద్యాబాలన్‌ నటించిన కహానీ ప్రశంసలతో పాటు ఘన విజయాన్ని కూడా అందుకుంది. అంతటి పాపులర్‌ సినిమాని రీమేక్‌ చేయడం సాహసమే. అందులోను సస్పెన్స్‌, థ్రిల్‌ ప్రధానంగా సాగే చిత్రాన్ని రీమేక్‌ చేయడం అంటే ముందే ముగింపు చెప్పేసి… చివరి వరకు కదలకుండా కూర్చోబెట్టి కథ చెప్పాలని ప్రయత్నించడమే. ఇంతవరకు ఎక్కువగా యూత్‌ఫుల్‌ సినిమాలు తీసిన శేఖర్‌ కమ్ముల ఈ సాహసానికి, ఇలాంటి ప్రయత్నానికి పూనుకున్నాడు. మరి ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు?

కథేంటి?

అనామిక (నయనతార) పది రోజులుగా కనిపించని తన భర్తని వెతుక్కుంటూ ఇండియాకి వస్తుంది. పాతబస్తీలో అతను బస చేసిన హోటల్‌లోనే దిగుతుంది. ఆమెకి ఎస్‌ఐ సారథి (వైభవ్‌) సాయపడుతుంటాడు. భర్త ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆమె భర్త ఒక ఐఎస్‌ఐ తీవ్రవాది అంటూ ఒక ఉన్నతాధికారి (పశుపతి) హడావిడి చేస్తాడు. మరి అనామిక తన భర్త అమాయకుడని ఎలా నిరూపించుకుంటుంది? అతడిని కలుసుకుంటుందా లేదా?

కళాకారుల పనితీరు!

నయనతారకి ఈ పాత్రని పోషించడానికి కావాల్సిన అనుభవం ఉండడంతో అనామిక క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఆమె నటనకి వంక పెట్టలేం. ప్రతి సీన్‌లోను అనామిక పాత్ర పడే మానసిక సంఘర్షణని కళ్లకి కట్టింది. వైభవ్‌ చాలా సహజంగా నటించాడు. పశుపతి మంచి నటుడే అయినా ఈ పాత్రకి ఎందుకో అతను మిస్‌ఫిట్‌ అనిపించింది. ఆ క్యారెక్టర్‌ ఎఫెక్టివ్‌గా ఉండడానికి వేరే ఎవరైనా పాపులర్‌ నటుడ్ని తీసుకుని ఉంటే బాగుండేది. హోటల్‌ ఓనర్‌, స్టేషన్‌లో రైటర్‌ వగైరా పాత్రధారులు ఓకే అనిపిస్తారు.  

సాంకేతిక వర్గం పనితీరు:

రెండు బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్స్‌ మినహా ఇందులో పాటల్లేవు. కీరవాణి టాలెంట్‌ మొత్తం బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో చూపించారు. ఈ చిత్రానికి ఆయన నేపథ్య సంగీతమే ప్రాణమని చెప్పాలి. చాలా సాధారణ సన్నివేశాలని కూడా ఆయన ఎలివేట్‌ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. విజయ్‌ సి. కుమార్‌ తన పనితనంతో ఆకట్టుకున్నారు. ఎడిటింగ్‌ సెకండ్‌ హాఫ్‌లో క్రిస్ప్‌గా బాగుంది. ఆ టెంపో ఫస్టాఫ్‌లో మిస్‌ అయింది. 

శేఖర్‌ కమ్ముల, యండమూరి వీరేంద్రనాధ్‌ కలిసి ‘కహానీ’ చిత్ర కథలో చాలా మార్పు చేర్పులు చేశారు. ఈ చిత్రాన్ని కొత్తగా మలిచేందుకు, కొత్త ట్విస్టులు ఇచ్చేందుకు కృషి చేశారు. ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమా కథకి ఆ మార్పులు చేయడం దుస్సాహసమే అయినా కానీ సస్పెన్స్‌ బేస్డ్‌ సినిమా కనుక ఈమాత్రం ఛేంజెస్‌ మాండెటరీ అనిపిస్తాయి. శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని బాగానే హ్యాండిల్‌ చేసినా కానీ థ్రిల్లర్స్‌ తీయడం తన ‘కప్‌ ఆఫ్‌ టీ’ కాదనే సంగతి తెలిసిపోతుంటుంది. ప్రధానంగా ప్రథమార్థంలో కథ నత్త నడకన సాగుతుంది. మొదటి అరగంటలో ఆ నిదానం కథాపరంగా తప్పదని అనుకున్నా కానీ ఆ తర్వాత కూడా వేగం పెంచకపోవడం పొరపాటే. ద్వితీయార్థంలో మాత్రం ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో అనామిక వేగంగా ముందుకి కదులుతుంది. ఈ పార్ట్‌లో శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌ బెటర్‌గా అనిపిస్తుంది. 

హైలైట్స్‌:

  • నేపథ్య సంగీతం
  • నయనతార అభినయం

డ్రాబ్యాక్స్‌:

  • నిదానంగా సాగే ప్రథమార్థం
  • ‘కహానీ’ స్థాయిలో లేకపోవడం

విశ్లేషణ:

ఒరిజినల్‌ వెర్షన్‌తో కంపారిజన్స్‌ వద్దన్నా కానీ కహానీ చూసేసిన వారు దానిని పూర్తిగా మర్చిపోయి దీనిని కొత్త సినిమాగా చూడడం అసాధ్యం. అందులోను ఒక్కసారి చూస్తేనే లాస్టింగ్‌ ఇంప్రెషన్‌ వేసే కహానీ లాంటి చిత్రాల్ని అంత తేలిగ్గా మర్చిపోవడం సాధ్యపడదు. ఇదంతా తెలిసే ఈ చిత్రం రీమేక్‌ చేసారు కనుక దాంతో పోల్చి మాట్లాడినా కానీ ఈ చిత్ర బృందం దానిని యాక్సెప్ట్‌ చేయాల్సిందే. ముందుగా చెప్పాలంటే కహానీలో ఉన్న వాస్తవికత, టెన్షన్‌ ఇందులో లోపించింది. కథ ముందే తెలియడం వల్ల ఉన్న సమస్య ఇదని అనుకున్నా కానీ ఎందుకో దాంట్లో ఉన్న ‘డార్క్‌ ఫీల్‌’ని తిరిగి తీసుకురాలేకపోయారు. కావాలనే చేసారో, లేక ఇలా అయితే బెటర్‌ అని అనుకున్నారో కానీ ఈ థ్రిల్లర్‌ కహానీలా కాకుండా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. 

ఫస్ట్‌ హాఫ్‌లో టెన్షన్‌ కంప్లీట్‌గా మిస్‌ అయింది. తన భర్త ఏమైపోయాడో అని బాధ పడుతున్న హీరోయిన్‌ తాలూకు పెయిన్‌ ఆడియన్స్‌ ఫీల్‌ అయ్యేట్టుగా చేయలేకపోయారు. కహానీ కథలో మార్పులు చేసినా కానీ అవి మరీ ఆ చిత్రాన్ని మరిపించే స్థాయిలో అయితే లేవు. ఆ సినిమాలో మాదిరిగా ఇందులోను ఏదో ఒక ట్విస్ట్‌ ఉంటుందనేది ముందే ఊహించవచ్చు. అదేమిటో కూడా కొందరు ముందే కనిపెట్టేయవచ్చు. ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నా కానీ శేఖర్‌ కమ్ముల ఈ చిత్రం ద్వితీయార్థంలో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌కీ, సెకండాఫ్‌కీ డ్రాస్టిక్‌ డిఫరెన్స్‌ ఉంది. సెకండాఫ్‌ ‘థ్రిల్లర్‌’ జోనర్‌ సినిమాకి తగ్గట్టుగా వేగంగా సాగుతుంది. అయితే క్లయిమాక్స్‌లో ట్విస్ట్‌ని ఫాస్ట్‌గా రివీల్‌ చేసినట్టయితే షాక్‌ ఫ్యాక్టర్‌ వర్కవుట్‌ అయి ఉండేది. ఆడియన్స్‌ దానికి ప్రిపేర్‌ అయిపోయే టైమ్‌ ఇచ్చేయడంతో షాక్‌ వేల్యూ డైల్యూట్‌ అయిపోయింది. అనామిక భర్త గురించిన వివరాల్ని క్లియర్‌గా చూపించకపోవడం లోపం. ఆ క్లారిటీ కూడా ఇచ్చి ఉండాల్సింది. 

కహానీ సినిమా చూడకపోయినా, దాని గురించి ఏమీ తెలియకపోయినా అనామిక మెప్పిస్తుంది. అది చూసిన వారు మాత్రం దాంతో పోల్చి చూసి ఇది ఆ స్థాయిలో లేదనేస్తారు. రొటీన్‌ కమర్షియల్‌ తెలుగు సినిమాలకి భిన్నంగా సాగే ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఎంతవరకు ఇంప్రెస్‌ చేస్తుందనేది చూడాలి. 

బోటమ్‌ లైన్‌: అనామిక కహానీ మొదట్లో నస పెట్టినా కంచికి బాగానే చేరింది.

-జి.కె.