నిన్న వచ్చిన హైకోర్టు తీర్పు ప్రాధాన్యత తెలుసుకోవాలంటే కథ ఎక్కడో నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టాలి. 2012 ఎన్నికలలో 70 సీట్ల ఎసెంబ్లీలో కాంగ్రెసుకు 32, బిజెపికి 31 వచ్చాయి. ఇద్దరూ అధికారానికి పోటీ పడ్డారు. పరుగుపందెంలో కాంగ్రెసు యితరులను కలుపుకుని ప్రభుత్వం ఏర్పరచింది. ప్రస్తుతం ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని వున్న 71 సీట్లలో నామినేటెడ్‌తో కలిపి కాంగ్రెసుకు 36 మంది, దానికి మద్దతు యిచ్చే పిడిఎఫ్‌కు 6 వున్నాయి. ప్రతిపక్షంలో వున్న బిజెపికి 28 వున్నాయి. ఇలాటి పరిస్థితిలో 9 మంది కాంగ్రెసు రెబెల్స్ బిజెపివైపు వచ్చారు, ఒక బిజెపి రెబెల్ కాంగ్రెసు వైపు వెళ్లాడు.
ఈ పరిణామం రావడానికి కారణం కాంగ్రెసులోని యిద్దరు ప్రముఖ నాయకుల పదవీకాంక్ష. వారిలో ముందుగా చెప్పవలసినది హరీశ్ రావత్‌ను. 2002లో ఉత్తరాఖండ్ ఏర్పడిన దగ్గర్నుంచి అతను ముఖ్యమంత్రి పదవి ఆశిస్తూనే వున్నాడు. అప్పుడు ఎన్‌డి తివారీకి ముఖ్యమంత్రి పదవి యిచ్చి, యితన్ని పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ఇతనికి నచ్చలేదు. తివారీకి అడ్డుతగులుతూనే వున్నాడు. 2007లో కాంగ్రెసు ఓడింది. 2012లో కాంగ్రెసు పైన చెప్పిన విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని ఉబలాట పడ్డాడు. కానీ అతని సీనియారిటీ కాదని కాంగ్రెసు హైకమాండ్ విజయ్ బహుగుణకు పదవి కట్టబెట్టింది. తివారీ, బహుగుణ తండ్రి వీళ్లందరూ లఖ్‌నవ్‌లో వుండేవారని, తను భూమిపుత్రుడు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి తగినవాణ్నని హరీశ్ నమ్మకం. 2013లో ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తినపుడు విజయ్ సహాయచర్యలు తీసుకోవడం వైఫల్యం చెందినపుడు ప్రతిపక్షం కంటె ఎక్కువగా యితనే యాగీ చేశాడు. పార్టీ ప్రతిష్ఠ కాపాడుకోవడానికి సోనియా 2014లో విజయ్‌ను దింపి హరీశ్‌ను కూర్చోబెట్టింది. కల నెరవేరింది కదాన్న ఆనందమే తప్ప దాన్ని నిలుపుకునే విజ్ఞత హరీశ్‌కు లోపించింది. అతనిపై మంత్రివర్గ సహచరులందరికీ ఫిర్యాదులే – అతని చుట్టూ భజనపరులు చేరారు, మంత్రులకు కూడా ఎపాయింట్‌మెంట్లు యివ్వడు, ఎమ్మెల్యేల గోడు పట్టించుకోడు, ఏదైనా శాఖాధిపతులను పిలిచినపుడు, ఆ శాఖ మంత్రిని కూడా సమావేశానికి పిలవడు, వాళ్లకు చెప్పకుండా నిర్ణయాలు తీసేసుకుంటాడు.. యిలా ఎన్నో!
ఇతని పనితీరుతో విసిగిన అసమ్మతి మంత్రులు, ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి కష్టాలు చెప్పుకోబోతే అతనికీ తీరిక లేదు. కేంద్రంలో అధికారంలో లేకపోయినా సరే మాతాసుతులకు ఏ రాష్ట్రపు అసమ్మతివర్గపువారినైనా కలుసుకోవడానికి యిష్టముండదు. పరిస్థితిని గమనించిన బిజెపి ఎలాగోలా కాంగ్రెసు ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిశ్చయించుకుంది. విజయ బహుగుణను దువ్వింది. అతను రాజ్యసభకు వెళదామన్నా హరీశ్ అడ్డుపడుతున్నాడు. అందుకని కసితో వున్నాడు. మరో 11 మందిని వెంటపెట్టుకుని బయటకు వస్తానని హామీ యిచ్చాడు. మొత్తం 36లో 12 మూడో వంతు కాబట్టి ఫిరాయింపు అనర్హత వేటు పడదు. భళా అనుకుని బిజెపి ముందుకు వెళ్లింది. తీరా చూస్తే విజయ్‌తో కలిపి బయటకు వచ్చినవారు తొమ్మిది మందే అయ్యారు. అందువలన ప్రభుత్వం కూల్చడానికి నానా రకాల వేషాలు వేయవలసి వస్తోంది.
బయటకు వచ్చిన తొమ్మిది మంది ఎవరాని చూడబోతే – విజయ బహుగుణ, జిత్తులమారిగా పేరుబడిన పాత కాంగ్రెసు నాయకుడు ఎచ్‌ఎన్ బహుగుణ కొడుకు. అతను అనేక పార్టీలు మారాడు. ఎమర్జన్సీ నడిచినంతకాలం ఇందిరతో వుండి, ఆఖరి నిమిషంలో జగ్జీవన్ రామ్‌తో బాటు బయటకు వచ్చేసి సిఎఫ్‌డి అనే పార్టీ పెట్టి జనతా పార్టీకి మద్దతు యిచ్చాడు. ఇప్పుడీ విజయ్ కూడా ముఖ్యమంత్రి పదవి పోవడంతో కాంగ్రెసులోంచి బయటకు వచ్చి బిజెపి పంచన చేరాడు. బిజెపి యితన్ని ముఖ్యమంత్రి చేస్తానందో లేదో యింకా తెలియదు. రెండో ఎమ్మెల్యే – అమృతా రావత్. ఈమె భర్త కాంగ్రెసు ఎంపీగా వుండేవాడు. ఈ మధ్య బిజెపిలో చేరాడు. దాంతో హరీశ్ యీమెను కాబినెట్‌నుంచి తీసేశాడు. మూడో వారు – హరక్ సింగ్ రావత్, కాబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి, విజయ్‌తో బాటు బయటకు వచ్చేశాడు. నాలుగోవారు – షీలా రాణీ రావత్, ఈమె హరక్ సింగ్ రావత్‌కు సన్నిహితురాలు. ఐదోవారు – ప్రదీప్ బాత్రా, వ్యాపారవేత్త, మంత్రి పదవి కోరి, రాకపోవడంతో అసమ్మతి బాట పట్టాడు. ఆరోవారు శైలేంద్ర సింఘాల్ కూడా మంత్రి పదవి రాక ఎదురుతిరిగినవారే, ఏడోవారు – సుబోధ్ ఉనియాల్, విజయ్‌కు సన్నిహితుడు, ఎనిమిదో వారు – ఉమేశ్ శర్మ, విజయ్‌కు అనుచరుడు, సోషల్ వర్కర్, తొమ్మిదో వారు – కువర్ ప్రణవ్ సింగ్, హరీశ్‌కు విజయ్‌కు ఎవరికీ సన్నిహితుడు కాడు, ఎందుకు బయటకు వచ్చేశాడో యితమిత్థంగా తెలియదు.
ఈ తొమ్మిదిమంది బయటకు వెళ్లిపోవడంతో కాంగ్రెసు బలం 42 నుంచి 33కి పడిపోయింది. ఆ ధీమా చూసుకుని బిజెపి మార్చి 18 నాటి అసెంబ్లీ సమావేశంలో బజెట్‌పై ఓటింగుకై పట్టుబట్టింది. 9మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా అదే డిమాండ్ చేశారు. బలాబలాలు తేల్చడానికి డివిజన్‌కై పట్టుబట్టారు. గలభా జరిగింది. స్పీకరు కుంజ్వాల్ ముఖ్యమంత్రి మనిషి కాబట్టి ఆ డిమాండ్ తిరస్కరించి మూజువాణీ ఓటుతో బిల్లు పాసయిందని ప్రకటించి అసెంబ్లీ వాయిదా వేసి వెళ్లిపోయాడు. ఇదే అన్ని చిక్కులకూ దారి తీసింది. తొమ్మిదిమంది ఎదురు తిరుగుతారని హరీశ్ వూహించలేదేమో, లేకపోతే ముందే వారిని స్పీకరు చేత ఏదో కారణం చెప్పి సస్పెండ్ చేయించి వుండేవాడు. మన తెలుగు రాష్ట్రాల స్పీకర్ల నడిగితే అలాటి ట్రిక్కులు బోల్డు నేర్పగలరు. సభ వాయిదా వేశాక యిక 9 మంది పనిపడదామని చూశాడు. విప్ ధిక్కరించినందుకు ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలంటూ ఫిరాయింపుల చట్టం కింద మార్చి 23 న షోకాజ్ నోటీసులు యిచ్చాడు. ఇటు హరీశ్ తన కాబినెట్ నుంచి హరక్ సింగ్ రావత్‌ను తీసివేశాడు. విజయ్ కొడుకు సాకేత్‌ను పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరించాడు. దీనికి ప్రతిగా బిజెపి అధిష్టానం చురుగ్గా కదిలింది. నిజానికి అసెంబ్లీ సమావేశానికి ముందు రోజే అమిత్ షా ఆదేశాలపై బిజెపి నాయకుడు కైలాశ్ విజయవర్గీయ బెంగాల్ ఎన్నికల ప్రచారం మానుకుని డెహ్రాడూన్ వచ్చి విజయ్‌తో బేరాలాడాడు. ఆ తర్వాత తమ గ్రూపువాళ్లను హరీశ్ ప్రలోభాలకు లొంగకుండా చూడడానికి జయపూర్‌కు, గుడ్‌గావ్‌కు, యితర ప్రాంతాలకు తిప్ప నారంభించారు. స్పీకరు నోటీసుల తర్వాత బిజెపి, తిరుగుబాటు కాంగ్రెసువాదులు కలిసి గవర్నరును, రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిశారు. గవర్నరు కెకె పాల్ ముఖ్యమంత్రిని పిలిచి మార్చి 28 నాడు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోమన్నాడు. ఇది సరైన చర్యగా అందరూ భావించారు.
అయితే యింతలో కథ మలుపు తిరిగింది. స్పీకరు నోటీసుకు జవాబివ్వడానికి తమకు మరి కొంత సమయం కావాలంటూ హైకోర్టుకి వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్‌ను కోర్టు మార్చి 25 న తోసిపుచ్చింది. మర్నాడే హరీశ్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డబ్బుతో ప్రలోభపెడుతున్నట్లు తీసిన స్టింగ్ ఆపరేషన్ వీడియో బయటకు వచ్చింది. అది నకిలీది అని హరీశ్ అన్నాడు కానీ అసలైనదే అని చండీగఢ్‌లోని ఫోరెన్సిక్ లాబ్ ధృవీకరించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తాము స్పీకరు ఎదుటకు వెళ్లకుండా లాయర్లను పంపారు. అది అదనుగా తీసుకుని స్పీకరు మార్చి 27 న 9 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాడు. దానితో అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్య తగ్గిపోయి హరీశ్‌కున్న మెజారిటీ సరిపోతుంది. 28 నాటి బలపరీక్షలో నెగ్గడం ఖాయం. ఈ దశలో కేంద్రం చూస్తూ వూరుకోలేకపోయింది. రాష్ట్ర బిజెపి బహిరంగ డిమాండు మేరకు తన విశేషాధికారాలను వుపయోగించి ఆర్టికల్ 356 సహాయంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్తచేతనావస్థలో వుంచింది.
ఇది విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీలో బలపరీక్ష జరగబోయేందుకు ఒక్క రోజు ముందు కేంద్రం ఎందుకు త్వరపడాలి అని అందరూ అడుగుతున్నారు. స్పీకరు ముఖ్యమంత్రి పక్షాన వున్నాడు కాబట్టి అడ్డువచ్చిన ప్రతిపక్షం వాళ్లందరినీ అనర్హులుగా ప్రకటించి, ముఖ్యమంత్రికి మేలు చేస్తాడనా? అనేక రాష్ట్రాలలో అదే జరుగుతోంది కదా! తన విశేషాధికారాలను దుర్వినియోగం చేసే స్పీకర్లలో ఉత్తరాఖండ్ స్పీకరు మొదటివాడూ కాదు, ఆఖరివాడూ కాదు. ద్రవ్యబిల్లు పాసయిపోయిందని ముఖ్యమంత్రి, స్పీకరు ఓ పక్క చెపుతున్నారు. దాని ఓటింగు సందర్భంగా మెజారిటీ కోల్పోయిన రావత్ ముఖ్యమంత్రిగా కొనసాగడం రాజ్యాంగవిరుద్ధం, అనైతికం కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేయడం సవ్యమైన పని అని అరుణ్ జైట్లీ అన్నాడు. అసెంబ్లీ కార్యకలాపాలలో కోర్టులకే ప్రమేయం లేదంటున్న యీ రోజుల్లో కేంద్రానికి ఏ మేరకు వుంటుంది? 2010 అక్టోబరులో కర్ణాటకలో ఎడ్యూరప్ప ప్రభుత్వాన్ని 19 మంది అసమ్మతి బిజెపి ఎమ్మెల్యేలు, మరో 5గురు యిండిపెండెంట్లు ద్వారా కూలదోయడానికి కేంద్రంలో కాంగ్రెసు ప్రయత్నించింది. రాష్ట్రపతి పాలనకు గవర్నరు సిఫార్సు చేస్తే బిజెపి గగ్గోలు పెట్టింది. ఇప్పుడు తను అదే పని చేస్తోంది. బిజెపి పాత్రను కాంగ్రెసు పోషిస్తోంది. బజెట్ బిల్లు పాస్ కాలేదన్న తన వాదనకు వూతం యివ్వడానికి ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బు తీసుకునేందుకు ఆర్డినెన్సు జారీ చేయడానికి పార్లమెంటును ప్రొరోగ్ చేసింది.
కాంగ్రెసు అధికారంలో వున్నంతకాలం, ముఖ్యంగా ఇందిర ప్రధానిగా వుండగా 356 ఆర్టికల్‌ను చిత్తం వచ్చినట్లు వినియోగిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వుండేవి. వారు అధికారంలోకి వచ్చాక వాళ్లూ అదే పని చేస్తున్నారు. ఈనాడులో వచ్చిన ఒక పట్టిక ప్రకారం 54 ఏళ్లపాటు అధికారంలో వున్న కాంగ్రెసు 88 సార్లు (దీనిలో ఇందిరే 50 సార్లు విధించింది) రాష్ట్రపతి పాలన విధిస్తే (అంటే సగటున ఏడాది పాలనకు 1.63 సార్లు అన్నమాట) 14 ఏళ్ల పాటు అధికారంలో వున్న కాంగ్రెసేతర పక్షాలు 36 సార్లు విధించాయి. అంటే సగటున ఏడాది పాలనకు 2.57 సార్లు అన్నమాట)! రాష్ట్రపతి పాలన విధింపుపై హరీశ్ హైకోర్టుకి వెళ్లాడు. హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఈ నెల 31 న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని తీర్పు యిచ్చింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఓటు వేయవచ్చని అయితే వారి ఓట్లను విడిగా వుంచాలని, వీరి అనర్హత సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది తీర్పు వచ్చిన తర్వాత వాటిని లెక్కలో తీసుకోవడమో, మానడమో తెలుస్తుందని అంది. ఏప్రిల్ 2 న మళ్లీ విచారణ చేస్తానంది. ఇదీ సబబుగానే వుంది. ఎందుకంటే బలాబలాలు అసెంబ్లీ ఫ్లోర్ మీదనే తేలాలని ఎప్పుడూ చెప్తూ వుంటారు. అయితే రాష్ట్రపతి పాలన విధింపు అనేది సమస్యను జటిలం చేసింది. దానిపై హై కోర్టు స్టే యిచ్చిందా, యివ్వగలదా అన్నదానిపై స్పష్టత లేదు. అదే సమయంలో స్పీకరు తీర్పుని కూడా కోర్టు ఆమోదించినట్లు లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేల అంశం ఓపెన్ ఎండెడ్‌గానే వుంచింది.
దీన్ని కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కోర్టులు రాష్ట్రపతి ఉత్తర్వుపై తీర్పు యివ్వలేవని అటార్నీ జనరల్ వాదించారు. ఇవాళ యిద్దరితో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ జడ్జి తీర్పుపై ఏప్రిల్ 7 వరకు స్టే యిచ్చింది. మిగతా కథ వెండితెరపై చూడాల్సిందే! ఇందులో ఒక పిట్టకథ కూడా వుంది. రాష్ట్రపతి పాలన విధించగానే ఉత్తరాఖండ్ ఎక్సయిజ్ కమిషనర్ అర్జంటుగా ఒక ప్రకటన చేశాడు – రాష్ట్రంలో అన్ని లిక్కరు షాపుల్లో అన్ని రకాల ఆల్కహాల్ బ్రాండులు లభ్యమవుతాయని! హరీశ్ రావత్ ప్రభుత్వం లిక్కర్ పాలసీ గట్టిగా అమలు చేసింది. రెండే రెండు ప్రభుత్వ ఏజన్సీల ద్వారా ఐఎంఎఫ్‌ఎల్, ఫారిన్ లిక్కర్ పంపిణీ జరిగేవి. లిక్కర్ లాబీ అలిగింది. అనేక పాప్యులర్ లిక్కర్ బ్రాండులు షాపుల్లోంచి మాయమయ్యాయి. ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దుతామని యీయన అంటున్నాడు. కేరళలో లిక్కర్ లాబీ ప్రభుత్వమార్పుకై గట్టి కృషి చేస్తోంది. ఇక్కడా అలాటిదేమైనా వుందేమో ప్రస్తుతానికి తెలియదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)