సినిమా నటులు అంటే జనాలకు ఆసక్తి వుంటుంది. అంత మాత్రం చేత వారు ఏది అడిగితే అది, ఇదిగో అంటూ చేతిలో పెట్టేయరు. ఓ కమెడియన్ వున్నారు.. అదృష్టం బాగుండి కెరీర్ టర్నింగ్ ఇచ్చుకుంది. ఎన్నో కొన్ని సినిమాలు చేతిలోకి వచ్చాయి. అయితే సదరు కమెడియన్ ఆ మధ్య ఒక ఔట్ డోర్ షూటింగ్ కు వెళ్లారట. అక్కడ ఓ పెద్ద హోటల్ లో దిగారు. హోటల్ కు చెందిన ఓ మహిళా సిబ్బందితో పరిచయం పెంచుకున్నారు. ఊరు చూపించాలి అని అడిగారట..
సరే అని అనగానే, మరి మీరు రోజు అంతా నాతోనే వుండిపోవాల్సి వుంటుంది.. అవసరమైతే రాత్రి కూడా అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు వదిలారట. దాంతో ఆ అమ్మడు చల్లగా అక్కడ నుంచి జారుకుని, అదే టీమ్ లో వున్న మరో నటుడితో మొరపెట్టుకుందట.. మేం ఎలా కనిపిస్తున్నాం.. ఆయనగారి కళ్లకి అంటూ.
సదరు నటుడు సముదాయించి పంపేసారట. అక్కడితో ఆగిపోయింది.. నయమే. ఆమె కనుక హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయలేదు. పైగా ఆ హోటల్ యాజమాన్యానికి ప్రభుత్వంలోనూ, చంద్రబాబు దగ్గర కావాల్సినంత పలుకుబడి వుంది.