కొండ ఎత్తేస్తాం చూడండి.. అంటూ ప్రచారం చేసి, పోటీ పడి గెలిచి అధికారంలోకి వచ్చింది మా టీమ్. కానీ ఇప్పుడు చూస్తే ఏమీ చేయడం లేదని, వారిలో వారికే పొసగడం లేదని, ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయి, ఎన్నికల వాగ్దానాలను మరిచి పోయారని ఫిలిం నగర్ సర్కిళ్లలో విమర్శలు వినవస్తున్నాయి. మా కార్యవర్గం తమిళ నాట ఎన్నికైన నడిగర సంఘాన్ని చూసి నేర్చుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి.
నడిగర్ సంఘం ఎన్నికల వాగ్దానమైన భవన నిర్మాణం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముంబై లో స్టార్ క్రికెట్ నిర్వహిస్తోంది. అందుకోసం ముగ్గురు సభ్యుల బృందం ఈ రోజు హైదరాబాద్ కు చవ్చింది. మహిళలకు పట్టుచీర, మగవారికి పట్టుపంచె, తాంబూలం ఇచ్చి క్రికెట్ మ్యాచ్ కు ఆహ్వానించింది. ప్రభాస్, నాగార్జున తో సహా పలువురు హీరోలను, కొందరు హీరోయిన్లను ఈ రోజు ఆహ్వానించారు. రేపు బాలయ్య, మోహన్ బాబు తదితరులను పిలుస్తారు.
ఈ విధమైన ఏర్పాట్లు, పిలుపులు చూసి, మా సంఘం పని తీరుతో బేరీజు వేసుకుని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లోని ఫ్రెండ్స్ నుంచి, బయట వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తామని, ఇంకా చాలా చేస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు మా కార్యాలయంలో ఒకరిద్దరు తప్ప మరెవరు కనిపించడం లేదని పలువురు సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో ఆ నలుగురిగా వున్న వారిలో రాజేంద్రప్రసాద్ నటుడిగా బిజీ అయిపోయారని, కాదంబరి కిరణ్ ను దూరం పెట్టారని, మిగిలిన ఇద్దరే మా కార్యాలయంలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారని ఓ సీనియర్ సభ్యుడు వ్యాఖ్యానించారు.