ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్‌లో ఫైనల్ బెర్త్‌ని ఖరారు చేసుకుంది ఇంగ్లాండ్. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అలవోకగా విజయం సాధించింది. సెమీస్ మ్యాచ్ అంటే హోరాహోరీగా వుంటుందని అంతా అనుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ధాటిగానే ప్రారంభించినా, దాన్ని కొనసాగించడంలో విఫలమయ్యింది. 200 పరుగుల విజయలక్ష్యాన్ని న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ముందుంచుతుందని అంతా అనుకుంటే, 20 ఓవర్లలో 153 పరుగులతో సరిపెట్టింది.
154 పరుగుల లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కాన్ఫిడెంట్‌గా రంగంలోకి దిగారు. ఓపెనర్ జాసన్ రాయ్, న్యూజిలాండ్ బౌలర్లతో ఓ ఆట ఆడేసుకున్నాడు. 17 బంతులు మిగిలి వుండగానే, ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుని, సగర్వంగా ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. ఇప్పుడిక తేలాల్సింది, ఇంగ్లాండ్‌కి ప్రత్యర్థి ఎవరనేదే. తొలి సెమీస్ న్యూజిలాండ్ – ఇంగ్లాండ్ మధ్య జరగగా, రెండో సెమీస్ వెస్టిండీస్ – టీమిండియా జట్ల మధ్య జరుగనుంది. సెకెండ్ సెమీస్‌లో టీమిండియా విజయం సాధిస్తే, ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడాల్సి వస్తుంది.
అయితే, వెస్టిండీస్‌ని అంత తేలిగ్గా తీసి పారెయ్యడానికి వీల్లేదు. వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ గేల్ రెచ్చిపోతే, టీమిండియాకి తిప్పలు తప్పవు. కానీ, టీమిండియా చిచ్చరపిడుగు కోహ్లీ ఫామ్ చూస్తోంటే మాత్రం, ఫైనల్‌లోకి అడుగు పెట్టడం, టీమిండియా టీ20 ట్రోఫీని కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్పిస్తోంది. పైగా సొంతగడ్డ మీద జరుగుతున్న పోరు కావడంతో ఎడ్జ్ టీమిండియాకే ఎక్కువ.
కానీ, టీ20 మ్యాచ్‌ని ముందే అంచనా వెయ్యడానికి వీల్లేదు. ఆ రోజు, ఆ సమయానికి పరిస్థితులు ఎటు మారితే, విజయం అటువైపు వరిస్తుంది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్ గెలిచి వుంటే, టీమిండియా ఇంకాస్త ఇబ్బంది పడేదే. ఎందుకంటే, న్యూజిలాండ్‌తో టీమిండియా వరుస పరాజయాల్ని టీ20 మ్యాచ్‌లలో చవిచూస్తూ వచ్చింది. ఆల్రెడీ ఈ టీ20 వరల్డ్‌కప్‌లోనే న్యూజిలాండ్‌తో గ్రూప్ దశలో ఓటమి చవిచూసింది టీమిండియా.
ఏదిఏమైనా, టీమిండియా ఈ వరల్డ్‌కప్‌లో పరాజయంతో ప్రారంభించి, వరుస విజయాల్ని నమోదు చేస్తోంది. కప్పు గెలవడానికి రెండే రెండు మ్యాచ్‌లు టీమిండియా ముందున్నాయి. వాటిల్లో మొదటిది వెస్టిండీస్‌తో జరగనుంది. ఇక్కడ తేడా కొడితే, ఇంటికే. వెస్టిండీస్‌ని దాటేస్తే మాత్రం, ఇంగ్లాండ్‌తో ఫైనల్.. ఆ తర్వాత కప్పు సొంతమవడం ఖాయం. తొలి టీ20 వరల్డ్‌కప్‌ని సాధించిన కెప్టెన్‌గా ఘనత సాధించిన ధోనీ, ఈ వరల్డ్‌కప్‌లోనూ టీమిండియాని విజయపథాన నడిపి, మరోమారు టీ20 వరల్డ్ కప్ ని సాధిస్తాడేమో వేచి చూడాలి.