ప్రతిపక్షంలో వున్న బిజెపికి ఇవన్నీ పిరికిచేష్టల్లా అనిపించాయి. 1997 ఎన్నికలలో వాజపేయి ''అణ్వాయుధాలను ప్రయోగించైనా సరే పాకిస్తాన్ అధీనంలో వున్న కశ్మీర్‌ను వెనక్కి తీసుకుంటాం. జాతీయ భద్రతపై రాజీపడే ప్రశ్న లేదు.'' అని ప్రకటించారు. ఇండియాలో వాజపేయి ప్రధానిగా రెండో ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధికారంలోకి వచ్చింది. అక్కడ అతనూ యిలాటి ఉపన్యాసాలే యిస్తున్నాడు. రెండు దేశాలూ అణ్వాయుధాలతో యుద్ధానికి తలపడతాయా అని అంతర్జాతీయ సమాజం భయపడుతూండగా వాజపేయి 1998 మార్చి 18 న ''మేం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నాం. అది మిలటరీపరంగా, ఆర్థికపరంగా, రాజకీయపరంగా దేశానికి ఎదురయ్యే ఆపదల గురించి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను నిర్వహిస్తుంది. దాని నివేదిక తర్వాత దేశసమగ్రతను, సరిహద్దులు కాపాడుకోవడానికి అణ్వాయుధాల ప్రయోగాంశంతో సహా అణు విధానాన్ని పునర్మూల్యాంకనం చేయడం జరుగుతుంది.'' అని స్టేటుమెంటు యిచ్చారు. దీనిపై విమర్శలు రావడంతో రక్షణ మంత్రి ఫెర్నాండెజ్ మార్చి 20 న ''అణు ప్రత్యామ్నాయాన్ని ప్రస్తుతం పరిగణించటం లేదు. అన్ని విషయాలూ సాకల్యంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని ప్రకటించారు.
రాజకీయంగా వాజపేయి పరిస్థితి అంత బాగా ఏమీ లేదు. గతం సారి 13 రోజులకే ప్రభుత్వం పడిపోయింది. ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో చేరిన సహచర మంత్రులు తలొకరు తలొకలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కామర్స్ మంత్రిగా వున్న రామకృష్ణ హెగ్డే వాజపేయిని 'అలసిసొలసిన ప్రధాని' అని వర్ణించాడు. రక్షణమంత్రిగా వున్న జార్జి ఫెర్నాండెజ్ ''భారతదేశానికి ఎనిమీ నెంబర్ వన్ అయిన చైనా సరిహద్దుల్లో ఒక హెలిపాడ్ కడుతోంది'' అని ఒక ప్రకటన జారీ చేశాడు. వాజపేయి బహిరంగంగా ఫెర్నాండెజ్‌ను ఖండించవలసి వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వమైనా సరే తమ ఎజెండా (రామమందిరం, ఆర్టికల్ 370, పర్శనల్ లా) అమలు చేసి తీరాలని ఆరెస్సెస్ పట్టుబడుతోంది. ఉదారవాదిగా పేరుబడిన వాజపేయి అవేమీ చేయడేమోనన్న సందేహంతో కారాలు మిరియాలు నూరుతోంది. ఇటువంటి అస్థిర పరిస్థితుల్లో (ఏం చేసినా యీ ప్రభుత్వం 13 నెలల్లో పడిపోయింది) తన యిమేజి పెంచుకోవడానికి వాజపేయి బాంబు బటన్ నొక్కేశారు. నిజానికి పేలుళ్లకు ఒక రోజు ముందే జశ్వంత్ సింగ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు అధినేతగా ఎవరుండాలా అని యింటర్వ్యూలు జరుపుతున్నారు. కౌన్సిలే ఏర్పడనప్పుడు వారు పరిస్థితిని అధ్యయనం చేయడం, ప్రమాదాలను గుర్తించడం, అణ్వాయుధ ప్రయోగం చేసిచూడవచ్చని అనుమతించడం యివన్నీ ఎక్కడ జరుగుతాయి? ఏ చర్చా లేకుండా, ఏ భద్రతా నిపుణుడూ హెచ్చరించకుండా వాజపేయి పేలుళ్లకు అనుమతి యిచ్చేశారు. 1998 మే 11 న ''ఆపరేషన్ శక్తి'' పేర ఒక ఫ్యూజన్ బాంబు, మూడు ఫిషన్ బాంబులు పేల్చారు. 13 న మరో రెండు ఫిషన్ బాంబులు పేల్చారు.
దీనివలన జాతీయంగా ఎలాటి స్పందన వచ్చిందో పైనే చెప్పాను. మరి అంతర్జాతీయంగా జరిగిన పరిణామాలేమిటి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జూన్ 6 న ఈ పరీక్షను ఖండిస్తూ, భారతదేశాన్ని ఎన్‌పిటి (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)పై తక్షణం సంతకం పెట్టేట్లా ప్రపంచదేశాలన్నీ ఒత్తిడి తేవాలని పిలుపు నిచ్చింది. అమెరికా ఇండియా చర్యను ఖండించి, ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. మానవతాదృక్పథంతో యిస్తున్న ఎయిడ్ తప్ప తక్కినవన్నీ కట్ చేసేసింది. రక్షణ సామగ్రి, సాంకేతిక పరిజ్ఞానం ఇండియాకు ఎగుమతి చేయడానికి వీల్లేదంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇండియాకు ఋణసహాయం చేస్తానంటే ప్రతిఘటిస్తానని ప్రకటించింది. యుకె, ఫ్రాన్సు, రష్యా తప్ప తక్కిన దేశాలన్నీ జపాన్ వంటి ముఖ్యమైన దేశాలన్నీ ఆంక్షలు విధించాయి. ఆంక్షలు ఎత్తివేయండి, మేం బుద్ధిమంతులమే బాబోయ్ అని చెప్పుకుని ప్రాధేయపడితే ఎత్తివేయడానికి ఐదేళ్లు పట్టింది. విద్యుత్ ఉత్పాదనకు వుపయోగించే అణుసామగ్రి కావాలన్నా ఎంత యిబ్బంది పడుతున్నామో 2009లో చూశాం. ఇప్పటికీ మాటిమాటికీ హామీలు అడుగుతూనే వుంటారు. ఎందుకంటే మనది 'దూకుడు దేశం'గా పేరుబడింది. ఇంతా చేసి ఆ పేలుళ్లు అమోఘమైనవా అంటే అదీ కచ్చితంగా చెప్పలేం. వాటిలో పాల్గొన్న కె సంతానం అనే సైంటిస్టు రిటైరయ్యాక 2009లో అవి అంతగా విజయవంతం కాలేదు అన్నాడు. కలాం గారు ఆయన తప్పు చెపుతున్నాడు అన్నారు. అయ్యంగారు అనే మరో సైంటిస్టు సంతానంను సమర్థించాడు. అది సాంకేతిక విషయం కాబట్టి మనం విని వూరుకోవడమే తప్ప ఏమీ చేయలేం. బాంబు పేలుతుందో లేదో కావాలంటే పేల్చి చూపిస్తా అంటే చూడడానికి మనం మిగలం.
అనంతర పరిణామాలను ముందుచూపుతో చూడగలిగితే 1998 పేలుళ్లు మనం ఆనందించవలసిన, హర్షించదగిన విషయం కాదని తెలుస్తుంది. 1974 పేలుళ్ల తర్వాత అంతర్జాతీయ సమాజం ఏ విధంగా ప్రవర్తించిందో గమనించిన రాజకీయనాయకులు యివి వూహించే వుంటారు. కానీ పైకి చెప్పలేదు – ప్రజలు తమను అపార్థం చేసుకుంటారన్న భయం. మీడియా ఖండించలేదు – పాఠకులు తమను దేశద్రోహులంటారన్న జంకు. కశ్మీర్ పాకిస్తాన్‌లో అంతర్భాగం అని పాక్ పేపర్లలో, ఇండియాలో అంతర్భాగం అని ఇండియన్ పేపర్లలో సంపాదకీయం రాయడం గొప్ప కాదు. అక్కడి ప్రజల మనోభావాలు తెలుసుకుని అవసరమైతే స్వతంత్రదేశంగా వుండనిస్తే మంచిదేమో అని అనుమానం వెలిబుచ్చగలిగేవాడు ధీరుడు. ప్రజలేమనుకున్నా, తను వాస్తవమనుకున్నది చెప్పినవాడే నిజమైన పాత్రికేయుడు అని నమ్మిన వినోద్ మెహతా యీ ప్రయోగాలను ఖండించాడు. ''మతతత్వం, మితిమీరిన జాతీయవాదం, అదుపులేని కాపిటలిజం అనే మూడు విషయాలపై నేను రాజీ పడలేను. తక్కిన విషయాల్లో నే పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అనే రకం కాదు. నా అభిప్రాయం చెప్పాక, నాతో విభేదించేవాళ్లకు కూడా నా పత్రికలో చోటిస్తాను. సంపాదకుడిగా అది నా ధర్మం. నిజానికి నా పత్రికలో విమర్శలకే ఎక్కువ చోటిస్తాను.'' అని అతను రాసుకున్నాడు. భద్రతా అవసరాల కంటె రాజకీయ అవసరాలే యీ ప్రయోగం చేయించాయని అతను రాయడం బిజెపి నాయకులనే కాదు, సాధారణ పాఠకులను సైతం మండించింది. వినోద్‌ను అసహ్యించుకుంటూ, ఖండిస్తూ, తిడుతూ ఉత్తరాల వర్షం కురిసింది. వినోద్ వాటన్నిటిని ప్రచురించాడు. ఇద్దరే యిద్దరు పాఠకులు వినోద్‌ను సమర్థిస్తూ రాశారట. ఇటువంటి పరిస్థితుల్లో అరుంధతి రాయ్ వినోద్‌ను సమర్థిస్తూ ''ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్'' అని 8000 పదాల వ్యాసం రాసి పంపింది. అది వినోద్ పది పేజీల్లో ప్రచురించాడు. బాంబు ప్రేమికులకు అది మరింత ఆగ్రహం తెప్పించింది. అరుంధతీ రాయ్ కున్న యిమేజి అలాటిది! ఈ తిట్ల జడివానలో తడుస్తూనే వినోద్ ముందుకు సాగాడు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ ( ఏప్రిల్ 2015)