కేంద్రమాజీ మంత్రి, ఎంపీ శశిథరూర్ భార్య, వ్యాపారవేత్త సునంద పుష్కర్ మృతి గురించి ఇప్పటి వరకూ మిస్టరీ వీడలేదు. ఢిల్లీలోని ఒక లాడ్జ్ లో చచ్చిపడిఉన్న ఆమెది హత్యనేని ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. అయితే ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాల గురించి ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. ఈ అంశం గురించి పరిశోధన అంటూ ఆ మధ్య పోలీసులు కొంత హడావుడి చేశారు కానీ.. ఇప్పటి వరకూ తేల్చింది ఏమీ లేదు.
దీనిపై సునంద భర్త శశి థరూర్ ను కూడా పోలీసులు విచారించారు. ఇంకా ఆమె పరిచయస్తులనేక మందిని కూడా పోలీసులు విచారించారు. ఇంకా ఈ పరిశోధన కొనసాగుతున్నట్టుగానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో తమిళంలో సునందపుష్కర్ జీవితంపై ఒక సినిమా రానున్నట్టుగా తెలుస్తోంది.
ఇది వరకూ వీరప్పన్ జీవితంపై వనయుద్ధం అనే సినిమాను తీసిన దర్శకుడు ఏఎమ్ఆర్ రమేష్ ఇప్పుడు సునంద జీవితం ఆధారంగా సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మూల కథ సునంద జీవితమే.. అని ఆయన అధికారికంగా ప్రకటించడం లేదు.ప్రకటిస్తే.. దానికి ఆటంకాలు ఏర్పడతాయనే ఆ విషయాన్ని దాస్తున్నట్టుగా తెలుస్తోంది.
విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో మనీషా కొయిరాలా ముఖ్యపాత్రను పోషిస్తుండటం. సునంద పాత్రనే ఆమె చేయబోతోందని తెలుస్తోంది. మరి ఒక ప్రముఖురాలి జీవితం గురించి ఈ దర్శకుడి పరిశోధన ఎలా ఉంటుందో! ఈ సినిమా ఎంతమంది దృష్టిని ఆకర్షించగలుగుతుందో!