2 జి స్కాము చల్లారలేదు. మండుతూనే పోయింది. మంట ప్రధాని కార్యాలయానికి కూడా పాకింది. 2010 నవంబరులో పార్లమెంటులో కాగ్ రిపోర్టు సమర్పించినపుడు దేశమంతా నిర్ఘాంతపోయింది. రాజా చర్యల కారణంగా దేశానికి 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ చెప్పింది. ప్రశాంత భూషణ్ సిబిఐ విచారణను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ఒక పిల్ వేశాడు. దానితో బాటు అనేక డాక్యుమెంట్లు, ఒక సిడి కూడా సమర్పించాడు. ఆ సిడిలో నీరా రాడియా సంభాషణలు 140 వున్నాయి. ప్రశాంత భూషణ్ ''ఔట్‌లుక్''కు స్నేహితుడు కాబట్టి వాళ్ల కరస్పాండెంట్ సైకత్ దత్తాకు ఆ సిడి కాపీ యిచ్చాడు. ఔట్‌లుక్ సిబ్బంది ఆ సిడి వినసాగారు. దాని రికార్డింగు క్వాలిటీ చూస్తే అదేదో దొంగచాటుగా రికార్డు చేసినట్లు లేదు. ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వశాఖ ఏదో చేయించినట్లు అనిపించింది. జరిగినదేమిటంటే – నీరా రాడియా మనీ లాండరింగ్ చేస్తోందని, 9 సం||రాలలో 300 కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించిందని 2007 నవరబరులో చిదంబరం ఫైనాన్సు మినిస్టర్‌గా వున్నపుడు ఫైనాన్సు శాఖకు ఫిర్యాదు చేరింది. అందుచేత 2008 ఆగస్టు నుండి 120 రోజుల పాటు ఆమె వుపయోగించే 14 ఫోన్లను ఇన్‌కమ్ టాక్సు డిపార్టుమెంటు ద్వారా ట్యాప్ చేయిస్తామని ఫైనాన్సు శాఖ ప్రతిపాదిస్తే హోం సెక్రటరీ సరేనన్నారు. వారు ఆమె ఫోన్లను ట్యాప్ చేశారు. రెండవ రౌండు రికార్డింగు 2009 మే నుండి 180 రోజులు సాగింది. మొత్తం 72 వేల కాల్స్ రికార్డు చేశారు. 2 జి స్కాముకి సంబంధించిన కాల్స్ గురించి మాత్రమే మీడియాలోకి వచ్చింది.
దాని ప్రకారం తెలిసినదేమిటి? 1) రాజాకు నీరా రాడియా సన్నిహితురాలు. అతని చేత స్వాన్ టెలికామ్, ఎయిర్‌సెల్, యూనిటెక్ వైర్‌లెస్, డాట్‌కామ్‌లకు స్పెక్ట్రమ్ కేటాయింపులు చేయించింది. 2) టెలికామ్ మంత్రిగా దయానిధి మారన్ రాకుండా ఏమైనా చేయమని రతన్ టాటా నీరాను కోరాడు 3) కరుణానిధి భార్య దయాళూ అమ్మాళ్‌తో భూమి వ్యవహారం మాట్లాడడానికి ఆమె ఆడిటరు రత్నం ద్వారా నీరా ఎప్రోచ్ అయింది 4) యుపిఏ 2లో రాజాకు టెలికాం శాఖ యిప్పించాలని కనిమొళి ప్రయత్నించింది 5) కనిమొళి, నీరా అడిగిన మీదట జర్నలిస్టులైన బర్ఖా, వీర్ సంఘ్వీ కాంగ్రెసు లీడర్లతో మాట్లాడి రాజాకు ఆ శాఖ దక్కేట్లు చేస్తామన్నారు 6) రాజాకు కాకుండా మారన్‌కు ఆ శాఖ వచ్చేట్లు చేయాలని ఎయిర్‌టెల్ చాలా ప్రయత్నించి, రాజా ఆగ్రహానికి గురైంది. కానీ అతని కోపం చల్లారేట్లు చేస్తానని నీరా మాట యిచ్చింది. 7) రిలయన్సుకు ప్రభుత్వం ద్వారా కావలసిన పనుల గురించి ముకేశ్, నీరా ఎన్నోసార్లు చర్చించుకున్నారు. ఆ సిడిల్లో వున్న తక్కిన కాల్స్ కూడా విశ్లేషిస్తే నీరా రాడియా, యిన్‌కమ్ టాక్స్ అధికారుల సహకారంతో బ్లాక్ మనీని వైట్ చేయడానికి 131 ఎకామడేషన్ ఎంట్రీలు పాస్ చేయించుకున్న విషయం కూడా తెలుస్తుంది అంటాడు అజిత్ పిళ్లయ్ తన పుస్తకంలో.
దీన్ని బయటపెడితే భారీ యాడ్స్ యిచ్చే రిలయన్సు, టాటాలు వంటి యాడ్ పెద్ద కంపెనీల నుంచి ఆదాయం ఆగిపోతుంది. పబ్లికేషన్‌కు ఆర్థికంగా దెబ్బ. కానీ భారత ప్రజాస్వామ్యాన్ని, దాన్ని కాపాడ వలసిన సంస్థలు పనిచేసే తీరును బయటపెట్టే సువర్ణావకాశం వస్తుంది. ఏమైతే అది అయిందని 2010 నవంబరు 19 సంచికలో ''ఆల్ లైన్స్ ఆర్ బిజీ'' అనే పేరుతో ఔట్‌లుక్ కవర్ స్టోరీ వేసేసింది. ఔట్‌లుక్‌లో పనిచేసి బయటకు వెళ్లిన జర్నలిస్టులు నడిపే స్టయిల్ మ్యాగజైన్ ''ఓపెన్'' కూడా యిదే కథనాన్ని వేసింది. వాళ్ల సంచిక ఔట్‌లుక్ కంటె ఒక రోజు ముందు మార్కెట్‌లోకి వచ్చింది. ఔట్‌లుక్ కథనం పెద్ద సంచలనం సృష్టించింది. టాటా, బర్ఖా దత్, వీర్ సంఘ్వి వంటి చాలా మంది ముసుగులు జారిపోయాయి. మన వ్యవస్థ ఎంతలా కుళ్లిపోయిందో తెలుసుకుని అందరూ నిర్ఘాంతపోయారు. సైకత్ దత్తా సంపాదించిన సిడిని ఔట్‌లుక్ వెంటనే తమ వెబ్‌సైట్‌లో పెట్టేసింది. అనేకమంది మంత్రుల వ్యాపారస్తుల పరువు గంగలో కలిసింది.
వారందరి మాటా సరే, తోటి జర్నలిస్టులైన వీర్, బర్ఖాల రియాక్షన్ ఎలా వుంది? వీర్ చాలా హుందాగా ప్రవర్తించాడు. తను చేసినది తప్పు కాదని వాదించలేదు. తను తెలివితక్కువగా వ్యవహరించానని ఒప్పుకుని ప్రాయశ్చిత్తంగా కొద్దికాలం జర్నలిజం నుంచి తప్పుకుంటానన్నాడు. ఇక బర్ఖా – తను పరిశోధనాత్మక కథనం రాయడానికై నీరాతో అలా మాట్లాడానని వాదించింది. ఆమె పని చేస్తున్న ఎన్‌డిటి ఆమెకు ఒక వేదిక ఏర్పాటు చేసింది. అక్కడ వివిధ పత్రికల ఎడిటర్లు వచ్చి బర్ఖాను ప్రశ్నించవచ్చన్నమాట. ఎన్‌డిటివి అధినేత ప్రణయ్ రాయ్ వినోద్‌కు ఫోన్ చేసి ఆ చర్చా కార్యక్రమానికి రమ్మనమన్నాడు. నాకు అవసరం లేదు అన్నాడు వినోద్. ''మీ మ్యాగజైన్‌లో ఆమెకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను సమాధానం చెప్పుకునే అవకాశం ఆమెకు వుండవద్దా?'' అని ప్రణయ్ వాదించాడు. ''దానికై నేను టీవీకి రావడం దేనికి? ఆమెను సమాధానం రాసి పంపమను, మా పత్రికలో వేస్తాం'' అన్నాడు వినోద్. ఎన్‌డిటివి యింటర్వ్యూ ప్రసారం చేసినపుడు 'వినోద్ మెహతా ఈ షోకు రావడానికి తిరస్కరించాడు' అని స్క్రోలింగ్ వేశారు. బర్ఖా రాసిన 800 పదాల రిజాయిండర్‌ను ఔట్‌లుక్ ఏ మార్పులూ లేకుండా ప్రచురించింది. అప్పటిదాకా వారానికి రెండు సార్లు షోకు వినోద్‌ను పిలిచే ఎన్‌డిటివి దీని తర్వాత పిలవడం మానేసింది. బర్ఖా రిజాయిండర్ వెలువడిన ఏడాది తర్వాత వీర్ సంఘ్వీ 'ఆ టేపులను మార్చివేశారని నాకెవరో చెప్పారు' అంటూ రిజాయిండర్ పంపాడు. అదీ వేసింది ఔట్‌లుక్.
రాడియా టేపుల ప్రచురణకు వినోద్ మూల్యం చెల్లించవలసి వచ్చింది. టాటాలు ఔట్‌లుక్‌ను బ్లాక్‌లిస్ట్ చేశారు. ఎడ్వర్టయిజర్స్ వినోద్‌ను తప్పించమని ఔట్‌లుక్ యాజమాన్యంపై చాలా ఒత్తిడి తెచ్చారు. అయితే యాజమాన్యం వినోద్‌ను వదులుకోలేదు. మధ్యేమార్గంగా అతన్ని ప్రధాన సంపాదకుడి పదవి నుండి తప్పించి ఎడిటోరియల్ బోర్డుకి చైర్మన్‌గా చేశారు. ''ఇప్పటికే 17 ఏళ్లు ఎడిటరుగా వున్నాను. ఈ మార్పుకు అభ్యంతరం తెలపను'' అన్నాడు వినోద్. చివరివరకు వినోద్ ఔట్‌లుక్‌తోనే కొనసాగాడు. ఏది ఏమైనా వినోద్ మెహతా ప్రజాదరణ పొందిన పత్రికా సంపాదకుడిగా ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నాడు. చిత్రం ఏమిటంటే – అతను జర్నలిజం అభ్యసించలేదు. పత్రికల్లో రిపోర్టరుగా, ఉపసంపాదకుడిగా పనిచేయలేదు. ఎకాయెకి ఎడిటరు అయిపోయాడు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునేవాడు, విషయగ్రహణ చేసేవాడు. కష్టపడేవాడు. ప్రతిభ వున్నవాళ్లని గుర్తించాడు, ప్రోత్సహించాడు. వాళ్లకీ పేరు వచ్చేట్లు చేశాడు. చెప్పదలచినది క్లుప్తంగా, సూటిగా, కొత్త శైలిలో రాయమని సహచరులకు సలహా యిచ్చేవాడు. భాష సులభంగా, అందరికీ తెలిసిన చిన్న పదాలలో, అందంగా వుండాలనేవాడు. తనతో వ్యతిరేకించిన వాళ్లకు కూడా అభిప్రాయం చెప్పే అవకాశం యిచ్చేవాడు. విమర్శను స్వీకరించేవాడు. తనెక్కణ్నుంచో దిగి వచ్చి ప్రబోధించినట్లు రాసేవాడు కాదు. తను అనుకున్నది, నమ్మినది నిర్భయంగా చెప్పేవాడు. పొరపాటున్న చోట ఒప్పుకునేవాడు. పత్రిక ప్రభావాన్ని అతిగా వూహించుకుని, తన వలననే దేశం నడుస్తోందన్న అభిప్రాయంలో ఎప్పుడూ లేడు. కానీ నిజాయితీగా వుండడం చేత, తన పత్రిక ఒక సమస్యపై అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలో ప్రజలకు ఉపయోగపడుతుందని నమ్మేవాడు. తనకు తెలిసున్నది, ప్రజాహితం అనుకున్నది వ్యాప్తి చేసేందుకు చూసేవాడు. అందుకే భారతీయ పత్రికా రంగంలో అతని పేరు చాలాకాలం నిలబడుతుందని నా నమ్మకం. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)