తెలంగాణలో హైదరాబాద్ తరువాత కీలకమైనది వరంగల్. రాజధాని తరువాత ఇదే పెద్దది. చారిత్రకంగా చూసినా చాలా ప్రాముఖ్యం ఉంది. రాజకీయంగానూ అంతే ప్రాధాన్యత ఉంది. కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాలు వరంగల్ చుట్టూ తిరుగుతున్నాయి. కారణం….వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్నది కాబట్టి. వరంగల్ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరి మంత్రిగా ప్రభుత్వంలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇది మొదటి ఉప ఎన్నిక. కొంతకాలం కిందట ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయాలు అత్యంత రంజుగా సాగి, నోటుకు ఓటు కుంభకోణంతో అవినీతి విశ్వరూపం మరోసారి బయటపడిన తరువాత మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నిక జరగబోతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాన్య ఓటర్లు ఓటు వేయరు. అది పూర్తిగా రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారం. అందులో తెర వెనక రాజకీయాలు అనేకం. కాని ఎంపీ స్థానం ఉప ఎన్నికలో లోపల ఎంత రాజకీయం జరిగినా గెలుపోటములను నిర్ణయించేంది సాధారణ ఓటర్లు.
ఇద్దరు చంద్రులకూ ప్రధానమే
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘ఆపరేషన్ ఆకర్ష్’ తో కాంగ్రెసు, టీడీపీ నుంచి ఎంతోమంది ముఖ్య నాయకులను లాగేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ తప్ప ఇతర పార్టీలు బతికి బట్ట కట్టకూడదనే పంతంతో ఉన్నారు. ప్రధానంగా టీడీపీని సర్వనాశనం చేయడమే ధ్యేయం. ఓ పక్క ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఉంటున్నట్లు నటిస్తూనే, భారతీయ జనతా పార్టీ ఎదగకుండా చూస్తున్నారు. ఇది తెలంగాణలో జరిగే ఉప ఎన్నిక అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత ముఖ్యమైంది. ఆయన పరువు ప్రతిష్టలకు సంబంధించింది కూడా. ఎందుకంటే…వరంగల్ స్థానాన్ని మిత్రపక్షమైన భాజపాకు వదిలేసింది. కాషాయ పార్టీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తోంది. అంటే పోటీ చేసే వ్యక్తి భాజపాటీడీపీ ఉమ్మడి అభ్యర్థి అన్నమాట. మరోమాటలో చెప్పాలంటే కేసీఆర్ చంద్రబాబు చెరో పక్క మోహరించారు. ‘నువ్వా…నేనా సై’ అంటున్నారు. భాజపాటీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలిస్తే తెలంగాణలో టీడీపీకి ఆక్సిజన్ అందడంతో బాబు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. అదే సమయంలో భాజపాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక కేసీఆర్ విషయం తీసుకుంటే….కొంతకాలంగా ఆయనపై తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతోంది. ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచినవారు అనేకమంది ఆయనకు వ్యతిరేకంగా గళాలు విప్పుతున్నారు. నియంతృత్వ వైఖరిని ఖండిస్తున్నారు. పోరాటానికి కొత్త వేదికలు నిర్మిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే సమ్మెలే ఉండవని, అసలు సమ్మె చేయాల్సిన అవసరమే రాదని, నోరు తెరిచి అడక్కుండానే కోరినవి తీరుస్తానని చెప్పిన కేసీఆర్ కొంతకాలంగా అనేక సమ్మెలను చూస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. అంతకుముందు ఆర్‌టీసీ కార్మికుల సమ్మె చూశాం. మళ్లీ సమ్మెకు సిద్ధమవుతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఉస్మానియా విద్యార్థులు మధ్య మధ్య రగులుతూనే ఉన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కేసీఆర్ నియంతృత్వ వైఖరి చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్‌టీసీ ఎంప్లాయీస్ పట్ల ఉదారంగా వ్యవహరించి భారీగా జీతాలు పెంచిన కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం మింగుడు పడని విషయం. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఆయన అనుకున్నంత ‘వీజీ’ కాదని కొందరి భావన.
అభ్యర్థుల వేటలో పిట్ట కథలు
ప్రధాన పోటీదారులైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల వేటలో తలమునకలుగా ఉన్నాయి. ఈ ‘వేట’ నేపథ్యంలోనే అనేక ప్రచారాలు మీడియాలో షికారు చేస్తున్నాయి. వీటిల్లో ఆసక్తికరంగా ఉన్నది టీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య చుట్టూ అల్లుకున్న ప్రచారం. చాలా కాలంగా సాగుతోంది. ఏమని? వరంగల్ ఉప ఎన్నికలో రాజయ్య కాంగ్రెసు అభ్యర్థిగా బరిలోకి దిగుతారని. ఒకప్పుడు ఆయన కాంగ్రెసు పార్టీ నాయకుడే కదా. ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు ఏ నాయకుడైనా ‘నిజమే పోటీ చేస్తున్నా అనడు కదా. రాజయ్య కూడా ఉత్తిదే అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చివరి రకప్తుబొట్టు వరకు బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానన్నారు. రాజయ్య కోసం టీడీపీ నాయకులు కూడా ప్రయత్నాలు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. రాజయ్యను బరిలోకి దింపాలని కాంగ్రెసు, టీడీపీ అనుకోవడానికి కారణమేమిటంటే…ఆయనను కేసీఆర్ అన్యాయంగా మంత్రివర్గం నుంచి తొలగించారు కాబట్టి ప్రజల్లో సానుభూతి ఉందని, అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ అంశాన్ని ప్రచారం చేసుకొని ఓట్లు సంపాదించవచ్చని అనుకున్నాయి. అందులోనూ రాజయ్య దళితుడు కావడం ప్లస్ పాయింట్‌గా భావించాయి.
నిరాశలోనే ఉన్నాడు కానీ….
టి.రాజయ్య ప్రస్తుతం నిరాశలో ఉన్నారు. తనను అన్యాయంగా మంత్రివర్గం నుంచి తొలగించారని ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తన ఆవేదన వ్యక్తం చూస్తూనే కేసీఆర్‌ను ప్రశంసించారు. ఆయన పథకాలు బాగున్నాయని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే…రాజయ్య ఓ పక్క ఆవేదన చెందుతున్నా, మరో పక్క టీఆర్‌ఎస్‌ను వీడనని చెప్పడానికి కారణం ఏనాటికైనా తాను మళ్లీ ‘ఫామ్’లోకి వస్తాననే ఆశతో ఉండటమే. టీఆర్‌ఎస్ అధికార పార్టీ కాబట్టి దీన్ని వదులుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని అనుకుంటున్నారు. కేసీఆర్ తనను మళ్లీ దగ్గరకు తీసుకొని ఏదో ఒక పదవి ఇస్తారని కూడా అన్నారు. అందుకే కాంగ్రెసు, టీడీపీ ఆఫర్లను తిరస్కరించి ఉండొచ్చు. రాజయ్య ఎక్కువకాలం సొంత నియోజకవర్గంలోనే గడుపుతున్నారు. తన పదవి పోయినా ఏనాడూ కేసీఆర్‌ను విమర్శించని రాజయ్య మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వడం విశేషం. మున్సిపల్ కార్మికుల డిమాండ్లు నెరవేర్చేందుకు కేసీఆర్ అయిష్టంగా ఉండగా వారి డిమాండ్లు తీర్చాలని రాజయ్య కోరుతున్నారు. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్ పట్ల రాజయ్యలో కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్లు కనబడుతోంది. కాని ఉప ఎన్నికలో అభ్యర్థిగా నిలబడేందుకు సాహసం చేయలేకపోతున్నారు.
తెర పైకి మాజీ స్పీకర్ మీరా కుమార్
కాంగ్రెసు అభ్యర్థి వేటలో లోక్‌సభ మాజీ స్పీకర్, కాంగ్రెసు నాయకురాలు మీరా కుమార్ పేరును కొందరు ప్రతిపాదించారు. ఈమె దళితులకు ఆరాధ్యుడైన బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తె అనే సంగతి తెలిసిందే. కాబట్టి దళితుల ఓట్లు పడతాయని ఆశించారు. మరో విషయమేమిటంటే…ఆమె అభ్యర్థిత్వాన్ని తెలంగాణ సెంటిమెంటుతో ముడిపెట్టారు. యూపీఏ2 ప్రభుత్వంలో మీరా కుమార్ స్పీకర్‌గా ఉండగానే తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది కదా. అంటే..తెలంగాణ రాష్ర్టం రావడంలో మీరా కుమార్ పాత్ర కూడా ఉందని ప్రచారం చేయొచ్చనుకున్నారు. మరి ఉప ఎన్నికలో పోటీ ప్రతిపాదనను కాంగ్రెసు నాయకులు మీరా కుమార్‌కు చెప్పారో లేదో తెలియదు. మొత్తం మీద ఆమె పేరును ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.
కాంగ్రెసుకు జీవన్మరణ సమస్య
సోనియా గాంధీ కారణంగానే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ వల్ల కాదని కాంగ్రెసు నాయకులు ఎంతగా మొత్తుకుంటున్నా ఆ పార్టీ గ్రాఫ్ పెరగడంలేదు. ఇప్పటికే చాలామంది కాంగ్రెసు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈమధ్య మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ర్ట పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెసుకు దిమ్మ తిరిగిపోయింది. కేసీఆర్ ఏడాది పాలన పూర్తయిన తరువాత కాంగ్రెసు టీఆర్‌ఎస్‌పై పోరు ఉధృతం చేసింది. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వచ్చి వెళ్లారు. వరంగల్ ఎంపీ సీటు గెల్చుకొని టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. వ్యూహ రచన కోసం ఆరుగురితో ప్రత్యేక కమిటీలు వేసింది.
కమలం పార్టీ మల్లగుల్లాలు
వరంగల్ ఎంపీ సీటును టీడీపీ తన మిత్రపక్షమైన భాజపాకు వదిలేయడంతో అది మల్లగుల్లాలు పడుతోంది. ఆ పార్టీలో పోటీ కూడా పెరుగుతోంది. ఇది ఉప ఎన్నిక అయినప్పటికీ భాజపా జాతీయ నేతలు కూడా దృష్టి సారించారట. అభ్యర్థిని నిర్ణయించడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను తమ పార్టీలోకి లాగి అభ్యర్థిగా నిలబెట్టాలని ప్రయత్నాలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు జరగలేదని భాజపా రాష్ర్ట నాయకులు చెబుతున్నా వరంగల్ జిల్లా నాయకులు రాజయ్యను సంప్రదించారట. భాజపాకు చెందని కొందరు ప్రముఖులు కూడా పోటీకి ఉత్సాహం చూపుతున్నారని తెలుస్తోంది. ఇక టీఆర్‌ఎస్‌లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురి పేరు వినిపించినా ఆయన దాన్ని ఖండించారు. టీఆర్‌ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారో ఇంకా నిర్ణయించకపోయినా అది అధికార పార్టీ కాబట్టి గెలుపుపై ధీమాగా ఉంది.
నాగ్ మేడేపల్లి