''హాసం'' తొలి సంచికకు మాకు రాసిన యితర రచయితల్లో – పరుచూరి గోపాలకృష్ణ (కుక్క విశ్వాసము గల జంతువు అనే కథ) తనికెళ్ల భరణి (తుమరాడ సంగమేశ్వర శాస్త్రిగారనే వైణికుడిపై రాసిన వ్యాసం) ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ ('అనగనగా ఆకాశం వుంది' పాటపై విశ్లేషణ), ఎమ్మెస్ నారాయణ (కస్తూరి శివరావుపై వ్యాసం), స్వామి చిత్రానంద (సినిమా రంగానికి చెందిన హాస్య ఉదంతాల శీర్షిక). సిఎచ్ లక్ష్మి (అద్నన్ శామీ) వున్నారు. లలిత సంగీతం విభాగంలో ఏం వేయాలో తెలియక నేను విజయవాడ వెళ్లినపుడు ప్లాట్‌ఫాం మీద కొన్న పుస్తకంలోంచి దేవులపల్లి రాసిన 'మధూదయంలో..' పాటను నొటేషన్‌తో సహా వేశాం.
సంచిక వెలువడగానే దాని ప్రత్యేకత, మేం ఏం కావాలని కోరుకుంటున్నామో రచయితలకు, సినీప్రముఖులకు అర్థమైంది. లలితసంగీతం శీర్షిక మేన్‌టేన్ చేయడానికి చిత్తరంజన్‌గారు, సంగీతజ్ఞుల జీవితాల్లో వుదంతాలు రాయడానికి తనికెళ్ల భరణి పూనుకున్నారు. తెలుగు హాస్యనటుల గురించి రావి కొండలరావుగారు శీర్షిక నడిపారు. ఎడిటరుగారి పూనికతో సినిమా రచయితలందరూ (సత్యానంద్, దివాకరబాబు, జనార్దన మహర్షి, మరుధూరి రాజా, చింతపల్లి రమణ, ఎంవియస్ హరనాథరావు) మాకు కథలు రాశారు. మాకు రాసిన యింకా కొందరు ప్రముఖుల పేర్లు చెప్పాలంటే – వేటూరి ('కొమ్మకొమ్మకో సన్నాయి' పేర సీరియల్), జమున (నేనూ – నా పాటలూ) సింగీతం శ్రీనివాసరావు ('కరాజు కథలు పేర సీరియల్), పిబి శ్రీనివాస్ (లతా మంగేష్కర్‌పై సీరియల్), మాధవపెద్ది సురేష్ (సినీసంగీతకారులపై సీరియల్), పద్మనాభం (ఆత్మకథ), సావిత్రీ ఘంటసాల (ఘంటసాల జీవితచరిత్ర), భువనచంద్ర (హాస్యకథల సీరియల్), సిరివెన్నెల సీతారామశాస్త్రి, డివి నరసరాజు, బాపు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మురారి, చంద్రబోస్, భాస్కరభట్ల, కులశేఖర్, కీరవాణి, వెన్నెలకంటి, మల్లాది (కామెడీ సీరియల్), ఆదివిష్ణు (కామెడీ సీరియల్), పులగం చిన్నారాయణ (జంధ్యాల సినిమాలపై సీరియల్), గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (అన్నమయ్య పదాలపై సీరియల్), పియస్ గోపాలకృష్ణ (తమిళ అర్థం చేసుకుందాం..శీర్షిక), ఆచార్య తిరుమల (చమత్కారపద్యాలు), బివి సత్యమూర్తి (చదువుల్రావు కార్టూన్ స్ట్రిప్), మృణాళిని (హిందీపాటల గురించి) .. యిలా ఎందరో వున్నారు.
వీరందరూ వచ్చినా నాకు పని కాస్తే తగ్గింది. ఉడ్‌హౌస్ పాత్ర ''బింగో లిటిల్'' ఆధారంగా ''రాంపండు లీలలు'' అనే సీరియల్ పూర్తి అవుతూండగానే మరో సీరియల్ ప్రారంభించవలసి వచ్చింది. ''కిశోర్ జీవనఝరి'' అని రాసి నా భార్య పేర రాశాను. ఎవరీ ఎమ్మెస్ స్వాతి అని సీతారామశాస్త్రి గారి దగ్గర్నుంచి అందరికీ కుతూహలం. చెప్పుకోలేం కదా. చివరకు పుస్తకరూపంలో వేసినపుడు యిదీ సంగతి అని చెప్పేశాను. హాసం టైములో ఎన్నెన్ని మారుపేర్లు వుపయోగించానో నేనే మర్చిపోయాను. హాసం ఆఫీసుకు వచ్చి పాత మ్యాగజైన్లు యిచ్చి సహకరించిన వారి పేర కూడా కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని ఐటెమ్స్ రాసేవాణ్ని. పక్షపత్రికగా 36 నెలలు నడిచింది. ఆఖరి సంచిక దాకా యిదే తంతు. ఇంత చేసినా, మంచి పేరు తెచ్చుకున్నా, యూరోపియన్ తెలుగు అసోసియేషన్ ఎవార్డు తెచ్చుకున్నా ''హాసం'' బతికి బట్టకట్టలేదు. పబ్లిషరు వరప్రసాద్ (శాంతా బయోటెక్నిక్స్)కు గౌరవం దక్కింది కానీ డబ్బు పోయింది. మరి బ్యాంకు వుద్యోగం వదులుకుని దీనిలోకి దిగిన నా గతి…? కేసు పోతే పోయింది కానీ కోర్టు వ్యవహారాలన్నీ బాగా తెలిసాయన్న సామెతలా చాలా విషయాలు తెలిశాయి. అవే యిప్పుడు మీతో పంచుకుంటున్నాను. హాసం మార్కెటింగ్‌కు వెళ్లినపుడు మార్గదర్శి మార్కెటింగ్ ఉద్యోగి ఒకతను నా రాజీనామా సంగతి విని 'అదేటండీ, కరెన్సీ నోట్లు గాలికి వదిలేసి చిల్లరకోసం వెతుక్కుంటున్నారు' అన్నాడు. అది భవిష్యవాణి అని తర్వాతి జీవితం బోధపరిచింది. హాసం మూసేసి పదేళ్లయింది. ఇప్పటికీ ఎవరో ఒకరు ఎదురై 'గొప్ప పత్రికండీి, మిస్సవుతున్నాం, మళ్లీ మొదలుపెట్టకూడదా?' అంటూ వుంటే వెన్నులో చలి పుడుతుంది.
పత్రికలు ప్రారంభిద్దామనుకుంటున్న వారందరూ యిలాటి ఆర్థికపరమైన నష్టాలకు, స్వయంగా రాసే, పెద్దల చేత రాయించే కష్టాలకు సిద్ధపడితేనే దీనిలో దిగాలి, లేకపోతే ఊహలతోనే సరిపెట్టుకోవాలి. దినపత్రికలతో ముడిపెట్టుకున్న మ్యాగజైన్లు మాత్రమే బతకడానికి ఛాన్సుంది. ''స్వాతి'' ఒక్కటే మినహాయింపు. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు వంటి దిగ్గజం కూడా తమ తెలుగు మాసపత్రిక ''సురభి'' మూసుకోవలసి వచ్చింది. ఇటీవలే ఇండియా టుడే కూడా తమ తెలుగు వెర్షన్‌కు మంగళం పాడింది. గత 50 ఏళ్లల్లో తెలుగులో ప్రారంభించిన పత్రికలు వందల్లో వుంటాయి. ప్రస్తుతం నడుస్తున్నవి పదిలోపే వుంటాయి. ఇప్పుడు వినోద్ మెహతా కథలోకి మళ్లీ వద్దాం – వినోద్ మెహతా సంపాదకత్వంలో డెబెనేర్ తొలి సంచిక 1974 ఏప్రిల్‌లో వెలువడింది. కంటెంటు మాట ఎలా వున్నా స్టయిల్, ఫాంట్స్, లే ఔట్, డిజైన్, ఫారిన్ మ్యాగజైన్ లుక్ అవీ చూసి పాఠకులు ఫర్వాలేదు అన్నారు. అప్పట్లో టాప్‌మోస్ట్ డిజైనర్ అయిన పన్నా జైన్ 'డిజైన్ ఫంటాస్టిక్‌గా వుంది. న్యూడ్ మ్యాగజైన్ కాకుండా వుంటే బాగుండేది' అన్నాడు. పాఠకుల స్పందన చూసి వినోద్, పబ్లిషర్లు అమ్మయ్య అనుకున్నారు.
వినోద్ అదృష్టం కొద్దీ రస్కిన్ బాండ్ దొరికాడు. ఆయన ఎక్కువగా పిల్లల నవలలు రాసినా ''ద సెన్సువలిస్ట్'' అనే రసవత్తరమైన నవల రాశాడు. దాన్ని డెబెనేర్‌లో సీరియల్‌గా వేయసాగారు. రస్కిన్ వంటి మర్యాదస్తుడు యీ పత్రికకు రాస్తున్నాడనగానే తక్కినవాళ్లు మెత్తబడ్డారు. వెంటనే కలం పట్టి డెబెనేర్‌కి రాసేయలేదు కానీ వినోద్ ఫోన్ చేస్తే కింద పెట్టేయడం లేదు. ఓపిగ్గా విని సారీ చెప్తున్నారు. ''డైలీ టెలిగ్రాఫ్'' పేపరు న్యూఢిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్న పీటర్ గిల్ వద్దకు వినోద్ వెళ్లి ఇండియన్ ప్రెస్‌పై మీ అభిప్రాయం ఒక వ్యాసంగా రాసి యివ్వండి అని కోరాడు. అతను సరే అన్నాడు. 'ఇండియాలో జర్నలిస్టులు, ఎడిటర్లు ప్రెస్ క్లబ్బులో కూర్చుని బాతాఖానీ కొట్టడం మరిగారు. బయట ఎన్నో కథనాలు వారికోసం ఎదురు చూస్తున్నాయి. కరువు, వరదలు, రేషన్, అవినీతి, ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు.. యిలా ఎన్నో వున్నాయి. వాటిపై చూపు సారించరు. ఏ పత్రికకు ఎవరు ఎడిటరు, అతనికి వున్న రాజకీయపరమైన పలుకుబడి ఎంత? మనకు జర్నలిస్టు కాలనీలో ఉచితంగా ఓ ప్లాటు యిప్పించగలడా' అని ఆలోచించడంతోనే టైమంతా సరిపోతుంది. ఆ తర్వాత మూడు రోజులు టైప్‌రైటర్ మీద చెమటోడ్చి డీగో గార్షియా గురించి ఫారిన్ పేపర్లలో రాసినది చూసి అటూయిటూ మార్చి రాసి అమ్మయ్య నా జీతం నేను సంపాదించేసుకున్నాను అనుకుంటారు.' అంటూ తన వ్యాసంలో చెరిగేశాడు. ఒక విదేశీ జర్నలిస్టు స్వదేశీ మీడియాపై ఒక బూతుపత్రికలో యిలా విరుచుకుపడడం అందర్నీ ఆశ్చర్యపరచింది. మీడియాలో వున్నవాళ్లంతా దీని గురించి విని, యీ పత్రికేమిటి, దీని కథేమిటి అని తెప్పించుకుని మరీ చూశారు.
ఆ విధంగా వినోద్‌కు గుర్తింపు వచ్చింది. ఈ బూతు పత్రిక ఎడిటరును ఎడిటరుగా గుర్తించాలా లేదా, తమ పార్టీల్లో పిలవాలా వద్దా అన్న చర్చ ఎడిటర్స్ క్లబ్‌లో జరిగింది. అయితే ఖుశ్వంత్ సింగ్ కొడుకు రాహుల్ సింగ్ అప్పుడు రీడర్స్ డైజస్టు ఇండియన్ ఎడిషన్‌కు ఎడిటరుగా వున్నాడు. అతనికి వినోద్ నచ్చాడు. తన యింట్లో యిచ్చిన పార్టీకి పిలిచాడు. అక్కడ కొంతమంది వినోద్‌ను దగ్గరకు రానిచ్చారు, మరి కొందరు దూరంగా పెట్టారు. దగ్గరకు రానిచ్చినవారిలో మారియో మిరాండా అనే కార్టూనిస్టు, యిలస్ట్రేటర్, 'బిజీబీ' అనే కలంపేరుతో రాసే బెహ్రామ్ కాంట్రాక్టర్ అనే హ్యూమర్ కాలమిస్టు వున్నారు. వాళ్లిద్దరినీ తన పత్రికకు కంట్రిబ్యూట్ చేయమని వినోద్ వెంటనే అడిగేశాడు. వాళ్లు సరేనన్నారు. తర్వాతి రోజుల్లో చాలా పేరు తెచ్చుకున్న అనిల్ ధార్కర్ ఒక కాలమ్ మొదలుపెట్టాడు. ఆబూ అబ్రహామ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పాకెట్ కార్టూన్లు వేసేవాడు. ఆయన యితనికి కార్టూన్లు వేసి యివ్వడమే కాక సెటైరికల్ కాలమ్ కూడా రాసేవాడు. ఇక్బాల్ మసూద్ అనే యిన్‌కమ్‌టాక్స్ కమిషనర్‌కు సినిమాలంటే పిచ్చి అని తెలుసుకుని వినోద్ వెళ్లి అతన్ని సినిమాలను సమీక్షించమన్నాడు. ఆ తర్వాత అతను నిలయవిద్వాంసుడై పోయి ఆవకాయ నుండి అణుబాంబు దాకా ప్రతీదీ సమీక్షించడం మొదలుపెట్టాడు. క్రికెట్‌పై సమీక్షావ్యాసాలు రాసే బాబీ తల్యార్‌ఖాన్ 'హౌ'జ్ దట్?' అనే కాలమ్ రాయడానికి ఒప్పుకున్నాడు. బ్లిట్జ్ కాలమిస్టు, సినిమా రచయిత కెఎ అబ్బాస్ అప్పుడప్పుడు 'వై ఐ బికేమ్ కమ్యూనిస్ట్?' వంటి వ్యాసాలు రాసేవాడు. ఇలా పెద్దవాళ్లు అందుకోవడంతో వినోద్‌కు స్వయంగా రాసే పని తగ్గింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2015)