ఎమ్బీయస్: ఏ దేశమేగినా, ఎందు కాలిడినా…

రాయప్రోలు సుబ్బారావుగారి ఈ గేయం ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. ‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవమ్ము..’…

రాయప్రోలు సుబ్బారావుగారి ఈ గేయం ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. ‘ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవమ్ము..’ అని సాగుతుంది. చాలా గొప్ప సూక్తి. మనలో మనం ఎన్నయినా అనుకోవచ్చు, మన దేశంలో అధికారంలోకి వచ్చినవారిని మనం ఇష్టపడకపోయి వుండవచ్చు, వారి విధానాలతో మనం విభేదించవచ్చు. కానీ ఇంకో దేశం వెళ్లినపుడు మాత్రం అవన్నీ పక్కకు పెట్టి ‘మేమందరం భారతీయులం. మా జాతి గొప్పది. మీకేమీ తీసిపోము’ అని అనడం పరిపాటి. 

ఈ పద్యం ఇతర భాషల్లో ఇలాగే లేకపోయి వుండవచ్చు కానీ భావం మాత్రం ప్రపంచ నాయకులందరూ గ్రహించారు. ఎవరూ ఇతర దేశంలో తమ దేశం గురించి చులకనగా మాట్లాడరు. మాదేశం అప్పుల్లో మునిగిపోయింది, అవినీతిలో కూరుకుపోయింది, అసమర్థత రాజ్యమేలింది అని ఎప్పుడూ చెప్పరు. ‘మేం ఎప్పుడూ ముందుకు సాగుతూనే వున్నాం, ఇప్పుడు మరింత చురుగ్గా సాగుతున్నాం. మాతో కలిసి మీరు దీర్ఘకాల ప్రణాళికలు వేయవచ్చు, భారీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈలోగా ఎన్నికలు వచ్చి మేం గద్దె దిగిపోయినా ఏమీ ఫర్వాలేదు, మా తర్వాత వచ్చేవాళ్లు రాక్షసులేమీ కాదు, మిమ్మల్ని కొత్తగా కమీషన్లు అడగరు, ఇప్పుడు చేసుకున్న ఒప్పందాలను మన్నిస్తారు, కొత్త షరతులు పెట్టి మిమ్మల్ని తరిమివేయరు’ అని చెప్తారు. అలా చెప్పకపోతే అవతలివాళ్లు ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు రారు. 

ఎందుకంటే వాళ్లకూ తెలుసు – ఈనాడు తమతో వ్యవహరిస్తున్న పార్టీకి నూటికి ఏ 35యో, 40యో శాతం ఓట్లు వచ్చి వుంటాయనీ, మెజారిటీ ప్రజలు వీరి విధానాలను వ్యతిరేకించాయనీ, ప్రతిపక్షాలు కలిసికట్టుగా భవిష్యత్తులో ఎదిరిస్తే ఈ ప్రభుత్వం కూలిపోతుందని, వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుందనీ! ఎన్నికలే లేని నియంతృత్వ వ్యవస్థలో సైతం, నియంతపై సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం వుంటుంది. అధికారంలో ఎవరూ శాశ్వతం కాదు. తామూ కాదు, విదేశీ అతిథీ కాదు అనే ఎఱిక అందరికీ వుంటుంది. అందువలన విదేశీ గడ్డపై తన దేశంలోని ప్రతిపక్షాల గురించి చులకనగా ఎవరూ మాట్లాడరు. అలా మాట్లాడిన ప్రత్యేకత మోదీది మాత్రమే. మొదటిసారి అలా మాట్లాడినప్పుడు మనవాళ్లు వులిక్కిపడి వుంటారు. కెనడాలోనూ ఉలిక్కిపడి వుంటారు కానీ అతిథి పట్ల గౌరవంతో పైకి ఏమీ అని వుండకపోవచ్చు. విమర్శలకు చలించే రకం కాదు మోదీ. అందుకే చైనాలో మళ్లీ మాట్లాడారు. కెనడాకు వచ్చిన తొలి ప్రధాని తానే అని ఆయన చెప్పినది తప్పు అని రుజువయ్యాక కూడా ఆయన క్షమాపణ లేదా సవరణ చెప్పలేదు. ఆయనకు నోట్సు రాసిచ్చినవారిని మందలించారో లేదో తెలియదు. కాంగ్రెసునో, జనతా పరివార్‌నో తిట్టాలంటే ఎన్నికల సభల్లో తిట్టవచ్చు, అక్కడకి వెళ్లి తిడితే ఏం లాభం? వాళ్లేమైనా ఓట్లేస్తారా? నవ్వుకుని వూరుకుంటారు. 

మోదీ ఏడాది పాలన కొడుతున్న డప్పులో విదేశీ పర్యటనల ప్రస్తావన విపరీతంగా జరుగుతోంది. అసలు ఏడాది పాలన గురించి ఇంత ప్రచారం అవసరమా? గతంలో ఎవరూ ఇంత హంగు చేయలేదు. ఇదేమైనా పివి నరసింహరావు వంటి అస్థిర ప్రభుత్వమో, అతుకుల బొంత వంటి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వమో, 13 నెలలు మాత్రమే రాజ్యం చేయగలిగిన దినదినగండం వాజపేయి రెండో ప్రభుత్వమో ఇలాంటి ప్రచారం చేసుకుంటే కాస్త అర్థం వుంది – చచ్చీచెడి ఏడాది మైలురాయి దాటాం, ఎన్నాళ్లు వుంటామో తెలియదు కాబట్టి ఇప్పుడే పండగ చేసేసుకుంటే మంచిదని. కానీ మోదీది అలాంటి పరిస్థితి కాదు. చాలా దశాబ్దాల తర్వాత పూర్తి మెజారిటీ లభించిన పార్టీ ప్రభుత్వం. తక్కినవాళ్లకు చోటు ఇవ్వడం సౌహ్రార్దపూర్వకంగానే తప్ప అవసరానికి కాదు. ఇలాంటిది ఏడాదేం ఖర్మ, ఐదేళ్లు పూర్తి చేస్తుందని అందరం అనుకుంటున్నాం. ఐదేళ్లేమిటి, కాంగ్రెసు కోలుకోదు, జనతా పరివార్ కలవదు, 2029 వరకు మాదే రాజ్యం అంటున్నాయి బిజెపి శ్రేణులు. ఇంత ఆత్మవిశ్వాసం తొణికిస లాడేవారికి ప్రజాధనంతో ఇంత ఆర్భాటం అవసరమా? ఇది చూసి రాష్ట్రప్రభుత్వాలన్నీ యిదే స్థాయిలో ప్రచారం మొదలుపెడితే, ఎంత వృథా వ్యయం? ప్రచారం అస్సలు అక్కరలేదని ఎవరూ అనరు, మోతాదు మించిందని మాత్రమే అనిపిస్తోంది. 

కొన్ని క్లెయిమ్స్ వింటూంటే నవ్వు వస్తోంది. ఏడాదిలో అవినీతి అస్సలు జరగలేదట – అది ఇప్పుడేం తెలుస్తుంది? కాగ్ రిపోర్టులు, పిఎసి రిపోర్టులు అవీ వచ్చి మీడియాకు మోదీ మైకం దిగి పరిశోధనల్లోకి దిగినప్పుడు అప్పుడు చెప్పగలుగుతాం – అవినీతి జరిగిందా లేదా, జరిగితే ఏ మేరకు అని. పిక్నిక్కులో ఏం జరిగిందో వెంటనే తెలియదు. ఐదారు నెలలు పోయాకనే చిన్నెలు కనబడతాయి. ప్రభుత్వం విషయంలో కొన్ని ఏళ్లు పడతాయి. ద్రవ్యోల్బణం తగ్గిందంటున్నారు కానీ ఆ ఛాయలు సామాన్యుడి జీవితంలో ఏమీ కనబడటం లేదు. అంతర్జాతీయంగా పెట్రోలు ధర తగ్గినా, ఇక్కడ పెరుగుతోంది. గ్యాస్ ధరలు తగ్గలేదు, పప్పులు, బియ్యం, నూనె, రైలు చార్జీలు, బస్సు టిక్కెట్లు – ఏవీ తగ్గలేదు. తగ్గిందేమైనా వుందంటే రూపాయి మారకం విలువ తగ్గింది. ధరలు తగ్గే వరకు అచ్ఛే దిన్ వచ్చినట్లు ఎవరూ ఫీలవరు – యాడ్స్‌లో ఏం రాసి మెరిపించినా, మోదీగారు ఎంత వ్యంగ్యవైభవం కురిపించినా!

ఆర్థికపరమైన విషయాల్లో మోదీ పాలన ఎలా వుంది, బజెట్‌లో నిర్ణయించుకున్న గమ్యం ఏ మేరకు చేరారు అనేది గణాంకాలన్నీ తెలిసిన తర్వాతే చెప్పగలం. ఆయన పాలన తీరు గురించి చెప్పాలంటే – నేను భయపడినట్లుగానే నియంతృత్వ పోకడలతోనే సాగుతోంది. ఈయన మరో ఇందిరా గాంధీ అవుతాడన్న భయం ఎప్పుడూ వుంది, అది సహేతుకమో, నిర్హేతుకమో కాలమే నిర్ణయిస్తుంది. ఆయన ఏడాది పాలన ప్రచారంలో విశేషంగా ప్రస్తావిస్తున్న, ప్రస్తుతిస్తున్న విదేశీ పర్యటనల గురించే కాస్త ముచ్చటిస్తాను. ‘మోదీ 12 నెలల్లో 18 విదేశాలు తిరిగి భారతదేశపు ప్రతిష్ఠ ఇనుమడింప చేశారు.’ అని మరీమరీ రాస్తున్నారు. పర్యటనల వలన ప్రతిష్ట పెరిగిపోతుందంటే మన ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా ప్రతీ వారం విదేశాలకు పంపిస్తూ వుండవచ్చు. ప్రపంచంలో మూలమూలలా మన దేశమేం ఖర్మ, రాష్ట్రాల ప్రతిష్ఠ కూడా పెరిగిపోతుంది. ‘అక్కడ మోదీకి ఘనస్వాగతం లభించిందంటే అది మోదీ పట్ల ప్రపంచ దేశాల దృక్కోణానికి నిదర్శనం’ వంటివి అతిశయోక్తులు. అక్కడ మోదీ తన వ్యకితగతమైన హోదాలో వెళ్లటం లేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రతినిథిగా వెళుతున్నారు. 

‘ఇందిరా గాంధీ యుఎన్‌ఓలో స్పీచి ఇస్తే అందరూ లేచి చప్పట్లు కొట్టారు’ వంటి వార్తలు బాగా ప్రచారం చేసే రోజుల్లో చో రామస్వామి రాశారు – ‘ఆ చప్పట్లు 90 కోట్ల ప్రజలకోసం కొట్టిన చప్పట్లు. వాటిల్లో మీకూ, నాకూ కూడా భాగం వుంది’ అని. టింబక్టూ దేశాధిపతి ఎంత మేధావి అయినా ఆయన ప్రసంగానికి అన్ని చప్పట్లు పడవు – దేశం యొక్క ప్రాధాన్యత బట్టి దాని ప్రతినిథికి విలువ పెరుగుతుంది. మొన్న రిపబ్లిక్ ఉత్సవాల్లో ఒబామా కోసం ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. అతను అమెరికా అధ్యక్షుడు కాకుండా అర్జెంటినా అధ్యక్షుడైతే అంత విలువ ఇస్తామా? మన వూరి బయటకు వెళ్లినపుడు మన వూరికి ప్రాతినిథ్యం వహిస్తాం, రాష్ట్రం బయటకు వెళ్లినపుడు రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తాం, మనమేదైనా మిస్‌బిహేవ్ చేస్తే గబుక్కున ‘తెలుగువాళ్లంతా యింతేరా’ అనేస్తారు. విదేశాలకు వెళ్లినపుడు ఇండియాకు ఆటోమెటిక్‌గా ఇండియాకు రిప్రజెంటేటివ్ అయిపోతాం. 

ఇక్కడ ఓ చిన్న సంఘటన చెప్తాను. మా మావయ్య ఫ్రెండు ఒకాయన ఇరిగేషన్ డిపార్టుమెంటు సీనియర్ యింజనీరుగా అంతర్జాతీయ బృందంతో కలిసి ఈజిప్టు వెళ్లాడు. అప్పట్లో ఈజిప్టు అధ్యక్షుడైన నాజర్ వీళ్లను పలకరించడానికి వచ్చాడు. ఈయన ఇండియా నుంచి వచ్చానని అనగానే ఆయన సంతోషంగా ‘‘హౌ ఈజ్ నెహ్రూ? ఫైన్!?’’ అని కుశలం అడిగాట్ట. నెహ్రూ, నాజర్ అలీన ఉద్యమంలో సారథులు, మంచి మిత్రులు. ఇండియా అనగానే నాజర్‌కు నెహ్రూయే గుర్తుకు వచ్చాడు. ఈ ఇంజనీరూ, నెహ్రూ కుటుంబ సభ్యులైనట్టు ఒకరిని చూడగానే మరొకరు గుర్తుకు వచ్చినట్లు అడిగేశాడు. నిజానికి ఈయన ఇండియాలో నెహ్రూను కలవగలడా? ఆ క్షణానికి నాజర్‌కు అవేమీ తోచలేదు. అలా మనం ఇండియా నుంచి.. అనగానే అవతలి విదేశీయుడు – గాంధీ, రాజ్ కపూర్, తందూరీ చికెన్… ఇలా ఏదో ఒకటి గుర్తు చేసుకుంటాడు. వారిపై/వాటిపై తనకున్న ఇష్టాన్ని మనపై చూపుతాడు. అదంతా మన ప్రతిభే అనుకుంటే పొరబాటు. భారత ప్రధాని స్థానంలో మోదీ కాదు, మరొకరు వెళ్లినా దేశాల మధ్య ఇలాంటి ప్రొటోకాల్ పాటిస్తారు. 

ఇక వెళ్లగానే ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడిపోయాయని అనడం తొందరపాటు. మనవాళ్లు ఏ దేశమెళ్లినా, ఏ దేశనాయకుడు మన దేశం వెళ్లినా ఇరు దేశాల మధ్య తరతరాలుగా సాంస్కృతిక బంధం వుందని ఇద్దరూ ఉద్ఘాటిస్తారు. చిన్నప్పుడు తొలిసారి ఇవి విన్నప్పుడు పులకించి పోయేవాణ్ని. తర్వాత తర్వాత అది తగ్గిపోయింది. అమెరికా వాళ్లు, రష్యా వాళ్లు, చైనా వాళ్లు – ఎవరైనా సరే ఇండియాకు వచ్చి ఏం అప్పచెపుతారో, పాకిస్తాన్‌లోనూ అదే చెప్తారు, శ్రీలంక లోనూ అదే చెప్తారు, బర్మాలోనూ అదే చెప్తారు. వెనక్కాల స్క్రిప్టు రైటర్స్ వుంటారుగా, పాత వాటినే అటూయిటూ మార్చి రాసి యిచ్చేస్తారు. పాత బంధాలు తవ్విపోయడం వలన వచ్చే లాభం ఏమీ వుండటం లేదు. అసలైన సరిహద్దు సమస్యలు ఎప్పుడూ పెండింగులోనే వుంటాయి. ఇక ఒప్పందాలంటారా, వాటి గురించిన కసరత్తు ఏళ్ల తరబడి సాగుతుంది. ఎప్పణ్నుంచో చేసుకుంటూ వచ్చిన బేరసారాలు తెమిలి, అప్పుడు లాంఛనంగా సంతకాలు పెడతారు. ఈ ప్రభుత్వాధికారులు మొదలుపెట్టిన ప్రక్రియ వచ్చే ప్రభుత్వహయాంలో పూర్తి కావచ్చు, అలాగే గతప్రభుత్వం చేసిన కృషి ఈ ప్రభుత్వకాలంలో ఫలించవచ్చు. ఇక్కడ మన దగ్గర అధికారం మారగానే మన దేశం పట్ల వారి దృక్పథం రాత్రికి రాత్రి మారిపోయిందనుకోవడం అర్థరహితం. మోదీ విదేశీ పర్యటనలు అవసరం కంటె రెట్టింపు వున్నాయని నా భావన. చాలా దేశాల విషయంలో అది మొక్కుబడి వ్యవహారమే! తక్కినవాటి ప్రభావం సంగతి కూడా ఇప్పుడే చెప్పలేం. కొన్నాళ్లు ఆగితేనే తెలుస్తుంది. 

మామూలు గృహస్తు ఇంట్లో మాత్రమే గౌరవింపబడతాడు, విద్వాంసుడు దేశవిదేశాల్లో ఎక్కడకు వెళ్లినా గౌరవింపబడతాడు అని ఆర్యోక్తి. ఈ కాలంలో ధనికుడు అనుకోవాలి. మన దేశం ఆర్థికంగా బలమైన శక్తిగా వున్నపుడు మాత్రమే మన దేశప్రతినిథి మాట బయట చెల్లుబాటవుతుంది. ప్రస్తుతం వస్తున్న గౌరవమంతా మన దేశం సంపద చూసి కాదు, మన దేశస్తుల మేధోసంపద చూసి. ఇతర దేశాల్లో మనవాళ్లు సాధిస్తున్న విజయాలను చూసి ఇండియా అంటే ఆదరం పెరుగుతోంది. కానీ అది చాలదు. మనం ఆర్థికంగా బలపడాలి. దానికోసం పాలకులు నిరంతరం శ్రమించాలి. నిర్ణయాధికారం  ఎవరికీ ఇవ్వకుండా, సర్వం గుప్పిట్లో పెట్టుకున్న ప్రధాని ఇంటి పట్టున వుండకుండా యాత్రలపై యాత్రలు చేస్తూ వుంటే ఆర్థిక ప్రక్రియ కుంటుపడుతుంది, జాప్యమవుతుంది. ఈ విషయంలో చైనావాళ్లను చూసి మనం చాలా నేర్చుకోవాలి. వాళ్లు చాలా దశాబ్దాల పాటు బయటకు రాలేదు. ఉపన్యాసాలు దంచలేదు. తమను తాము దిద్దుకుంటూ, ఆర్థికంగా బలపడుతూ వున్నారు. వాళ్లు గొప్ప శక్తిగా ఎదిగాక, అందరూ వాళ్ల చుట్టూ రౌండ్లు కొడుతున్నారు. మోదీగారు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. విదేశాలు తిరిగితే తిరగనివ్వండి, సెల్ఫీలు తీసుకోవాలనుకుంటే తీసుకోమనండి, కొత్త కొత్త సూట్లు వేసుకోవాలంటే వేసుకోనివ్వండి కానీ వాటి వలన ఏదో ఒరిగిందని ఇప్పుడే ప్రచారం చేయకండి, ప్లీజ్!

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2015)

[email protected]