ట్రంప్ వాచాలత వింటూ వింటే చికాకేస్తుంది కానీ 'గ్లోబల్ సంగతులు పక్కనపెట్టి అమెరికనిజం గురించే ఆలోచిద్దా'మంటూ అతను చెప్పేదానిలో అమెరికా హితం వుందనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండు తిరగబడి, ఒకవేళ అతను అధ్యక్షుడిగా ఎన్నికైనా యితర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అలవాటును అమెరికా చేత అతను మాన్పించగలడన్న ఆశ కలగదు. ఎందుకంటే అమెరికా రాజకీయాలపై ఆయుధ వ్యాపారుల పట్టు అలాటిది. ప్రస్తుతానికి మాత్రం అమెరికా విధానాలకు వ్యతిరేకంగా నోరు విప్పుతున్నాడనే సంగతి మనం గుర్తించి హర్షించాలి.
ఆగస్టు మొదటివారంలో అమెరికా సౌదీ అరేబియాకు 1.15 బిలియన్ డాలర్ల ఆయుధాలు అమ్మబోతున్నామని ఒబామా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా సౌదీకి ఆయుధాలు అమ్మడంలో వింతేమీ లేదు. అమెరికా ఆయుధాల ఎగుమతుల్లో 10% సౌదీకే వెళతాయి. దాని అనుయాయులైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి 9% వెళతాయి. 2015లో అమెరికా వాళ్లకు 20 బిలియన్ డాలర్ల ఆయుధాలు అమ్మింది. 2015 సెప్టెంబరులో వారితో కుదుర్చుకున్న 60 బిలియన్ డాలర్ల ఆయుధ ఒప్పందం గురించి అమెరికా ప్రకటించింది. అలాటప్పుడు ఆగస్టు నెల అమ్మకాల గురించి ప్రస్తావన ఎందుకు అంటే అది యెమెన్‌లో శాంతి చర్చలు విఫలమై, మూణ్నెళ్ల యుద్ధవిరామం తర్వాత సౌదీ యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించింది కాబట్టి, యెమెన్‌పై యుద్ధంలో సౌదీ అనేక రకాల మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐక్యరాజ్యసమితి నెత్తీనోరు కొట్టుకుని చెపుతోంది కాబట్టి. ప్రపంచంలో ఎక్కడ ఏ ఉల్లంఘన జరిగినా కర్ర పట్టుకుని పెద్దన్నలా తయారయ్యే అమెరికా సౌదీ విషయంలో దానికి మద్దతుదారుగా, ఓ రకంగా భాగస్వామిగా ఎందుకు తయారైందంటే దానికో నేపథ్యం వుంది.
యెమెన్ సౌదీ అరేబియాకు పక్కనే వుంది. ఇంచుమించు పెరట్లోనే వున్న ఆ దేశంలో తమ మాటకు వత్తాసు పలికే పాలకులే వుండాలని సౌదీ పట్టుదల. యెమెన్ ఉత్తర, దక్షిణ భాగాలు రెండూ 1990లో కలిసిపోయి, ఉత్తర యెమెన్‌కు అధ్యక్షుడిగా వున్న ఆలీ అబ్దుల్లా సలే అధ్యక్షుడయ్యాడు. అమెరికా ఇరాక్‌లోని సద్దాం హుస్సేన్‌కు వ్యతిరేకంగా సౌదీ నాయకత్వంలో అరబ్బు దేశాలను కూడగట్టినపుడు అతను ఆ కూటమిలో చేరడానికి ఒప్పుకోలేదు. దాంతో అతని మెడలు వంచడానికి సౌదీ తన దేశంలో పని చేస్తున్న పది లక్షల మంది యెమెన్ పౌరులను బహిష్కరించింది. వారు నెలానెలా యింటికి పంపే 350 మిలియన్ డాలర్ల డబ్బు యెమెన్ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం. అది పోయింది. పైగా సౌదీ ఆర్థికసాయం నిలిపేసింది. ఏం చేసినా సరే లొంగలేదు. పదేళ్లు పోయాక సౌదీతో రాజీ కుదిరింది. మొత్తం మీద అతను 23 ఏళ్ల పాటు పాలించాడు.
కొంతకాలానికి అతనికి వ్యతిరేకంగా హౌతీ జాతివారు హుస్సేన్ హౌతీ నాయకత్వంలో తిరగబడ్డారు. సలే సైన్యం హుస్సేన్‌ను 2004లో చంపివేయడంతో అతని స్థానంలో అబ్దుల్ మాలిక్ హౌతీ నాయకుడిగా వచ్చాడు. హౌతీలు 2011లో సలే నివాసంపై దాడి చేసి అతన్ని గాయపరచారు. సలే చికిత్స చేయించుకోవడానికి అమెరికా వెళుతూ ఉపాధ్యక్షుడైన మన్సూర్ హాదీని తన స్థానంలో కూర్చోబెట్టి వెళ్లాడు. అందుకు ప్రత్యుపకారంగా అతను పార్లమెంటు చేత సలే చర్యలపై ఎటువంటి విచారణ జరగకూడదని చట్టం చేశాడు. 2012 నుంచి రెండేళ్ల పాటు అధ్యక్షుడిగా తనను తానే ఎన్నిక చేసుకున్నాడు. ఇతనికి కూడా సౌదీ మద్దతు యిస్తూ పోయింది. హౌతీలు అతని పాలనను కూడా ఎదిరిస్తూ వచ్చారు. వారికి ఇరాన్ వెనక్కాల నుండి మద్దతు యిస్తూ వచ్చింది. 2014-15లో హౌతీలు తిరుగుబాటు చేయడంతో 2015 జనవరిలో హాదీ రాజీనామా చేసి, హౌతీలు అతన్ని గృహనిర్బంధంలో వుంచారు. నెల్లాళ్లు పోయాక అతను తప్పించుకుని తన స్వస్థలమైన ఏడెన్‌కు పారిపోయి రాజీనామాను ఉపసంహరించుకున్నాడు. హౌతీ పాలనను తృణీకరించాడు. హౌతీలు ఏడెన్‌కు వెళ్లి అతన్ని పట్టుకోబోవడంతో అతను సౌదీ అరేబియాలోని రియాద్‌కు వచ్చి తలదాచుకున్నాడు.
ఇక అప్పణ్నుంచి సౌదీ అతన్ని మళ్లీ ఎలాగైనా గద్దెపై కూర్చోబెట్టాలనే తపనతో హౌతీల పాలనలో వున్న యెమెన్‌పై దాడులు చేయసాగింది. మాజీ అధ్యక్షుడు సలేకు విధేయంగా వుండే సైనికవర్గాలు హౌతీలతో చేతులు కలిపి సౌదీని ఎదిరిస్తున్నాయి. ఈ సందట్లోనే అల్ కైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా (ఎక్యూఎపి), ఐసిస్ కూడా చొరబడ్డాయి. దానితో ఉత్తర యెమెన్‌లో అరాచకం ఏలుతోంది. సౌదీ అరేబియా తను దిగడమే కాక, యుఎఇ, బెహరైన్, ఈజిప్టు, సుడాన్, మొరాక్, కువాయిత్‌లను కలుపుకుని దాడి చేయసాగింది. వీళ్లకు అమెరికా, యూరోప్ దేశాలైన యుకె, ఫ్రాన్సు మద్దతు పలుకుతున్నాయి. ఈ మద్దతుకు ఎవరి కారణాలు వారి కున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఇరాన్ తన ప్రాబల్యం పెంచుకుంటోందని సౌదీకి కోపం. సౌదీలో ఇస్లాంలోని సున్నీ శాఖకు చెందిన వహాబిజం అమల్లో వుంది. ఇరాన్, ఇరాక్, బెహరైన్‌లలో షియా శాఖ ముస్లిములు మెజారిటీలో వున్నారు. యెమెన్‌లో సైతం మెజారిటీలో వున్నారని కొందరంటారు. ఇరాక్‌లో యిప్పటికే షియా పాలన వచ్చేసింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా వుంది. అందువలన వీరంతా ఏకమై తమ పెరట్లో వున్న యెమెన్‌ను ఆక్రమించి తమకు పక్కలో బల్లెంగా తయారవుతారని సౌదీకి అనుమానం. ఇరాన్ ఎదగకుండా దానిపై ఆర్థిక ఆంక్షలు కొనసాగుతూ వుండాలని దాని ఆకాంక్ష. అయితే ఆంక్షలు ఎత్తివేయడమే కాక, ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకోవడంతో సౌదీ అమెరికాపై ఆగ్రహించింది. వారి బంధం యీనాటిది కాదు. సౌదీ రాజు అబ్దుల్ అజీజ్‌తో 1945లో రూజ్వెల్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు – 'రాజుగా వుండడానికి మీకు సాయం చేస్తాం, మేం అడిగినంత ఆయిలు యివ్వండి' అని. ఇటీవలి కాలంలో అమెరికాకు సౌదీ నుంచి ఆయిల్ అవసరం తగ్గినా ఆయుధాలు అమ్ముకునే అవసరం మాత్రం పెరుగుతూ వచ్చింది. 2010 నుంచి యిప్పటిదాకా 100 బిలియన్ డాలర్ల ఆయుధాలు సౌదీకి అమ్ముకుంది. అందువలన సౌదీ కోపం తగ్గించడానికి 'మీరు యెమెన్‌పై దాడి చేసినా మేం మద్దతిస్తాం' అని ఒబామా అన్నాడు. సౌదీ ఇరాన్‌పై కోపంతో ఇజ్రాయేలుతో కూడా బాంధవ్యం పెట్టుకుంది. ఈ మధ్య సౌదీ పాలక కుటుంబానికి చెందిన వారు ఇజ్రాయేలు అధికారులతో తరచుగా కలుస్తున్నారు. సౌదీ యువరాజు ఇజ్రాయేలు మాజీ రక్షణాధినేతలతో సమావేశమయ్యాడు కూడా. హౌతీలకు ఇరాన్ మద్దతు యిస్తోందని సౌదీ ఆరోపణ. 'మద్దతేమీ లేదు, మేం వారి ప్రభుత్వాన్ని గుర్తించామంతే' అంటోంది ఇరాన్.
సౌదీ, తన మద్దతుదారులతో కలిసి యెమెన్‌పై దాడికి తెగబడగానే అమెరికాతో బాటు బ్రిటన్ కూడా భళా అంటూ వారికి 3.8 బిలియన్ డాలర్ల ఆయుధాలు అమ్ముకుంది. వీరి అండ చూసుకుని సౌదీ, దాని మిత్రదళాలు యెమెన్‌పై బాంబు దాడులకు పాల్పడి సర్వనాశనం చేస్తున్నాయి. ఇప్పటివరకు 6500 మంది పౌరులు చనిపోయారు. సగం మంది విమానదాడుల్లోనే పోయారు. సౌదీలు స్కూళ్లపై, పాఠశాలలపై, ఫ్యాక్టరీలపై, మార్కెట్లపై దాడి చేసి పిల్లలతో సహా పౌరులను చంపేయడం, దానికి అమెరికా సాంకేతిక సహకారం యివ్వడంతో బాటు క్లస్టర్ బాంబులు సమకూర్చడం విమర్శలకు గురవుతోంది. యుద్ధానికి ముందు అమెరికా సాయంతో సౌదీ యెమెన్‌పై ఆర్థిక దిగ్బంధం విధించింది. మానవతా దృక్పథంతో యితరులు పంపిన ఆహారం, దుస్తులు తీసుకుని వస్తున్న ఓడలను కూడా రేవులో లంగరు వేయనివ్వలేదు. యెమెన్‌లోకి ఏది ప్రవేశించాలన్నా సౌదీలు తనిఖీ చేయాల్సిందే. యెమెన్‌లో జరుగుతున్నదాన్ని రిపోర్టు చేద్దామని వెళ్లిన విదేశీ మీడియాను సౌదీ అనుమతించలేదు.
ఇదంతా చూసి నెదర్లాండ్స్ యెమెన్‌లో అన్ని పక్షాల ద్వారా జరుగుతున్న యుద్ధనేరాల గురించి యునైటెడ్ నేషన్స్ చేత విచారణ జరిపించాలని ప్రయత్నించింది. కానీ అమెరికా, బ్రిటన్ మద్దతుతో సౌదీ దాన్ని అడ్డుకోగలిగింది. గత జూన్‌లో యునైటెడ్ నేషన్స్ వారు బాలల హక్కులు హరిస్తున్న దేశాల బ్లాక్ లిస్టు తయారుచేసి దానిలో సౌదీ పేరు చేర్చింది. 'అలా చేరిస్తే మేం మీ సంస్థలకు యిచ్చే విరాళాలను ఆపేస్తాం' అని సౌదీ బెదిరించడంతో లిస్టులోంచి దాని పేరు తీసివేయవలసి వచ్చింది. ఇలాటి ఒత్తిళ్లు యుఎన్‌ఓ జనరల్ సెక్రటరీ బాన్-కి-మూన్‌పై వస్తూనే వున్నాయి. చివరకు ప్రాణం విసిగి 'సౌదీ మాపై ఒత్తిడి చేస్తోంది' అని ఆయన ప్రకటించాడు. చొరవ తీసుకుని కువాయిత్‌లో శాంతి చర్చలు ప్రారంభించాడు. అన్ని పక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి, దాన్ని కొత్తగా నియమించిన తాత్కాలిక అధ్యక్షుడు నడపాలని హౌతీలు ప్రతిపాదించారు. సౌదీలో ప్రవాసంలో వుంటున్న మన్సూర్ హాదీ 'అదేం కుదరదు, నన్ను మళ్లీ అధ్యక్షుణ్ని చేయాలి. హౌతీలు ఆయుధాలు విసర్జించి, ఉత్తర యెమెన్‌కు వెళ్లిపోవాలి' అని పట్టుబట్టాడు. మూణ్నెళ్లపాటు సాగిన చర్చలు చివరకు విఫలమయ్యాయి.
కువాయిత్‌లో చర్చలు సాగుతూండగానే సౌదీలు విమానదాడులు మళ్లీ ప్రారంభించేశారు. యునైటెడ్ నేషన్స్ నిరసిస్తున్నా, అమెరికా, బ్రిటన్‌ల అండ చూసుకుని ఇరాన్‌పై కక్షతో సౌదీ యెమెన్‌పై భీకర యుద్ధం సాగిస్తోంది. వారు ఆక్రమించుకున్న ప్రాంతాల్లో ఎక్యూఎపి, యితర యిస్లామిక్ గ్రూపులు వారిని ఎదిరిస్తున్నాయి. ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో తెలియదు. నిజం చెప్పాలంటే సౌదీ ఆర్థిక పరిస్థితి బాగాలేని యీ తరుణంలో యీ యుద్ధం దానికి పెనుభారం కాబోతోంది. ఏడాదిగా ఆయిలు ధరలు బ్యారెల్ 30-40 డాలర్ల మధ్య తచ్చాడుతోంది. 2015లో సౌదీకి 100 బిలియన్ డాలర్ల లోటు బజెట్. ఈ ఏడాది యింకా పెరుగుతుంది. అయినా పట్టుదలతో పౌరులను, బాలబాలికలను చంపుతూ యెమెన్‌లో యుద్ధం చేస్తోంది. ఇరాక్‌లో మానవహక్కులకు విఘాతం కలిగింది, లిబ్యాలో కలిగింది అంటూ ఆ దేశాల వ్యవహారాల్లో చొరబడే అమెరికా కంటికి యీ ఘోరాలేవీ ఆనటం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)