ఎమ్బీయస్‌ : ఏమిటీ సి-శాట్‌ వివాదం?

సి-శాట్‌ పై ఉత్తర భారతీయులు విరుచుకు పడుతున్న తీరు మొత్తం సమస్యను గందరగోళ పరిచింది. అటూయిటూ తిప్పి దీన్ని హిందీ భాషీయుల పట్ల జరుగుతున్న అన్యాయంగా మలిచారు. ప్రస్తుతం అధికారంలో వున్న ఎన్‌డిఏ ప్రభుత్వం…

సి-శాట్‌ పై ఉత్తర భారతీయులు విరుచుకు పడుతున్న తీరు మొత్తం సమస్యను గందరగోళ పరిచింది. అటూయిటూ తిప్పి దీన్ని హిందీ భాషీయుల పట్ల జరుగుతున్న అన్యాయంగా మలిచారు. ప్రస్తుతం అధికారంలో వున్న ఎన్‌డిఏ ప్రభుత్వం హిందీ వ్యాప్తికి అనుకూలం కాబట్టి, ఉత్తర భారతంలో విస్తరిద్దామని చూస్తోంది కాబట్టి యిప్పుడే గట్టిగా ఒత్తిడి చేస్తే పట్టణ ప్రాంతాల్లో ఇంగ్లీషు మీడియంలో చదివేవారి ప్రాబల్యం తగ్గించి వారి స్థానంలో తాము వచ్చేయవచ్చని హిందీ భాషీయులు ఆశించి ఆందోళనలు చేస్తున్నారు. బిజెపికి అనుబంధ సంస్థ అయిన ఎబివిపి యీ విషయంలో అగ్రస్థానంలో వుంది. అంతిమంగా ప్రభుత్వం వారు కోరిన మార్పులు చేసేస్తే ఘనతంతా వాళ్లకు పోతుందేమోనన్న భయంతో వామపక్ష విద్యార్థి సంస్థలు, జెడియు, ఆర్‌జెడి, ఎస్పీవంటి ఉత్తరాది రాజకీయపక్షాలు రంగంలోకి దిగి చెడుగుడు ఆడేస్తున్నాయి. వాళ్ల వాదనలో న్యాయం ఎంత వుంది అని తెలుసుకోవాలంటే పరీక్ష నేపథ్యంలోకి వెళ్లాలి.

మేధావితనానికి గుర్తు ఏమిటంటే ఐయేయస్‌కు సెలక్టవడం అని భారతీయ విద్యార్థులందరిలో నాటుకుపోయిన సంగతి. పట్టణ ప్రాంతాలకు చెందిన వారు, అందునా ఇంగ్లీషు మీడియంలో చదివినవారే యీ క్యాడర్‌లో విజయం సాధిస్తున్నారన్న బాధ తక్కినవారిలో వుంది. అందువలన హిందీకి కూడా ఇంగ్లీషుతో బాటు సమాన స్థాయి కల్పించాలని ఆందోళన చేసి సాధించారు. పోనుపోను సెలక్టయిన అభ్యర్థులలో నాణ్యత అంత గొప్పగా వుండటం లేదని భావించిన ప్రభుత్వం యుపిఎస్‌సిలో (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌) సంస్కరణలకై 2001లో యోగీందర్‌ అలఘ్‌ కమిటీ వేసింది. అప్పట్లో ఐయేయస్‌ ఎంట్రన్సు టెస్టులో జనరల్‌ స్టడీస్‌పై ఒక పేపరు వుండేది. ఇంకో పరీక్షకు 23 ఆప్షనల్‌ సబ్జక్ట్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అది విద్యార్థి డిగ్రీ సంపాదించిన సబ్జక్ట్‌ అయివుండాల్సిన పని లేదు. కమిటీవాళ్లు గమనించినదేమిటంటే విద్యార్థులు తాము అప్పటిదాకా చదివిన సబ్జక్టు కాకుండా మార్కులు ఎక్కువ వచ్చే సబ్జక్టులు తీసుకుంటున్నారు. 

ఇంటర్‌లో సంస్కృతం, ఉర్దూ, ఫ్రెంచ్‌ వంటి సబ్జక్టులు తీసుకుంటే మార్కులు ఎక్కువ వస్తాయి, మాతృభాష తెలుగు తీసుకున్నవారికి తక్కువ వస్తాయి. అందుకని అందరూ సంస్కృతం, ఫ్రెంచ్‌ అంటూ ఎగబడతారు. కాలేజీ చదువు తర్వాత మళ్లీ వాటి మొహం చూడరు. ఐయేయస్‌లో కూడా స్కోరింగు ఎక్కువ వచ్చే సబ్జక్టులు తీసుకోని మంచి అభ్యర్థులు వెనకబడిపోతున్నారు. దీన్ని సవరించాలని కమిటీ గుర్తించింది. కమిటీ గమనించిన మరో విషయం ఏమిటంటే చాలామంది సబ్జక్టులను బట్టీపట్టి రాసేసి మార్కులు తెచ్చుకుంటున్నారు తప్ప వాళ్లలో లాజికల్‌ థింకింగ్‌ (తర్కబద్ధమైన ఆలోచనా విధానం) లోపిస్తోంది. బ్యాంకు క్లర్కు పోస్టుకి కూడా ఎనలిటికల్‌, లాజికల్‌ థింకింగ్‌పై, కాంప్రెహెన్షన్‌పై పేపరు వుంటోంది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఎంట్రన్సు పరీక్ష అయిన క్యాట్‌లో కూడా యీ సబ్జక్టులపై పేపర్లు వుంటున్నాయి. మరి ఎడ్మినిస్ట్రేషన్‌ అంటే మేనేజ్‌మెంటే కదా, అప్పటికప్పుడు తలెత్తే సమస్యలను కలక్టరు హోదాలో వున్న వ్యక్తి బుద్ధికుశలతతో పరిష్కరించ లేకపోతే ఎలా? అందువలన సివిల్‌ సర్వీసెస్‌ ఎంట్రన్సు పరీక్షలో కూడా యీ పేపరు పెట్టాలి అని కమిటీ సూచించింది.

2008 లో ఏర్పడిన రెండవ ఎడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్‌స్‌ కమిషన్‌ కమిటీ సిఫార్సులను ఆమోదించి పరీక్షల విధానాన్ని మార్చమంది. అప్పుడు యుపిఎస్‌సి వారు ఖన్నా కమిటీ అని వేసి దాని సూచనల మేరకు 2011లో సి-శాట్‌ (సివిల్‌ సర్వీసెస్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌) ప్రవేశపెట్టారు. దీని ప్రకారం రెండు కంపల్సరీ పేపర్లు రాయాలి. మొదటి పేపరు జనరల్‌ స్టడీస్‌పై వుంటుంది. రెండో పేపరులోనే మార్పులు చేశారు. ఇది కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, లాజికల్‌ రీజనింగ్‌, ఎనలిటికిల్‌ ఎబిలిటీ, డెసిజన్‌ మేకింగ్‌, ప్రాబ్లెమ్‌ సాల్వింగ్‌, జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ, డాటా యింటర్‌ప్రెటేషన్‌, ఇంగ్లీష్‌ కాంప్రెహెన్షన్‌ – లకు సంబంధించిన ప్రశ్నలతో వుంటుంది. ఈ పరీక్షా విధానం సబ్జక్టు ఎంత బాగా బట్టీపట్టాడు అన్నదాని కంటె దాని సారాన్ని ఎంత బాగా వంటబట్టించుకున్నాడు, అవగాహన చేసుకుని, విశ్లేషించి, దాన్ని నిజజీవితానికి ఎలా అప్లయి చేయగలడు అనేది తేలుస్తుంది. 40 ప్రశ్నలుంటాయి. అవి ఇంగ్లీషు, హిందీలలో వుంటాయి. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో సమాధానాలు రాయవచ్చు. 'ఈ పద్ధతి వలన సైన్సు, ఇంజనీరింగ్‌ నేపథ్యం వున్న విద్యార్థులకు మేలు కలుగుతుంది. మా బోటి ఆర్ట్‌స్‌, హ్యుమానిటీస్‌ చదివినవారికి నష్టం కలుగుతుంది' అంటూ ఆర్ట్‌స్‌ విద్యార్థులు గొడవ చేశారు. నిజంగా జరిగినది అదే! 2010లో 28-30% మంది ఆర్ట్‌స్‌ విద్యార్థులు విజయం సాధిస్తే ఇంజనీరింగ్‌ వాళ్ల శాతం కూడా అంతే వుంది. 2011లో సి-శాట్‌ ప్రవేశపెట్టాక  చూస్తే పరీక్షకు వెళ్లిన ఆర్ట్‌స్‌ విద్యార్థులలో 15% మంది విజయం సాధిస్తే, 50% మంది సైన్సు/ఇంజనీరింగు విద్యార్థులు విజయం సాధించారు. (ఇక్కడో విషయం గమనించాలి, ఆర్ట్‌స్‌ చదివే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మన రాష్ట్రాలలో అయితే వాళ్లని వెతికి వల వేసి పట్టుకోవాలి) 

అంతేకాదు, గ్రామీణ ప్రాంతాలలో మాతృభాష మీడియంలో చదివి, పాఠాలు బట్టీపట్టి పాస్‌ అవుతూ వచ్చిన విద్యార్థులు కూడా కొత్త విధానంలో నష్టపోయారు. 2010లో హిందీ మీడియం విద్యార్థులు 4156 మంది సెలక్టు కాగా, 2011 నాటికి అది 1682కి పడిపోయింది. తెలుగు మీడియంలో చదివినవారి సంఖ్య 69 నుండి 29కి, తమిళ మీడియం వారి సంఖ్య 38 నుండి 14కి, కన్నడ వారిది 38 నుండి ఏకంగా 5కి పడిపోయింది. దీన్ని సవరించడం ఎలా అని యుపిఏ ప్రభుత్వం అరవింద్‌ వర్మ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేసింది. వారు మార్చిలో రిపోర్టు యివ్వాలి, కానీ యింకా మూణ్నెల్ల గడువు అడిగారు. యీ లోపున ఫిబ్రవరిలో ప్రభుత్వం పరీక్షకు హాజరు కావడానికి యింతకుముందు నాలుగు ఛాన్సులుంటే, యిప్పుడు ఆరు చేస్తున్నాం అని విద్యార్థులను సముదాయించింది. వాళ్లు చల్లబడ్డారు. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక దానిలో ఇంగ్లీషు అర్థం చేసుకోవడం కష్టంగా వుంది, హిందీ అనువాదం సరిగ్గా లేదు, అందుకని మొత్తం ఆ పరీక్షే ఎత్తేయాలని హిందీ ప్రాంతీయులు గొడవ మొదలుపెట్టారు. ఇక్కడ గమనించవలసిన అంశాలు కొన్ని వున్నాయి. పరీక్షలో ప్రశ్నలు ఇంగ్లీషు, హిందీలలో వున్నాయి. హిందీ వాళ్లు డైరక్టుగా తమ మాతృభాషలో ప్రశ్న చదివి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. హిందీ మాతృభాష కాని తెలుగు విద్యార్థుల లాటివాళ్లకు రెండూ పరాయి భాషలే. ఇంగ్లీషులో చదివి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కదా, ఆ మేరకు వాళ్లకు నష్టమే కదా. అది హిందీవాళ్లు గుర్తించడం లేదు. 

ఇక హిందీ అనువాదం గురించి – వాళ్లు చేస్తున్న ఆరోపణలు సరైనవే. యుపిఎస్‌సి వాళ్లు గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ ఉపయోగించి అనువాదం చేసేస్తున్నారు. మన తెలుగు యాడ్స్‌ను బొంబాయిలో అనువదించి పంపుతుంటారు. అవెంత ఘోరంగా వుంటాయో యివీ అంతే ఘోరంగా వుంటాయి. ఐరన్‌ ప్లాంట్‌ అని ఇంగ్లీషులో ప్రశ్న వుంటే దాన్ని లోహే కా పౌధా అని అనువదించింది. ప్లాంట్‌ అంటే ఫ్యాక్టరీలో వుండే యంత్రసముదాయం, మొక్క అని కూడా అర్థం వుంది. గూగుల్‌ మొక్క అనే అర్థంలో పౌధా అని యిచ్చింది. అధికారులు గుడ్డిగా అదే హిందీ ప్రశ్నల్లో పెట్టేశారు. అలాగే నార్త్‌ పోల్‌ అనే మాటకు ఉత్తరీ ఖంభా (స్తంభం) అని గూగుల్‌ యిస్తే ఉత్తర ధృవం అని మార్చకుండా అలాగే వుంచేశారు. ఇలాటి తప్పులు సవరించాలని ఆందోళన చేస్తే బాగుండేది. అలా కాకుండా యీ వంకతో అసలుకే ఎసరు పెడదామని వీళ్ల యత్నం. ఈ ప్రశ్నల్లో ఒక 8 ప్రశ్నలకు హిందీ అనువాదం యివ్వటం లేదు. అవి ఇంగ్లీషులో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. వాటికి 20 మార్కులు. అవి కూడా అర్థం కాకపోతే కాండిడేటు వేస్టు అన్నమాట. హిందీ విద్యార్థులు తమకు అన్యాయం జరుగుతోంది అని గోల చేయగానే కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ ఆ 8 ప్రశ్నలు తీసేస్తాం అన్నారు. 'ఏడిసినట్టుంది, అవి చాలా సులభమైనవి, 'వి వాంట్‌ జస్టిస్‌' అనే అరిచే కుర్రాళ్లు ఆ పాటి ఇంగ్లీషు అర్థం చేసుకోలేరా?' అంటున్నాయి విద్యార్థులకు ట్రెయినింగ్‌ యిచ్చే సంస్థలు. వారి ప్రయత్నం – మొత్తం సి-శాట్‌ ఎత్తేయించాలని! ఈ ఆగస్టు 24 న పరీక్ష జరగకుండా చూడాలని!

సి-శాట్‌ పెట్టిన తర్వాత ఫిల్టరింగ్‌ బాగానే జరుగుతోంది. ఈ పరీక్షలో మార్కులు స్కోరింగ్‌లో లెక్కకు రావు. కానీ యిది పాస్‌ అయితే తప్ప తక్కిన పేపర్లు దిద్దరు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్‌ తర్వాతి ఘట్టంలో కంపల్సరీ ఇంగ్లీషు పేపరు వుంది. సి-శాట్‌ పెట్టడానికి ముందు (2010) ప్రాథమిక పరీక్షలో పాసయి కంపల్సరీ ఇంగ్లీషు పరీక్షలో  తప్పినవారు 819 వుండగా, 2011లో సి-శాట్‌ పెట్టాక అది 351కు తగ్గింది. అసలు ఐయేయస్‌ ప్రాథమిక పరీక్షలకు వెళ్లేవాళ్లు ఎందరు? 2011లో 5 లక్షల మంది అప్లయి చేశారు, సాధారణంగా సగం మందే పరీక్షకు హాజరవుతారు. మొత్తం మీద 12 వేల మంది పాసయ్యారు. 2 వేల మంది ఇంటర్వ్యూకు సెలక్టయ్యారు. ఫైనల్‌గా 920 మందిని తీసుకుని ఐయేయస్‌, ఐపియస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐఆర్‌ఎస్‌.. యిత్యాది సర్వీసుల్లో పోస్టు చేశారు. ఈ సారి 8 లక్షల మంది అప్లయి చేశారు. వీళ్ల భవిష్యత్తు ఎలా వుంటుందో చూడాలి. ఇంగ్లీషు మీడియంలో చదివిన వారు ఎక్కువగా సెలక్టు అవుతున్నారా? అంటే ఔననే చెప్పాలి. 2008లో మొత్తం కాండిడేట్లలో వారి శాతం 52 వంటే 2009లో 55, 2010లో 62 అయింది. 2011లో కొత్త పరీక్ష పెట్టాక అది 83 అయింది, 2012లో కూడా 82 వుంది. ఈ కారణంగా ఇంగ్లీషును తీసిపారేయాలనడం, తగ్గించి పారేయాలనడం తప్పు. 

ఏ మీడియంలో చదివినా సబ్జక్టుపై అవగాహన పెంచుకోవడం అవసరం. పట్టణాల్లో చదివినా, గ్రామాల్లో చదివినా బట్టీ పట్టడం మానేసి లాజికల్‌ థింకింగ్‌ అలవాటు చేసుకోవాలి. మామూలు ఇంజనీరింగు వాళ్లకు, ఐఐటీకి వెళ్లేవాళ్లకు యిదే తేడా కనబడుతుంది. సివిల్‌ సర్వీసెస్‌లకు వెళ్లేవాళ్లకు విషయగ్రహణ శక్తి అమితంగా వుండాలి. వాళ్లను ఒక శాఖ నుండి మరో శాఖకు తరచుగా బదిలీ చేసేస్తూంటారు. కొత్తదాన్ని త్వరగా, సులువుగా అవగాహన చేసుకుని సజావుగా పాలించే శక్తి వుండాలి. ఒక ఐఐటికి, ఒక ఐఐఎమ్‌కు సెలక్టయ్యే విద్యార్థికి వుండవలసిన తెలివితేటలు ఐయేయస్‌కు అక్కరలేదని వాదించడం మూర్ఖత్వం. గతంలో మన రాజకీయనాయకులు స్వతహాగా మేధావులు, విద్యావంతులు అయి వుండేవారు. ఇప్పుడు మరీ నాసిరకం తయారవుతోంది. పార్లమెంటులో వాళ్ల చర్చలు (..సారీ రచ్చలు) చూస్తేనే వారి క్వాలిటీ తెలుస్తోంది. కనీసం అధికారగణమైనా తెలివితేటలున్నవారు వుండకపోతే మన దేశం గతి అధోగతే. గ్రామంలో చదివినా, తమిళంలో చదివినా కలాం గారి మేధస్సుకు లోటు వచ్చిందా? అయినా ఇంగ్లీషు మీడియంలో చదివిన వారందరూ ఐయేయస్‌ స్థాయికి ఎదుగుతున్నారా? వారిలో కొందరు మాత్రమే తమ తెలివితేటలతో సెలక్టవుతున్నారు. వారిని చూపించి, మాకు అన్యాయం జరుగుతోంది, ఆ పరీక్ష ఎత్తేయండి అనడం పొరబాటు. ఆ పాటి ఇంగ్లీషు కూడా రాకుండా మీరు వేరే రాష్ట్రాలలో ఎలా పని చేస్తారు? అని అడిగితే యీ ఆందోళనకారులు 'ఓ పంజాబీని బెంగాల్‌లో వేసినపుడు స్థానిక భాష నేర్చుకోవడానికి ఆర్నెల్లు టైము యిస్తారు కదా, అలాగే మేం కూడా ఉద్యోగం వచ్చాక ఆర్నెల్లలో యింగ్లీషు నేర్చుకుంటున్నాం' అంటున్నారు. ఆ పంజాబీ వాడికి బెంగాల్‌లో వేస్తారో, కేరళలో వేస్తారో ముందుగా తెలియదు కాబట్టి  యిప్పుడు నేర్చుకోవటం లేదు. వీళ్లకైతే ఎక్కడ వేసినా ఇంగ్లీషు అత్యవసరం అని తెలుసుగా. అందువలన ఆ  నేర్చుకునే అఘోరింపేదో యిప్పుడే, పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడే ఏడవ్వచ్చుగా! 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2014)

[email protected]