రెండు రోజుల తర్వాత –
జిమ్‌కు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. సంగతేమిటని కనుక్కుంటే తెలిసింది – అమెరికాకు, బ్రిటన్‌కు అతి పెద్ద వాణిజ్య బంధం కుదురుతున్న ఏరోస్పేస్ ప్రకటన వెలువడుతున్న సమయంలో అమెరికాను నిందిస్తూ జిమ్ చేసిన ప్రకటన చూసి ప్రధాని మండిపడుతున్నాడు. ఆ విషయం హంఫ్రీ చెప్పగానే జిమ్ వణికాడు. ''నా ప్రకటన కరెక్టే కానీ టైమింగ్ రాంగ్. ఈ ఏరోస్పేస్ ఒప్పందం చర్చ జరుగుతోందని నాతో ఎవరూ చెప్పలేదు. ప్రతిపక్షంలో వుండగా ఉమ్మడి బాధ్యత గురించి ఉపన్యాసాలు యిచ్చిన మా నాయకులే నాకు ఏమీ చెప్పకుండా చీకట్లో వుంచేశారు.'' అని తల పట్టుకున్నాడు.
''ప్రధాని కార్యాలయం నన్ను పిలిచి రద్దు గురించి, ఉపన్యాసం గురించి వాళ్ల ముందస్తు అనుమతి ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు.''
''నువ్వేం చెప్పావ్?''
''పాలనలో పారదర్శకత సిద్ధాంతాన్ని వివరించి చెప్పాను. దాని వలన వాళ్లకు మరింత కోపం వచ్చింది. ప్రధాని మీతో మాట్లాడతారట.''
''ఏం జరుగుతుందంటావు?'' జిమ్ అడిగాడు భయంగా.
''పెట్టే చెయ్యే కొట్టగలదు. మంత్రి పదవి యిచ్చినది ప్రధానే, తీసుకోగలిగినదీ ఆయనే..'' అని తేల్చాడు హంఫ్రీ.
నేనూ, హంఫ్రీ, ఫ్రాంక్ వెళ్లి ప్రధాని కార్యాలయం బయట కూర్చున్నాం.
అక్కడికి చీఫ్ విప్ వచ్చాడు. అతనిదంతా మోటు వ్యవహారం. జిమ్‌ను చూస్తూనే ''గొప్ప తలనొప్పి తెచ్చిపెట్టావయ్యా, ప్రైమ్ మినిస్టర్ పెనం మీద పేలగింజలా ఎగిరిపడుతున్నాడు. అలాటి స్పీచి యివ్వడానికి మతి పోయిందా?'' అని కేకలు వేశాడు.
''మనది పారదర్శక ప్రభుత్వం'' అన్నాడు ఫ్రాంక్.
''నువ్వు నోర్ముయ్.'' అంటూ అతన్ని కసిరి, జిమ్‌తో ''మానిఫెస్టోలో వుంది కదాని ఏది పడితే అది మాట్లాడడమేనా? కాస్త లౌక్యం వుండద్దా? అవునూ, నువ్వు మంత్రి పదవి ఆయుర్దాయం ఎంత? వారంన్నరా? బాగుంది, గిన్నెస్ బుక్‌లోకి ఎక్కుతావులే. రేపు పేపర్లో హెడ్‌లైన్సు ఎలా వుంటాయో వూహించగలను. 'అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కాబినెట్లో నిట్టనిలువునా చీలిక. ప్రధానికి వ్యతిరేకంగా జిమ్ నేతృత్వంలో తిరుగుబాటు!'' అంటూ చేతులు తిప్పుతూ వెళ్లిపోయాడు.
జిమ్‌కు మతిపోయింది. పదవి వూడడం ఖాయం అని అర్థమై పోయింది. అంతలో ఆర్నాల్డ్ వచ్చాడు. హంఫ్రీ కేసి చూసి ''మీ మంత్రిగారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎటువంటి యిరకాటంలో పెట్టావ్, మీ మంత్రే కాదు, మొత్తం కాబినెట్ అప్రదిష్ట పాలవుతోంది.'' అని చివాట్లేశాడు.
హంఫ్రీ జిమ్ కేసి ఓ చూపు పడేసి ''మా మంత్రిగారు, ఆయన కింద పనిచేస్తున్న మా అధికారగణం అంతా పారదర్శక ప్రభుత్వానికి కట్టుబడి వున్నాం. ఇన్నాళ్ల దాకా మూసి వున్న కిటికీ తలుపులు తెరిచి కొత్తగాలిని లోపలకి రానిస్తున్నాం.'' అన్నాడు. జిమ్‌ను అనుకరిస్తూ.
జిమ్ తల వూపాడు కానీ నోరెత్తలేకపోయాడు. ఆర్నాల్డ్ జమ్ కేసి తిరిగి ''మంత్రిగారూ, పార్టీ వేదికల మీద యిదంతా వినడానికి బాగానే వుంటుంది. కానీ ప్రధానిని బాగానే యిరికించారు.''
ఏదో ఒకటి మాట్లాడకపోతే లాభం లేదనిపించింది జిమ్‌కు. ''పారదర్శక ప్రభుత్వ సిద్ధాంతం పట్ల మా అంకితభావం మాటేమిటి..'' అన్నాడు నోరు పెగల్చుకుని.
''ఆ అంకితభావం అంకం యింకా వచ్చినట్లు లేదు. ఇప్పటిదాకా మొదటి అంకమే ప్రారంభం కాలేదు. అప్పుడే తెర పడేట్లు వుంది.'' అనేసి ఆర్నాల్డ్ వెళ్లిపోయాడు.
హంఫ్రీ జిమ్ కేసి తిరిగి ''సర్ ఎందుకైనా మంచిది రాజీనామా పత్రం తయారుచేసి పట్టుకు రమ్మంటారా? మాటామాటా వస్తే మీరు చటుక్కున ప్రధాని బల్ల మీద పెట్టేయవచ్చు'' అన్నాడు.
జిమ్‌కు ఏడుపొక్కటే తరువాయి. ''ఇదంతా పైకి రాకుండా మనం కప్పిపుచ్చేయలేమా?'' అని అడిగాడు లోగొంతుతో.
అనరాని, వినరాని మాట విన్నట్టుగా హంఫ్రీ ఆశ్చర్యం ప్రదర్శించాడు. ''మీరు!? కప్పిపుచ్చడం గురించి మాట్లాడుతున్నారా!!? సమాచారం బయటకు రాకుండా తొక్కి పెట్టేయమంటున్నారా!!!?''
''అన్ని మాటలు ఎందుకులే, కానీ భావం అయితే అదే..'' అని జిమ్ అన్నాడు ఆముదం తాగిన మొహం పెట్టి.
''..అంటే పాలనలో పారదర్శకత అనే మన సిద్ధాంతానికి కట్టుబడి వుంటూనే సందర్భం బట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాస్త వెసులుబాటు కల్పించుకోవాలి – అంటారు.'' అన్నాడు హంఫ్రీ గంభీరంగా.
''అదే, అదే, నేను చెప్పదలచినదీ అదే.'' అన్నాడు జిమ్.
ఇంతలో బెర్నార్డ్ పరిగెట్టుకుని వచ్చాడు. ''సర్, ప్రెస్ రిలీజు విషయంలో మన నూతన విధానం అమలులో వైఫల్యం నా దృష్టికి వచ్చింది..'' అంటూ మొదలెట్టాడు. జిమ్ ఆదుర్దాగా ఏమైందేమైందన్నాడు. ఏదైనా ప్రకటన మీడియాకు పంపేముందు క్లియరెన్సు తెచ్చుకోవాలి అనే నిబంధన ఎప్పటినుంచో వుంది. ఆ నిబంధన తొలగిస్తానని హంఫ్రీ మాట యిచ్చాడు కానీ మర్చిపోయాడట. అందువలన పాత అలవాటు ప్రకారం డిపార్టుమెంటులో యితర అధికారులు మంత్రిగారి ప్రకటనను ప్రెస్‌కు రిలీజు చేయలేదు.
ఇది వింటూనే జిమ్ మొహం యింతైంది. అమ్మయ్య, విషయం మీడియా దాకా వెళ్లలేదు. తన పదవికి గండం లేదు. ప్రధానికి ఏదో చెప్పుకుని బతిమాలుకోవచ్చు.
కానీ హంఫ్రీ క్షమాపణలు చెప్పసాగాడు. ''మంత్రిగారూ, తప్పంతా నాదే. మీ పారదర్శకప్రభుత్వ సిద్ధాంతాన్ని అమలు చేస్తానని మాట యిచ్చి మాట నిలబెట్టుకోలేకపోయాను. ఆ నిబంధన ఎత్తివేయనందుకు నన్ను మన్నించాలి.'' అని.
ఏదో ఔదార్యం ప్రదర్శిస్తున్నట్లు జిమ్ ''ఓకేఓకే హంఫ్రీ, మనమంతా తప్పులు చేస్తాం. వదిలేయ్.'' అన్నాడు.
''ఎస్, మినిస్టర్'' అన్నాడు హంఫ్రీ వినయం ఒలకబోస్తూ.
*********
ఈ ఎపిసోడ్‌ను యింత విపులంగా చెప్పడానికి కారణం – పాలనలో పారదర్శకత అనేది మన దగ్గర కూడా తరచుగా వినబడే పదం. కానీ ఆదర్శాలను అమలులోకి తేవడం ఎంత కష్టమో దీనిలో చూపించారు. ఏదైనా చేద్దామంటే దానికి మరి దేనితోనో లింకు వుంటుంది. అధికారంలోకి రాగానే మన దగ్గర కూడా మంత్రులు నిరాడంబరంగా వుంటామని, ప్రజలకు అందుబాటులో వుంటామని, అన్ని విషయాలను ప్రజలకు చెప్పే చేస్తామనీ, అవినీతిని సహించమనీ ప్రకటిస్తారు. కానీ నిజంగా వాటిని ఆచరణలో పెట్టాలనుకున్నా పెట్టలేరు. ఉత్సాహం వురకలు వేసే కొత్త బిచ్చగాడిలా వున్న మంత్రిని రొటీన్ పద్ధతికి తేవడానికి అధికారులు తమ ట్రిక్కులు వుపయోగించి, ముకుతాడు వేస్తారు. దీనిలో ఏరోస్పేస్ డీల్ గురించి హంఫ్రీకి ముందు తెలిసినా మంత్రికి చెప్పడు. మంత్రిని ఎగదోయడానికి కంప్యూటర్ టెర్మినల్ బిల్లు అతనికి అందేట్టు చేశాడు. అది కూడా ఏదో పెద్ద ఘోరం జరిగిపోతూంటే తను వలవేసి పట్టుకున్నట్టు అతనికి అనిపించేట్టు సీను క్రియేట్ చేశాడు. అతను ఆర్డర్ ఆపడంతో సరిపెట్టబోతే స్టేటుమెంటు రూపంలో యిచ్చే ఐడియాను సటిల్‌గా తనే అతని మెదడులో ప్రవేశపెట్టాడు. దాని కారణంగా కొంప మునిగే పరిస్థితి వచ్చాక తనే చక్రం వేసి కాపాడాడు. అది కూడా తన వలన జరిగిన పొరపాటుగా చిత్రీకరించి మంత్రి అహాన్ని కాపాడాడు. పారదర్శకత పనికి రాదని మంత్రికి పాఠం నేర్పాడు. ఆ మాట కూడా పచ్చిగా అననీయకుండా, అంతా కలిసి కుట్ర పన్నినట్లు కాకుండా, దేశాన్ని ఉద్ధరించడానికి అన్నట్లు, రిఫైన్డ్ భాషలో ఏదో పెద్ద సిద్ధాంతం ప్రవచించినట్లు చెప్పాడు. అధికారుల పరిభాష (జార్గన్) ఎలా వుంటుందో రుచి చూపించాడు. ఈ ధోరణి అర్థమైతే తర్వాతి కథలు క్లుప్తంగానే చెప్పుకున్నా మీకు హంఫ్రీ, యితర అధికారగణం మేధస్సు (కుటిలత్వం అనవచ్చు కానీ మనమూ వాళ్ల పరిభాష ఉపయోగించాలిగా) మంత్రిని లొంగదీసుకునే విధానాల్లో స్వారస్యం బోధపడుతుంది. (రెండో కథ సమాప్తం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2016)