ఎమ్బీయస్‌ : పాకిస్తాన్‌-తాలిబన్‌ లింకు

తాలిబన్లను పాకిస్తాన్‌ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని, మన దేశంలో ఉగ్రవాద చర్యలకు ఐఎస్‌ఐయే కారణమని అందరికీ తెలుసు కానీ వాటికి ఆధారాలు దొరకడం కష్టం. తన పాత్రికేయ వృత్తి రీత్యా ఆ ఆధారాలు సంపాదించిన…

తాలిబన్లను పాకిస్తాన్‌ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని, మన దేశంలో ఉగ్రవాద చర్యలకు ఐఎస్‌ఐయే కారణమని అందరికీ తెలుసు కానీ వాటికి ఆధారాలు దొరకడం కష్టం. తన పాత్రికేయ వృత్తి రీత్యా ఆ ఆధారాలు సంపాదించిన కార్లోటా గాల్‌ అనే ''న్యూయార్క్‌ టైమ్స్‌'' కరస్పాండెంట్‌ రాసిన ''ద రాంగ్‌ ఎనిమీ'' అనే పుస్తకం యిప్పుడు మార్కెట్లోకి వచ్చింది. 9/11 దాడి తర్వాత ''న్యూయార్క్‌ టైమ్స్‌'' వారు ఆమెను ఆఫ్గనిస్తాన్‌కి పంపించి ఆ దాడుల వెనక తాలిబన్లు, ఆల్‌ కైదా పాత్ర గురించి పరిశోధించమన్నారు. అప్పటినుండి 12 ఏళ్లపాటు ఆమె అఫ్గనిస్తాన్‌లోనే వుండిపోయి, అక్కడ అమెరికన్లు చేసిన విధానపరమైన లోపాల గురించి కథనాలు పంపుతూ వచ్చింది. తమపై దాడి తర్వాత అమెరికా అఫ్గనిస్తాన్‌పై విరుచుకుపడి తాలిబన్లను నాశనం చేసిన సంగతి అందరికీ తెలుసు. తాలిబన్లు నిర్మూలించబడినందుకు, అమెరికా సహాయంతో హమీద్‌ కర్జాయ్‌ ప్రభుత్వం ఏర్పడినందుకు అఫ్గనిస్తాన్‌ ప్రజలు ఎంతో సంతోషించారని ఆమె రాసింది. కానీ అది ఎక్కువకాలం నిలవలేదు. అఫ్గనిస్తాన్‌ను పరోక్షంగా తమ అధీనంలోకి తెచ్చుకోవడానికై  మళ్లీ తాలిబన్ల ప్రభుత్వం ఏర్పరచాలని పథకం వేసిన పాకిస్తాన్‌ ప్రధాని పర్వేజ్‌ ముషారఫ్‌, అతని యింటెలిజెన్సు చీఫ్‌ అష్ఫాక్‌ పర్వేజ్‌ కయానీ తాలిబన్లకు పాకిస్తాన్‌ పర్వతప్రాంతాల్లో ఆశ్రయం కల్పించి, వారికి తర్ఫీదు యిప్పించారు. మదరసాల్లో చదువుకుంటున్న అనేకమంది పిల్లల్ని వాళ్ల తలిదండ్రులకు తెలియకుండా తాలిబన్లు తీసుకుని వచ్చేసి ఆ క్యాంపుల్లో సూయిసైడ్‌ బాంబర్లగా తయారుచేసి వారిని అఫ్గనిస్తాన్‌లో ప్రయోగించారు. 2006 నాటికి దక్షిణ అఫ్గనిస్తాన్‌లో యిలాటి ఆత్మాహుతి దాడులు కనీసం 100 జరిగి వుంటాయి. ఇలా పిల్లల్ని పోగొట్టుకున్న వారు బహిరంగంగా బాధపడడానికి కూడా భయపడేవారు. ఐయస్‌ఐ ఏమైనా చేస్తుందేమోనని వారి భయం.

ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికాతో సహకరిస్తున్నామని పైకి చెప్తూనే పాకిస్తాన్‌ అంతర్గతంగా తాలిబన్లను, కశ్మీరీ ఉగ్రవాదులను, ఇండియన్‌ ముజాహిదీన్‌ను, అల్‌ కైదా సంబంధిత సంస్థలకు సహాయం అందిస్తోందని జర్నలిస్టులు రాస్తున్నా అమెరికన్‌ ప్రభుత్వాధికారులు చాలాకాలం నమ్మలేదు. నమ్మక తప్పని పరిస్థితి వచ్చినపుడు 'పాకిస్తాన్‌ వద్ద అణ్వాయుధాలు వున్నాయి. వారితో పేచీ పెట్టుకోలేం' అనేవారు. క్రమంగా తాలిబన్లు  చెలరేగిపోయి కాబూల్‌పై దాడులు జరిపినపుడు, వాటికి మూలం పాకిస్తాన్‌లో దొరికినపుడు యిక ఒప్పుకోక తప్పలేదు. 2008 జులైలో అమెరికన్‌ సెక్యూరిటీ అధికారులు రొటీన్‌గా ఐయస్‌ఐ అధికారుల ఫోన్‌ 'ట్యాప్‌' చేస్తూండగా ఒక అధికారి ఇండియన్‌ ఎంబసీపై కారు బాంబు ఎటాక్‌ గురించి ప్లాన్‌ చేసిన వైనం వారి దృష్టికి వచ్చింది. కొన్ని నెలల తర్వాత ముంబయిపై జరిగిన దాడిలో ఐయస్‌ఐ హస్తం పూర్తిగా తేటతెల్లమైంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆడుతున్న నాటకం గురించి అమెరికాకు ఏ సందేహం మిగలలేదు. అందుకే వారు 2011 మేలో బిన్‌ లాడెన్‌ పై దాడి చేసేముందు ఐయస్‌ఐకు చెప్పలేదు. ఆ నాటి దాడిలో లాడెన్‌ దొరికాక కూడా అతని వునికి గురించి తమకేమీ తెలియదని పాకిస్తాన్‌ ప్రభుత్వం చెపుతూ వచ్చింది. అలా ఎలా చెప్పగలదు? అది నిజమా కాదా? అని కార్లోటా గాల్‌ రెండేళ్లపాటు పరిశోధించి ఆ వివరాలు తన పుస్తకంలో రాసింది. 

ఏబటాబాద్‌లో లాడెన్‌ దాగున్న యింటి పేరు వజీర్‌స్తాన్‌ హవేలీ. పాకిస్తాన్‌-అఫ్గనిస్తాన్‌ సరిహద్దుల్లో వున్న పర్వతప్రాంతాల్లో శిక్షణ పొందుతూ అఫ్గనిస్తాన్‌పై దాడులు చేస్తూ వాటిలో గాయపడినవారిని ఐయస్‌ఐ పాకిస్తాన్‌లోని కొన్ని నగరాలలో, ప్రశాంతంగా వుండే కాలనీల్లో విడిగా వుండే యిళ్లల్లో ఆశ్రయం కల్పిస్తూ చికిత్స చేయించేది. స్థానికంగా వుండే ఇంటెలిజెన్సు అధికారులకు, సివిల్‌ అధికారులకు అలాటి యిళ్లను పట్టించుకోవద్దని, సోదా చేయనక్కరలేదని ఆదేశాలు యిస్తారు. వాటిలో ఎవరు నివాసం వుంటారో కూడా వారికి తెలియదు. అటువంటిదే యీ హవేలీ కూడా. దీనిలో లాడెన్‌ వున్న విషయం స్థానిక అధికారులకు కూడా వాళ్లకు తెలియదు. తెలిసి వుంటే ఆ నోటా యీ నోటా విషయం పొక్కి వుండేది.  ఐయస్‌ఐలో కూడా అమెరికన్‌ గూఢచారులు వుంటారు కాబట్టి సిఐఏకు తెలిసి వుండేది, లాడెన్‌పై కక్ష కట్టిన అమెరికన్‌ ప్రభుత్వం అతనిపై దాడి చేసేది. అందువలన ఐఎస్‌ఐ ఏం చేసిందంటే లాడెన్‌ సంగతి చూడడానికి ఒక ప్రత్యేకమైన డెస్క్‌ ఏర్పాటు చేసి, అక్కడో అధికారిని కూర్చోబెట్టింది. లాడెన్‌ విషయాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అతనే తీసుకున్నాడు. ఎవరినీ సంప్రదించే పని లేదు. అందువలననే వ్యవహారం రహస్యంగా వుండిపోయింది. ఐయస్‌ఐలో ఎవరైనా ఒక అధికారి ఒక ఆదేశం యిస్తే చాలు, తక్కినవారెవరూ ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించరు. అది ఆ సంస్థ నిర్వహణ తీరు. ఆ హవేలీ జోలికి పోవద్దు అని ఒక్క సూచన పైనుండి వచ్చింది. అంతే స్థానిక అధికారులు ఎవరూ ఆ జోలికి వెళ్లలేదు.

నిజానికి దానికి కొన్ని వందల గజాల దూరంలోనే కాకుల్‌ మిలటరీ ఎకాడమీ వుంది. దానికి ఏడాదికి రెండుసార్లు ఆర్మీ చీఫ్‌ వస్తూ వుంటాడు. అక్కడ తర్ఫీదు పొందే కాడెట్లపై ఉగ్రవాదుల దాడులు కూడా జరుగుతూంటాయి. అందువలన సెక్యూరిటీ కాపాడడానికి చుట్టుపట్ల యిళ్లన్నీ  తిరిగి ఎవరున్నారో వాకబు చేసి అవసరమైతే సోదాలు చేస్తూ వుంటారు. ఇలాటి పరిస్థితుల్లో యీ యింట్లో ఎవరున్నారో ఎవరూ పట్టించుకోకపోవడానికి కారణం – ఆ ఐయస్‌ఐ ఉన్నతాధికారి ఆదేశాలే! చివరకు 2011 మే 2న ఆ యింటిపై దాడి జరిగి 40 ని||ల పాటు అమెరికన్‌ సైనికులు ఆ యింట్లో వీరవిహారం చేసినప్పుడు కూడా ఆ అకాడెమీ నుండి ఎవరూ వచ్చి తొంగిచూడకపోవడానికి కూడా అదే కారణం! సిఐఏ అధికారులకు లాడెన్‌ ఆచూకీపై సమాచారం లభించి ఆ యింటి కాంపౌండ్‌ను పరీక్షించినపుడు గమనించిన విషయం ఏమిటంటే – ఆ యింటికి సొరంగం లేదు, దాక్కోడానికి నేలమాళిగ లేదు, ఏదైనా దాడి జరిగితే తప్పించుకుని పోవడానికి మరో ద్వారం లేదు. ఇలాటి యింట్లో లాడెన్‌ ఎందుకున్నాడు? 'అమెరికన్లు దాడి జరిపే ప్రమాదం వుంటే మాకు ముందుగా తెలుస్తుంది. అప్పుడు నిన్ను నిమిషాల్లో వేరే యింటికి తరలించేస్తాం' అని ఐయస్‌ఐ అధికారి హామీ యివ్వడం చేతనే! అందుకనే అమెరికన్లు దాడి చేసినపుడు లాడెన్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. అచేతనుడై పోయి ఆయుధాలు చేతిలోకి తీసుకోలేదు, పేల్చలేదు. ఇంట్లో పేలుళ్లు జరుగుతూంటే ఎలా రియాక్ట్‌ కావాలో కూడా తెలియనంత దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇది సిఐఏ ముందే వూహించింది. ఐయస్‌ఐను విశ్వాసంలోకి తీసుకుంటే వాళ్లు లాడెన్‌కు చెప్పేస్తారని గ్రహించుకుని వారికి చెప్పకుండానే మొత్తం ఆపరేషన్‌ నిర్వహించింది.

అయితే యింతకీ లాడెన్‌ డెస్క్‌ నిర్వహించిన ఆ ప్రత్యేక అధికారి ఎవరు? అది స్పష్టం కాలేదు. ఐయస్‌ఐ చీఫ్‌గా 2004 నుండి 2007 దాకా పని చేసి రిటైరైన కయాని కావచ్చు, లేదా అతని తర్వాత ఆ పదవిలోకి వచ్చిన అహ్మద్‌ షుజా పాషా కావచ్చు, లేదా అతనికి డిప్యూటీగా పనిచేసి తర్వాత వారసుడిగా వచ్చిన జహీర్‌ ఉల్‌ ఇస్లాం కావచ్చు, వీరెవరూ కాకుండా నదీమ్‌ తాజ్‌ కూడా కావచ్చు. అతను ముషారఫ్‌కు భార్యవైపు బంధువు, మిలటరీ ఇంటెలిజెన్సుకు, ఐయస్‌ఐకు నాయకత్వం వహిస్తూ ముషారఫ్‌కు మిలటరీ సెక్రటరీగా పనిచేశాడు. ఇలాటి పుస్తకాల వలన తమ అధినేతల నిర్వాకాల గురించి పాక్‌ ప్రజలకు కనువిప్పు కలిగి వారిపై తిరగబడితేనే కానీ ఐయస్‌ఐ ఆగడాలకు కళ్లెం పడదు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]