ఎమ్బీయస్: వాటే ఫాల్, జైపాల్!

జైపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో పాసయిన తీర్మానం తొండి తీర్మానం అన్నారు. అదేమిటో ఆయనకు అదొక్కటే అలా  అపించింది. తెలంగాణ బిల్లు తొలి అడుగు నుండి తొండి ఆటే ఆడారన్న సంగతి ఆయన గమనించలేదా?…

జైపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో పాసయిన తీర్మానం తొండి తీర్మానం అన్నారు. అదేమిటో ఆయనకు అదొక్కటే అలా  అపించింది. తెలంగాణ బిల్లు తొలి అడుగు నుండి తొండి ఆటే ఆడారన్న సంగతి ఆయన గమనించలేదా? రాష్ట్రవిభజన జరపాలంటే ఇరుప్రాంతాల వారినీ కూర్చోబెట్టి నచ్చచెప్పాలని శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడో చెప్పింది. జైపాల్ కూడా అలాగే అనుకుని ‘నేను మధ్యవర్తిగా వ్యవహరించి ఆ పని చేస్తాను’ అని ఆఫర్ చేశారు. ఎటొచ్చీ ఆయన తెలంగాణపై అధిష్టానం అన్నీ తేల్చేసిన తర్వాత ఆ ఆఫర్ ఇచ్చారు. ‘మనం అడిగిన తెలంగాణ ఇచ్చేసిన తర్వాత సీమాంధ్రులతో కలిసి చర్చకు కూర్చుంటే ఇచ్చినది పోగొట్టుకోవడమవుతుంది తప్ప కలిసివచ్చేది లేద’నుకున్న తెలంగాణ నాయకులు, ‘అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకీ ఆఫర్, ఇలాంటి పని ఎప్పుడో చేయాల్సింది’ అనుకున్న’ సీమాంధ్ర నాయకులు – ఇద్దరూ ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఆయినా తన మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. మళ్లీ ఆఫర్ చేయలేదు. ఇరుప్రాంతాల మధ్య చర్చలు జరిగివుంటే తెలుగువారందరూ వెళ్లి ఢిల్లీ నాయకుల కాళ్లమీద పడే అవసరమే వుండేది కాదు. అలాంటి కసరత్తు జరగకుండా తెలంగాణ బిల్లు ప్రతిపాదనను అధిష్టానం లేవనెత్తడంలో జైపాల్‌కు తొండి కనబడలేదా? 

ఆ తర్వాత సీమాంధ్రలో ఆందోళన రేగినపుడు సోనియాకానీ, ప్రధాని కానీ, రాహుల్ కానీ అటువైపు తొంగి చూడకపోగా ఒక్క సానుభూతి వాక్యం కూడా పలకకపోవడంలో, రెండు నెలల పాటు బిల్లుపై ఏ కసరత్తు చేయకుండా ఊరుకుని, తర్వాత బిల్లును పరుగులు పెట్టించడంలో, ఆంటోనీ కమిటీ నివేదికను పక్కన పడేయడంలో, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఎవరికీ పంపిణీ చేయకపోవడంలో, మంత్రుల ముఠా సభ్యుల సంఖ్య తగ్గించడంలో, సంబంధంలేని శాఖల వారిని ఆ కమిటీలో వేయడంలో, క్యాబినెట్ సమావేశాల్లో ఈ బిల్లును టేబుల్ ఐటెమ్స్‌గా ప్రవేశపెట్టడంలో, 70 పేజీల రిపోర్టు ఇప్పటికిప్పుడు ఎలా చదువుతామని సీమాంధ్ర మంత్రులు అభ్యంతరాలు లేవనెత్తితే, ‘మీరేం చెప్పినా మా నిర్ణయం మారదు, అందుకని మీరు చదివినా చదవకపోయినా ఒకటే’ అని చిదంబరం అన్నపుడు – జైపాల్‌కు తొండి కనబడలేదా? తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారా లేదా అన్న వివాదం వచ్చేట్లా శ్రీధరబాబు, డిప్యూటీ స్పీకరు కలిసి తమాషా చేస్తే తొండి కనబడలేదా? తెలంగాణ బిల్లులో జైపాల్‌గారికి కనబడిన లోపాలు – శాంతిభద్రతలు గవర్నరు చేతిలో వుండడం, హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా వుండడం! సీమాంధ్రకు ఏమీ ఇవ్వకుండా సున్నపు పిడత చేతిలో పెట్టారన్న సంగతి ఆయనకు తోచనే లేదు. ఈ అవకతవక, పక్షపాతపు బిల్లును ఆమోదించకపోయినందుకు సీమాంధ్రులు ఆయనకు శుంఠల్లా తోచారు. ‘కాంగ్రెసు చెప్పిందంటే అది శిలాక్షరమే, మీరు ఏమీ చేయలేని అసమర్థులు, ఇప్పటికైనా నోరు మూసుకుని దీన్ని ఆమోదించండి’ అని ఆయన వంటి మేధావి సుద్దులు చెప్పినా విననివాళ్లపై ఆపాటి చివాట్లు వేయడం సహజమే! తన మాటల్లో కాని, చేతల్లో కాని ఆయనకు తొండి ఏమీ కనబడలేదు.

 అసెంబ్లీ మాటకు విలువ లేదని, దాని అభిప్రాయం ఇక్కడ ఢిల్లీలో ఎవరూ అడగటం లేదని, బిల్లు హైదరాబాదు గడప ముట్టుకుని వచ్చేస్తే చాలనీ, రాష్ట్రపతి చర్చకు పెద్దగా సమయం ఇవ్వరనీ, డిసెంబరు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాస్ అవుతుంది అని ఆయన చెప్పారు. కానీ రాష్ట్రపతిగారు ఈయన ఆలోచనలు పట్టించుకోకుండా తొండి ఆడి, ఆరువారాల టైము ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ కొంతకాలం సీమాంధ్ర ఎమ్మెల్యేలు తొండి ఆడి, మరి కొంతకాలం తెలంగాణ ఎమ్మెల్యేలు తొండి ఆడి, చర్చలు జరగకుండా చేశారు. డిప్యూటీ సిఎం గారు ఏకంగా తెలంగాణ మంత్రులనే వెల్‌లోకి పంపి తొండి ఆట ఆడించారు. కిరణ్ కుమార్ గారు వందలాది పేజీల మేటరు రోజుల తరబడి చదువుతానని ఆశపెట్టి, మూడు రోజుల్లో అప్పుడు కొంతా, ఇప్పుడు కొంతా చదివి సమైక్యవాదులతో తొండి ఆడారు. ఆ తర్వాత గిరీశం దేవుడితో ‘నన్ను డిపెండెంట్‌గా పుట్టించావా? ఇండిపెండెంటుగా పుట్టించావా? అంటూ ఆర్గ్యూ చేసినట్టు, ‘ఇది అసలు బిల్లా? ముసాయిదా  బిల్లా?’ అసలుదైతే ముసాయిదా అని హోంశాఖ ఎందుకు రాశారు? ముసాయిదా అయితే రాష్ట్రపతిగారు ఎందుకు పంపారు? అసలుదైతే ఉద్దేశం, ఫైనాన్షియల్ సమాచారం ఏవి? ముసాయిదా అయితే అసలుది పంపాకనే చర్చిస్తాం’ అని కేంద్రం ఆడిన తొండి ఆటను బయటపెట్టి బిల్లు తిరస్కరిస్తున్నాం అని స్పీకరుకు నోటీసు ఇచ్చేశారు. 

అసెంబ్లీ ఏం చెపితే మాత్రం ఏముంది గాడిదగుడ్డు, అంశాలవారీ ఓటింగు తలపెడితే అడ్డుకుంటాం అని తొండి ఆట ఆడడానికి సిద్ధపడిన వున్న తెలంగాణ మంత్రులకు షాక్ కొట్టింది. ద్రౌపది ‘నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?’ అని దుశ్శాసనుడితో వాదానికి దిగినట్లు, కిరణ్‌గారు ఇది ప్రభుత్వం తరఫున ఇచ్చినట్లా, అయితే క్యాబినెట్ ఆమోదం ఏది? ఒట్టి సభ్యుడిగానే ఇస్తే 10 రోజుల నోటీసు లేదు కదా అన్న లాజిక్‌పై తీసి అవతల పారేయవచ్చు కదాని స్పీకరుపై ఒత్తిడి తెచ్చారు. స్పీకరుగారు సంకటంలో పడ్డారు. క్యాబినెట్ ఆమోదం వున్నా లేకపోయినా కిరణ్ సభానాయకుడి హోదాలో ఇచ్చినపుడు ఆయన నోటీసును కాదనలేదని టి-వాదులకు స్పష్టంగా చెప్పారు. దాన్ని సభలో ప్రవేశపెట్టాల్సిందే అన్నారు. మరి బిల్లులోని అంశాలపై క్లాజ్‌వారీ ఓటింగో అని సమైక్యవాదులు అంటే సభ సవ్యంగా నడవటం లేదు కదా అన్నారు. చివరకు అంశాలవారీ ఓటింగు లేకుండా సమైక్యవాదులతో తొండి ఆట ఆడారు. చటుక్కున సభానాయకుడి తీర్మానాన్ని ప్రవేశపెట్టి మూజువాణీ ఓటుతో ఔననిపించి టి-వాదులతో తొండి ఆడారు. మూజువాణీ ఓటుతో తీర్మానం నెగ్గిందని రాసుకుని వచ్చి స్పీకరు చదివారంటేనే తెలుస్తోంది – అంతా ముందే సిద్ధమై పోయిందని. బిల్లుపై ఓటింగు జరగకుండా అడ్డుకున్నాం అని టి-వాదులకు ఆనందం. ఏదో ఒక తీర్మానం ద్వారా తిరస్కరించాం అని సమైక్యవాదులకు ఆనందం. ఓటింగు జరిగినా దానికి విలువ వుండదు అన్నపుడు ఓటింగు ఎందుకు అడ్డుకున్నారో అర్థం కాదు. 

బిల్లు అసమగ్రంగా వుంది కాబట్టి తిరస్కరిస్తున్నాం అని చేసిన తీర్మానం సరైనదా కాదా అన్న చర్చ జరుగుతూండగానే దేశానికి మాత్రం సంకేతం వెళ్లిపోయింది – అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు ఇది! అని మెజారిటీ సభ్యుల మూక బలంతో తిరస్కరించడం కాదు, బిల్లులో వుండవలసిన ముఖ్యాంగాలు లేకపోబట్టి తిరస్కరించారు అని కూడా అన్ని రాజకీయపక్షాలకూ అర్థమైపోయింది. ఇంకా అర్థం కాని దూరప్రాంతపు ఎంపీలకు అర్థం కావడానికి ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రదర్శనలు నిర్వహించి వాళ్ల దృష్టిలో పడి ‘ఇదేదో సవ్యంగా జరగటం లేదు’ అనే భావాన్ని కలిగించారు. అందుకే బిజెపి లోకసభ నాయకురాలు కూడా ‘అసెంబ్లీ తిరస్కరించిన తీర్మానం, మీ ముఖ్యమంత్రి ఎదిరించిన బిల్లు..’ అంది. ఎన్‌డిఏలో భాగస్వాములుగా వున్న అకాలీదళ్, శివసేన కూడా ఆర్థిక బిల్లులు తప్ప తెలంగాణ బిల్లు పెట్టవద్దని అఖిలపక్షంలో చెప్పాయి. జ్గుపాల్ దృష్టిలో వాళ్లు కూడా తొండి ఆడినట్లే. కానీ బళ్ల కొద్దీ బండిళ్లు పంపితే వాటిని తెరిచి కూడా చూడకుండా అరగంటలో మంత్రుల ముఠా ఫైనల్ బిల్లుకు రూపం ఇచ్చేస్తే మాత్రం ఆయనకు అది తొండిగా అనిపించడం లేదు. ఇంత పక్షపాతమా!? ఒకప్పుడు ప్రత్యర్థుల చేత కూడా మేధావిగా కీర్తించబడిన జైపాల్ రెడ్డే ఇలా అయిపోయారా? వాటే ఫాల్, జైపాల్! 

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)

[email protected]