జమ్మూ, కశ్మీర్‌లోని మూడు పార్లమెంటరీ సీట్లలో రెండింటికి త్వరలో ఉపయెన్నికలు రానున్నాయి. అవి గెలవడం మెహబూబాకు చాలా అవసరం. పరిస్థితి చూస్తే ఆశాజనకంగా లేదు. ఈ రెండింటిలో ఒకటి 2014లో ఆమె గెలిచిన అనంత్‌నాగ్ నియోజగవర్గం. ముఖ్యమంత్రి కావడానికి ఆమె గత జూన్‌లో దానికి రాజీనామా చేయడం వలన ఖాళీ అయింది. మరొకటి శ్రీనగర్ నియోజకవర్గం. దానిలో మెహబూబా పార్టీ పిడిపిలో సీనియర్ నాయకుడు తారీఖ్ హమీద్ కర్రా మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను 42 వేల ఓట్ల తేడాతో ఓడించాడు. అది ఫరూఖ్‌కు మొదటి ఓటమి. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు చేస్తున్న ఆందోళనకారులపై ప్రభుత్వ సైన్యాలు అనవసరంగా హింస ప్రయోగిస్తున్నాయని, అన్యాయంగా చంపివేస్తున్నాయని ఆరోపిస్తూ అతను 2016 సెప్టెంబరులో రాజీనామా చేశాడు. ఉపయెన్నికలలో వీటిలో గెలవకపోతే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందనే మాట ఎదుర్కోవలసి వస్తుంది.
బిజెపికి, పిడిపికి మౌలిక సిద్ధాంతాల్లోనే చుక్కెదురు. అయినా అధికారం కోసం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి నడుపుతున్నారు. పిడిపితో చేతులు కలిపినందుకు బిజెపి పడే నిందల కంటె బిజెపితో చేతులు కలిపినందుకు పిడిపి ఎక్కువ విమర్శ ఎదుర్కుంటోంది. ముఖ్యంగా కశ్మీరు లోయలో పిడిపి అభిమానులు పార్టీపై గుర్రుగా వున్నారు. కాశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి నిచ్చే ఆర్టికల్ 370 కొనసాగించకూడని బిజెపి అంటుంది, కొనసాగించాలని పిడిపి అంటుంది. కశ్మీరులో వున్న భారతసేనకు విశేషాధికారాలు కల్పించే ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని మార్చాలని పిడిపి అంటే, మార్చనక్కరలేదని బిజెపి అంటుంది. ఇలాటి విభేదాలు కాలక్రమేణా పరిష్కరించుకోవాలంటూ ఒక ఒప్పందం రాసుకుని రెండు అధికారాన్ని పంచుకున్నాయి. తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ బిజెపి నాయకులతో కూర్చుని తయారుచేసిన యీ ఒప్పందం మెహబూబాకు ఏ మాత్రం యిష్టం లేదు. దీని వలన పార్టీకి దీర్ఘకాలికంగా నష్టమే అని ఆమె అభిప్రాయం. అయితే తండ్రి మరణం తర్వాత పొత్తు కొనసాగించాలా లేదా అన్న ప్రశ్నను ఆమె ఎదుర్కోవలసి వచ్చింది. ఎంతో తర్జనభర్జన తర్వాత కొనసాగించడానికే నిశ్చయించుకుంది.
కశ్మీర్‌లో వున్న రాజకీయ పార్టీల్లో, ఉద్యమకారుల్లో -మితవాదులు, అతివాదులు, తీవ్రవాదులు, వేర్పాటు వాదులు, భారత్‌తో కలిసి వుందామనుకుంటూనే సైన్యాన్ని తొలగించాలని వాదించేవారు, భారత్ అంటేనే గిట్టనివారు – యిలా రకరకాల వారున్నారు. వీరిలో ఎవరినీ దూరం పెట్టకుండా అన్ని తరహాల వారినీ పిలిచి మాట్లాడి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించాలని పిడిపి-బిజెపి తమలో తాము అంగీకరించాయి. అయితే ఆచరణలో యిది సాధ్యపడలేదు. ఈ పరిష్కారం వచ్చేవరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ఒప్పుకున్నారు. కానీ బిజెపి నాయకులు ఆర్టికల్ 370, యూనిఫార్మ్ సివిల్ కోడ్ వగైరా విషయాలపై తమ వ్యతిరేకతను బాహాటంగా చాటుతున్నారు. సిద్ధాంతపరంగా రెండు పార్టీల్లో ఏ మార్పూ రాలేదు. అయితే ఆమె పాలనలో తీవ్రవాదం, ఉగ్రవాదం ఏదీ తగ్గలేదు. ప్రజల్లో అసహనం పెరుగుతోంది. తీవ్రవాదులు, వారి సానుభూతిపరులు మిలటరీపై, ప్రభుత్వ సైన్యాలపై దాడులు చేయసాగారు. అనేకమంది జవానులు మరణిస్తున్నారు. వాళ్లు తీవ్రవాదులపై కాల్పులు కాలిస్తే 'రాళ్లు రువ్వే వాళ్లపై తుపాకీలు కాలుస్తున్నారు' అంటూ కొందరు వారిని తప్పుపడుతున్నారు. గత ఏడాది జులైలో హిజబుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్‌హాన్ వాని మరణం తర్వాత జరిగిన నిరసన ప్రదర్శనలు, కాల్పుల వలన 80 మంది పౌరులు మరణించారు. 15 వేల మంది గాయపడ్డారు. వీటిపై ఆమె సహచరులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కశ్మీరు సమస్యను కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడడం చేత, విభిన్న భావజాలాల సంస్థలను కలుపుకుని పోలేక పోవడం చేత అది రావణకాష్ఠంగా మిగిలిపోయింది. భిన్న దృక్పథాల పిడిపి-బిజెపి ప్రభుత్వం వచ్చాక సంప్రదింపుల ద్వారా ఏదైనా మార్గం కనుగొంటారని ఆశించినవారికి ఆశాభంగం కలిగింది. కశ్మీరీ ప్రజలను, ప్రత్యేకించి యువతను పాలనలో మరింతగా భాగస్వాములను చేయడంలో, వారికి భవిష్యత్తు ఆశావాదం కల్పించడంలో కేంద్రంలో ఎన్‌డిఏ, రాష్ట్రంలో పిడిపి-బిజెపి విఫలమయ్యాయి. కశ్మీరు విధానాలను సైన్యమే నిర్దేశిస్తున్నట్లు కనబడుతోంది. అల్లర్లలో మరణించిన సైనికులకు నివాళి సమర్పించే సందర్భంగా మాట్లాడుతూ భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనవరల్ బిపిన్ రావత్ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరులో సైన్యంపై రాళ్లు రువ్వుతూ వారి కార్యకలాపాలకు అవరోధం కల్పిస్తున్నవారిని టెర్రరిస్టులకు సాయపడే 'ఓవర్ గ్రౌండ్ వర్కర్ల'గా గుర్తిస్తామంటారు. పాకిస్తాన్ జండాలు ప్రదర్శిస్తూ తీవ్రవాదాన్ని కొనసాగిస్తూన్న పౌరులు, జహాదీ గ్రూపులను జాతి వ్యతిరేకులుగా పరిగణించి ఆర్మీ వారిని వదిలిపెట్టదని హెచ్చరించారు. సాధారణంగా యిలాటి వ్యాఖ్యలు రాజకీయనాయకులు చేస్తారు. వాటికి పెద్దగా ప్రాధాన్యత వుండదు. కానీ యీ సారి ఆర్మీ చీఫ్ అనడంతో కశ్మీరు విషయాన్ని కేంద్రం యీ కోణంలోంచి చూస్తోందని అర్థమైంది. రావత్‌తో ఏకీభవిస్తారా అని డిఫెన్సు మంత్రి పారికర్‌ను అడిగితే ఆయన సూటిగా సమాధానం చెప్పకునిడా స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఆర్మీ కానీ, సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ నిర్ణయం తీసుకుంటాయని అన్నారు.
రావత్ వ్యాఖ్యలు మెహబూబాను యిబ్బందిలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఒక వైపు సైన్యం స్థయిర్యం చెదరకుండా చూస్తూ, మరొకవైపు వైపు ఆందోళనకారులకు చల్లార్చవలసిన అగత్యం మెహబూబాకు పట్టింది. ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో రాజీ పడి తమ సిద్ధాంతాలను వదులుకోలేదని కశ్మీరులోని ఓటర్లకు తనూ హామీ యివ్వవలసిందే అనుకుని యిటీవల జనవరి 30న అసెంబ్లీలో ఫరూఖ్ కంటె తీవ్రంగా ''ఆర్టికల్ 370 రద్దు చేయాలని కోరేవారందరూ జాతి వ్యతిరేకులే'' అనే తీవ్రప్రకటన చేసింది. ఒక బిజెపి సభ్యుడు అసెంబ్లీ రికార్డుల నుంచి జాతివ్యతిరేకులు (యాంటీ నేషనల్స్) పదం తొలగించాలని కోరబోయాడు. ఆ కోరిక మన్నిస్తే ముఖ్యమంత్రిపై సభ విశ్వాసం కోల్పోయిందన్న అర్థం వస్తుంది. ఈ ఇరకాటం నుంచి ఆమెను తప్పించడానికి బిజెపి పార్టీకి చెందిన స్పీకరు కవీందర్ గుప్తా తెలివిగా సభను వాయిదా వేసేశాడు.
మహారాజా హరి సింగ్ జయంతి అయిన సెప్టెంబరు 23ని సెలవుదినంగా ప్రకటించాలని కోరుతూ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో జనవరి 25న తీర్మానం ప్రవేశపెట్టి, పిడిపితో సహా యితర పార్టీలన్నిటినీ యిరకాటంలోకి పెట్టే పని చేసింది బిజెపి. శిఖ్కులతో పోరాటంలో తమకు సాయపడినందుకు సంతోషించిన బ్రిటిషువారు గులాబ్ సింగ్ అనే డోగ్రా రాజుకు 25 లక్షల మంది ప్రజలున్న కశ్మీరును రూ. 50 లక్షలకు అప్పగించారు. అప్పణ్నుంచి డోగ్రా రాజుల పాలన ప్రారంభమై 100 సం.లు నడిచింది. ఆఖరి డోగ్రా రాజైన మహారాజా హరిసింగ్ పాలనలో మతసామరస్యం వర్ధిల్లినా, రాజ్యంలో మాత్రం దారిద్య్రం తాండవించింది. రాజు భోగవిలాసాలపై ప్రజలకు మొహం మొత్తి, తిరగబడ్డారు. 'మహారాజు సేనపై తిరగబడడానికి తుపాకులు దొరక్కపోతే కర్రలు, రాళ్లనైనా ఉపయోగించండి' అని పిలుపు నిచ్చిన అబ్దుల్ ఖాదిర్ అనే నాయకుణ్ని హరి సింగ్ అరెస్టు చేయించాడు. దాన్ని నిరసిస్తూ 1931 జులై 13 న శ్రీనగర్ సెంట్రల్ జైలు బయట అనేకమంది ప్రదర్శన నిర్వహించారు. వారిపై రాజు సేనలు కాల్పులు కాలిస్తే 21 మంది చనిపోయారు. విప్లవ నాయకుల్లో ఒకడైన షేక్ అబ్దుల్లా దాన్ని జలియన్‌వాలా బాగ్‌తో పోల్చాడు. తర్వాతి రోజుల్లో తను అధికారంలోకి వచ్చాక జులై 13 ను అమరవీరుల దినంగా పాటిస్తూ వచ్చాడు. పాలకులు ఆ రోజున వెళ్లి ఆ 21 మంది సమాధుల వద్ద నివాళులు అర్పించడం రివాజు అయింది. ఈ సారి బిజెపి మంత్రులు ఆ ఫంక్షన్‌లో పాల్గొనడానికి నిరాకరించారు.
ఆంగ్లేయులు వెళ్లిపోయేటప్పుడు హరి సింగ్ మన నిజాంలాగానే కశ్మీర్‌ను విడి దేశంగా వుంచుకుంటానన్నాడు. అయితే షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో విప్లవం చెలరేగడంతో దాన్ని అణచలేక భారత్‌తో రాజీ పడ్డాడు. హైదరాబాదు స్టేట్ విషయంలో ప్రజలు ఇండియాతో కలవాలనుకున్నారు, పాలకుడు విడిగా వుందామనుకున్నాడు. కశ్మీరు విషయంలో ప్రజలు విడిగా వుండాలనుకున్నారు, పాలకుడు ఇండియాతో కలవాలనుకున్నాడు. భారతప్రభుత్వం హైదరాబాదు విషయంలో ప్రజల మాటను, కశ్మీరు విషయంలో పాలకుడి మాటను లెక్కలోకి తీసుకుంది. హరి సింగ్‌ను కశ్మీరు ప్రజలు గౌరవించరు కానీ, జమ్మూలో అధిక సంఖ్యాకులైన హిందువులు గౌరవిస్తారు. అక్కడ బలంగా వున్న బిజెపి హరి సింగ్‌కు ప్రాధాన్యత యివ్వాలని సంకల్పించింది. అందుకే హరి సింగ్ మనుమడు, బిజెపి లెజిస్లేటర్ అయిన అజాతశత్రు సింగ్ (ఇతను ఫరూఖ్ నేషనల్ కాన్ఫరెన్సు పార్టీలో వుంటూ ఫరూఖ్ అబ్దుల్లా కాబినెట్‌లో మంత్రిగా కూడా చేశాడు) హరి సింగ్ జయంతి గురించి తీర్మానం ప్రవేశపెట్టాడు. అన్ని పార్టీలకు జమ్మూలో యూనిట్లు వున్నాయి కాబట్టి దాన్ని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేదు. పిడిపికి చెందిన సురీందర్ చౌధరీ దాన్ని బలపరిచాడు. కాంగ్రెసుకు చెందిన డిప్యూటీ చైర్మన్ జహంగీర్ మీర్ సమర్థించాడు. పిడిపి నాయకుడు, విద్యామంత్రి అయిన నయీమ్ అఖ్తర్ తన పాలనాకాలంలో మతసామరస్యం పాటించినందుకు మహారాజాను గౌరవించాలని అన్నాడు.
నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ యూనిట్ నాయకుడు, ఒమార్ అబ్దుల్లాకు సన్నిహితుడు అయిన దేవీందర్ సింగ్ రాణా యీ తీర్మానాన్ని ప్రశంసిస్తూ ప్రకటన చేయడం ఫరూఖ్ అబ్దుల్లాను చిర్రెత్తించింది. అతను అటుయిటూ ఏమీ అనకుండా వూరుకున్నాడు కానీ తన కశ్మీరీతనం చాటుకోవడానికి మెహబూబాను మరింత యిరకాటంలోకి నెట్టడానికి మిలిటెంట్లను త్యాగధనులుగా వర్ణిస్తూ ఫిబ్రవరి 24 న ఓ ప్రకటన చేశాడు. ''ఈ రోజు మన పిల్లలు ఎన్నో త్యాగాలు చేస్తున్నారంటే దానికి అర్థం వారికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వంటి పదవులపై ఆశ లేదని..'' అన్నాడు. కశ్మీరు ప్రజల మనసుల్లో మెదలుతున్న భావాలను యిలా వ్యక్తపరచి ఫరూఖ్ వారి సానుభూతిని, మద్దతును చూరగొనడానికి ప్రయత్నించాడు.
మెహబూబాకు సొంత పార్టీలోకూడా మద్దతు తగ్గిపోతోంది. కొందరు నాయకులు ఆమెపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఆమె మేనమామ సర్తాజ్ మదానీని ముఫ్తీ తన జీవితకాలంలో దగ్గరకు రానీయలేదు. కానీ తండ్రి మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన మెహబూబా అతనికి పార్టీ జనరల్ సెక్రటరీ పదవి కట్టబెట్టడం చాలామందికి రుచించలేదు. అంతేకాదు, 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన చాలామంది నాయకులను ఆమె పదవుల్లో నియమించడం కూడా నచ్చలేదు. హార్టికల్చర్ డెవలప్‌మెంట్ బోర్డు వైస్ చైర్మన్ అయిన నిజాముద్దీన్ భట్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్ అయిన పీర్జాదా మన్సూర్ హుస్సేన్, వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ అయిన పీర్ మొహమ్మద్ హుస్సేన్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వైస్ చైర్మన్ అయిన రఫీ అహమద్ మీర్ – వీళ్లందరూ అలా ఓడిపోయిన బాపతే. పిడిపి యువనాయకుడు వహీద్ ఉర్ రహమాన్ పర్రాను స్పోర్ట్‌స్ కౌన్సిల్ సెక్రటరీగా వేయడంతో ఆ శాఖకు మంత్రిగా వున్న ఇమ్రాన్ రజా అన్సారీ రాజీనామా చేశాడు.
ఈ శాఖతో బాటు అతను ఐటికి, టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు కూడా మంత్రిగా వున్నాడు. రాజీనామా చేయవద్దని మెహబూబా అతన్ని కోరింది. అయినా అతను మెత్తబడకుండా ఇరాన్, ఇరాక్‌లకు తీర్థయాత్రపై వెళ్లిపోయాడు. ఇటీవల జరిగిన మంత్రివర్గ మార్పుల్లో రెవెన్యూ మంత్రిగా వున్న బషరత్ బుఖారీని ఆ శాఖనుంచి తీసేసి హార్టికల్చర్ మంత్రిగా వేస్తే అతను రాజీనామా చేసేశాడు. కానీ మెహబూబా నచ్చచెప్పిన మీదట, మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. గతంలో ఉన్నతాధికారిగా వుండి రాజకీయాల్లోకి వచ్చిన నయూమ్ అఖ్తర్‌ను విద్యా శాఖ నుంచి ప్రతిష్ఠాత్మకమైన రోడ్లు, భవనాల శాఖకు మార్చడం వీళ్లను మండించింది. మెహబూబా అతన్ని ఆత్మీయుడిగా పరిగణించి ప్రాముఖ్యత యిస్తున్నా పార్టీలో తక్కినవారు అతన్ని బయటి వ్యక్తిగానే చూస్తారు. అసలే పార్టీలో, ప్రజల్లో అసంతృప్తిని ఎదుర్కుంటున్న మెహబూబాకు వచ్చే ఎన్నికలలో ఓటమి ఎదురవుతుందన్న భయం పట్టుకుంది. ఫిబ్రవరి నెలాఖరులో ఢిల్లీ వెళ్లి మోదీ వద్ద 'నిర్ణీత కాలవ్యవధితో మన ఒప్పందంలో కొన్నయినా అమలు చేసి చూపించకపోతే కష్టం' అని మొరపెట్టుకుంది. ఉపయెన్నికలలో పిడిపి ఓడిపోతే అప్పుడేమవుతుందో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]