ఆంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుంచి వైసిపి చాలా నేర్చుకోవాలి. దానికి పడాల్సిన వేళ, పడాల్సిన చోట దెబ్బ పడింది. దాని గురించి చెప్పుకునే ముందు, యిది టిడిపి అనుకూల మీడియా చిత్రీకరిస్తున్నంత ఘోరపరాజయం మాత్రం కాదని అర్థం చేసుకోవాలి. ‘అంతొద్దు, యింత చాలు’ అని వైసిపి, టిడిపిలు రెండిటికీ చెరో రకంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు 14 స్థానాలకు జరిగాయి. వాటిలో 9 స్థానిక సంస్థల ప్రతినిథుల స్థానాలు, 2 టీచర్స్ స్థానాలు, 3 గ్రాజువేట్స్ స్థానాలు. మొదటి 9టిలో 5టిని వైసిపి ఏకగ్రీవంగా గెలిచింది. తక్కిన 4టిని ఎన్నికలలో గెలుచుకుంది. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమలలో ఉన్న రెండు టీచర్ల స్థానాలను కూడా వైసిపి స్వల్ప మెజారిటీతోనైనా గెలిచింది. టీచర్స్ స్థానాల్లో యిది వారికి తొలి గెలుపు. ఉద్యోగి వర్గాలలో వైసిపిపై అత్యధిక కారాలు, మిరియాలు నూరుతున్న వర్గం టీచర్లు. అయినా ఆ వర్గంలో వైసిపి గెలవడం ఆశ్చర్యకరం.
ఇక మూడు గ్రాజువేట్ స్థానాలు తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలలో ఉన్నాయి. వీటిలో టిడిపి గెలిచింది. పశ్చిమ రాయలసీమ స్థానంలో హోరాహోరీ పోరులో గెలిచింది. ఇదీ టిడిపి సంతోషానికి కారణం. వైసిపికి ఎదురుగాలి ప్రారంభమైందన్న దానికి యిదే సంకేతం అని చెప్పుకుంటోంది. గత నాలుగేళ్లలో ప్రతిపక్షానికి గర్వంగా చెప్పుకోదగ్గ విజయం యిదొక్కటే. స్థానిక సంస్థల ఎన్నికలలో, ఉపయెన్నికలలో ఏ గెలుపూ దక్కక అలమటిస్తున్నవారికి మృష్టాన్నభోజనం చేసినంత సంబరం కలగడం సహజమే. కానీ మరీ అంతొద్దు.. యింత సందడి చాలు అని చెప్పాలి మనం. ఇల్లలకగానే పండగ కాలేదు. 14టిలో మూడే వచ్చాయి. మీరనుకున్నంత స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉండి వుంటే యీ ఎన్నికలలో అధికార పార్టీ చిత్తుగా ఓడిపోవాల్సింది అని చెప్పాలనిపిస్తోంది. ఈ ఎన్నికలలో… అని నొక్కి చెప్పడ మెందుకంటే, వైసిపిపై పూర్తి వ్యతిరేకత ఉన్న వర్గమేదైనా ఉందా అంటే అది మధ్య, దిగువ మధ్యతరగతి విద్యావంతులు, మధ్యతరగతి వర్గమే. దానిలోనే వైసిపి వ్యతిరేకత యింత మాత్రమే ఉందంటే సమాజంలో తక్కిన వర్గాలన్నీ కలిసినప్పుడు వ్యతిరేకత నీరుగారిపోతుంది.
ఈ ఎన్నికల టేక్ హోమ్ మెసేజ్ ఏమిటంటే, నమోదైన గ్రాజువేట్స్లో వైసిపి పట్ల వ్యతిరేకత బలంగా ఉంది అని. నమోదైన అని ప్రత్యేక ప్రస్తావన ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 50 లక్షల మంది గ్రాజువేట్స్ రమారమిగా ఉంటే 9 లక్షల మంది మాత్రమే నమోదు చేయించుకున్నారట. నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లే అన్నారెవరో. ఓటర్లో ఎంత శాతం మంది ఓటేశారో ఆ లెక్కలు తీసి, యీ ఫలితాలను తక్కువ చేయడం సమంజసం కాదు. నమోదు చేసుకోనివారు, ఓటేయనివారు అందరూ అధికార పార్టీకి అనుకూలం అనో, వ్యతిరేకం అనో చెప్పలేం. కానీ సర్వే విషయంలో కొంతమందిని మాత్రమే అడిగి, జనాభా అంతటికీ అన్వయించినట్లే, తక్కినవారి అభిప్రాయం యీ నిష్పత్తిలోనే ఉంటుంది అనుకుని, ముందుకు సాగడం మంచిది. గ్రాజువేట్లలో ఐదో వంతు కంటె తక్కువమంది నమోదు చేయించుకున్నారంటే నాకు ఆశ్చర్యం కలగదు. 70 ఏళ్ల వయసొచ్చాక గత ఏడాది మాత్రమే నేను నమోదు చేయించుకున్నాను.
నేను ఏ రాష్ట్రంలో పని చేస్తే అక్కడ ఓటరుగా నమోదు చేయించుకుని, అన్ని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఓటేసిన నేను ఎమ్మెల్సీ ఎన్నికలను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎందుకంటే కౌన్సిళ్లు అజాగళస్తనాలనే నా అభిప్రాయం. గతంలో అయితే విద్యావంతులు, మేధావులు ఉండి వ్యాఖ్యానాలు చేసేవారు. పోనుపోను, ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేని వాళ్లను కౌన్సిల్ ద్వారా తెప్పించే పద్ధతి ప్రారంభమైంది. అందువలన ఎమ్మెల్సీ ఎన్నికలు అంత హుషారిచ్చేవి కావు. గతేడాది నేను నమోదు చేయించుకోవడానికి కారణం, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిపై గౌరవంతో ఆయనకు ఓటేద్దామని! కౌన్సిల్ ఎన్నికలలో టీచర్ ప్రతినిథులు సాధారణంగా వామపక్షాల వారు, యూనియన్ లీడర్లే ఉంటారు. వాళ్ల పేర్లూ గుర్తుండవు. వారి కార్యకలాపాలూ మనం ఫాలో కాము. వైసిపిని ఏదో ఒక ఎన్నికలో ఓడించి, తాము సజీవంగా ఉన్నామని టిడిపి చూపుకో దలచింది కాబట్టి యీ ఫోకసైనా పడింది.
ఎన్నికలకు సరిగ్గా ముందు దొంగ ఓటర్లున్నారని టిడిపి, యితర ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. డిగ్రీ చేయని కొందరికి ఓటుందని చదివాను. మరి యివన్నీ ముందే ఎందుకు చూసుకోలేదనే ప్రశ్న వస్తుంది. అధికార పార్టీ గెలిస్తే వీటి మీద యాగీ చేయవచ్చని అట్టేపెట్టుకున్నారేమో తెలియదు. ఎన్నికలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు కొత్త కాదు. ఎవరు అధికారంలో ఉన్నా అవి తప్పవు. అవి ఏ మేరకు నిజమో అక్కడున్నవారికే తెలియాలి. ఫలితాలు వచ్చేశాక మనతో పాటు వారికీ యింట్రస్టు పోతుందను కుంటాను. కోర్టుకి వెళ్లరు. ఉత్తరాంధ్ర గ్రాజువేటు ఎన్నికలలో 12 వేల ఓట్లు చెల్లకుండా పోయేయి. గ్రాజువేట్లు, టీచర్లు ఓటర్లుగా ఉన్నపుడు కూడా అలా జరిగిందంటే, పదో తరగతి వాళ్లు కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారా అనే సందేహం వస్తుంది.
ఇది చెప్పే రాజకీయ పాఠాలేమిటి? బిజెపి, జనసేన పేరుకి భాగస్వాములు కానీ, ఆచరణలో కాదని తేలిపోయింది. జనసేన అభిమానుల్లో డిగ్రీ చదివిన యువత చాలామంది ఉన్నారనుకుంటే, వైజాగ్ ప్రాంతంలో జనసేనకు బలం గణనీయంగా ఉందనుకుంటే, అక్కడి బిజెపి అభ్యర్థికి డిపాజిట్టు దక్కలేదంటే అర్థమేమిటి? వైసిపిని ఓడించండి అని పిలుపు నిచ్చి జనసేన వదిలేస్తే, దాని అభిమానులు ఓడించే సామర్థ్యం టిడిపికే ఉందనుకుని దానికి వేసి ఉంటారు. దేశమంతా మధ్యతరగతి వాళ్లు హిందూత్వ జోరులో పడి కొట్టుకుని పోతూ బిజెపిని అభిమానిస్తున్నారు అనుకుంటే ఆ లాజిక్ ఆంధ్రలో పని చేయలేదు. ఓటర్లు వైసిపి, టిడిపిల మధ్య చీలిపోయారు. ఇక వామపక్షాలు బలపరిచిన అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చినా అవి సార్వత్రిక ఎన్నికలకు పనికి రావు. ఇక టిడిపి నాయకులు తెలుసుకోదగినది ఏమిటంటే, వారు ఆత్మస్థయిర్యాన్ని కోల్పోయి, కాడి పారేయవలసిన పని లేదు. బాబు పాలన విసుగు పుట్టించిన వేళ ఓటర్లు జగన్ వైపు చూసినట్లు, జగన్ పాలన పట్ల విసుగు పుడితే టిడిపి వైపు చూస్తారు. ప్రజల్లో ఒక వర్గమైనా వారికి అండగా నిలుస్తుంది. అది జగన్‌ను ఓడించడానికి సరిపోతుంది అని యీ దశలో అనుకోలేక పోయినా, వైసిపి సీట్లను గణనీయంగా తగ్గించ గలుగుతుంది అని తప్పక అనుకోవచ్చు. నంద్యాల ఉపయెన్నిక ఫలితం తర్వాత దాన్నే భూతద్దంలో చూసి జగన్ పని అయిపోయిందనుకుని, 2019లో బోల్తా పడ్డాక నాలిక కరుచుకున్న విషయాన్ని గుర్తు పెట్టుకుని, యిప్పుడు మరీ విర్రవీగక పోవడం మంచిది.
ఇక వైసిపి నేర్చుకోవలసిన పాఠాలు చాలా ముఖ్యమైనది. ఎంతసేపూ సమాజంలోని కొన్ని వర్గాల వాళ్లనే పట్టించుకుంటూ, వాళ్లు తప్పకుండా తమకు ఓటేస్తారనే ధీమాతో, తక్కిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తే యిదే జరుగుతుంది. పథకాల వలన లాభపడ్డవారు అధికార పార్టీకి తప్పకుండా ఓటేస్తారన్న గ్యారంటీ లేదని ఎన్నికలు నిరూపిస్తున్నాయి. మా డబ్బేగా మాకిచ్చేది అనే భావం వారిలో యిప్పటికే ఉంది. సమాజంలో ప్రతి వర్గానికీ సంక్షేమ పథకాలివ్వడం సాధ్యమయ్యే పని కాదు. బడుగు వర్గాలకే యివ్వాలి. కానీ అది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా యివ్వాలి. కొన్ని వర్గాల కోసం మానిఫెస్టోలో లేని పథకాలు సైతం కనిపెట్టి, ఖజానా ఖాళీ చేసి, ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేసి, డిఎ బకాయిలు తొక్కి పెట్టి, పెన్షన్ చెల్లింపులు వాయిదా వేసి, కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగు పెట్టి వాళ్లందరినీ ఏడిపిస్తే ఎలా? సంఖ్యరీత్యా మధ్యతరగతి, విద్యావంతుల వర్గం చిన్నదే కావచ్చు, కానీ ప్రజాభిప్రాయాన్ని రూపుదిద్దడంలో దాని పాత్ర ప్రధానమైనది.
టీచర్లు, ప్రభుత్వోద్యోగులు ఎవరు అధికారంలో ఉంటే వారికి వ్యతిరేకంగా ఉంటారు. వారి డిమాండ్ల లిస్టు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. పోలింగు ఆఫీసర్లుగా వారు కొన్ని ఓట్లనైనా తారుమారు చేయగలరనే భయంతో ప్రభుత్వాలు వారు చెప్పినట్లు ఆడుతూంటాయి. వారికి బదులుగా వేరేవారిని పోలింగు ఆఫీసర్లగా పెట్టుకుంటే సరి అని వైసిపి అనుకోవచ్చు. కానీ అది గుర్తు పెట్టుకోవలసినది మధ్యతరగతి ప్రజలు అంటే ప్రభుత్వోద్యోగులు మాత్రమే కాదు. అన్ని రకాల వృత్తుల వాళ్లూ దానిలోకి వస్తారు. కేంద్ర విధానాలతో ఎలాగూ అవస్థలు పడుతున్న వారికి కాస్తయినా ఊరట కలిగించకుండా, మీతో మాకేం పని అన్నట్లు వ్యవహరిస్తే ఎలా? సంక్షేమం, అభివృద్ధి రెండింటి మధ్య తూకం పాటించాలనేది అందరూ పాడే పాటే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడాన్ని విస్మరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి? ఏ వ్యాపారి వ్యాపారం చేయగలడు? ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనబడకపోతే ఏ యువకుడు, ఏ యువతి అధికార పార్టీని ఆదరిస్తారు? మా నానమ్మకు పెన్షన్ పెంచారు, నాకు ఉద్యోగం రాకపోయినా ఫర్వాలేదని వారిలో ఎవరైనా అనుకుంటారా?
జగన్‌కు మిగిలిన సమయం తక్కువే. ఈ పెట్టుబడుల సదస్సు లాటి హంగులు చంద్రబాబు చాలా చేసి మొహం మొత్తించారు. చేసుకున్న ఒప్పందాల్లో పది శాతమైనా సాకార మౌతాయన్న నమ్మకం లేదు. పదవిలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత సదస్సు పెట్టారేం అంటే మొన్నటి దాకా కరోనా కదా అనవచ్చు. పోనీ యీ లోపున ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగు పరచుకుని ఉంటే అదో దారి. ఇప్పుడు పెట్టి ఏవో హామీ లిప్పించుకుంటే యువత సంతోషిస్తుందా? ఇక రాజధాని అంశం గురించి మాట్లాడాలంటే ఉత్తరాంధ్ర గ్రాజువేట్ సీటులో టిడిపి గెలిచింది కాబట్టి వైజాగ్‌ను రాజధానిగా అక్కడి ప్రజలు తిరస్కరించారు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటివరకు అన్ని ఎన్నికలలో అమరావతిలో టిడిపిని ఓడించారు కాబట్టి అక్కడ రాజధాని అక్కర లేదని అమరావతి వాళ్లు అంటున్నారా? రాజధాని అనేది టిడిపి, వైసిపిలకు అంశం తప్ప సాధారణ ప్రజలకు కాదు.
స్థానిక ప్రజలలో సామాన్యులకు రాజధాని వలన ఒరిగేది ఏమీ లేదు. అక్కడ అప్పటికే భూములున్న వారికి, లేకపోతే రేటు పెరుగుతుందనే ఆశతో కొత్తగా కొన్న వారికీ తప్ప, తక్కినవారికి రాజధాని ఎక్కడున్నా ఒకటే. దిల్లీ దేశానికే రాజధాని. దిల్లీ వాసులందరూ సంతోషించేస్తున్నారా? కాలుష్యం ఎక్కువై పోయిందని గగ్గోలు పెడుతున్నారు. ప్రజలకు కావలసినది అభివృద్ధి. ఉన్న ఊళ్లోనే ఉద్యోగం దొరికే వీలు. ‘మీది కార్యనిర్వాహక రాజధాని, అబ్బెబ్బే ఏకంగా రాజధానే’ అని ఊరిస్తే మురిసి ముక్కలవుతారని అనుకుంటే లెంపలేసుకోవాలి. మూడు రాజధానుల అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళదామని వైసిపి అనుకుంటోంది అనే వార్తలు యిప్పటివరకు వచ్చాయి. ఈ పాఠాల తర్వాత దాన్ని ఒక అంశంగా పెట్టకపోతేనే మంచిది అనుకోవచ్చు. ఓటర్లు పథకాల కోసం పరితపిస్తున్నారని వైసిపి అనుకుంటే ‘అంతొద్దు, యింత చాలు’ అని ఓటరు చెప్పినట్లయింది.
పథకాల లబ్ధిదారులు వేరు, యీ ఓటర్లు వేరు అనుకోవద్దు. డిగ్రీ చదువు అబ్బురం కాని యీ రోజుల్లో, అన్ని వర్గాల వారూ విద్యావంతులవుతున్న యీ కాలంలో ఈ గ్రాజువేట్లో, కనీసం వారి కుటుంబసభ్యుల్లో కొందరూ లబ్ధిదారులుండవచ్చు. తన విధానం మార్చుకోవలసిన అగత్యం వైసిపికి కల్పించిన యీ ఎన్నికల ఫలితాలను ఆహ్వానిద్దాం. అదే సమయంలో టిడిపి, జనసేన కూడా తమ వాగ్దానాలను మార్చుకోవలసిన అవసరాన్ని యివి ఎత్తి చూపుతున్నాయి. ఆ రెండు పార్టీలూ జగన్ పథకాలను విమర్శిస్తూనే, తాము అధికారంలోకి వస్తే వాటిని కొనసాగించడమే కాక, యింకా మెరుగ్గా యిస్తామని చెప్తున్నాయి. ఫలానా ఫిల్టర్లు పెట్టి, కొన్ని పథకాల లబ్ధిదారులను తగ్గిస్తాం అని చెప్పటం లేదు. మీరూ వైసిపిలాగ ఆ వర్గం వాళ్లకే దోచిపెడతామంటే మీకు మాత్రం ఎందుకు వేయడం? అని యీ విద్యావంతుల, మధ్యతరగతి వర్గం వాళ్లు అనుకునే ప్రమాదం ఉందని ఆ పార్టీలు గ్రహించాలి.