యూరోప్ దేశాలలో ముస్లిం యువతలో కొంతమంది తీవ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకై పాశ్చాత్యదేశాలు ముస్లిము దేశాలలో మతవైషమ్యాలు రగిలించే ధ్యేయంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఆ దేశాలలోని ముస్లిము యువత కూడా ఆ ప్రభావానికి లోనై, 'ఇస్లాం ప్రమాదంలో పడింది, దాన్ని రక్షించాలి' అనే ఆందోళనతో మతం కోసం తమ ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధపడి, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. వారిని జిహాద్ వైపు ఆకర్షించడానికి సిరియాలోని ముస్లిం తీవ్రవాద సంస్థలు కొరాన్ పంచిపెడుతున్నాయి, ఛాందసవాదాన్ని బోధించే మతగ్రంథాలు అందిస్తున్నాయి. సిరియా యుద్ధంలో తమ దళాలు విజయాలు సాధించిన ఘట్టాలను వీడియో తీసి జర్మనీలో వ్యాఖ్యానం చెప్పించి జర్మన్ ముస్లింల మధ్య పంచుతున్నారు. ప్రస్తుతం సిరియాలో జరుగుతున్న యుద్ధంలో దాదాపు 500 (అధికార వర్గాల ప్రకారం 320) మంది జర్మన్ ముస్లింలు పాల్గొంటున్నారు. వీరిలో 20-25 మంది మరణించారు. వెనక్కి తిరిగివచ్చిన 100 మంది ఆ యుద్ధంలో తాము నేర్చిన విధ్వంసక చర్యలను జర్మనీలో ప్రయోగించబోతున్నారని జర్మనీ ప్రభుత్వం భయపడుతోంది. కౌన్సిలింగ్ ద్వారా ముస్లిం యువతను ఆ దారినుండి మళ్లించడానికి క్లాడియా డాంట్ష్కే అనే 51 ఏళ్ల మహిళ నడుం కట్టింది.
ఆమె తూర్పు జర్మనీలో పెరిగింది. విదేశీ విద్యలు నేర్వాలనే కోరికతో అరబిక్ నేర్చుకుంది. ఇంతలో జర్మనీ ఏకీకరణ జరిగింది. తూర్పు జర్మనీలో అయితే ప్రభుత్వమే అన్నీ చూసుకునేది. ఇప్పుడు నిరుద్యోగం ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు తను నేర్చుకున్న భాష ఉపయోగపడింది. బెర్లిన్లో వున్న టర్కీ జనాభాతో కలిసి మెలసి తిరుగుతూ జర్నలిస్టుగా, అనువాదకురాలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. సాధారణంగా టర్కీ వాళ్లు యితరులను నమ్మరు. కానీ యీమెను నమ్మి కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. అందుకే వారి ఆలోచనాధోరణిలో వస్తున్న మార్పులను ఆమె పసిగట్టి, జర్మనీలోని టర్కీ ప్రజలు రానున్న కాలంలో సమస్యలు తెచ్చిపెట్టగలదు అని 1990ల్లోనే హెచ్చరించింది. కానీ ఎవరూ ఆమె మాటలను పట్టించుకోలేదు. 'వాళ్ల దేశంలో పని దొరక్క యిక్కడకు వచ్చిన పనివాళ్లు వాళ్లు. నాలుగు రోజులుండి పోతారు, మననేం చేస్తారు?' అనుకున్నారు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు.
జర్మనీలో పుట్టి పెరిగిన టర్కీ యువకులకు టర్కీ వెళ్లడానికి పాస్పోర్టు అక్కరలేదు, వారికి భాషా సమస్యా లేదు, కారెక్కితే ఒక రోజులో టర్కీ చేరవచ్చు. అక్కణ్నుంచి సిరియాలో దూరడం ఎంతసేపు? సిరియాలో జర్మన్ పౌరులైన ముస్లిములు పాలు పంచుకుంటున్నారని తెలిసిన తర్వాత జర్మన్ అధికారులు యీమెను ఆశ్రయించారు. జర్మనీలో ముస్లిం విషయాలు అధ్యయనం చేసే నిపుణులకు యీమెచే ఉపన్యాసాలు యిప్పిస్తున్నారు. సెంటర్ ఫర్ డెమోక్రాటిక్ కల్చర్ అనే సంస్థ ద్వారా యీమె చేత ముస్లిం యువకులకు కౌన్సిలింగ్ యిప్పిస్తున్నారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించేవారికి తూర్పు జర్మనీ పాలకులు కౌన్సిలింగ్ చేసి ఎలా మారుస్తున్నారో గతంలో ఆమె చేసిన అధ్యయనం యిప్పుడు అక్కరకు వస్తోంది. ఇతర దేశాలలో కూడా యిటువంటి కార్యక్రమాలు చేపడితే జిహాద్ పేర జరిగే తీవ్రవాదానికి ముకుతాడు వేయడం సాధ్యపడవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్