నంద్యాల ఉపయెన్నిక ఫలితం వచ్చేసింది. అధికారంలో వున్న టీడీపీ అభ్యర్థి నెగ్గాడు. బొటాబొటీ మెజారిటీతో నెగ్గివుంటే ప్రతిపక్షం మేం నైతిక విజయం సాధించాం అనైనా చెప్పుకునేది. కానీ బొత్తిగా ఇరవైయేడున్నర వేల మార్జిన్ అంటే బ్రహ్మాండంగా నెగ్గినట్లే! వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి అల్లాటప్పా మనిషా అంటే రాజకీయాల్లో తలపండినవాడు. పదేళ్లపాటు ఎమ్మెల్యే. మాజీమంత్రి. నియోజకవర్గానికి ఎంతో చేసినవాడు. ఓటర్లకు చిరపరిచితుడు. డబ్బుకి లోటు లేనివాడు.
ఇవతల టీడీపీ కాండిడేటు బ్రహ్మానంద రెడ్డి, మోహనరెడ్డితో స్టేచర్‌లో ఏ మాత్రం తూగడు. భూమా నాగిరెడ్డి కేరాఫ్‌గానే ఎన్నికలలో దిగాడు. మొదటిసారి ఎన్నికలలో నిలబడ్డాడు. ఇకపై చేస్తానని హామీ ఇవ్వాలే తప్ప ఇప్పటిదాకా చేసినదేమీ లేకపోయినా ఈ స్థాయి విజయం సాధించాడు. కేవలం అభ్యర్థుల పరంగా చూస్తే ఇంతే కనబడుతుంది. కానీ వారి వెనకాల వున్న శక్తులు, నాయకులు, పరిస్థితులు – ఇవే ఫలితాన్ని శాసించాయి. అవేమిటో తరచి చూస్తేనే ఈ గెలుపు అర్థమౌతుంది.
నిజానికి సాధారణ పరిస్థితుల్లో ఒక ఉపయెన్నిక గురించి ఇంత చర్చ అవసరం పడదు – ఆ ఫలితంపై ప్రభుత్వ భవితవ్యం ఆధారపడితే తప్ప! ఐదేళ్ల మధ్యలో వచ్చే ఉపయెన్నికలు ప్రజాభిప్రాయం మారుతోందా, అలాగే వుందా అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని అనుకుంటారు. కానీ ఉపయెన్నికలు సూచికలుగా పనిచేసిన సందర్భాలు చాలా తక్కువ. 2014 సెప్టెంబరులో యూపీలో 11 అసెంబ్లీ స్థానాల ఉపయెన్నికలలో ఎస్పీ 9స్థానాలను గెలుచుకుంది. 2017 వచ్చేసరికి ఏం జరిగిందో చూశాం. ప్రజా వ్యతిరేకత ఎంతవున్నా ఉపయెన్నికలలో అధికారపక్షం నెగ్గిన సందర్భాలూ వున్నాయి. ఉపయెన్నికలలో నెగ్గిన ప్రతిపక్షం తర్వాత వచ్చిన జనరల్ ఎన్నికలలో ఓడిపోయిన సందర్భాలూ వున్నాయి. అందువలన ఉపయెన్నికల బట్టి ఏ నిర్ణయానికీ రాలేము.
ఎక్కువ సందర్భాల్లో ఉపయెన్నికలలో అధికారపక్షం నెగ్గుతుంది. ఎందుకంటే క్యాబినెట్ మొత్తం ఆ నియోజకవర్గంపై ఫోకస్ పెడుతుంది. అన్ని శాఖల నుంచి ఆ నియోజకవర్గానికి నిధులు ప్రవహిస్తాయి. వ్యాపారస్తులు అధికార పార్టీకే విరాళాలిస్తారు. అధికార యంత్రాంగం అధికారపక్షానికి అనుకూలంగానే వ్యవహరిస్తుంది. సాధారణ ఎన్నికలలో అయితే, ఎవరు నెగ్గుతారో తెలియదు కాబట్టి అధికారగణం తటస్థంగా వ్యవహరిస్తుంది. పైగా బ్యూరాక్రసీ మొత్తం ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తుంది. ఉపయెన్నికలలో ఆ వాతావరణం వుండదు. అధికారంలో వున్న పార్టీ ఫలానా అని తెలుసు. దాని అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లి తలనొప్పులు తెచ్చుకోరు.
నంద్యాలతో బాటే ఉపయెన్నికలు జరిగిన తక్కిన రాష్ట్రాలలో కూడా అధికారపక్షమే గెలిచింది. దిల్లీలో అయితే కార్పోరేషన్ ఎన్నికలలో దెబ్బతిన్న ఆప్ అసెంబ్లీకి జరిగిన ఉపయెన్నికలో 24వేల మెజారిటీతో, ప్రత్యర్థిపై 18% ఓట్ల తేడాతో గెలిచింది. గోవాలో బీజేపీ ముఖ్యమంత్రి గెలిచిన స్థానంలో 31%తో, మరో స్థానంలో 44% తేడాతో గెలిచింది. నంద్యాలలో టీడీపీ 16% తేడాతో గెలిచింది. 2014లో జరిగిన 65 ఉపయెన్నికలలో 44చోట్ల, 2015లో జరిగిన 23టిల్లో 18, 2016లో జరిగిన 28టిలో 21, 2017లో జరిగిన 18టిల్లో 16 స్థానాల్లో అధికార పక్షం గెలిచింది. ఆ విధంగా చూస్తే నంద్యాల ఉపయెన్నిక ఫలితంపై పెద్దగా ఆసక్తి వుండవలసినంత అవసరంలేదు, 75% అవకాశాలు టీడీపీకే ఉన్నాయి కాబట్టి! అయితే హోరాహోరీగా కోట్లాది రూపాయల బెట్టింగులు జరిగాయి.
గణాంకాల ప్రకారమైతే వైసీపీ తరఫున పందెం కట్టేవాడు వుండకూడదు. అయినా భారీగా కట్టారు – ఎందుకంటే నంద్యాల ఉపయెన్నిక ఇతర ఎన్నికల లాంటిదికాదు కాబట్టి. ఆంధ్రలో (తెలంగాణలో కూడా) అధికారపార్టీ ధారాళంగా ఫిరాయింపులు ప్రోత్సహించింది. కానీ వాళ్లచేత రాజీనామా చేయించి, మళ్లీ గెలిచి రమ్మనలేదు. రికార్డుల ప్రకారం వాళ్లు వేరే పార్టీ పేరుతో వున్నా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. దాంతో అధికార పార్టీకి ఉపయెన్నికలంటే భయం అనే పేరు పడిపోయింది. ఈ ఉపయెన్నికలో టీడీపీ ఓడిపోయి వుంటే ఫిరాయించిన స్థానాలన్నిటిలోనూ రాజీనామా చేసి ఓటర్ల నెదుర్కోవాలని ప్రతిపక్షమే కాదు, ప్రజలూ ఎదురు చూసేవారు. అన్నిచోట్ల ఒకేసారి ఎన్నికలంటే అధికార పక్షానికి చాలా ఇబ్బందిగా వుండేది.
వాటిలో కొన్ని పోగొట్టుకున్నా, నాయకుల్లో అధికారపక్షం యొక్క పునారగమన శక్తిపై నమ్మకం సడలేది. అందువలన నంద్యాల గెలుపు టీడీపీకి అత్యవసరం అయిపోయింది. ఒక్కసీటే కదా అనుకోవడానికి లేదు, రాజకీయాలను మలుపుతిప్పే సీటు అది. బీజేపీ, టీడీపీతో వున్న పొత్తును వుంచుకుంటుందా, వూడగొట్టుకుంటుందా అనేది కూడా నంద్యాల ఫలితమే నిర్ణయిస్తుందనుకున్నారు. బీజేపీ అండలేకపోతే టీడీపీ ఆ మేరకు నష్టపోతుంది. ఇలా నంద్యాల టీడీపీ పాలిట జీవన్మరణ సమస్య అయింది.
దాన్ని మరణశాసనంగా మలచుకుందామని జగన్ దఢసంకల్పం చేసుకున్నాడు. టిక్కెట్టు దొరకని శిల్పా మోహనరెడ్డి టీడీపీి నుంచి వచ్చి చేరతాననగానే, తన క్యాండిడేటును పక్కన పెట్టి స్వాగతించాడు. సకలవిధాలా దన్నుగా నిలిచాడు. రెండువారాల పాటు అక్కడే మకాంవేసి ప్రచారం నిర్వహించాడు. సర్వ శక్తియుక్తులను ధారపోశాడు. పార్టీ ఎమ్మెల్యేలందరినీ అక్కడకు తరలించాడు. ''సాక్షి'' టీవీ, పత్రికలలో మూడువారాల పాటు నంద్యాల కథనాలు హోరెత్తించాడు. ఇదంతా చూసి టీడీపీ, వైసీపీల మధ్య టగ్-ఆఫ్-వార్‌గా వుంటుందని అందరూ అనుకున్నారు.
ఎందుకంటే నంద్యాలలో గెలిస్తే వైసీపీకి కొత్త ఊపిరి పోసినట్లే. బాబు పాలనపై ప్రజలకు మొహం మొత్తిందని ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసుకోవచ్చు. మళ్లీ ఇంకో ఉపయెన్నిక జరిగేవరకూ బాబు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో వుండేవాడు. మొరేల్ దెబ్బతినేది. వ్యాపారస్తులు విరాళాలు ధారాళంగా ఇవ్వడానికి తటపటాయించేవారు. బాబు ఎక్కడా ఉపయెన్నిక జరగకుండా స్పీకరు వ్యవస్థను మేనేజ్ చేస్తూ వచ్చాడు. కానీ యముణ్ని మేనేజ్ చేయలేకపోయాడు. నాగిరెడ్డి మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఇది అభ్యర్థుల మధ్య ఎన్నికగా కాక, ఇద్దరు పార్టీ అధ్యక్షుల మధ్య ఎన్నికగా మారింది.
దీనిలో టీడీపీని ఓడించగలిగితే జగన్ ఛాతీ ఉప్పొంగేది. అందువలన ఈ ఉపయెన్నిక జగన్‌కూ జీవన్మరణ సమస్యే అయింది. అందువలన అందరికీ ఉత్సుకత పెరిగింది. బాబు, జగన్ ఇద్దరూ ఏ చిన్న ప్రయత్నాన్నీ వదలరని, అందువలన నెగ్గినా, ఓడినా చాలాతక్కువ మార్జిన్‌తో వుంటుందనీ అందరూ అనుకున్నారు. ఆ మార్జిన్ అటా, ఇటా అన్నదే సందేహం, అందుకే బెట్టింగ్. అయితే ఈ అంచనాలు తల్లకిందులు చేస్తూ టీడీపీ పెద్ద మార్జిన్‌తో గెలిచింది. అదెలా సాధ్యమైంది?
ఏదైనా ఉపయెన్నికలో అధికారపక్షం ఓడిపోతే 'మేం చేస్తున్న అభివద్ధి కార్యక్రమాల గురించిన అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. ప్రతిపక్షం చెప్పుడు మాటలు విని ఓటర్లు మిస్‌లీడ్ అయ్యారు.' అని చెప్పుకుంటారు. నెగ్గితే 'ప్రజలు మాపై వుంచిన విశ్వాసానికి ఇది సంకేతం' అంటారు. ప్రతిపక్షం నెగ్గితే 'ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందనడానికి ఇది ఒక సూచిక అంటారు.' ఓడిపోతే 'ప్రభుత్వపక్షం అధికారదుర్వినియోగానికి పాల్పడింది. అధికారులు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యానికి మంగళం పాడారు.' అంటారు. ఈసారీ అవే వినబడ్డాయి. మామూలుగానే ఓటింగుపై ధనప్రభావం పడింది అంటూంటారు.
ఈసారి మరీ ఎక్కువగా అన్నారు. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి ఓటుకు డబ్బు ఇచ్చామని గాని, పంచామని గాని, పుచ్చుకున్నామని గాని బహిరంగంగా చెప్పరు. అందువలన కర్ణాకర్ణి వార్తల పైనే ఆధారపడాలి. అభ్యర్థులు, వారి వెనుక వున్న పార్టీ అధ్యక్షులు అందరూ డబ్బున్నవాళ్లే. పోలింగు జరుగుతున్నది ధనరాజకీయాల తెలుగు రాష్ట్రం! అందువలన డబ్బు వెల్లువై ప్రవహించింది అన్నది సులభంగా నమ్మవచ్చు. ఎవరెంత ఖర్చు పెట్టారు అన్నదే ఊహించాలి. నేను విన్న దాని ప్రకారం ప్రతిపక్షాలిచ్చిన రేటు కంటే అధికార పక్షం రెట్టింపు ఇచ్చిందట. ప్లస్ చివరి రోజుల్లో ముక్కుపుడకలు, చీరలు ఎక్‌స్ట్రాట. (ఇవన్నీ -ట వార్తలే) ఇచ్చేందుకు అధికార పక్షానికి ఒక వెసులుబాటుంది. వాళ్లు ఇప్పుడే ఆ నియోజకవర్గంలో రూ.1400 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు. 10% కమిషన్ అనుకున్నా రూ.150 కోట్లవుతుంది. వేరే ఎక్కణ్నుంచీ తేకుండానే చులాగ్గా రూ.100 కోట్లు ఖర్చుపెట్టే స్తోమత వుంది.
ఒట్టి డబ్బుతోనే ఎన్నికలు గెలవవచ్చు అనుకుంటే ఏ అధికార పార్టీ ఎన్నికలలో ఓడిపోదు కదా. అందువలన డబ్బు ప్రభావం వుండుంటుంది అనుకుంటూనే తక్కిన కారణాలకై అన్వేషించాలి. సానుభూతి పనిచేసిందంటున్నారు. నిజానికి సానుభూతి అంటూ చూపితే శిల్పా మోహనరెడ్డిపై చూపాలి. 2014లో తన ప్రత్యర్థి భార్య చనిపోవడంతో పరిస్థితి తారుమారైంది. శోభ శవాన్ని నంద్యాలలో మూడు రోజులపాటు వుంచి నాగిరెడ్డి సానుభూతిని పూర్తిగా పిండుకున్నాడు. మోహనరెడ్డి 2% మార్జిన్‌తో, 3600 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తర్వాత చూస్తే ప్రత్యర్థి తన పార్టీలోకే వచ్చిపడ్డాడు. ఉన్నంతకాలం సతాయించి పోయాడు.
ఆ సింపతీతో అఖిలకు మంత్రిపదవి ఇచ్చారు. సరేలే అనుకుంటే తన నియోజకవర్గంలో నాగిరెడ్డి అన్న కొడుక్కి టిక్కెట్టు ఇచ్చారు. ఇలా రెండు నియోజకవర్గాలూ నాగిరెడ్డి బంధువులకే పోతే ఇక తనకు మిగిలేదేముంది అని గత్యంతరం లేక పార్టీ విడిచి వైసీపీలో చేరి పోటీచేస్తే 'అమ్మానాన్న లేని అనాథలం, సానుభూతి చూపండి' అంటూ అఖిల, సోదరి ప్రచారం! 'వాళ్లేమీ చిన్నపిల్లలు కాదు, వాళ్ల సంగతి వదలండి, పోటీ చేసిన అభ్యర్థి అనాథ కాదు.' అని మోహనరెడ్డి వాదిస్తూ వున్నా ఎవరూ పట్టించుకోలేదా? శోభది దుర్మరణం కానీ, నాగిరెడ్డిది సహజమరణమే కదా, ఇంక సానుభూతికి చోటెక్కడ? నా ఉద్దేశంలో సానుభూతి పెద్ద ఫ్యాక్టర్ అయి వుండదు.
ఇక అభివద్ధి – అభివద్ధిని చూసి ఓటేశారు అనేది హాస్యాస్పదం. అభివద్ధి జరిగివుంటే అది మోహనరెడ్డి ఖాతాలోకి పోయి వుండేది. పదేళ్లు అతనే ప్రజాప్రతినిథి కాబట్టి, మూడేళ్లగా అతనే అధికారపక్షపు ప్రతినిథి కాబట్టి! అంతకంటె అభివద్ధి పనుల ప్రారంభం చూసి, ఓటేయకపోతే ఆపేస్తారేమోనని భయపడడం చేత ఓటేశారు అనేది సరైన వర్ణన. నంద్యాల వ్యాపారకేంద్రం. ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా ఆసుపత్రి, కోర్టు, సినిమాహాళ్లు అన్నీ వున్న రెండున్నర కిలోమీటర్ల రహదారిని విస్తరించమని పౌరులు 30ఏళ్లగా కోరుతున్నారు. కానీ విస్తరణను వ్యాపారస్తులు అడ్డుకోవడంతో ప్రజాప్రతినిథులు రిస్కెందుకని వూరుకుంటూ వచ్చారు. ఎందుకంటే షాపులు కూలగొట్టినా, సరైన నష్టపరిహారం ఇవ్వకపోయినా వాళ్లకు కోపాలు వస్తాయి.
నా నియోజకవర్గ అభివద్ధి కోసం పార్టీ మారుతున్నా అంటూ కొందరు వైసీపీ నాయకులు టీడీపీలోకి మారారు. నాగిరెడ్డీ అలాగే మారారు. ఐనా నంద్యాల అభివద్ధి జరగలేదు. ఫిరాయింపులు జరిగిన తక్కిన చోట్ల కూడా ఇదే పరిస్థితి వుందేమో ఉపయెన్నిక నిర్వహిస్తే తెలుస్తుంది. ఇప్పుడిక్కడ వచ్చింది కాబట్టి గబగబా వందలాది జేసీబీలు తెచ్చి టపటపా కూల్చేశారు. సరైన నోటీసులు లేవు, చర్చలులేవు, యుద్ధభూమిలో దాడి చేసినట్లు చేశారు. ఏదో అద్భుతం జరిగిపోతోందన్న ఫీలింగు కలిగించడానికి చేసినదిది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.80 కోట్లట. నష్టపరిహారానికై 30, మురికినీటి కాలువల కప్పులకై 60, ఇంతేనా రూ.850 కోట్ల ఖర్చుతో 13వేల ఇళ్ల మంజూరు, తాగునీటి సౌకర్యానికై రూ.137 కోట్లు, కాలువ పూడికలు తీయడానికి నిధులు.. ఇలా మొత్తం రూ.1500 కోట్ల పనులు ప్రకటించి 20-30% చేసి ఆపేశారు. రోడ్లు తవ్వేసి వదిలిపెట్టి, మాకు ఓట్లేయకపోతే ఇది ఇలాగే వుండిపోతుంది అని బెదరగొట్టారు.
అధికారం చేతిలో వుంది కాబట్టి, వాళ్లు ఆపినా ఆపగలరు, పైగా బాబు ఓపెన్‌గా అడిగారు – 'నా రోడ్డు మీద నడుస్తూ, నా పెన్షన్లు తీసుకుంటూ, నాకు ఓటేయరా?' అని. ఓటేయకపోతే నడవడానికి రోడ్డే లేకుండా చేస్తాడేమోనని, పరిహారం సైతం ఇవ్వడనీ ఓటర్లు జంకారు. అందుకే నంద్యాల టౌనులోనే టీడీపీకి దాదాపు 21వేల మెజారిటీ వచ్చింది.
ఈ ఎన్నిక ఫలితాన్ని చూశాక బాబుకి నెగ్గే కిటుకు తెలిసిపోయింది. ఇకపై ప్రతి ఎన్నికా గెలిచితీరతాం అని ధీమా ప్రకటించారు. గతంలో హైదరాబాదులో రోడ్లూ గీడ్లూ, హైటెక్ వగైరాలు అన్నీ చేసి, 'చూసుకోండి ఏం చేశానో' అని చెప్పుకోబోతే 'సరే చేశావుగా, చాలు ఇక దిగు' అని దింపేశారు. అందుకని ఇక్కడ వేరే రూటు పట్టారు. ఆర్భాటంగా ప్రకటించడం, కాస్త చేసి పనులు ఆపడం, నేను చెప్పినట్లు చేస్తేనే పూర్తిచేస్తా అని హెచ్చరించడం! దీనిలో ఖర్చు తక్కువ, ఓ 20% పెట్టుబడి పెడితే చాలు. ఈలోగా ఇంకో చోట ఉపయెన్నిక వస్తే అక్కడకు నిధులు మళ్లించవచ్చు.
అదేమిటి సార్ అని అడిగితే 'ఉండవయ్యా, రాజధానే పూర్తవలేదు, మీ వూరికి వచ్చిన తొందరేముంది?' అనవచ్చు. రాబోయేది వరదల కాలం, తుపాన్ల కాలం, 'ప్రక తి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి బజ్జెట్ అయిపోయింది, కేంద్రసాయం గురించి ఎదురు చూస్తున్నాం, రాగానే మీ పని చూస్తాం' అనవచ్చు. గట్టిగా మాట్లాడితే '30 ఏళ్లగా ఏ అభివద్ధీ లేకుండా వున్నారుగా, ఇంకో 30నెలలు ఆగలేరా?' అని దబాయించవచ్చు. లేదా మరో 20% పనులు చేసి, 40% పనులను 2019 ఎన్నికలలో వూరించడానికి వాడుకోవచ్చు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారిది 'లాభసాటి బేరాలు' అనే కథ వుంది. ఓ క్లబ్బులో పిచ్చాపాటీ నడిచేటప్పుడు 'వ్యాపారానికి పనికి వచ్చేదేముంది?' అనే చర్చ జరుగుతూంటే భారీ మీసాలున్న రాజు అనే అతను ఒకతను 'ఎవరైనా కొంటానంటే నా మీసాలు అమ్ముతాను' అంటాడు. శాస్త్రి అనే అతను 'పది రూపాయలకు నేనుకొంటాను.' అంటాడు. అందరూ అతను వెర్రివాడనుకుంటారు.
పదిరూపాయలు తీసుకుని రాజు మీసాలు గొరిగించుకోబోతే శాస్త్రి ఆగమంటాడు. అవసరమైనప్పుడు అడుగుతానులే అంటాడు. చివరకు ఓ ఫంక్షన్లో రాజు చక్కగా అలంకరించుకుని వచ్చినపుడు శాస్త్రి వచ్చి నీ మీసాలతో పని పడిందోయ్, ఇప్పుడే కావాలి అంటాడు. తిట్టుకుంటూనే రాజు ఒప్పుకుంటాడు. మంగలి సగం మీసం గీశాక, శాస్త్రి ఆగమంటాడు. ఇప్పటికి ఇది చాలులే, మిగతాది తర్వాత తీసుకుంటా అంటాడు. రాజు లబోదిబోమంటాడు. చివరకు పాతిక రూపాయలు ఇచ్చి తన మీసంపై హక్కులు వెనక్కి కొనుక్కుంటాడు. పని మధ్యలో ఆపించడం వలన శాస్త్రికి 15 రూ.లు లాభం. బాబు గారి విషయంలో అయితే నంద్యాల…
అబ్బే, ఇది ముఖ్యకారణం కాదు, జగన్, రోజా, చక్రపాణిల 'వాగ్ధాటే' కారణం అని కొందరనవచ్చు. అఖిల వస్త్రధారణ గురించి రోజా మాట్లాడింది నిశ్చయంగా తప్పే! గొడవయ్యాక క్షమాపణ చెప్పకపోవడం ఇంకా తప్పు. ఇక జగన్ మాట్లాడిన తీరులో అనేకమంది ప్రతిపక్ష నాయకులు తిట్టగా చూశాను. ఇవేమాటలే కాకపోయినా, ఇలాంటి మాటలు ప్రతిపక్ష నాయకుడిగా బాబు మాట్లాడారు. 'ఇదే వేరే దేశంలో అయితే ఉరి వేసేవారు,' వంటి మాటలు ఎందరో వాడారు. జగన్ మాట్లాడిన దానికి మరింత రంగు పులిమి టీడీపీ నాయకులు విమర్శించారు. అలా చేస్తారని తెలిసినపుడు జగన్ మరింత సంయమనంతో మాట్లాడడంలో విజ్ఞత వుంది.
రాయలసీమ ఓటర్లు ఆ మాటలకు నొచ్చుకుని ఓట్లేయడం మానేశారంటే నమ్మడం కష్టం. జనసామాన్యంలో నిత్యంపలికే మాటలే అవి. మీడియా చేతిలో పడి ప్రాధాన్యత సంతరించుకున్నాయంతే. 'ఏది ఏమైనా జగన్ ఇక్కడ అభ్యర్థి కాదు, రేపేదైనా పనిబడితే తాము వెళ్లవలసినది మోహనరెడ్డే, అతను మితభాషి, సౌమ్యుడు, నియోజకవర్గానికి సొంత డబ్బులతో ఎంతో కొంత చేసినవాడు, మంత్రిగా అవినీతి ముద్ర తెచ్చుకోలేదు' అని నంద్యాల ఓటర్లకు తెలుసు. అయినా అతన్ని ఓడించారు.
బాబు ప్రచారం అడ్డగోలుగా సాగింది. మొన్నటిదాకా తన పార్టీలో వున్న మోహనరెడ్డి సంస్థల్లో ఆయనకు హఠాత్తుగా అక్రమాలు గోచరించాయి. ఇక ఓటర్లను కులాలుగా, మతాలుగా చీల్చి ప్రతివర్గానికి తాయిలాలు పంచారు. యాదవులకు కష్ణ దేవాలయం, మసీదులకు, చర్చిలకు మరమ్మత్తులు.. ఇలా 'ఆత్మీయ సమావేశాల' పేర మొత్తం సమాజాన్ని చీల్చి చెండాడారు. టీడీపీని దాక్కోమన్నారు. కిడ్నాపులు, రౌడీ షీటర్ల మద్దతు తీసుకోవడం, డబ్బులిచ్చి నాయకులను ఆకట్టుకోవడం.. గట్రాలు అన్నీ జరిగాయి. 70మంది ఎమ్మెల్యేలు క్యాంప్ వేశారు.
క్యాబినెట్ అన్నిటికన్న ఘోరం – సర్వేల పేరుతో ఇంటింటికి బెదిరింపు సేనలు. సర్వే చేసినవారే చెప్పారు – పేరు, ఫోన్ నెంబరూ తీసుకుంటున్నాం అని. అవెందుకు అడగాలి? 'అన్నీ మా చేతిలో వున్నాయి, తలచుకుంటే ఆపేయగలం జాగ్రత్త' అని బెదిరించడానికి కాకపోతే! కాకినాడలోనూ ఇదే ట్రిక్కు ప్లే చేస్తున్నారు. జనరల్ ఎన్నికలు వచ్చినపుడు మాత్రం ఇలాంటివి పని చేయకపోవచ్చు – రాజెవడో, రంగడెవడో తెలియదు కాబట్టి!
తెలియదు అని మాటవరసకి అంటున్నాను కానీ చూడబోతే బాబుకి ఎదురు లేనట్టుంది. రాయలసీమలో, అదీ మైనారిటీలు పెద్ద సంఖ్యలో వున్న నంద్యాల ఫలితం తర్వాత జగన్ నాయకత్వంపై మైనారిటీలతో పాటు, ప్రజలకూ విశ్వాసం సన్నగిల్లిందని చెప్పాల్సిందే. పార్టీ మారి వచ్చిన చక్రపాణి చేత రిజైన్ చేయించి జగన్ తన నైతికత చూపుకున్నా లాభం లేకపోయింది. 19 రౌండ్లలో ఒక్క రౌండులో మాత్రమే వైసీపీ గెలిచింది. అన్ని వనరులు వుండి కూడా అంత మార్జిన్‌తో తమ అభ్యర్థి ఓడిపోవడం వైసీపీ కార్యకర్తలను కృంగదీసి వుంటుంది.
ప్రశాంత్ కిశోర్ ఏం చేశాడన్న ప్రశ్న వినబడుతోంది. అతని సూచనలేమిటో, అంచనాలేమిటో బయటకు తెలియలేదు. కానీ ఆంధ్రలో బాబును ఎదుర్కోవడం ఎంత కష్టమో నంద్యాల అతనికి నేర్పి వుంటుంది. ఆంధ్రలో బాబుపాలన బాగాలేదు, 2014లో రాష్ట్రమంతా టీడీపీ-బీజేపీ కూటమికి ఓటేసిన సమయంలో సైతం నెగ్గిన సీటునైనా వైసీపీ నిలుపుకోలేక పోవడంతో సరైన ప్రతిపక్షమూ లేదని తేలిపోయింది. ఆ ప్రతిపక్షం వేకెన్సీని బీజేపీ పూరిస్తుందా, లేక వేరే పార్టీ ఏదైనా ఉద్భవిస్తుందా అనేది ఊహించుకోవడానికి బాగానే వుంటుంది కానీ, ఏడాదిన్నర సమయంలో అలాంటిది రూపు దిద్దుకోవడానికి ఎన్టీయార్ మళ్లీ అవతరించాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్