మొన్ననే వచ్చిన ఒక స్టార్ హీరో సినిమాలో.. హీరోయిన్ పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ.. బాలీవుడ్ బూతుపాట, ఐటమ్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్లో ప్లే చేయించాడు ఆ సినిమా డైరెక్టర్! ఆ పాటకు చిందులేస్తూ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందన్నమాట..! అదీ ఇంట్రడక్షన్ సీనంటే..! ఆ సినిమా భారీ వసూళ్లను సాధించుకుంది. 'సభ్య సమాజం..' సినిమాను చూసి మురిసిపోయింది. పిల్లాపాపలు వెళ్లి ఆ సినిమాను చూసి తరించారు.
ఇంతకంటే ఘనులైన డైరెక్టర్లు.. గత కొన్ని దశాబ్దాలుగా హీరోయిన్‌ను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే.. స్విమ్ సూటో, బికినీనో వేయించి.. వారిచేత గ్లామర్‌ను ఒలకపోస్తూ.. ఇది మన వాళ్లకు బాగా అలవాటైన టెక్నిక్. అలా కాకపోతే.. కెమెరాను హీరోయిన్ మొహం మీద, ఆమె ఎద ఎత్తుల మీద.. ఫోకస్ చేయిస్తూ.. ఆమె శారీరక సౌష్టవాన్నంతా చూపిస్తూ.. హీరోయిన్ పాత్రను పరిచయం చేస్తున్నారు… ఇవన్నీ ఎవరికి తెలియనివి. అయితే అవేవీ తప్పు అని మన ప్రేక్షకజనానికి అనిపించలేదు, అనిపించదు!
మరి ఇలాంటి ఇండస్ట్రీలో ఇలాచేస్తే తప్పుకాదా? ఇతడేం డైరెక్టర్ అండీ, తన సినిమాలో హీరోయిన్‌ను చూపించే ఫస్ట్ సీన్లో అష్టలక్ష్మీస్త్రోత్రాన్ని బ్యాక్‌గ్రౌండ్లో ప్లే చేశాడు! మంగళూరు రేడియో స్టేషన్ నుంచి.. బాంబే సిస్టర్స్ పాడిన అష్టలక్ష్మీ స్తోత్రం బ్యాక్ గ్రౌండ్లో ప్లే అవుతుండగా.. అమాయక చూపులతో, అదురుబెదురు నడకతో.. హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఎన్ని గట్స్ ఈ 'అర్జున్ రెడ్డి' సినిమా డైరెక్టర్‌కు?
'సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి యేమమయే. మునిగణ మండిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే. పంకజ వాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే. జయజయహే మధుసూదన కామిని..' అంటూ ఎనిమిది రూపాల్లోని లక్ష్మీ దేవితో హీరోయిన్‌ని పోల్చుతావా? మతి ఉండాల్సిన తెలుగు డైరెక్టర్ చేయాల్సిన పనేనా? ఇది. హీరోయిన్‌ని ఏ స్విమ్మింగ్ ఫూల్ దగ్గరో ఇంట్రడ్యూస్ చేస్తూ సీన్ రాసుకోవాలి కానీ.. ఆడదాన్ని, అమ్మవారితో సమానం అన్నట్టుగా చూపుతావా? ఇదేనా తెలుగు సినిమా నీకు నేర్పింది?
ఆడవాళ్లను ఈ స్థాయిలో గౌరవిస్తూ.. నీవు ఉధాత్తమైన రీతిలో రాసుకున్న పాత్రలో అమ్మవారికి ఉన్నంత గొప్పదనం ఉందని చూపడం ద్వారా ప్లే అవుతున్నది అష్టలక్ష్మీ స్తోత్రం అనే విషయం తెలిసిన వాడి గుండెలు పిండేశావ్! కానీ ఏం చేద్దాం.. నువ్వు తీసింది ఒక తెలుగు సినిమా. అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఆదిపరాశక్తి స్తోత్రాన్ని పెట్టావన్న విషయం చాలామంది గుర్తించలేదు. గుర్తించరు కూడా.
ఎంతసేపూ.. నువ్వు ముద్దులు పెట్టించావ్, డ్రగ్స్ వాడిపించావ్.. బోల్డ్‌గా మాట్లాడించావ్.. అని మొత్తుకుంటున్నారు కానీ.. గత రెండు దశాబ్దాల్లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనే.. హీరోయిన్ ఇంట్రడక్షన్లో ఇలాంటి శ్లోకాన్ని వాడిన మనసున్న డైరెక్టర్ ఒక్కడూ లేడనే విషయాన్ని తెలుగు సినీ ప్రేక్షకగణం ఎన్నటికి గుర్తిస్తుంది?
ఇలాంటి ప్రేమ కథను రాస్తావా.. ఏం బుద్ధి నీది?
రియల్ లవ్ స్టోరీస్ ఎగ్జిస్టింగ్ ఇన్‌మూవీస్ ఓన్లీ… అనేది ఒక ఇంగ్లిష్ నానుడి. నిజమే.. నిజజీవితంలో ఇలాంటి ప్రేమకథలు చూడలేం. యాంత్రికంగా మారిపోయిన సమాజంలో.. ఈ స్థాయిలో ప్రేమించే వాళ్లు ఉండరు. కోట్ల రూపాయల ఆస్తి, అంతకంటే విలువైన చదువు, అందం.. అన్నీ ఉన్న కుర్రాడు.. ప్రేమించిన అమ్మాయి కోసం అంతలా పడిచావడం, అంతగా పతనం అయిపోవడం.. నిజ జీవితంలో జరగని పని. నీకు ఎన్నో ఉన్నాయి.. నువ్వు కోల్పోయింది సర్వమే.. అని అనుక్షణం చుట్టూ ఉన్న వాళ్లు పోరుతున్నా.. అన్నీ ఉన్నా, ఆమె లేదనే.. బాధతో ఒక వ్యక్తి అలా తయారు కావడం అంటే.. నిజజీవితంలో అది జరిగేపని కాదు.
నిజమైన ప్రేమకథలు.. సినిమాల్లోనే ఉంటాయని, అంతస్వచ్ఛమైన ప్రేమను చూపుతావా? ఏంటిది? బతికితే.. అలా బతకాల్రా.. అని ఆ మూడు గంటలసేపైనా.. అనిపించింది నిజమే, తెలుగు సినిమా స్టాండర్డ్స్ గమనించావా ఈ మధ్య? యూత్ అంటే.. బ్లూఫిల్మ్‌లు, ఆంటీలు.. అన్నట్టుగా ఉండాలి, కోట్లు సంపాదించే కెరీర్ కోసం పరితపించాలి.. అంతకు మించి ఏంలేదని కదా తెలుగు సినిమా చూపుతున్నది. ఇలాంటి సినిమాల మధ్యన.. 'అర్జున్ రెడ్డి' లాంటి ప్రేమికుడిని తెస్తావా? నీకెన్ని గట్స్ అయ్యా వంగా సందీప్ రెడ్డి?
ఆబ్జెక్టివిటీ వద్దంటావా?
అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు? ఈ మధ్య టెలివిజన్ యాడ్స్‌నైనా గమనిస్తున్నావా? స్ప్రే కొట్టుకుంటే… అమ్మాయిలు పడిపోతారు, కొత్త బైక్‌లో రోడ్డు ఎక్కితే.. డజన్ల కొద్దీ అమ్మాయిలు ఆ బైక్ వెంట పరిగెత్తుకు వస్తారు. తొలిరోజు స్ప్రే కొట్టుకుని వెళ్తే అమ్మాయి పడిపోతుంది, రెండో రోజు అదే సెంటు వాసనకు.. వాళ్ల అమ్మ పడిపోతోంది! అడ్వర్టైజ్‌మెంట్స్ అనేకాదు.. సినిమాలు ఇస్తున్న సందేశం కూడా ఇదే. మరి 'అర్జున్ రెడ్డి' ఏమిటి? ఆడదంటే ఆబ్జెక్ట్ కాదని అంటాడు? ఎయిర్ హోస్టెస్ అందంగా లేదని.. వాగిన వాడి పెళ్లినే చెడగొట్టి పంపిస్తాడేంటి? ఈతరం వాడివేనా నువ్వు?
ముద్దులు పెట్టించడం ఇలాగేనా..?
అదేంటి.. అన్ని ముద్దు సీన్లా? ముద్దంటే ఎంత పాపమో తెలుసా? స్వచ్ఛమైన ప్రేమను చూపించి.. నువ్వు కొన్ని ముద్దులు పెట్టిస్తే అది బూతు. అదే ఇప్పటికి ముప్పై ఏళ్ల కిందటే మణిరత్నం హీరోహీరోయిన్ల చేత ముద్దు పెట్టించి, ఏకంగా అలాగే ఒక పాటనే చిత్రీకరిస్తే.. అది కళాఖండం! ఆ సినిమా పాటను భక్తిగీతంలా వింటాం, అది క్రియేటివిటీ అని మా మేధస్సుకు మేమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం, అలాంటి క్రియేటివిటీని మెచ్చుకునే కళా గుండె మాకుందని గర్వపడతాం.. అయితే నువ్వు తెలుగు వాడివి కదా.. తప్పే, కచ్చితంగా తప్పే.
ముద్దుసీన్లన్నీ తప్పే! మణిరత్నం ముద్దులు పెట్టిస్తే కళ, అదే శింబూగాడొచ్చి పెదవులు కొరికితే.. స్టైల్.. కానీ అర్జున్ రెడ్డి చేసింది మాత్రం తప్పే! అదేంటని అడగొద్దు.. యూట్యూబ్‌లో లిప్‌లాక్ సీన్లు వెదుక్కొని చూస్తాం మేం. ఇప్పటికి కావు, ఎప్పటెప్పటివో.. దేశ విదేశాలవీ.. అయితే అర్జున్ రెడ్డిది మాత్రం తప్పే. ఖండించేస్తున్నాం అంతే. హిపోక్రసీ కాదు ఇది, మనసులో ఒకటి, పైకి ఒకటి చెప్పే ద్వంద్వవైఖరి. మరేం చేస్తాం.. నువ్వు పెట్టించిన ముద్దుల్లో లవ్ ఉంది కానీ, లస్ట్ లేదు.. మాకు కావాల్సింది లస్ట్. అందుకే.. నీపై ఈ విమర్శలు!
ఇక సెక్స్ సీన్లు తీస్తావా? అంతకన్నా పాపముందా?
తెలుగు సినిమా చరిత్రలో ఇంత వరకూ హీరోహీరోయిన్లు ఒకరి మీద ఒకరు పడుకున్న సన్నివేశాలు ఏవైనా ఉన్నాయని అనుకుంటున్నావా? లేవు, లేవంతే. ఉన్నాయంటే ఒప్పుకోమంతే. హీరోయిన్లను అలా ఒకరి మీద ఒకరిని పడుకోబెట్టిన దర్శకుడు లేడు.. అంత ఉత్తమమైనది తెలుగు చిత్ర పరిశ్రమ. అలాంటి చిత్రసీమను ఇలా తయారు చేస్తావా? హీరోయిన్ల చేత హాట్ ఎక్స్‌ప్రెషన్లు పెట్టించు, హీరోయిన్ బొడ్డు మీద హీరో చేత ముద్దులు పెట్టించు.. చీర పక్కకు తీసి ఎద అందాలు చూపించు.. ఫస్ట్‌నైట్ సీన్ల పేరుతో.. బెడ్ మీద్ ఏమైనా చేయించు.. అదంతా ఫ్యామిలీ టైప్! చీర కట్టించి ఏం చేసినా పర్వాలేదు.. ఎంత ఎరోటిక్‌గా చూపినా తప్పులేదు.. అదంతా మామూలే.. నువ్వు చేసింది మాత్రం తప్పే!
ఇవయ్యా.. వంగా సందీప్ రెడ్డి, 'అర్జున్ రెడ్డి'తో నువ్వు చేయించిన తప్పులు! ఆడదాన్ని అమ్మవారిగా చూపావు, ఆబ్జెక్ట్‌లా చూడనివ్వొద్దన్నావ్, రొమాంటిక్ సీన్లలో లస్ట్ ఉట్టి పడకుండా.. లవ్ చూపించావ్.. ఇవన్నీ నువ్వు చేసిన తప్పులు. ఇందుకుగానూ నిన్నేం చేసినా తప్పులేదు, ఎంతమంది ఎంతగా విమర్శించినా తప్పులేదు. మాకు ఇలాంటి సినిమాలొద్దు.. అవే కావాలి. అర్థమైందా?