వరుసగా నాలుగో వారం కూడా బిగ్ బాస్ రియాలిటీ షోకు మంచి రేటింగ్ రావడంతో సోషల్ మీడియాలో ఇప్పుడో ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. కేవలం ఎన్టీఆర్ వల్లనే బిగ్ బాస్ షో కు అంత మంచి రేటింగ్ వస్తోందని, లేదంటే పెద్దగా ఎవ్వరూ పట్టించుకునే వాళ్లు కాదనేది ఆ డిస్కషన్. ఈ వాదనతో దాదాపు 80శాతం మంది ఏకీభవించడం విశేషం.
ఎందుకంటే బిగ్ బాస్ అనేది తెలుగులోకి రాకముందే అందరికీ తెలిసిన వ్యవహారం. మరీ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ లో బిగ్ బాస్ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఇలాంటి కాన్సెప్ట్ ను తెలుగులో కాస్త కొత్తగా చెప్పాలన్నా.. తిరిగి అర్బన్ జనాల్ని ఈ కార్యక్రమానికి రప్పించాలన్నా స్టార్ వాల్యూ తప్పనిసరి.
స్టార్ మా అదే పనిచేసింది. కాన్సెప్ట్ ను కొత్తగా చెప్పకపోయినా, ఎన్టీఆర్ లాంటి మాస్ అప్పీల్ ఉన్న హీరోను రంగంలోకి దించింది. ఎన్టీఆర్ కు ఏకంగా 8కోట్లు ఇవ్వడానికి కూడా వెనకాడలేదు ఈ గ్రూప్.
అంతెందుకు ఎన్టీఆర్ లేకుండా బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఒకసారి ఊహించుకుందాం. ఈ రియాలిటీ షోలో పాల్గొనే సెలబ్రిటీస్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఫేమస్ కాదు. ఇంకా చెప్పాలంటే కత్తి మహేష్ లాంటి వ్యక్తులు చాలా మందికి తెలియనే తెలీదు. ఇలాంటి కార్యక్రమానికి ఓ సాధారణ యాంకర్ ను పెడితే అంతే సంగతులు. అందుకే స్టార్ మాకు ఎన్టీఆర్ అవసరమయ్యాడు.
మరోవైపు ఎన్టీఆర్ కు ప్రత్యామ్నాయంగా మరికొంతమంది హీరోల పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ.. ఇప్పుడు షో సూపర్ హిట్ అయింది కాబట్టి తారక్ స్థానంలో మరో హీరోను ఊహించుకోలేం అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎటొచ్చి ఎన్టీఆర్ రాకతో స్టార్ మా దశ తిరిగిందనేది మాత్రం నిజం.