నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ జోషి రాజీనామా

ఫిబ్రవరి 26 న ఇండియన్‌ నేవీకి చెందిన సింధురత్న అనే సబ్‌మెరైన్‌ (జలాంతర్గామి) ముంబయి తీరానికి 80 కి.మీ.ల దూరంలో వుండగా బ్యాటరీ పిట్‌లో మంటలు రేగాయి. ఆర్పడానికి వెళ్లిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ కపీశ్‌,…

ఫిబ్రవరి 26 న ఇండియన్‌ నేవీకి చెందిన సింధురత్న అనే సబ్‌మెరైన్‌ (జలాంతర్గామి) ముంబయి తీరానికి 80 కి.మీ.ల దూరంలో వుండగా బ్యాటరీ పిట్‌లో మంటలు రేగాయి. ఆర్పడానికి వెళ్లిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ కపీశ్‌, లెఫ్టినెంట్‌ మనోరంజన్‌ చనిపోయారు. పొగచుట్టుముట్టి ఏడుగురు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే విమానంలో నేవీ హాస్పటల్‌కు తీసుకుని వెళ్లడంతో బతికారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటలకే నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ డి కె జోషి నైతికబాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. మన దేశంలో సైనికాధికారులు యిలా రాజీనామా చేయడం చాలా అరుదు. 1960లలో రక్షణమంత్రి కృష్ణమీనన్‌తో విభేదాల కారణంగా జనరల్‌ కె ఎస్‌ తిమ్మయ్య రాజీనామా చేస్తానంటే ప్రధాని నెహ్రూ వారించారు. 1962లో చైనా యుద్ధంలో ఓటమి తర్వాత ఆర్మీ చీఫ్‌ పి ఎన్‌ థాపర్‌ రాజీనామా చేశారు. 1998లో నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ విష్ణు భగవత్‌ రక్షణమంత్రి జార్జి ఫెర్నాండెజ్‌తో తనకున్న విభేదాలను బహిరంగపరచడంతో ఆయన్ను తొలగించారు. ఇప్పుడీయన రాజీనామా చేయడానికి కారణం – గత ఆర్నెల్లలో నేవీలో 7 ప్రమాదాలు జరగడం! రైలు ప్రమాదాలు అనేకం జరిగినా మంత్రులు రాజీనామా చేయడం లేదు కదా, యీయన మాత్రం ఎందుకు చేయాలి? అంటే జోషి తీరే అంత.

2012లో యీ పదవిలోకి వచ్చిన అడ్మిరల్‌ జోషికి సమర్థుడు, చండశాసనుడు, నిజాయితీపరుడన్న యిమేజి వుంది. తను స్వయంగా పెర్‌ఫెక్షనిస్టు కాబట్టి తన స్టాఫ్‌ ఏ పొరబాటు చేసినా సహించని గుణం వుంది. వాళ్లందరికీ యీయనంటే చచ్చే భయం. ఇటీవలే చాలామంది ఆఫీసర్లను ఎడాపెడా బదిలీ చేసేశాడు. చిన్న పొరబాట్లకు కూడా పెద్ద శిక్షలే విధించాడు. ఇప్పుడు తనను తానే శిక్షించుకున్నాడు. ఇంకా 18 నెలల సర్వీసు వున్నా, రాజీనామా చేసేశాడు. 2013 ఆగస్టు 14న సింధురక్షక్‌ అనే 3వేల టన్నుల బరువున్న జలాంతర్గామిలో ఆయుధాగారం పేలిపోయి మునిగిపోయి 18 మంది చనిపోవడంతో నేవీ ప్రతిష్ట దెబ్బ తింది. 80 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో రష్యాలో రిపేర్లు చేయించుకుని వచ్చిన సింధురక్షక్‌కు యింకా 15 సం||రాల ఆయుర్దాయం వుంది. కానీ ఆ ప్రమాదంతో నాశనమైంది. దాన్ని పైకి వెలికి తీస్తే తప్ప ప్రమాదం ఎందుకు జరిగిందో నిర్ధారించలేరు. ఆ పని యీ ఏడాది మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ లోపునే డిసెంబరు 4 న ఐఎన్‌ఎస్‌ కొంకణ్‌పై అగ్నిప్రమాదం జరిగింది. డిసెంబరు 23న ఐఎన్‌ఎస్‌ తల్వార్‌ రత్నగిరి తీరం వద్ద ఒక చేపలబోటును గుద్దింది. బోటు  మునిగిపోయి, 27 మంది జాలర్లు సముద్రంలో పడిపోయారు. అదృష్టవశాత్తూ ఎవరూ చావలేదు. ముంబయి సముద్రతీరంలో యిసుక మేట వేయడంతో  2014 జనవరి 17 న సింధుఘోష అనే జలాంతర్గామి నేలమీదకు వచ్చేసింది. మళ్లీ సముద్రజలాలలోకి పంపడం పెద్ద పని. ప్రమాదం జరగలేదు కానీ జోషి దీన్ని సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు. ఇది జరిగిన నాలుగు రోజులకు జనవరి 21 న ఐఎన్‌ఎస్‌ విపుల్‌ బాడీలో లీకులు కనబడ్డాయి. మర్నాడు జనవరి 22న ఐఎన్‌ఎస్‌ బెట్వా డోమ్‌లో పగుళ్లు కనబడ్డాయి. జనవరి 30 న ఐఎన్‌ఎస్‌ ఐరావత్‌ ప్రొపెల్లర్లు డామేజి అయ్యాయి.

ఇవన్నీ బయటపడుతూంటే డిఫెన్సు మినిస్ట్రీ ఆందోళన వ్యక్తం చేసింది. వివరాలు యిమ్మంటే నేవీ యివ్వడం లేదని, మేమే చూసుకుంటామని అంటోందని ఆరోపించింది. నిజానికి సింధురక్షక్‌ మునిగిపోయినపుడు ఏంటోనీ అడ్మిరల్‌ జోషితో ''తన విలువైన ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత నేవీది.'' అని చురక వేశారు. నెల తర్వాత నిర్వహించిన ప్రెస్‌ సమావేశంలో జోషి ''ఇతర దేశాల నేవీలతో పోలిస్తే మన దేశపు నేవీ సేఫ్టీ రికార్డు చాలా బాగుంది. ప్రమాదాలు చెదురుమదురుగానే జరుగుతున్నాయి. వాటిని గుదిగుచ్చి నేవీ సరిగ్గా పనిచేయడం లేదన్న అభిప్రాయానికి రాకూడదు.'' అని వాదించారు. ఇప్పుడు సింధురత్న ప్రమాదంతో ఆయనకు మొహం చెల్లలేదు. ప్రమాదం జరగగానే ఆంటోనీ సంజాయిషీ అడగడానికి పిలిస్తే రాజీనామా లేఖ చేతిలో పెట్టారు. నేవీ అధికారులు జోషి చర్యను అభినందిస్తూ ఆయన్ను బలిపశువు చేశారని అన్నారు. ఇప్పటిదాకా 7 ప్రమాదాలు జరిగినా నెట్టుకొస్తున్న జోషి సింధురత్న ప్రమాదానికి ఎందుకింత చలించారంటే – ఆ తరహా సబ్‌మెరైన్లకున్న ఖ్యాతి అలాటిది. రష్యా తయారీదార్లు దాన్ని ఇకెఎమ్‌ అని పేరు పెట్టినా 'కిలో' తరగతికి చెందినవిగా అవి ప్రసిద్ధి కెక్కాయి. మనదేశంలో వాటిని సింధుఘోష క్లాస్‌ అంటారు. వీటి ఉనికిని కనిపెట్టడం చాలా కష్టం. శత్రునౌకలు సముద్రంలోకి శబ్దతరంగాలను వదిలి, వాటికి ఎక్కడ అవరోధం కలిగిందో అక్కడ జలాంతర్గామి వున్నట్టు తెలుసుకుంటారు. ఈ కిలోలు వాటికి లొంగవు సరికదా, అలా వచ్చిన శబ్దతరంగాలను వక్రీకరించి తిప్పి పంపుతాయి. దాంతో శత్రునౌక లెక్క తప్పి, దూరంగా ఎటాక్‌ చేస్తుంది. కానీ ఆ శబ్దతరంగాల కారణంగా యీ కిలోకు శత్రునౌక ఎక్కడుందో తెలిసిపోయి, వెళ్లి దాడి చేస్తుంది. 

ఇంకో లాభం ఏమిటంటే – ఈ కిలోలో 45 రోజుల పాటు సముద్రంలో దాగి వుండవచ్చు. అప్పుడైనా డీజిల్‌ బ్యాటరీలకు రీచార్జి చేయడానికి వస్తే చాలు. సముద్రపు లోతుల్లో వుంటే కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌ అందడం కష్టం. కానీ మనదేశంలో లో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని బాగా అభివృద్ధి చేశారు కాబట్టి దాని సహాయంతో ఎంత లోతుగా వున్నా సిగ్నల్స్‌ అందుకోవచ్చు. ఇలాటి కిలోలను 1990లలో మనదేశం రష్యానుండి కొనుగోలు చేసింది. దీని గుట్టుమట్లు తెలుసుకోవాలని అమెరికా చాలా ప్రయత్నించింది. అందుకని భారత-అమెరికా నేవీలు యిరుదేశాల నౌకల్లో సంయుక్తంగా ఎక్సర్‌సైజ్‌ చేయాలని, తర్ఫీదు పొందాలని ప్రతిపాదించింది. భారత్‌ సరేనంది. మీరు ఏమేం తరహా నౌకలు యీ కసరత్తులో వాడతారో జాబితా యివ్వండి అంది. మనవాళ్లు దానిలో జర్మన్‌ తయారీ సబ్‌మెరైన్‌ ఎచ్‌డిడబ్ల్యు అని రాసి యిచ్చారు. 'దాని బదులు కిలో వుంటే బాగుంటుంది కదా' అని అమెరికన్లు అన్నారు. విదేశాంగ శాఖ సరే అన్నా నేవీ అధికారులు ససేమిరా అన్నారు. దాంతో అమెరికాకు యీ ప్రతిపాదనపై ఉత్సాహం చచ్చింది. వాళ్ల ఆంతర్యం ఏమిటంటే ఇరాన్‌తో వాళ్లు అప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఇరాన్‌ దగ్గర యీ తరహా సబ్‌మెరైన్లు వున్నాయి. మన దగ్గర దాన్ని అధ్యయనం చేసి, దానికి విరుగుడు కనిపెట్టి ఇరాన్‌ను ఓడిద్దామని వాళ్ల ప్లాను. అప్పటికే పర్షియన్‌ గల్ఫ్‌ కి అటూ, యిటూ సెన్సర్లు పెట్టి ఇరాన్‌ సబ్‌మెరైన్ల ఉనికి కనిపెడుతున్నారు. కానీ కిలోలు వాటి దృష్టిలో పడకుండా తప్పించుకుంటున్నాయి. ఇదంతా తెలుసుకున్న ఇరాన్‌ అమెరికా ప్రతిపాదన తిరస్కరించమని మనను కోరింది. అందుచేత మనవాళ్లు అమెరికాకు 'నో' చెప్పేశారు. పదిహేనేళ్ల తర్వాత ఇరాన్‌ తన అభ్యంతరాన్ని ఉపసంహరించుకుంది. అప్పుడు ఇండియన్‌ నేవీ అమెరికాతో కలిసి కిలో పై ఎక్సర్‌సైజ్‌ నిర్వహించింది. 

ఇప్పుడు ప్రమాదానికి గురైన సింధురత్న భారతదేశానికి వున్న 12 సబ్‌మెరైన్లలో ఒకటి. వోల్వో బస్సుల నిర్మాణంలో కూడా మనవాళ్లు లోపాలున్నాయని ఆరోపించగలిగారు కానీ కిలోల ఇంజనీరింగ్‌లో కాని డిజైన్‌లో కాని ఏ లోపాలు వుండని అందరికీ తెలుసు. అంటే నిర్వహణలోనే లోపం వుందన్నమాట. వైరింగు లోపం వలన గ్యాస్‌ లీకయి మంట పుట్టిందని, అది బ్యాటరీ పిట్‌కు వ్యాపించిందని తెలుస్తోంది. దాని కారణంగా నేవీలో పెద్ద తలకాయ ఒకటి రాలిపోయింది. ఇకనైన నిర్వహణపై వాళ్లు దృష్టి సారిస్తారని ఆశిద్దాం. దానితో బాటు ఇంకోటి కూడా…! నిర్వహణాలోపాల వలన అనేక రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రైల్వేలో కూడా ఎవరైనా ఉన్నతాధికారి యిటువంటి రాజీనామా ఒకటి చేస్తే, కనీసం అందరూ వులిక్కిపడి మేలుకోవచ్చు. అప్పుడు మనం ధైర్యంగా రైలెక్కవచ్చు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]