ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? -3

పవన్‌పై అతని ప్రత్యర్థులు చేసిన విమర్శల్లో ప్రధానమైనది – తన పార్టీ సిద్ధాంతాలు చెప్పలేదని! అసలు ఏ పార్టీకైనా ప్రత్యేకమైన సిద్ధాంతాలున్నాయని, వారికో ప్రత్యేకత వుందనీ చెపితే నాకు నవ్వు వస్తుంది. చిన్నపుడు కాంగ్రెసుకి…

పవన్‌పై అతని ప్రత్యర్థులు చేసిన విమర్శల్లో ప్రధానమైనది – తన పార్టీ సిద్ధాంతాలు చెప్పలేదని! అసలు ఏ పార్టీకైనా ప్రత్యేకమైన సిద్ధాంతాలున్నాయని, వారికో ప్రత్యేకత వుందనీ చెపితే నాకు నవ్వు వస్తుంది. చిన్నపుడు కాంగ్రెసుకి కమ్యూనిస్టులు పూర్తిగా వ్యతిరేకమని, బిజెపి యీ యిద్దరితోనూ విభేదిస్తుందని నమ్మేవాణ్ని. తర్వాత తర్వాత తెలిసివచ్చింది – అందరూ కాంగ్రెసు పద్ధతిలోనే పోతున్నారని. కాంగ్రెస్‌ వంశపారంపర్య రాజకీయాలు విభేదిస్తూ, ఢిల్లీ పెత్తనాన్ని నిరసిస్తూ టిడిపి పుట్టినపుడు అబ్బో అనుకున్నాను. అతి త్వరలోనే అదీ కాంగ్రెసు మార్గం పట్టింది. ఎవరి మ్యానిఫెస్టో చూసినా ఒకటే దంపుళ్ల పాట – అగ్రవర్ణాలు అడుక్కుతిన్నా ఫర్వాలేదు, బిసిలకు పెద్దపీట వేస్తాం, మైనారిటీలను నెత్తిన పెట్టుకుంటాం, దళితుల కోసం ప్రత్యేకమైన ప్రణాళిక వుంది. మహిళలను పైకి తీసుకువస్తాం. యువతకు అవకాశాలు కల్పిస్తాం. విద్య, వైద్యానికే మా ప్రాధాన్యత. సైన్సు, టెక్నాలజీ మా ఆరోప్రాణం. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతాం, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతాం, అన్నీ వూరికే యిస్తాం, కానీ అభివృద్ధి సాధిస్తాం… యిలాగే వూకదంపుడు. ఒక్క మహానుభావుడు కూడా బజెట్‌లో యింత శాతం అభివృద్ధికి, యింత శాతం ఫలానా సంక్షేమపథకానికి అని చెప్పడు. నిధులు ఎక్కణ్నుంచి తెస్తావ్‌ అని అడిగితే అధికారం యిచ్చి చూడండి, అదరగొట్టేస్తాన్‌, అవినీతిపరుల ఆస్తులు జప్తు చేసి వాటితో ప్రాజెక్టులు కట్టేస్తాన్‌ అంటారు. ఇప్పటిదాకా ఎందరు అవినీతిపరుల ఆస్తులు జప్తు అయ్యాయి చెప్పండి. 

వీళ్లు ఏ సమస్యకూ పరిష్కారం చెప్పరు. అధికారంలోకి వచ్చాక అందర్నీ కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరిస్తా అని హామీ యిస్తారంతే. ప్రతిపక్షంలో వుండగా అఖిలపక్షం మీటింగుకి రానే రారు. వీళ్లు అధికారంలోకి వచ్చాక అవతలివాళ్లు కలిసి వస్తారా? ఇంకెక్కడి సామరస్యం? ఫలానా విషయంపై మా విధానం యిది, నచ్చితే మెచ్చండి, లేకపోతే తిట్టండి, కానీ మేం యిలాగే చేస్తాం – అని స్పష్టంగా ఎవరూ చెప్పరు. ప్రతీవాడూ ఒకటే రొద, ఒకే సొద. పైన హెడింగ్‌ మూసేస్తే ఏ పార్టీ మ్యానిఫెస్టోయో చెప్పడం కష్టం. అసలు పార్టీ నాయకులే మ్యానిఫెస్టో చదవరు. 2009 కాంగ్రెసు మ్యానిఫెస్టోలో తెలంగాణ యిచ్చేస్తామని వుందని టి-కాంగ్రెసు నాయకులు వాదిస్తూ వచ్చారు. 'అలా లేనే లేదు, ఎక్కడుందో చూపించండి' అని గాదె వెంకటరెడ్డి వంటివాళ్లు ఎంత వాదించినా ఎవరూ సమాధానం చెప్పలేదు. ఉండే వుంటుంది అనుకుని వుంటారు. ఇంతోటి మ్యానిఫెస్టోకి ఓ కమిటీ, దానికో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌. చాలామంది విద్యార్థులు సీనియర్ల ప్రాజెక్టులు తీసుకుని కాపీ కొట్టేసి, పైన పేరు మార్చి యిచ్చేస్తూ వుంటారు. ఆ పైన ఉద్యోగాన్వేషణలో పడ్డాక పక్కవాడి రెజ్యూమెను కాపీ, పేస్టు చేసేస్తూంటారు. అలాగే వీళ్లూ పాత ఎన్నికలదో, పక్క రాష్ట్రానిదో కాపీ, పేస్ట్‌ చేసేస్తే చాలు. 'కొత్త ఎందుకు లెండి, గత మ్యానిఫెస్టోను ఎంతవరకు అమలు చేశారో చెప్పండి కాస్త' అంటే ఎవరికీ నోరు పెగలదు. ఇలాటి పరిస్థితుల్లో పవన్‌ సిద్ధాంతాలు చెప్పలేదని విమర్శించడం హాస్యాస్పదం.  కానీ అందరూ అదే పట్టుకుని రాపాడించడంతో జనసేన వాళ్లు కనీసం ఏదో ఒక సిద్ధాంతం – ఎవరికీ తట్టనిది – చెపితే బాగుండుననుకున్నారు. సెలవు రోజుల గురించి ఒక ఏ పార్టీ పట్టించుకోదు కాబట్టి దాని గురించి ఒక పాలసీ డెసిషన్‌ తీసుకుని దాన్ని ప్రకటించారు. 

తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌ అవతరణోత్సవ దినోత్సవాలను మాత్రం సెలవుదినాలుగా ప్రకటిస్తే చాలని, నాయకుల జయంతి, వర్ధంతి రోజుల్లో సెలవులు అక్కరలేదని కనిపెట్టారు. విభజన జరిగిన తీరుని నిరసిస్తున్నా అంటూ యీ అవతరణ దినోత్సవంపై అంత మమకారం దేనికి? ప్రభుత్వ హోం శాఖ వారు ఎలా విడగొట్టాలో యిప్పటిదాకా తేల్చుకోలేకపోయారు. విలక్షణమైన మన ప్రభుత్వోద్యోగుల రిక్రూట్‌మెంట్‌ విధానం కమలనాథన్‌ కమిటీకి అంతు పట్టలేదట. ఢిల్లీలో వేసుకుని వచ్చిన బ్లూప్రింట్‌ తగలపెట్టేసి, కొత్తది తయారుచేసే పనిలో పడ్డారు. లక్షమంది ఉద్యోగుల వివరాలు అందుబాటులో లేవట. ఇక కార్పోరేషన్లు అవీ ఎలా విడగొట్టాలో ఎక్కడ పెట్టాలో ఏమీ తేలలేదు. కొత్త ప్రభుత్వాలు వచ్చాక అవన్నీ చూసుకుంటాయి, మనం ఎపాయింటెడ్‌ డేకు ఏదో ఒకటి చేసి పారిపోదాం అంటోంది హోం శాఖ. కొత్త ప్రభుత్వాలు సిగపట్లకు దిగుతాయన్న భయం అందరికీ వుంది. ఆంధ్రోళ్లతో పంచాయితీ తప్పదు అని కెసియార్‌ యిప్పటికే హెచ్చరించారు. కొన్ని కార్పోరేషన్లు యిక్కణ్నుంచి ఆంధ్రకు తరలిస్తాం అనే నిర్ణయం ఆ కార్పోరేషన్‌ తీసుకోగలదా? దాని అధినేత రాక్షసాంధ్రుడనో, వాడికి అమ్ముడు పోయినవాడనో యాగీ జరగదా? ఇవన్నీ మూడో వ్యక్తి మధ్యస్తం చేయవలసిన విషయాలు. ఆ బాధ్యత తప్పించుకుని ప్రతీదీ అరకొరగా వదిలేసి పోదామని కేంద్రం చూస్తోంది. ఎందుకు అంటే జూన్‌ 2ని ఆ దినంగా గుర్తించారు కాబట్టి! ఆ దినం ప్రత్యేకత ఏమిటి అంటే అది ఇటలీ రిపబ్లిక్‌గా ఏర్పడిన రోజట! రెండవ ప్రపంచయుద్ధానంతరం 1946 జూన్‌ 2 న రిఫరెండం జరుపుకుని దాని ఫలితంగా ఇటలీ రిపబ్లిక్‌గా ఏర్పడింది. అప్పణ్నుంచి ఇటలీ రిపబ్లిక్‌ డేను జూన్‌ 2న జరుపుకుంటున్నారు. ఇటలీ మాత ప్రసాదించిన రాష్ట్రాలు కాబట్టి ఆవిడ ఆ రోజును ఎంచుకుంది. దాన్ని గొప్పగా సెలబ్రేట్‌ చేసుకోవడానికి వీలుగా సెలవు దినంగా ప్రకటించాలని జనసేన తీర్మానించింది. వహ్వా!

ఒక భాష, ఒక జాతి, ఒక రాష్ట్రం అనే సిద్ధాంతంపై ఏర్పడిన తొలి భాషాప్రయుక్త రాష్ట్రం భళ్లుమని బద్దలవుతున్న రోజది. తెలుగువాడే సాటి తెలుగువాడు రాక్షసజాతి వాడని నిందించి, వాడిని తరిమికొడతామని ప్రతిన పూని విడిపోతున్న రోజది. మోదీ భాషలో చెప్పాలంటే తల్లిని చంపి శిశువు పుడుతున్న రోజది. ఉమ్మడి కుటుంబం విడిపోతూ వుంటే కుటుంబసభ్యులకే కాదు, పక్కవాళ్లకీ కన్నీళ్లు వస్తాయి. ముఖ్యంగా పశువులను పంచుకునేటప్పుడు అవి మాలిమి అయినవాళ్లను విడిచి వెళ్లలేక అంబా అని అరుస్తుంటే కడుపులో దేవినట్లు వుంటుంది. విడిపోక తప్పదు కాబట్టి విడిపోతున్నాం, ఏ కష్టం వచ్చినా మమ్మల్ని పిలవడానికి సంకోచించకండి అని ఒకరికొకరు చెప్పుకుని అప్పగింతలు పెట్టుకుంటారు. మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్నపుడు  వేర్వేరు జాతులవాళ్లు విడిపోయారు. తెలుగు, కన్నడ, మలయాళీ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి విడిపోయి వారివారి ప్రాంతాలతో కలిశారు. తమిళజాతి, తెలుగుజాతి ఒకటి కాదు. అయినా మద్రాసులో, పరిసరప్రాంతాల్లో చాలాకాలం కలిసి వుండడం చేత విడిపోయినప్పుడు ఎమోషనల్‌గా ఫీలయ్యారు. రాష్ట్రం ఏర్పడినా పత్రికలు, సినిమాలు మద్రాసును ఒక పట్టాన వదిలిపెట్టలేదు. తెలుగువాళ్లందరం కలిసి వుండాలన్న భావనతో ఎట్టకేలకు విడిచి వస్తే యీ రోజు దూషణలతో, పరస్పర సంశయాలతో విడిపోతున్నారు. ఇది ఆనందించవలసిన రోజని జనసేన ఎలా అనుకుందో నాకైతే అర్థం కాదు. (సశేషం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2