ఇది ఏప్రిల్ 1 నాడు నేను చూసిన ‘‘శివపార్వతుల కల్యాణం’’ అనే బాలే (సంగీత, నృత్యనాటకం) గురించిన వ్యాసం. దీనిలో నా పాత్ర కూడా కొంత ఉంది కాబట్టి స్వోత్కర్ష కోసం రాశానని మాట పడే ప్రమాదం ఉన్నా, మంచి పుస్తకాలు, సినిమాలు పరిచయం చేసిన తీరులోనే దీన్నీ చేస్తున్నాను అనే భావనతో ముందుకు సాగుతున్నాను. మా వరప్రసాద్‌కు దేవుళ్లకు కళ్యాణాలు చేయించడం ఓ సరదా, ఓ అలవాటు. పదేళ్ల క్రితం శ్రీనివాస కల్యాణం చేయించి, మళ్లీ యీ ఫిబ్రవరిలో చేయించాడు. ఆ తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణం , ఏడేళ్ల క్రితం శివపార్వతుల కల్యాణం ఆడియో, ఈ నెలలో బాలే వెర్షన్, మధ్యలో రుక్మిణీ కల్యాణం బాలే! ఈ బాలేలు రవీంద్రభారతిలో జరగగా, తక్కినవి వాళ్లింట్లోనే జరిగాయి.
శాంతా వసంతా ట్రస్టు పేరిట ఆయన నిర్వహించిన కార్యక్రమాల వీడియో లింకు యిది. ఈ లింకు కింద యితర వీడియోలు కూడా చేరి ఉన్నాయి చూసుకోండి. ముందుగా శ్రీనివాస కల్యాణం గురించి కాస్త చెప్తాను. శ్రీవారి ఫౌండేషన్ అని బెంగుళూరులో ఓ ట్రస్టు ఉంది. ఓ కార్పోరేట్లో ఉన్నతోద్యోగం చేసే వెంటేశ్ మూర్తి గారనే ఆయన తనలాటి ఉన్నతోద్యోగులు, విద్యాధికులతో కలిసి ఏర్పాటు చేశారది. అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు. తిరుమలలో వెంకటేశ్వర కల్యాణం చేయించుకోవాలంటే పేదసాదలకు కష్టం. మధ్యతరగతి వారికి ఆర్థిక రీత్యా అందుబాటులోనే ఉన్నా, టిక్కెట్టు దొరకడం కష్టం. కల్యాణం భక్తితో చూస్తాం కానీ యిన్వాల్వ్ కాలేకపోతాం. ఎందుకంటే పూజారులు ఏవో మంత్రాలు చదువుతూంటారు. అంతా యాంత్రికంగా జరుగుతూన్నట్లు తోచి, కొద్ది సేపటికి మన దృష్టి మరలుతుంది.
ఈ ఫౌండేషన్ వాళ్లు ఆ సమస్యలు అధిగమించడానికి ఏం చేశారంటే తిరుమల సెట్టింగులన్నీ స్టేజి మీద ఏర్పాటు చేసి, వీళ్లే పూజారులుగా వేషం ధరించి, కన్నడంలో పాటలు, కీర్తనలు పాడుతూ రెండున్నర గంటల పాటు వివాహ క్రతువును రూపొందించారు. వారాంతాల్లో వాటిని ‘‘శ్రీనివాస కల్యాణ’’ పేరుతో వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. దాంతో చూసేవారికి ఉత్సాహంగా ఉంటుంది, భక్తీ కలుగుతుంది. ఇప్పటికి 600కి పైగా ప్రదర్శనలు యిచ్చారు. భట్కళలో వారు బహిరంగ ప్రవేశంలో నిర్వహించిన కార్యక్రమం లింకు యిస్తున్నాను. మచ్చు చూడండి.
వరప్రసాద్ బంధువొకాయన తన 80వ పుట్టినరోజు సందర్భంగా బెంగుళూరులో తన యింట్లో యీ కార్యక్రమం ఏర్పరచారు. దాన్ని చూడ్డానికి వెళ్లిన వరప్రసాద్‌కు అది చాలా బాగా నచ్చింది. తెలుగులో చేయకూడదా అని వెంకటేశ్ మూర్తిగారిని అడిగాడు. ‘‘మాకు తెలుగు అర్థమవుతుంది తప్ప రాసుకోలేము. స్క్రిప్టు, పాటలు ఎవరైనా చేసిస్తే చేస్తాం. అభినయం, పూజావిధానం మారదు కదా’’ అన్నారు వాళ్లు. ఇక వరప్రసాద్ నిర్మాత-దర్శకుడిగా రూపం ఎత్తాడు. ఆయన తలచుకున్నాడంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు. వెంకటేశ్వరుడి మీద మనకు అన్నమయ్య పాటలే బోల్డు ఉన్నాయి. అవి కాక వేరే పాటలూ రాయించాడు. సంగీతం చేయించాడు. ఎస్పీ బాలు తదితరుల చేత పాడించాడు. అన్నీ దగ్గరుండి పర్యవేక్షించి, తను అనుకున్నది వచ్చేదాకా ఆర్టిస్టులను రాపాడించి బ్రహ్మాండంగా తయారు చేయించాడు. స్క్రిప్టు విషయంలో వాళ్లు ఇంగ్లీషు వెర్షన్ పంపితే దాన్నుంచి వరప్రసాదూ, నేనూ కలిసి తెలుగులోకి చేశాం. ఎస్పీ బాలూ దానికి గాత్రదానం చేశారు. ఇదంతా పదేళ్ల క్రితపు మాట.
‘‘శ్రీనివాస కల్యాణం’’ చాలా విజయవంతమైంది. ఇక అప్పణ్నుంచి తెలుగు వెర్షన్ కూడా చేయమని శ్రీవారి ఫౌండేషన్‌కు అభ్యర్థనలు రాసాగాయి. వెంకటేశ్ మూర్తి గారికి వరప్రసాద్ మీద వల్లమాలిన గౌరవాభిమానాలు కలిగాయి. అందుకే యీ ఫిబ్రవరిలో వరప్రసాద్ వైవాహిక స్వర్ణోత్సవం రోజున వాళ్లింటి దగ్గర కార్యక్రమం చేయాలని కోరగానే అది బుధవారమైనా వారి టీమంతా సెలవులు పెట్టుకుని వచ్చి మరీ చేశారు. ఆ కార్యక్రమం లింకు యిస్తున్నాను. రెండున్నర గంటల కార్యక్రమం. చూస్తే దాని వైభోగం మీకే తెలుస్తుంది.
వరప్రసాద్ తల్లి శాంతమ్మ గారికి యివన్నీ ఎంతో నచ్చాయి. వృద్ధాప్యం వలన బయటకు వెళ్లలేక, యింటి దగ్గరే యిలాటి కార్యక్రమాలు, చాగంటి ప్రవచనాలు ఏర్పాటు చేయమని కొడుకుని కోరడం, ఆయన వాటిని నిర్వహించడం జరుగుతూ వచ్చింది. 2016లో శివపార్వతుల కల్యాణం అనే 138 ని.ల (సంగీత రూపకం 68 ని.లు, మంత్రాలు 70 ని.లు) కార్యక్రమాన్ని స్టేజిపై జరిపించారు. రాంభట్ల నృసింహ శర్మ గారనే పండితకవి, రచయిత, వైజాగ్ ఆలిండియా రేడియో ఉద్యోగి దాని వచనం రాయడంతో పాటు చాలా పాటలు రాశారు. వెంకటగిరి రాజా సాయికృష్ణ యాచేంద్ర గారు కొన్ని పాటలు రాసి, సంగీతం సమకూర్చారు. తక్కినవాటికి ఫ్లూట్ నాగరాజుగా పిలవబడే నాగ్ శ్రీవత్స గారు సంగీతమిచ్చారు. ఎస్పీ బాలు వచనం చదవడంతో పాటు, కొన్ని పాటలు పాడారు. సురేఖా మూర్తి, నిత్యసంతోషిణి, గోపికా పూర్ణిమ, మణి, సాయిచరణ్, పవన్ యిత్యాది గాయనీగాయకులు పాటలు పాడారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. దాని సంక్షిప్త వీడియో లింకు యిదిగో . కార్యక్రమం జరిగిన కొన్ని రోజులకే శాంతమ్మ గారు కాలం చేశారు.
ఇది జరిగిన ఆరేళ్లకు దాన్ని బాలేగా ప్రదర్శించాలనే కోరిక కలిగింది వరప్రసాద్‌కు. 2022 మార్చి నెలలో రాజేశ్వరీ సాయినాథ్, ఆమె కుమార్తె వైష్ణవి అనే నృత్యకళాకారిణులను సంప్రదించాడు. పాటల్లోని భాష క్లిష్టంగా పలు పదవిన్యాసాలతో అర్థం కాకుండా ఉందని, తమకు తెలుగు అంత బాగా రాకపోవడం చేత ఇంగ్లీషులో దాన్ని వివరిస్తే బాగుంటుందని కోరారు. వరప్రసాద్ ఆ పని నాకప్పగించాడు. అది చేసి పెడుతూనే, నేనొక సూచన చేశాను. ‘ఆ పాటల్లో ప్రస్తావించిన తారకాసురుని గాథ, కామదహనం, పార్వతి తపస్సు. కాలకూట విషపానం, దక్షయజ్ఞం వంటి ఘట్టాల నేపథ్యాలు యీ తరం వాళ్లకు తెలియవు కదా. పాటల్లోని గహనమైన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం, అప్పటికప్పుడు అన్వయించుకోవడం, ఆస్వాదించడం కొంతమందికే సాధ్యం. అందుచేత మధ్యలో కూచిపూడి స్టయిల్లో సూత్రధారి, సఖి పాత్రల ద్వారా కథ చెప్పవలసిన అవసరం ఉంది. పాటలను అటూయిటూ చేసి, సినిమా స్క్రీన్‌ప్లే విధానంలో కథ చెపితే యింట్రస్టు పెరుగుతుంది.’ అన్నాను.
వరప్రసాద్‌కు ఐడియా నచ్చింది. ‘సంగీతం, సాహిత్యం, నృత్యం మూడూ బాగా తెలిసిన దండిభొట్ల శ్రీనివాస వెంకట శాస్త్రిగారిని పిలుస్తున్నాను. ఆయన కూచిపూడిలో నిష్ణాతుడు. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు, డాన్సు విభాగంలో ఆచార్యుడు. ఆయన ఏమంటారో చూద్దాం.’ అన్నారు. మాతో పాటు రాజేశ్వరీ, వైష్ణవి గార్లు కూడా కూర్చున్నారు. నేను రెండు భాగాలు రాసుకొచ్చి చదివి వినిపించాను. శాస్త్రిగారు బాగున్నాయి, తక్కినవి కూడా రాయండన్నారు. మొత్తం ఐదు భాగాలుగా రాశాను. మొత్తం 80 ని.ల బాలే అయితే 20 ని.లు నేను రాసిన సూత్రధారి, సఖి సంభాషణలు వస్తాయి. వాటిలో సందర్భోచితంగా కాళిదాసు కుమారసంభవం, నన్నెచోడుడి తెలుగు కుమారసంభవం, శ్రీనాథుడి హరవిలాసం నుంచి కొన్ని పద్యాలు ఏరి వ్యాఖ్యానాలతో సహా పెట్టాను. వాటికి నాకు ఉపకరించినవి యువభారతి వారు వేసిన పుస్తకాలే.
నేను రాసిన స్క్రిప్టు మొత్తం ఓకే అయిపోయింది. సూత్రధారి పాత్రకు వెంపల్లి లక్ష్మణకుమార్ అనే ఆయన, సఖి పాత్రకు కల్లూరి అనూష అనే ఆవిడ గాత్రదానం చేశారు. మధ్యలో వచ్చే సంస్కృత, తెలుగు పద్యాలు శాస్త్రిగారు పాడడంతో పాటు ఆనంద తాండవ ఘట్టానికి సంగీతం సమకూర్చారు కూడా. బాలే గంటా, గంటంపావుకి మించకుండా ఉండాలనుకున్నాం. చివర్లో ఆనందతాండవం పెట్టడంతో గంటా యిరవై నిమిషాలైంది. మంత్రాలు తీసేసినా, ఆడియో వెర్షన్ 68 ని.లుంది. 20 ని.లు సంభాషణలు పెట్టాం. డాన్సు చేయడానికి కొంత స్పేస్ ఉండాలి. అందుకని పాటల్లో కొన్నిటిని పూర్తిగా, మరి కొన్నిటిని క్లుప్తంగా వాడుకున్నాం. కొత్తగా చేర్చిన భాగాలకు వరప్రసాద్ మళ్లీ సంగీత నిర్వహణ వహించాడు. మొత్తం బాలేకు రాజేశ్వరి గారు నృత్యదర్శకత్వం వహిస్తూ ముఖ్యపాత్ర ధరించారు.
ఇదంతా చేయడానికి ఒక ఏడాది పట్టింది. ఈ నెల ఏప్రిల్ 1న 25 మంది ఆర్టిస్టులతో రవీంద్రభారతిలో ప్రదర్శన జరిగింది. శివుడిగా సహానా ఉమేష్, పార్వతిగా వైష్ణవి అభినయించారు. కథాగమన వివరణ అనే క్రెడిట్ నాకిచ్చారు. ప్రదర్శన జరిగేటప్పుడు బ్యాక్ ప్రొజెక్షన్లో కొన్ని దృశ్యాలు చూపించి, సినిమాటిక్ అనుభూతి కలిగించారు. ఇవన్నీ వరప్రసాద్ ఉన్నతస్థాయిలో నిర్వహించాడు. సాహిత్యం, సంగీతం, నృత్యం, సాంకేతిక విలువలు అన్నీ అద్భుతంగా జతపడి నాకు ఒక బాపు, ఒక విశ్వనాథ్ గుర్తుకు వచ్చారు. మనకు కళాకారులున్నారు. కానీ వాళ్లకు బద్ధకాలున్నాయి, తిక్కలున్నాయి, గోరోజనాలున్నాయి, అత్యాశలున్నాయి, యివన్నీ సంబాళించుకుని రావడానికి చాలా ఓర్పు, నేర్పు కావాలి. కొందరిలో కళ దాగుని ఉంటుంది. దాని వెలిబుచ్చే అవసరం, అవకాశం వాళ్లకు రావు. అలాటివారందర్నీ వెలికి తీసి, సానబట్టి, యీ వజ్రాలను సరైన చోట అమర్చి, ఒక గొప్ప మణిహారాన్ని చేయగల సమర్థుడు వరప్రసాద్. వీడియో చూస్తే మీకూ అలాగే అనిపించవచ్చు.
లైవ్‌లో చూస్తున్నపుడు ఒక ప్రేక్షకుడిగా థ్రిల్ అయిపోయాను. దీనిలో నాకూ భాగముందన్న ఊహ నన్ను పులకింప చేసింది. ఆ భాగస్వామ్యం యిచ్చిన వరప్రసాద్‌కు కృతజ్ఞుణ్ని. ఎందుకంటే నేను రాసిన భాగం అందరికీ నచ్చింది. అతిథిగా వచ్చిన ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు నన్ను సత్కరిస్తూ ‘మీ సంభాషణల వలన కథ తెలిసింది’ అని ప్రశంసించారు. ఆయన రసజ్ఞుడు. గతంలో కూడా వరప్రసాద్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యారు. అగ్రికల్చర్ మినిస్టరైనా కల్చరంటే యిష్టంతో సారస్వత పరిషత్ సమావేశాలకు హాజరయ్యే నిరంజన్ రెడ్డి మరో అతిథిగా సత్కారంలో పాలు పంచుకున్నారు. ఆడియన్స్‌లో చాలామంది వచ్చి నన్ను ప్రశంసించారు. నాకీ జానర్లో రచన కొత్త. ఒక ప్రౌఢ రచనలో పాలు పంచుకోవడం విశేషమే కదా.
ఇప్పుడు మీకు దాని లింకు యిస్తున్నాను. గంటా ఇరవై నిమిషాలుంటుంది. పూర్తిగా చూసేటంత టైము లేకపోతే నేను రాసిన భాగాలు (వీడియోలో టైమింగ్స్ యిస్తున్నాను) చూస్తే కథ బోధపడుతుంది. అవి 8:23 నుంచి 12:39 – 4:16 ని.లు, 22:32 నుంచి 26:15 – 3:43 ని.లు, 38:00 నుంచి 42:13 – 4:13 ని.లు, 44:28 నుంచి 49:47 – 5:19 ని.లు, 57:56 నుంచి 1:00:14 – 2:18 ని.లు మొత్తం 19:49 ని.లు. ఏది చూడకపోయినా చివర్లో (1:12:12 నుంచి 1:20:12) వచ్చే ఆనందతాండవం చూడండి. (ఫోటో – కార్యక్రమ ఆహ్వానపత్రిక, శ్రీయుతులు నిరంజనరెడ్డి, వరప్రసాద్ సమక్షంలో హరీశ్‌రావుచే సత్కారం, ప్రశంస, నేపథ్యంలో ఆర్టిస్టులు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)