ఎమ్బీయస్‍ – కథ – ‘పవిత్ర’ పాపి

ఒకసారి పోప్‍ నుంచి ఫ్రాన్స్ రాజు సోదరుడికి పిలుపు వచ్చింది. అతను తన మిత్రుడైన ఫ్రెంచ్‍ వ్యాపారిని టస్కనీ నగరానికి తోడు రమ్మన్నాడు. ఆ వ్యాపారి వెళ్లడానికి ముందు తన ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టదలచి,…

ఒకసారి పోప్‍ నుంచి ఫ్రాన్స్ రాజు సోదరుడికి పిలుపు వచ్చింది. అతను తన మిత్రుడైన ఫ్రెంచ్‍ వ్యాపారిని టస్కనీ నగరానికి తోడు రమ్మన్నాడు. ఆ వ్యాపారి వెళ్లడానికి ముందు తన ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టదలచి, సరైన వ్యక్తులకోసం వెతికాడు. అన్ని పనులకు ఎవరో ఒకరు దొరికారు కానీ బర్గండీలోని బాకీదారుల నుండి బాకీలు వసూలు చేసే సరైన వ్యక్తి దొరకలేదు. ఎందుకంటే బర్గండీ వాసులు కపటానికి, దౌర్జన్యానికి పేరుబడినవారు. వెతగ్గా వెతగ్గా చివరకు సెపరిలో అనే ఒక న్యాయవాది దొరికాడు.

ఈ సెపరిలోని న్యాయవాది అనడం కంటె అన్యాయవాది అనడం సబబు. అతను చేయని మోసం లేదు. కక్షిదారుల నుంచి లంచం తీసుకుని నోటరీ హోదాలో ఎన్నో దొంగ దస్తావేజులను ధృవీకరించేవాడు. దొంగసాక్ష్యాలు చెప్పేవాడు. అన్యాయంగా ఎంత సంపాదించినా సరిపోనన్ని సప్తవ్యసనాలు అతనికి వున్నాయి. హత్య చేయడానికి కూడా అతను వెనుకాడడు. తనపై కేసు పడకుండా పోలీసులకు లంచాలిచ్చి శిక్ష పడకుండా చూసుకునేవాడు.

ఇటువంటివాడే బర్గండీయులతో వ్యవహరించగలడన్న ఆలోచనతో ‘‘బాకీవసూలు మొత్తంలో కొంత భాగం కమిషన్‍గా యిస్తాను. సరేనా?’’ అని వ్యాపారి అడిగాడు. నిజానికి యి ప్రతిపాదన కాదనే స్థితిలో సెపరిలో లేడు. అతనికి ఆదాయం వచ్చే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఖర్చులు మానుకోలేక పోతున్నాడు. అందువలన కాస్సేపు బెట్టు చేసి సరేననేశాడు. తన తరఫున వ్యవహరించేందుకు అధికారపత్రం అతనికిచ్చి వ్యాపారి తన ప్రయాణం సాగించాడు.

కొద్ది రోజుల్లోనే సెపరిలో బర్గండీ వెళ్లి వడ్డీ వ్యాపారుల యింట్లో బస చేశాడు. వాళ్లు సోదరులు. ఇతని సంగతి తెలిసినా ఫ్రెంచి వ్యాపారిపై గల గౌరవంతో యితనికి ఆశ్రయం యిచ్చారు. అయితే బర్గండీ వాతావరణం పడకనో ఏమో సెపరిలో జబ్బుపడ్డాడు. పోనుపోను అతని ఆరోగ్యం క్షీణించింది. చావు తప్పదనిపించింది. దాంతో సోదరులిద్దరూ గాభరా పడ్డారు.

‘‘చనిపోయేముందు క్రైస్తవపూజారిని రప్పించి, చేసిన తప్పులు ఒప్పుకోవడం, పూజారి అవన్నీ విని క్షమాభిక్ష ప్రకటించడం మనలో రివాజు. ఇతను చేసిన పాపాల చిఠ్ఠా ఎంత పెద్దదంటే ఏ పూజారీ యితన్ని క్షమించడు. క్షమాపణ దక్కకపోతే యితని అంత్యక్రియలు నిర్వహించడానికి ఏ చర్చి ఒప్పుకోదు. చివరకు యితని శవాన్ని ఏ కాలువలోనో విసిరి పడేయాలి. అప్పుడందరూ మననే తిడతారు. పోనీ అలాగని యిప్పుడే తరిమివేద్దామా అంటే రోగిష్టివాణ్ని వీధిలోకి నెట్టామన్న మాట పడతాం. ఎరక్కపోయి యీ గొడవలో చిక్కడ్డాం.’’ అని తమలో తాము చర్చించుకోసాగారు.

సెపరిలో యి మాటలు విన్నాడు. వాళ్లను దగ్గరకు పిలిచాడు. ‘‘మీ చింత అర్థం చేసుకోగలను. అతి పవిత్రుడైన పూజారిని వెతికి నా వద్దకు తీసుకురండి. తక్కినదంతా నాపై వదిలేయండి. వ్యవహారాలు ఎలా చక్కబెడతానో మీరే చూద్దురుగాని’’ అని చెప్పాడు. వాళ్లు అలాటి పూజారిని తెచ్చారు. అతను సెపరిలో వద్దకు వచ్చి ‘‘నీవు పాపాంగీకారం చేసి ఎంతకాలమైంది నాయనా?’’ అని అడిగాడు.

జీవితంలో ఎన్నడూ ఆ పని చేసి ఎఱుగని సెపరిలో ‘‘ప్రతీ వారం చర్చికి వెళ్లి చేసిన పాపాలను అంగీకరించి ప్రక్షాళితుణ్ని కావడం నా అలవాటు స్వామీ. వారానికి రెండు సార్లు వెళ్లిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా యీ అనారోగ్యం పట్టుకున్నప్పటి నుంచి వెళ్లలేకపోయాను. అదే నా చింత.’’ అని ఘోరంగా అబద్ధమాడేశాడు.

‘‘అలా అయితే నేను అడగవలసినది, వినవలసినది పెద్దగా వుండదనుకుంటా.’’ అన్నాడు ఆ అమాయక పూజారి.

‘‘ఆ మాట నిజమే అయినా, మృత్యువు సమీపిస్తున్న యీ ఘడియలో పుట్టినప్పటినుంచీ చేసిన పాపాలను ఒక్కసారి వల్లె వేసి, క్షమాపణ కోరాలని వుంది స్వామీ. అందువలన మీరు నన్ను క్షుణ్ణంగా, లోతుగా ప్రశ్నించి లవలేశం సంశయం కూడా లేకుండా చేసుకోవలసినదిగా కోరుతున్నాను.’’

పూజారి నిట్టూర్చాడు. ‘‘అలాగే కానీ, నువ్వు నీ భార్యతో కాక వేరే స్త్రీతోనైనా అనుచితంగా ప్రవర్తించావా?’’

‘‘ఇతర స్త్రీల మాట అటుంచండి స్వామీ, నాకు భార్యే లేదు. నేను ఘోరబ్రహ్మచారిని. తల్లి గర్భం నుంచి వచ్చినపుడు ఎంత పవిత్రంగా వున్నానో యిప్పుడూ అలాగే వున్నాను.’’

పూజారి సంతోషించాడు. అంతలోనే అనుమానంగా చూసి ‘‘పేదలకు దక్కకుండా అతిగా భుజించడం కూడా పాపమే, ఆ విషయం…?’’

‘‘ఉపవాస దినాల్లో ఉపవాసం చేయడమే కాదు, వారానికి మూడు రోజులు రొట్టె తిని, నీళ్లు తాగి కాలక్షేపం చేస్తాను, స్వామీ, కానీ అలసిపోయిన సందర్భాల్లో నీటికోసం అల్లాడి, ఎక్కువ మోతాదులో సేవించిన మాట వాస్తవం. పల్లెటూళ్లలో స్త్రీలు తినే ఆకూఅలమలూ చూసి నోరూరినమాట కూడా ఒప్పుకుని తీరాలి, ముఖ్యంగా వరుస ఉపవాసాలు ముగిసినప్పుడు..’’

పూజారి చిరునవ్వు నవ్వాడు ‘‘ఇవి చాలా చిన్న విషయాలు. సహజమైన విషయాలు. దీని గురించి ఆందోళన పడకు. దీని కంటె ముఖ్యమైనది దురాశతో అవసరమైన దాని కంటె ఎక్కువ డబ్బు పోగేయడం. నువ్వు ధనాశాపరుడివా?’’

‘‘నేను వడ్డీవ్యాపారస్తుల యింట్లో వున్నాను కాబట్టి మీకా సందేహం వచ్చి వుండవచ్చు. కానీ నేను యీ వూరు వచ్చినదే వారిని యి పని మానుకోమని చెప్పడానికి. ఈ వ్యాపారం అనైతికమని బోధించడానికి వచ్చి దురదృష్టవశాన్న జబ్బుపడ్డాను.’’

పూజారి పొంగిపోతూ ‘‘మంచిది. మరి కోపావేశాలు వున్నాయా?’’ అని ప్రశ్నించాడు.

‘‘ఉన్నాయి స్వామీ, చర్చికి వెళ్లనివారిని చూసినా, పూజారులను లక్ష్యపెట్టనివారిని చూసినా, చర్చికి విరాళం యివ్వడానికి లోభించి మద్యంపై మాత్రం వెచ్చించేవారిని చూసినా ఆగ్రహం వస్తుందని ఒప్పుకుంటున్నాను.’’

‘‘అది ధర్మాగ్రహం నాయనా, కానీ నువ్వా కోపంతో వాళ్లను తిట్టడం, కొట్టడం వంటివి చేయలేదు కదా’’

‘‘దేవుడి ప్రతిరూపమైన మీ వంటి నోటి నుండి అలాటి మాటలెలా వస్తున్నాయి స్వామీ! తిట్టడం, కొట్టడం, చంపడం వంటివి భ్రష్టులు చేసే పని. అటువంటివారు నాకు ఎదురైనప్పుడు, వారిని గుర్తు పెట్టుకుని వారు మారాలనీ, బాగుపడాలనీ చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసేవాణ్ని. వారి గురించి యితరులకు చాడీలు సైతం చెప్పేవాణ్ని కాను. కానీ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే నాకు తెలిసిన ఒక తాగుబోతు తన భార్యను విపరీతంగా తన్నేవాడు. ఆ హింసను చూడలేక ఆమె బంధువులకు అతని గురించి చెప్పాను. అది నేను చేసిన పాపమే కదా..’’

‘‘అబ్బెబ్బే, పాపమెలా అవుతుంది. ఇక నీ వృత్తికి వద్దాం. నువ్వు వ్యాపారస్తుడివి కదా, వ్యాపారంలో ఎవరినైనా మోసం చేశావా? ఎవరి సొత్తునైనా కాజేశావా?’’

‘‘తెలిసి చేయలేదు స్వామీ, కానీ ఒక పొరపాటు మాత్రం జరిగింది. నా దుకాణంలో బట్టలు కొన్న ఒక గృహస్తు అరువు పెట్టాడు. నెల్లాళ్లు పోయాక వచ్చి డబ్బిచ్చాడు. అతనిమీద నమ్మకంతో దాన్ని లెక్కపెట్టకుండా ఒక పెట్టెలో పెట్టేశాను. తీరా చూస్తే దానిలో నాలుగు పెన్నీలు ఎక్కువ వుంది. తిరిగి యిచ్చేద్దామంటే అతని విలాసం తెలియదు. అందువలన అతని కోసం వేచి చూశాను. అతను మళ్లీ రాలేదు. చివరకు ఆ డబ్బును ఒక ముష్టివాడికి వేసేశాను.’’

ఇటువంటి ధర్మాత్ముణ్ని ఏ పాపం గురించి ప్రశ్నలు వేయాలో పూజారికి తట్టలేదు. అందుకని ‘‘ఏమైనా పాపం చేసి వుంటే నువ్వే చెప్పు.’’ అనేశాడు.

దానికి దీర్ఘంగా ఆలోచించినట్లు నటించి సెపరిలో ‘‘సబ్బాత్‍ పండగపూట నేను నా పనివాడి చేత పని చేయించాను.’’ అన్నాడు.

‘‘చ్చొచ్చొచ్చొ, అదో పెద్ద విషయమా? ఇంకేదైనా వుంటే చెప్పు.’’

‘‘..మరోసారి, మరోసారి..’’

‘‘..ఏమైందో చెప్పు బాబూ.’’

‘‘అనాలోచితంగా నేను చర్చిలో ఉమ్మి వేశాను, స్వామీ’’

‘‘దాని గురించి అంత తటపటాయింపు దేనికి నాయనా, పూజారులమైన మేమే చాలాసార్లు ఉమ్మేస్తూంటాం.’’

‘‘మీ సంగతి సరే, మీరు పుణ్యమూర్తులు, ఏం చేసినా పాపం తగలదు. నేను యింతకంటె ఘోరమైన పాపం యింకోటి చేశాను. అది తలచుకుంటే భగవంతుడు నన్ను క్షమించడన్న భయం వేస్తోంది.’’ అంటూ సెపరిలో పొగిలిపొగిలి ఏడవసాగాడు.

పూజారి కంగారు పడ్డాడు. ‘‘అదేమిటో చెప్పేయి, త్వరగా క్షమించేస్తాను’’ అని బతిమాలసాగాడు.

చాలాసేపు బతిమాలించుకుని అప్పుడు చెప్పాడు – ‘చిన్నప్పుడు ఓసారి నేను మా అమ్మను తిట్టాను’ అని.

పూజారి పెదాలపై నవ్వు మొలిచింది. ‘‘అమాయకుడా, పసితనంలో చేసిన పొరపాట్లను భగవంతుడు లెక్కించడు. నీ వంటి పుణ్యజీవి ఎంత ఘోరమైన తప్పిదం చేసినా, ఆఖరికి తనను శిలువ ఎక్కించినవారిలో నువ్వు ఒకడివైనా క్షమిస్తాడు. నీ వంటి మహాత్ముడి చివరి విశ్రాంతిస్థలం మా చర్చిలో  వుండడం మాకు గర్వకారణం. నీ ఉద్దేశం ఏమిటి?’’

‘‘అంతకంటే నాకు కావలసినదేముంది స్వామీ, పైగా నేను క్రైస్తవంలో మీ శాఖకు చెందినవాణ్నే’’ అన్నాడు చెమర్చిన కళ్లతో సెపరిలో.

ఎంతటి అబద్ధాలకోరైనా అంత్యదశలో నిజం చెప్పడం, పశ్చాత్తాపపడడం సహజం. ఆ పూజారి అనుభవంలో కూడా యిటువంటి వాళ్లనే చూశాడు. అందువలన సెపరిలో చెప్తున్నవన్నీ నిజాలని ఆయన మనస్ఫూర్తిగా నమ్మాడు. ఈ లోకంలో చివరి ఘడియల్లోనే కాదు, పైలోకంలో దేవుడి ఎదుట కూడా కుటిలత్వం చూపడానికి వెఱువని గండరగండడు సెపరిలో అని ఆయన ఎలా వూహించగలడు? అందుకే అతనికి ఎక్స్ట్రీమ్‍ అనక్షన్‍ పంపుతానని మాట యిచ్చాడు. చెక్కతెర చాటుగా యి ప్రహసనం అంతా విన్న సోదరులు సెపరిలో తెంపరితనానికి నివ్వెరపోతూనే చివరకు నవ్వాపుకోలేక పోయారు.

చివరకు సెపరిలో చనిపోయాడు. అంత్యక్రియలకు పూజారికి కబురు పెట్టగానే ఆయన వచ్చి తన ఉపన్యాసంలో సెపరిలో ఏ పాపము చేయని పసిపాపలాటి వాడని, అటువంటి పవిత్రమూర్తి లోకంలో చాలా అరుదుగా లభిస్తాడని చెప్పాడు. అది విన్న ఆ వూరి ప్రజలందరూ అతని సమాధి వద్ద కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేయసాగారు. అలా ప్రార్థించినవారిలో చాలామంది కోరికలు నెరవేరాయి కూడా.

దాంతో అందరూ అతన్ని సెపరిలో ఋషి (సెయింట్‍) అని పిలవసాగారు. అతని ఖ్యాతి, అతని మహిమలపై ప్రజల నమ్మకం నానాటికీ పెరగడంతో చివరకు చర్చి కూడా అతనికి సెయింట్‍హుడ్‍ ప్రసాదించింది. అతని సమాధి వద్దకు వెళ్లి ఏ పని జరగాలని కోరుకున్నా అయిపోతుందని అందరూ కథలుకథలుగా చెప్పుకోసాగారు. చిత్రం ఏమిటంటే ఆపదలు వచ్చినప్పుడు అతనికి మొక్కులు మొక్కినవారిలో అతని కథ క్షుణ్ణంగా తెలిసిన వ్యాపారి సోదరులు కూడా వున్నారు! (మూలం – బొకాచియో ‘డెకామెరాన్‍’ )

-ఎమ్బీయస్‍ ప్రసాద్‍ (జులై 2020)
[email protected]