మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయడంతో ఏపీలో మళ్లీ రాజకీయ వేడి రగులుకొంది. త్వరలో విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధానికి శంకుస్థాపన చేస్తామని, ప్రధాని మోడీని ఆహ్వానిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇదిలా ఉండగా మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతి జేఏసీ శనివారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మద్దతు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైనంత మాత్రాన దాని బలాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. 2014లో వైసీపీ ఓడిపోవడం, ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిం చినంత మాత్రాన బలహీనపడలేదు కదా? ఆ పార్టీ క్షేత్రస్థాయిలో అంతకంతకూ బలపడుతూ 2019 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంత చేసుకొంది. ఏపీ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమైన విజయాన్ని సొంత చేసుకోవడాన్ని ఎలా మరిచిపోతాం?
క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ కలిగిన టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రాజధానులకు మద్దతుగా ఊరూరూ, ప్రతి వాడా గర్జిం చాలని పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనాను కూడా లెక్క చేయకుండా ఉద్యమం ఊపందుకుంటుందని, జగన్ సర్కార్ కట్టడి చేయలేదేమోననే అనుమానాలు, భయాందోళనలు కలిగాయి. శనివారం నిరసనలకు సంబంధించిన వార్తలను ఆదివారం పత్రికల్లో గమనిస్తే…ఓ ఆశ్చర్యం.
రాష్ట్ర వ్యాప్తంగా 103 నియోజకవర్గ కేంద్రాలు, 320 మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు నిససనల కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు, పెద్దాపురంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు, తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, కృష్ణా జిల్లా నందిగామలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు నిరసనలలో పాల్గొన్నట్టు వార్తలు చూడొచ్చు.
కానీ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ మాత్రం ఎక్కడా పాల్గొనలేదు. చాలా మంది టీడీపీ జిల్లా అధ్య క్షులు, మాజీ ఎమ్మెల్యేలు తమ ఇళ్ల వద్దే ప్లకార్డులు పట్టుకునో, నల్లబ్యాడ్జీలతోనో నిరసన వ్యక్తం చేశారు. కానీ ఈ మొత్తం కార్యక్రమానికి పిలుపునిచ్చిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ పాల్గొనకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ట్విటర్ వేదికగా జగన్‌పై విమర్శలకు మాత్రమే లోకేశ్ పరిమితం కావడం గమనార్హం.
కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో తండ్రీకొడుకులు ప్రాణ భయంతో వణికిపోతున్నారని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. అందువల్లే తమను మాత్రం ముందుకు తోసి, అబ్బాకొడుకులు తమ వరకూ రక్షణ చర్యలు తీసుకుని ఇళ్లకే పరిమితమయ్యారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్‌లవేనా ప్రాణాలు…తమవి కాదా అని కార్యకర్తలు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఊరూ, వాడా కదిలి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు తానెక్కడ నిరసనకు దిగారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
ఒకవేళ చంద్రబాబు వయసు రీత్యా నిరసనకు దూరంగా ఉన్నారనుకున్నా….ఆయన కొడుకు లోకేశ్‌కు ఏమైందని ప్రశ్ని స్తున్నారు. విపత్కర సమయంలో పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించే అవకాశాన్ని లోకేశ్ ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రాణ భయంతో తాము మాత్రం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆందోళనలకు దూరంగా ఉంటూ…మిగిలిన వాళ్లను మాత్రం ముందుకు తోయడంతో మరోసారి చంద్రబాబు నైజంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఓర్నీ పాసుగులా…ఎంత పనిచేశారయ్యా అబ్బాకొడుకులు అని చంద్రబాబు, లోకేశ్ గురించి టీడీపీ శ్రేణులు ఆశ్చర్యంతో అంటున్నాయి.