ఐదు రాష్ట్రాల ఇంకా తుది ఫలితాలు రాలేదు కాబట్టి అంకెలు కచ్చితంగా చెప్పలేం కానీ విషయమైతే అర్థమైంది. గోవా, మణిపూర్‌లలో త్రాసు అటూయిటూ వూగుతోంది. ఇతరులు హెడింగ్ కింద కనబడే పార్టీలు ఎవరితో చేతులు కలుపుతాయో తెలిస్తే ప్రభుత్వం ఎవరిదో అర్థమవుతుంది. యుపి, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో అలాటి సందిగ్ధం లేదు. ఈ ఎన్నికలలో ప్రధానంగా నొక్కి చెప్పవలసినది నమో సునామీని! అందరి అంచనాలను అధిగమిస్తూ మోదీ విజేతగా వెలిగిపోయారు. ఇది అపూర్వమైన విజయం. 2014 పార్లమెంటు విజయంతో సరిపోల్చదగిన విజయం. అప్పటితో పోలిస్తే కాసిన్ని సీట్లు తగ్గి వుండవచ్చు కానీ అప్పుడు అతనే ప్రధాని అభ్యర్థి. ఇప్పుడు అతని అనుచరుడెవరో ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు. అయినా అదే ఉత్సాహంతో ఓట్లేశారు. అయిదు రాష్ట్రాలలో దాదాపు అన్నిటిలో ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసింది కాబట్టి యుపిలో కూడా అదే జరిగింది అంటూ యీ విజయాన్ని తక్కువ చేసి చూడడానికి లేదు. అవన్నీ చిన్నచిన్న రాష్ట్రాలు. ఒకే రకమైన ధోరణిలో ఓటేసే రాష్ట్రాలు. యుపి అలా కాదు. ఒక్కో ప్రాంతం ఒక్కోలా ఓటేస్తూ వచ్చింది. ఈసారి మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ బిజెపి, కరక్టుగా చెప్పాలంటే మోదీ, అమిత్ ద్వయం విజయదుందుభి మోగించింది. పోలరైజేషన్, ఋణమాఫీ హామీ, ప్రతిపక్షాల అనైక్యత… యిలాటివి ఎన్ని అంశాలు కలిసినా యిలాటి విజయాన్ని అందివ్వలేదు. ఇది ఉత్తర ప్రదేశ్ సమాజంలోని అన్ని వర్గాలు కలిసి మోదీ సామర్థ్యంపై అపారమైన నమ్మకంతో ఓట్లేసిన ప్రత్యేక సందర్భం. ఎప్పుడో ఇందిర హయాంలోనే యిలాటివి చూసేవాళ్లం. ఇన్నాళ్లకు మోదీ మళ్లీ చేసి చూపించారు. ఆయన యీ ఫీట్ ఎలా సాధించాడు అనే విషయంపై వచ్చే రోజుల్లో చాలా విశ్లేషణలు వస్తాయి. అవన్నీ చూశాక మళ్లీ ముచ్చటించుకోవచ్చు. కానీ యీ లోపున యీ సునామీని పత్రికలు, ఎన్నికల నిపుణులు, విశ్లేషకులు ఎందుకు పసిగట్టలేక పోయారు అనే విషయమే ఆశ్చర్యం కొలుపుతుంది.
'మీరు నమ్మలేదు కానీ, బిజెపి తాము 300 సీట్లకు పైగా గెలుస్తామని చెప్పింది, చేసి చూపించింది.' ఎవరైనా అనేయవచ్చు. తక్కిన చోట్ల కూడా యిలాటి ధీమాయే వ్యక్తం చేసింది కానీ ఉత్తరాఖండ్ తప్ప మిగిలిన చోట్ల అవేమీ సాగలేదు కదా! గోవాలో మా ముఖ్యమంత్రి ఓడిపోతాడు అని చెప్పిందా? ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఆ ముఖ్యమంత్రి టీవీలో కనబడి మాకు 40లో 26కు పైగా వస్తాయి అని చెప్పుకున్నాడు. ఎందుకంటే మోదీ నాయకత్వం, అమిత్ షా మార్గదర్శకత్వం అంటూ ఏవేవో చెప్పాడు. అవేమీ పని చేయలేదు కదా. ఇప్పుడు యితర పార్టీలనో, స్వతంత్రులనో కలుపుకునో, పార్టీ మార్పిడి చేయించో ప్రభుత్వం ఏర్పరిస్తే ఏర్పరచవచ్చు. అది వేరే విషయం. పార్టీలు ప్రచారంలో భాగంగా చెప్పుకునే గొప్పల గురించి చెపుతున్నాను. యుపిలో మాయావతిని చూడండి. హంగ్ ఏర్పడుతుందన్న సందేహంతో ఎన్నికలయ్యాక అఖిలేశ్ 'బిజెపిని నిలవరించడానికి బియస్పీతో చేతులు కలుపుతాం' అంటే 'ఆ అవసరమే పడదు, మా అంతట మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం' అంది గొప్పగా. ఇప్పుడు ఫలితాలు వచ్చాక జీర్ణించుకోలేక ఇవిఎమ్‌లు టాంపర్ అయ్యాయని ఆరోపిస్తోంది. అందువలన పార్టీల క్లెయిమ్స్‌ను పెద్దగా పట్టించుకోము. పత్రికా కథనాలను, విశ్లేషణలను పేపర్లలో, మాగజైన్లలో చదువుతూ క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటూ, ఊహాగానాలు చేస్తూ వుంటాం.
ఈసారి కథనాలు చూస్తే పంజాబ్‌లో అకాలీ దళ్ ఓటమి, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెసు ఓటమి మాత్రం కచ్చితంగా చెప్పగలిగారు. ఉత్తరాఖండ్‌లో ఇండియా టుడే, చాణక్య చెప్పిన అంకెల కంటె బిజెపికి 4 ఎక్కువ వచ్చాయి. సీ ఓటరైతే కాంగ్రెసుకు 35 దాకా రావచ్చంది. చివరకు వాళ్లకు వచ్చింది 11! పంజాబ్‌లో ఆప్‌కు కాంగ్రెసుతో యించుమించు సమానంగా వస్తాయని చెప్పిన అంచనా తప్పేసింది. ఎగ్జిట్ పోల్స్ చేసిన ఆరు సంస్థల అంకెలు చూసుకుంటే సీ ఓటర్ 67 వస్తాయని, సిఎన్‌ఎన్ 57 వస్తాయని, చాణక్య 54 వస్తాయని యిలా చెప్తే ఎబిపి వారు మాత్రం 36-48 వస్తాయన్నారు. చివరకు 20 లో ఆగిపోయింది. అంటే ఆప్ ఘోరపరాజయాన్ని వీరెవ్వరూ పసి గట్టలేక పోయారు. కాంగ్రెసు విషయంలో ఇండియా టుడే మాగ్జిమమ్ 71 వస్తాయంది. తక్కిన వాళ్లందరూ 50-55 మధ్యలోనే ఆగిపోయారు. చివరకు కాంగ్రెసుకు 77 వచ్చాయి. అంటే యింత విజయాన్ని వాళ్లు వూహించలేదన్నమాట. అకాలీ దళ్-బిజెపి కూటమికి ఎబిపి వాళ్లు ఒకళ్లే 19-27 యిచ్చారు. తక్కినవాళ్లు 10 లోపే అన్నారు. చివరకు దానికి 18 వచ్చాయి. మణిపూర్ విషయంలో సిఎన్‌ఎన్ వాళ్లు బిజెపి, కాంగ్రెసులకు యించుమించు సమానంగా వస్తాయని, ఇతరులకు 11 వస్తాయని అన్నారు. ఇతరుల విషయం కరక్టయింది. ఇండియా టుడే కాంగ్రెసుది గెలుపంది. సీ ఓటరు బిజెపి గెలుపంది. ఫైనల్‌గా కాంగ్రెసుకు 28 వచ్చాయి, బిజెపికి 21 వచ్చాయి. ఆరు సంస్థల్లో ఒక్క సంస్థ కూడా గోవాలో బిజెపి కంటె కాంగ్రెసుకు ఎక్కువ వస్తాయని చెప్పలేదు. అందరూ బిజెపికే ఛాన్సుందన్నారు. చివరకు కాంగ్రెసుకు 17, బిజెపికి 13 వచ్చాయి. ఆప్‌కి 6 వస్తాయని సిఎన్‌ఎన్ అంటే ఎమ్మార్సీ 7 వస్తాయంది. తక్కినవి 0-2, 0-4.. అలా యిచ్చాయి. అంతిమ ఫలితాలు చూస్తే ఆప్‌కి ఏమీ రాలేదు.
ఇక యుపి విషయానికి వస్తే బిజెపి ప్రభంజనాన్ని పాత్రికేయులు, విశ్లేషకులు ఎవరూ గుర్తుపట్టలేదు. 5వ విడత, 6వ విడత ఎన్నికల తర్వాత కూడా ఎటూ మొగ్గు కనబడటం లేదనే రాశారు. చివరకు వచ్చేసరికి మాయావతిని కొట్టి పారేయడానికి వీల్లేదని, ఆమె ముస్లిములకు 100 సీట్లు యివ్వడంతో బాటు, అగ్రవర్ణాల వాళ్లకూ టిక్కెట్లు యిచ్చి ఆకట్టుకుందని, దళితుల్లో జాతవులు ఎటూ ఆమె వైపు వున్నారని, బిజెపి ఓటర్లు సద్దు చేసే రకమైతే, ఆమె ఓటర్లు నిశ్శబ్ద ఓటర్లని చెప్పారు. ఆమె సర్‌ప్రైజ్ విన్నర్ కావచ్చన్నారు. ఒకవేళ బిజెపికి సింపుల్ మెజారిటీ రాకపోతే ఎస్పీ, బియస్పీ చేతులు కలుపుతాయని కూడా రాశారు. అదృష్టవశాత్తూ అది జరగలేదు. ఎందుకంటే యుపిలో సంకీర్ణప్రభుత్వాలేవీ సరిగ్గా సాగలేదు. బిఎస్పీకి ఫైనల్‌గా 19 వచ్చాయి. ఇన్నే వస్తాయని ఏ సంస్థా చెప్పలేకపోయింది. అందరి కంటె ఎక్కువగా 93 యిచ్చినది సీ ఓటర్. తక్కువగా 27 మాత్రమే యిచ్చినది చాణక్య. ఇండియా టుడే కూడా కనీసం 28 వస్తాయంది. ఇక ఎస్పీ కూటమి విషయానికి వస్తే వాళ్లకు అంతిమంగా వచ్చినది 54. ఈ అంకెను ఎవరూ పసిగట్టలేదు. హీనపక్షం 88 వస్తాయని చాణక్య, ఇండియా టుడే అన్నాయి. అందరి కంటె ఎక్కువగా 169 వరకు రావచ్చని అంది ఏబిపి. తక్కినవి 120-130 మధ్య వస్తాయన్నట్లే చెప్పారు. చివరకు దానిలో సగం కూడా రాలేదు. కాంగ్రెసుతో కూటమి వలన ఎస్పీ నష్టపోయింది అని చెప్పారు కానీ విడిగా కాంగ్రెసు పది లోపునే వస్తాయని ఎవరూ వూహించి వుండరు. కాంగ్రెసు వ్యూహకర్త ప్రశాంత కిశోర్ ఉద్యోగానికి ముప్పు వచ్చేట్లుంది. అఖిలేశ్‌కు సలహా లిచ్చిన ఫారిన్ పెద్దమనిషిని అనవసరంగా కలిశానని పవన్ కళ్యాణ్ వాపోవచ్చు.
బిజెపి కూటమి విషయానికి వస్తే ఎవరూ 325 వస్తాయని చెప్పలేదు. అందరి కంటె ఎక్కువగా చెప్పిన చాణక్య కూడా 285 వస్తాయంది. ఇండియా టుడే 279 వస్తాయంది. టైమ్స్ నౌ, సిఎన్‌ఎన్ 200 దరిదాపుల్లో వస్తాయన్నాయి. సీ ఓటరు 155 నుంచి 167 మాత్రమే వస్తాయంది. ఏబిపి 164 నుంచి 176 అంది. ఎంత ఘోరంగా తప్పాయో చూడండి. ఈ ఎగ్జిట్ పోల్స్ శాంపుల్ సెలక్షన్‌లోనో, సైజులోనో, మెథడాలజీలోనో తప్పుందనుకోవాలి. అక్కడ తప్పు లేకపోతే ప్రజల నాడిని పసిగట్టలేక పోయారని ఒప్పుకోవాలి. అంతిమంగా వచ్చిన అంకెలు చూస్తే మోదీ అంత యిదిగా ఎందుకు కష్ట్టపడ్డాడా అని ఆశ్చర్యం వేస్తుంది. చివరిచివరికి వచ్చేసరికి పరోక్షంగా మతాన్ని ప్రస్తావిస్తూ చేసిన ఉపన్యాసాల అగత్యం ఏముంది అనిపిస్తుంది. అంటే బిజెపి కూడా యీ ప్రభంజనాన్ని వూహించలేక పోయిందా అన్న అనుమానం వస్తుంది. వాళ్లు నియమించిన సర్వే ఏజన్సీలు కూడా యిలాటివే అన్నమాట. ఇవాళ ప్రణయ్ రాయ్ చెప్తున్నారు – బిహార్ ఎన్నికల ఫలితాలప్పుడు సర్వే ఏజన్సీ యిచ్చిన ఇన్‌పుట్‌లు లోపభూయిష్టమైనవి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ తప్పాయి అని. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని ఎస్పీ, ఎస్పీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని కాంగ్రెసు సర్వేలు చేయించుకునే వుంటాయి. అలాగే 100 సీట్లు ముస్లిములకు యిస్తే లాభిస్తుందా లేదా, బ్రాహ్మణులతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని బియస్పీ కూడా సర్వేలు చేయించుకుని వుంటుంది. ఇవన్నీ తప్పుడు సమాచారం యిచ్చి వుంటాయి. అందుకే వాళ్లు యింత ఘోరంగా దెబ్బ తినేశారు.
గతంలో యిలాటి సర్వేలు వుండేవి కావు. ప్రజల మధ్య మసలే నాయకులు ప్రజల అభీష్టాన్ని గుర్తించి, హై కమాండ్‌కి చెప్పేవారు. హై కమాండ్ కూడా వారి మాట నమ్మేది, దానికి తగ్గట్టు విధానాలు మార్చుకునేది. రాజీవ్ గాంధీ జమానా నుంచి హైటెక్ నాయకులు వచ్చేశారు. క్షేత్రస్థాయి కార్యకర్తలపై వాళ్లకు గౌరవం లేదు. వారి తెలివితేటలపై నమ్మకం లేదు. అందుకని ఎవరో ఏజన్సీ వాళ్లను నియమించడం, వాళ్లిచ్చిన రిపోర్టులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. పోనుపోను అది యితర పార్టీలకు కూడా పాకింది. గుప్పెడు మంది నాయకులు కూర్చుని దేశంలోని అన్ని ప్రాంతాల గురించి ఎడాపెడా నిర్ణయాలు తీసేసుకుంటారు. టిక్కెట్లు అడిగిన అభ్యర్థుల గురించి ఏజన్సీల చేత రిపోర్టులు తెప్పించుకోవడం, వాటి బట్టి టిక్కెట్లు యివ్వడం, స్థాని కార్యకర్తలు వద్దని మొత్తుకుంటున్నా పైనుంచి రుద్దడం.. యిలా జరుగుతోంది. గతంలో కింది స్థాయి నాయకులు కూడా గట్టిగా వుండేవారు కాబట్టి, హై కమాండ్‌తో విభేదించేవారు, అవసరమైతే పోట్లాడేవారు. పోనుపోను హై కమాండ్‌కు ఎస్ బాస్ అనేవాళ్లే మిగులుతున్నారు. కార్పోరేషన్ మేయరు పదవైనా సరే, కార్పోరేటర్లు ఎన్నుకోరు. ఎవర్ని నియమించాలో హై కమాండ్ నిర్ణయానికి వదిలేస్తున్నాం అని తీర్మానం చేయడం తప్ప వారి కేమీ రాదు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు జరపరు. అన్నీ నామినేటెడ్ పోస్టులే. ఎన్నికలు వచ్చినపుడు ప్రజల మధ్య మసలే నాయకులకు టిక్కెట్లు యివ్వడం లేదు. పార్టీకి నిధులు సమకూర్చే వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, ధనికులు యిలాటి వారికే యిస్తారు. వాళ్లు అప్పటికప్పుడు పార్టీలో చేరి టిక్కెట్లు ఎగరేసుకుని పోతారు. ప్రజలేమనుకుంటున్నారని వాళ్లను అడిగితే వాళ్లేం చెప్పగలరు? తమ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలున్నాయో కూడా చెప్పలేరు. మొత్తం అన్నీ హై కమాండ్ తన చేతిలో పెట్టుకుంటోంది. ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఏజన్సీలపై ఆధారపడుతోంది. లేకపోతే మీడియా రిపోర్టులను నమ్ముతోంది. ఈ ఎన్నికల ఫలితాలు చూశాకైనా పార్టీలు ప్రజల్లో తిరిగే స్థానిక నాయకుల మాటలకు విలువ నివ్వడం మంచిది.
– ఎమ్బీయస్ ప్రసాద్