ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్, అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాని సస్పెండ్ చేసిన విషయం విదితమే. అఫ్‌కోర్స్.. ఆ సస్పెన్షన్ ముగిసి, ఆమె సభకు హాజరవుతున్నా.. ఆమె మెడ మీద ఇంకో 'సస్పెన్షన్ వేటు' కత్తిలా వేలాడుతోందనుకోండి.. అది వేరే విషయం. రోజా విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అలా వ్యవహరిస్తున్నప్పుడు, రేవంత్‌రెడ్డి విషయంలో తెలంగాణలో టీఆర్‌ఎస్ కూడా అలాగే వ్యవహరిస్తే తప్పేంటట.?
ఆగండాగండీ.. అక్కడ గడ్డి తింటున్నారు కాబట్టి, ఇక్కడ మేమూ గడ్డి తింటాం.. అనే తరహాలో టీఆర్‌ఎస్ వాదన ఎంతవరకు సబబు.? అని మాత్రం అడగొద్దు.! ఇది రాజకీయం. పార్టీ ఫిరాయింపులు అనైతిక చర్య.. అని టీఆర్‌ఎస్‌కి తెలుసు. ఇదే టీఆర్‌ఎస్ గతంలో పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారమని విమర్శించింది. కానీ, తెలంగాణలో ఇప్పుడు ఆ ఫిరాయింపుల్నే ప్రోత్సహించింది. టీఆర్‌ఎస్‌ని చూసి, చంద్రబాబు కూడా అదే ఫాలో అవుతున్నారు. రాజకీయ వ్యభిచారమని విమర్శించిన చంద్రబాబే, ఫిరాయింపు రాజకీయాలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
ఈ కథలో నీతి ఏంటంటే, చెప్పడానికే నీతులు.. పాటించడానికి కాదు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి డాష్ డాష్ డాష్.. రేప్పొద్దున్న ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా, అప్పుడూ అంతే. అప్పుడు బాధపెట్టేవారు, బాధితులు అటూ ఇటూ అవుతారంతే.
బడ్జెట్ సెషన్ వరకు తనతోపాటు సండ్ర వెంకట వీరయ్యను (వీళ్ళిద్దరే మిగిలారు తెలంగాణలో టీడీపీకి..) తెలంగాణ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై రేవంత్‌రెడ్డి గుస్సా అవుతున్నారు. న్యాయపోరాటం కూడా చేస్తారట. ఈ మేరకు 'ప్రక్రియ' కూడా ప్రారంభించేశారట. కామెడీ కాకపోతే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన రోజా, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఏం జరిగింది.? కాస్తంత ధమాక్ ఉండాలి కదా రేవంత్‌రెడ్డికి.! 'మీ చంద్రబాబునడుగు.. రోజా విషయంలో ఏం చేశారో..' అంటూ టీఆర్‌ఎస్ నేతలు ఎత్తిపొడుస్తోంటే, రేవంత్‌రెడ్డికి ఎక్కడ కాలాలో అక్కడే కాలిపోతోంది మరి.!