ఎన్నో సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి కానీ, ఆ రెండు సినిమాలు వచ్చే, వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆ రెండు సినిమాలు మరేవో కావు. గోపీచంద్ నటించినవే. ఒకటి ఎ ఎమ్ గోపీకృష్ణ (రత్నం కుమారుడు) దర్శకత్వం వహించిన ఆక్సిజన్. మరొకటి బి గోపాల్ రిపేర్లు చేస్తున్న సినిమా.
ఆక్సిజన్ సినిమా ప్రొడక్ట్ ఇదిగో అదిగో అంటూ సాగుతుంటే, ఆఖరికి గోపీచంద్ మరో సినిమా మీదకు వెళ్లిపోయాడు. దీంతో చివర్న జస్ట పది శాతం వర్క్ వుండిపోయింది. అయితే ఆఖరికి సంప్రదింపులు అవీ జరిగి ఫినిష్ చేసాడు. అదే సమయంలో బి గోపాల్ చేతిలో పెట్టిన సినిమాకు పివిపి అండగా నిలిచి ఫైనాన్స్ అందించారు. అది కూడా కాస్త కదిలింది.
కానీ గోపీచంద్ కు ఇప్పుడు తన ఆశలన్నీ సంపత్ నందితో చేస్తున్న గౌతమ్ నందా మీద వున్నాయి. దానికి మంచి బజ్ వస్తోందని, దాని ముందు ఈ సినిమాలు విడుదల చేస్తే, ఆ సినిమా మార్కెట్ దెబ్బతింటుందేమో అని గోపీచంద్ ఆలోచిస్తున్నాడని వినికిడి. అందుకే ఈ రెండు సినిమాలను ఫినిష్ చేసినట్లు కాక, చేయనట్లు కాక మెల్లగా నడపిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ నందా విడుదలై, మాంచి పేరు వస్తే, అప్పుడు ఈ సినిమాలకు కూడా ప్లస్ అవుతుందని, అలా కాకుండా ఇవి ముందు వచ్చి తేడా చేస్తే, ఆ ఎఫెక్ట్ ఆ సినిమాపై పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తం మీద ఒకటి అయితే ష్యూర్ గా కనిపిస్తోంది. గౌతమ్ నందా మీద వున్న కాన్ఫిడెన్స్ ఈ రెండు సినిమాల మీద గోపీచంద్ కు వున్నట్లు లేదు.