పాత తెలుగు సినిమాల్లో యువరాణి ప్రియుణ్ని కలవడానికి సోదెకత్తె వేషం కట్టడం చూసేవాళ్లం. ఈ యువరాణి నిజంగానే సోదె (భవిష్యత్తు) చెప్పే 48 ఏళ్ల యువరాణి. పేరు మార్తా లూసీ. నార్వే రాజవంశీకురాలు. పంచమ హెరాల్డ్ రాజు కూతురు. రాజ్యసింహాసనానికి వారసులలో నాల్గవ స్థానం ఆమెది. కానీ రాజవంశం 17 ఏళ్ల క్రితమే 'హెర్ రాయల్ హైనెస్' బిరుదు నుంచి తీసేసింది. తాజాగా 'ప్రిన్సెస్' బిరుదు కూడా తీసేసింది. దీని కంతా కారణం ఆమె భవిష్యత్తు చెప్తాననడం, దేవతలతో, జంతువులతో మాట్లాడతాననడం, ఆత్మలతో కూడా ముచ్చట్లాడతానని చెప్పుకోవడం. ఇటీవల తన కంటె రెండాకులు ఎక్కువ చదివిన ఆత్మల మాంత్రికుడితో (షామాన్ అంటారు) జత కట్టింది. దాంతో వార్తల్లోకి ఎక్కింది. ఆవిడ చదివిన కోర్సు ఫిజియోథెరపీ. కానీ దానిలో ప్రాక్టీసు చేయలేదు. 'భవిష్యద్దర్శనం (క్లేర్‌వాయెన్స్ అంటారు), ఆత్మలతో సంభాషించడం నేర్పుతా' అంటూ కొందర్ని పోగేసి స్కూళ్లు నడిపింది. వాటిని నార్వేలో 'ఏంజిల్ స్కూల్స్' అంటారు.
రాజవంశీకులు వ్యాపారాలు చేయకూడదు. వ్యాపారావసరాలకై తన బిరుదు వాడుతుందనే భయంతో రాజుగారు ఆమె 'రాయల్‌హైనెస్' తీసేశారు. దాంతో సాధారణ పౌరుల్లాగానే ఇన్‌కమ్‌టాక్స్ కడుతోంది. సోదె పట్ల యీమెకు ఆసక్తి పెరగడానికి కారణం జానపద గాథలు, గేయాలు. ఈమె నార్వేకు సంబంధించిన జనపదాలలో తిరిగి వారు చెప్పుకునే గాథలు, పాడుకునే పాటలు సేకరించి, సంగీత విభావరులలో పాడసాగింది. 2003 క్రిస్‌మస్‌కు చర్చిలో సోలోగా పాడి, దాన్ని సిడిగా కూడా రిలీజ్ చేసింది. 2002లో వ్యాపారం ప్రారంభించినపుడు తన కంటె ఒక ఏడాది చిన్నవాడైన ఏరీ బెహ్న్‌ను పెళ్లాడింది. అతను రచయిత, నాటకకర్త. 2017లో వాళ్లిద్దరూ విడిపోయే నాటికి వాళ్లకు ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. 2004లో ఇద్దరూ అమెరికా వెళ్లి నార్వే రాజవంశం గురించి యీమె రాసిన పిల్లల పుస్తకాన్ని విడుదల చేశారు. 50 దేశాల నుంచి సేకరించిన 67 ఫెయిరీ టేల్స్ (జానపద గాథలు) సంకలనానికి సంపాదకత్వం వహించి 2007లో విడుదల చేసింది.
ఆమె జీవితం యిలాగే సాగిపోతూ ఉంటే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదేమో! కానీ ఆమె గత ఏడాది మేలో చేసిన ప్రకటన అందర్నీ ఉలిక్కిపడేట్లా చేసింది. తన కంటె మూడేళ్లు చిన్నవాడు, అమెరికాకు చెందిన నల్లజాతీయుడైన డ్యూరెక్ వెర్రెట్‌తో సంబంధం సాగిస్తున్నానని ప్రకటించింది. అతను ఓ షామాన్. భవిష్యత్తును చూడగలనని, రకరకాల ఆత్మలతో మాట్లాడుతూంటానని, ప్రజల మానసిక రోగాలను నయం చేస్తానని చెప్పుకుంటాడు. ఆడా, మగా యిద్దరితో సంపర్కం పెట్టుకునే స్వభావం ఉన్నవాడు. ఆ విషయాన్ని దర్జాగా చెప్పుకుంటాడు కూడా. తన మాజీ ప్రియుడి గురించి అతను మాట్లాడుతూ 'అతను మగవాడనే విషయం మర్చిపోండి. మా మధ్య ఉన్న అలౌకికమైన ప్రేమను గమనించండి' అన్నాడు.
డ్యూరెక్ చెప్పుకునే కొన్ని విషయాలు – 'నేను అమెరికాపై జరిగిన 9/11 దాడిని ముందే తెలుసుకున్నాను. తప్పిపోయిన మనుష్యులు ఎక్కడున్నారో తెలుసుకోగలను. మీ ఆత్మీయులెవరైనా చనిపోతే వారితో కనక్ట్ చేయించగలను (''సోగ్గాడే..''లో బ్రహ్మానందం గుర్తుకు వస్తున్నాడా?) మీకు దెయ్యం పడితే తరిమివేయగలను, శరీరంలో టాక్సిన్స్, నెగటివ్ ఎనర్జీని తీసేయగలను, కాన్సర్‌ను కూడా నయం చేస్తాను. మీ శరీరంలోని ఆటమ్స్‌ను నా వశం చేసుకుని ఎలక్ట్రాన్లను ఓ తిప్పు తిప్పి, మీ వయసు పెరగకుండా చేయగలను. నా క్లయింట్లలో హాలీవుడ్ తారలు కూడా ఉన్నారు.' ఇంతకీ యీ విద్యలన్నీ నీకు ఎక్కడ పట్టుబడ్డాయి బాబూ అని అడిగితే 'మా నాయనమ్మ నేర్పింది. ఆమె క్రోషియా యువరాణి.'' అని చెప్పుకున్నాడు.
ఇలా ఎన్నేళ్ల నుంచి చెప్పుకుంటున్నాడో తెలియదు కానీ నార్వే యువరాణిని ఆకర్షించడంతో నిజానిజా లేమిటో తెలుసుకుందామని అందరికీ ఆసక్తి కలిగింది. ఐస్‌ల్యాండ్‌లోని ఓ వెబ్‌సైట్ కూపీ లాగి 'ఇతను పుట్టడానికి రెండేళ్ల ముందే ఆ నాయనమ్మ చనిపోయింది. ఆవిడ రాణీ కాదు, మరేదీ కాదు. అనేకమంది ఆఫ్రో-అమెరికన్ల లాగానే ఆమె కూడా కష్టజీవే' అని తేల్చింది. నార్వేలో 92% మంది అతను ఒట్టి మోసగాడు అనుకుంటున్నారని ఓ సర్వే చెప్పింది. 'నాపై యింత వ్యతిరేకత ఉంటుందని నేనెన్నడూ అనుకోలేదు' అన్నాడు డ్యూరెక్. 'నువ్వు భవిష్యత్తు చూడగలవు కదా, యిది తెలుసుకోలేక పోయావా?' అని వెక్కిరించారు జర్నలిస్టులు. ఎవరేమంటున్నా మార్తా మాత్రం వినటం లేదు. 'మాది అనంతమైన ప్రేమ. ఈ యుగం నుంచి వచ్చే యుగం దాకా ఉంటుంది.' అని గొప్పగా చెప్పుకుంది. ఓ పత్రిక 'కితం సారి వివాహంలో ఆమె 'యగం' ఆయుర్దాయం 15 ఏళ్లు' అని గుర్తు చేసింది.
డ్యూరెక్ మాత్రం అస్సలు తగ్గటం లేదు. ''నేను గతజన్మలో ఈజిప్టుని ఏలిన ఫారోని, మార్తా నా రాణి. మా యిద్దరి మధ్య అప్పణ్నుంచే ప్రేమ ఉంది. మాది జన్మజన్మల బంధం. అందుకే ఆమెను చూడగానే ఎప్పుడో చూసిన అనుభూతి కలిగింది.'' అని చెప్పుకుంటున్నాడు. ఇద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా 5 షోలు నిర్వహిస్తాంచారు. 'మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకునే అద్భుతలోకంలోకి తీసుకెళతాం' అని హామీ యిస్తున్న యీ షోల ద్వారా రూ.12 కోట్లు ఆర్జించారు. ఈ షోకు ''ద ప్రిన్సెస్ అండ్ ద షామాన్'' అని పేరు పెట్టడం నార్వే రాజవంశాన్ని మండించింది. 'ప్రిన్సెస్ హోదాను వాణిజ్యపరంగా ఉపయోగించడం వలన మన పరువు పోతుంది. అందుకని అది వాడరాదు.' అంటూ ఆ బిరుదు తొలగించారు. ఆ షోలు కూడా వివాదాస్పద మయ్యాయి. అయినా వెనకాడకుండా 2019 అక్టోబరులో డ్యూరెక్ రాసిన ''స్పిరిట్ హ్యేకింగ్'' అనే సెల్ప్-హెల్ప్ పుస్తకాన్ని కాలిఫోర్నియాలో విడుదల చేశారు.
వీళ్ల సంగతి యిలా నడుస్తూండగానే మార్తా మాజీ భర్త ఏరీ బెహ్న్ 2019 డిసెంబరు 25న ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యపానం, మానసిక వ్యగ్రత ఉన్నాయంటున్నారు కానీ అసలైన కారణం తెలియదు. ఈ సోదె వాళ్లిద్దరూ దాన్ని ముందే తెలుసుకోలేక పోయారు. జనవరి మొదటివారంలో జరిగిన అతని అంత్యక్రియల్లో మార్తా పాల్గొంది. మూడు రోజుల తర్వాత డ్యూరెక్ సోషల్ మీడియా ద్వారా మార్తాకు సంతాపం తెలియపరిచాడు. ఈ యిద్దరూ కలిసి ఏరీ చావుకి కారణమేమిటో అతని ఆత్మను నుక్కుని మనకు చెప్తారేమో వేచి చూడాలి.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)
[email protected]