మండలి రద్దుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకీ ఇక్కట్లు తప్పేలా లేవు. అయితే తను ప్రతీదీ రాజకీయ సమీకరణాల కోణం నుంచి ఆలోచించేది ఉండదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. తనను మరో చంద్రబాబు చేయవద్దని జగన్ స్పష్టం చేశారట. మండలిలో ఎమ్మెల్సీల ఫిరాయింపుకు రెడీ అని, కాబట్టి ప్రస్తుతానికి మండలి రద్దు ఆలోచనను విరమించుకోవచ్చని ఒకరిద్దరు మంత్రులు సలహా ఇవ్వగా చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన నిర్ణయాల్లో రాజకీయ స్వార్థం ఉండకూడదని జగన్ భావిస్తున్నట్టుగా స్పష్టం అవుతూ ఉంది.
ఇది ఆహ్వానించదగిన పరిణామమే. ఒక ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తి రాజకీయ స్వార్థ రహితంగా ఆలోచించడం మంచిదే. ఇప్పుడు మండలి రద్దుతో సామాన్యులకు వచ్చిన నష్టం అయితే ఏ మాత్రం లేదు. నష్టంఏదైనా ఉంటే అది జగన్ కే. అయినా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మండలి రద్దుతో ఇద్దరు మంత్రులు రాజీనామాకు రెడీ అయినట్టే. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ వీరిద్దరూ జగన్ కోసం గతంలో మంత్రి పదవులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వంలో వీరిని మంత్రులుగా చేశారు జగన్. అయితే ఇప్పుడు జగన్ నిర్ణయంతోనే వారు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారట ముఖ్యమంత్రి.
కేబినెట్ ర్యాంక్ హోదాలో వారికి ఏదైనా పదవి లభించే అవకాశాలున్నాయి. అలాగే ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను జగన్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వాటిల్లో ఈ ఎమ్మెల్సీ రేసు నేతలందరికీ ప్రాధాన్యత దక్కవచ్చనే ప్రచారం జరుగుతూ ఉంది.