ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్‌నాయుడు కుటుంబ సభ్యులతో సహా కలిశాడు. అసెంబ్లీ లాబీలోని సీఎం చాంబర్‌లో సోమవారం జగన్‌ను కలిసి తన కుమారుడు రిత్విక్ పెళ్లికి ఆహ్వానించాడు. పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో రిత్విక్ వివాహం ఫిబ్రవరి 7న జరగనుంది.
అంతకు ముందు వీరిద్దరి నిశ్చితార్థం దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తన కుమారుడి పెళ్లికి రావాలని ఇటీవలే ప్రధాని మోడీని కూడా కుటుంబ సమేతంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత సీఎం రమేష్ సహా మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీపై ఒంటికాలి మీద లేచిన సీఎం రమేష్…ఇప్పుడు నోరు తెరవడం లేదు. అంతేకాకుండా సీఎం జగన్‌కు దగ్గరయ్యేందుకు అతను అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు రమేష్ వెళ్లి సీఎంను అభినందించిన విషయం తెలిసిందే.
మళ్లీ ఇప్పుడు తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు సీఎం జగన్‌ను రమేష్ కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. పెళ్లి సాకుతో జగన్‌కు దగ్గరయ్యేందుకు రమేష్ ప్రయత్నిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. సీఎం రమేష్ కాంట్రాక్ట్ వర్క్స్‌కు సంబంధించి కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు రావాల్సి ఉందని సమాచారం. ఎలాగైనా తనకు ప్రభుత్వం నుంచి డబ్బును రాబట్టుకునే క్రమంలో సీఎం రమేష్ నానా తిప్పలు పడుతున్నారని సమాచారం.