ప్రాజెక్టులు – పర్యావరణ సమస్యలు

సామాజిక అభివృద్ధి జరగాలంటే విద్యుత్ కావాలి. విద్యుత్ కావాలంటే ప్రాజెక్టు పెట్టాలి. పెడితే పర్యావరణం చెడుతుంది, కొంతమంది నిర్వాసితులు అవుతారు. ప్రగతి, పర్యావరణం వంటి రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు. ఏకకాలంలో రెండూ…

సామాజిక అభివృద్ధి జరగాలంటే విద్యుత్ కావాలి. విద్యుత్ కావాలంటే ప్రాజెక్టు పెట్టాలి. పెడితే పర్యావరణం చెడుతుంది, కొంతమంది నిర్వాసితులు అవుతారు. ప్రగతి, పర్యావరణం వంటి రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు. ఏకకాలంలో రెండూ సాధించడం అసాధ్యం. ఒకదాని తర్వాత మరొకటి సాధించాలంతే. అయితే ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సామాజిక సంస్థలు రెండూ ఒకేసారి చేపట్టాలని భావిస్తాయి. ఏవేవో చట్టాలు చేస్తాయి. అవి ఆచరణసాధ్యం కాదు. ప్రాజెక్టులు పేపర్లపై మురిగిపోతాయి. విద్యుత్ ఉత్పత్తి కాదు, ప్రగతి ఆగిపోతుంది, ప్రజలు గగ్గోలు పెడతారు. రాజకీయపక్షాలు అధికారంలో వుండగా కంపెనీల తరఫున, విపక్షంలో వుండగా ప్రజల తరఫున వాదిస్తూ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తాయి. అధికారంలో వున్నవారిలో కూడా పరిశ్రమల మంత్రి ఒకలా, పర్యావరణ మంత్రి మరొకలా మాట్లాడుతూంటారు. పర్యావరణ రక్షణ అంటూ కొన్ని చట్టాలు చేస్తూ వుంటారు. అవి ఆచరణలో ఎలా విఫలమవుతాయో, చట్టపరమైన ఇబ్బందులు దాటడానికి కంపెనీలు ఎలాంటి తప్పుడు మార్గాలు తొక్కుతాయో ఉదాహరణగా నిలిచినవి – మధ్యప్రదేశ్‌లో థర్మల్ ప్లాంట్స్! 

మధ్యప్రదేశ్‌లోని తూర్పుప్రాంతంలో వున్న సింగ్రౌలీలో మూడు థర్మల్ ప్లాంట్లున్నాయి. మరో 12 సూపర్ థర్మల్ ప్లాంట్లు రాబోతున్నాయి. అన్నీ కలిసి రాబోయే రోజుల్లో 35 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయబోతాయి. దేశంలో  యిండస్ట్రియల్ ఎస్టేట్సు వుంటే సింగ్రౌలి ఎస్టేటు స్థానం – తొమ్మిది. దానికి కారణం అక్కడ వున్న విస్తారమైన బొగ్గుగనులు, జలసమృద్ధి! అక్కడ వున్న మహాన్ అడవిలో సాల్, మహువా, తెండు వృక్షాలున్నాయి. దగ్గర్లోనే పులుల కోసం రిజర్వ్ చేసిన ప్రాంతం కూడా వుంది. రిలయన్సు, హిందాల్కో, జయప్రకాశ్, డిబి పవర్, ఎస్సార్ వంటి సంస్థలు ఇక్కడ  ప్రాజెక్టులు కట్టడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే సింగ్రౌలీ వాతావరణం కలుషితమైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. రాబోయే ప్రాజెక్టుల వలన  మరింత హాని జరగడంతో బాటు, తాము నిర్వాసితులవుతామన్న భయంతో వాటిని అక్కడి పౌరులు అడ్డుకుంటున్నారు. బంధోరాలో ప్రాజెక్టు కట్టబోయిన ఎస్సార్‌కు సంబంధించిన ట్రక్కులను, ఆస్తులను 2009లో గ్రామస్తులు తగలబెట్టారు. పోలీసు ఫైరింగ్ జరిగింది. గ్రామాలలో ఇళ్లు నేలమట్టం చేసి ప్లాంట్ కట్టారు. ఇంకా అనేక ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఎలా? అంటే ఇక్కడో కిటుకు వుంది.

ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే దాని వలన ప్రభావితమయ్యే గ్రామాల్లో సమావేశం జరిపి గ్రామసభవారు తమకు అభ్యంతరం లేదని తీర్మానం చేయాలని పర్యావరణ శాఖ నిబంధన విధించింది. దాన్ని అధిగమించడానికి కంపెనీలు కొత్త ఎత్తులు ఎత్తాయి. సభ జరగకపోయినా, దానికి అందరూ రాకపోయినా మెజారిటీ ప్రజలు వచ్చినట్లు, ఆమోదం తెలుపుతూ సంతకాలు పెట్టినట్లు రికార్డులు సృష్టించారు. దొంగ సంతకాలు, దొంగ వేలిముద్రలు వేయించే హడావుడిలో   వాళ్లు బతికున్నారో లేదో చూసుకోలేదు పాపం. ఉదాహరణకి మహాన్ అరణ్యంలో 150 మెగావాట్ల ఎస్సార్-హిందాల్కో జాయింట్ వెంచర్ సంగతి చూదాం. ఐదువేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టుకై రెండేళ్ల క్రితం ప్రభుత్వం 112 హెక్టార్ల భూమి మంజూరు చేసింది. దానిలో వున్న బొగ్గుగనుల్లో బొగ్గు తవ్వాలంటే అక్కడ వున్న 14 గ్రామాల ప్రజల అనుమతి కావాలి. ఎస్సార్ కంపెనీ ఉద్యోగులు, జిల్లా అధికార యంత్రాంగం కలిసి నో-అబ్జక్షన్ సర్టిఫికెట్‌లు తయారు చేసేసి కేంద్రం నుండి అనుమతి తెచ్చేశారు. అవి తప్పని సామాజిక సంస్థలు ఆరోపిస్తున్నాయి. ‘‘2013 మార్చి 6 న అమేలియా గ్రామంలో జరిగిన సభలో 14 మంది హాజరవుతే 1125 మంది వచ్చారని, సంతకాలు పెట్టారని చూపించారు.’’ అని ఆ సంస్థ ప్రతినిథి ఆరోపించాడు. సంతకాలు పెట్టారని చూపిస్తున్నవారిలో 13 మంది కొన్ని సంవత్సరాల క్రితమే మరణించారట, ఒకతను జైల్లో యావజ్జీవశిక్ష అనుభవిస్తున్నాడట. 

సింగ్రౌలికి 250 కి.మీ.ల దూరంలో కట్ని జిల్లాలో వున్న బుజ్‌బూజా, డోకారియా గ్రామాల్లో కూడా ఇలాంటి మాయాజాలమే జరిగింది. ఒక ప్రయివేటు సంస్థ థర్మల్ పవర్ స్టేషన్ పెడతానంటే జిల్లా అధికారులు 237 హెక్టార్లలో వున్న గ్రామసభల నుండి ఇలాంటి సర్టిఫికెట్లు సంపాదించి ఇచ్చారు.  అక్కడ సంతకాలు పెట్టినవారిలో 21 మంది మృతులున్నారు. చిత్తశుద్ధి లేకుండా చేసే ఇలాంటి పనుల వలన మేలు కంటె కీడు ఎక్కువ జరుగుతుంది. వ్యవసాయ అవసరాల కోసం, జలవిద్యుత్‌కోసం కట్టిన రిహాండ్ డ్యామ్‌లోని నీటిని ఇప్పుడు వాటికోసం వాడటం లేదు. థర్మల్ ప్లాంట్లలోని టవర్స్‌ను చల్లబరచడానికి వాడుకుంటున్నారు. అంతేకాదు, ఆ నీటితో చెరువులు కట్టి పవర్ స్టేషన్ల నుండి వెలువడే హానికరమైన వ్యర్థపదార్థాలను వాటిలో కలుపుతున్నారు.   కంపెనీలు ఇలాంటి దొడ్డిదారులు వెతుకుతాయని అధికారంలో వున్నవారు ముందుగానే వూహించి, ఆచరణాత్మకమైన ప్రభుత్వాదేశాలను రూపొందిస్తే ప్రగతి ఆ తర్వాత పర్యావరణరక్షణ సాధ్యం. లేకపోతే బూటకమే మిగులుతుంది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]