సూర్యకాంతిని ఆపవచ్చు. అర ‘చేతి’తోనే కాదు; పుర (ఎడమ) చేతితో కూడా ఆపెయ్యవచ్చు. ఇలా అంటే, ఎందరికోఆశ్చర్యంగా వుండవచ్చు; కొందరికి కోపం కూడా రావచ్చు; ఇంకొందరికి ప్రకృతి విరుధ్ధంగా వుండవచ్చు. కానీ జరిగిపోయింది. గతవారం ( సెప్టెంబరు మొదటివారం 2014) జరిగిన దేశంలోని కొన్ని రాష్ట్రాల ఉపఎన్నికల సారమిదే. ఇవి జరగటానికి మూడు నెలల క్రితం (మే 2014) ఎన్నికలకీ, ఈ ఉపఎన్నికలకీ పోలికేలేదు. ఆ ఎన్నికలలో దేశంలో వోటర్లు ‘నమో’ అంటూ నరేంద్ర మోడీ ముందు ప్రణమిల్లారు. అజేయుడుగా, అతీతుడుగా, అందని వాడుగా ఆయన ఈ ఎన్నికలలో ఎదిగిపోయాడు. చండ్రభానుడిలాగా ప్రకాశించాడు. ఇప్పట్లో బీజేపీ సంధించిన ‘నమ్మో’హనాస్త్రానికి తిరుగు లేదని రాజకీయ పరిశీలకులు భావించారు. యావధ్భారతం కాక పోయినా, ఉత్తర, పశ్చిమ భారతాలు ఆయనకు నీరాజనాలు పట్టాయి.
కానీ ఈ ఉపఎన్నికల తర్వాత అందరికీ ఒక సందేహం వచ్చింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలప్పుడు ( మే 2014) న వీచింది ‘మోడీ’ ప్రభంజనమేనా? అదే నిజమయింతే, మోడీకి కంచుకోట అయిన ఉత్తర భారతంలో ఈ భంగపాటు ఏమిటి? ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేవలం మూడు స్థానాలనే గెలుచుకుంది. ఎనిమిది సొంత (సిట్టింగ్) స్థానాలను కోల్పోయింది. ఈ ఎనిమిదింటిని ప్రధాన ప్రత్యర్థిగా వున్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సునాయాసంగా వొడిసి పట్టుకుంది. రాజస్థాన్‌లోని మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేవలం ఒకే ఒక స్థానాన్ని గెలుచుకుంది. మూడు సొంత(సిట్టింగ్) స్థానాలను జారవిడుచుకున్నది. ఇవి వెళ్ళి వెళ్ళి నేరుగా కాంగ్రెస్ ‘చేతి’లో పడ్డాయి. ఇక నరేంద్ర మోడి సొంత రాష్ట్రంలో నయినా పరువు నిలిచిందా` అంటే` అదీ లేదు. మొత్తం తొమ్మిది సీట్లలో ఆరింటిని మాత్రమే కైవసం చేసుకుంది. మిగిలిన మూడూ స్వస్థానాలనూ కాంగ్రెస్‌కు సమర్పించుకుంది.
అసెంబ్లీ స్థానాల విషయంలోనే కాదు, పార్లమెంటు సీట్ల విషయంలో కూడా ఇదే జరిగింది. ఉపఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లోనూ, బీజేపీ మూడు రకాలుగా భంగపడిరది. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ నేత ములాయం సింగ్ ఖాళీ చేసిన మణిపురి పార్లమెంటు స్థానాన్ని, తిరిగి ఎస్పీ అభ్యర్థే కైవసం చేసుకోగలిగాడు. బీజేపీ తన హవాను చూపలేక పోయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఖాళీ చేసిన మొదక్‌లో, బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కూడా, మూడోస్థానంలో నిలిచింది. ( కాక పోతే ఓటింగ్ శాతాన్ని స్వల్పంగా పెంచుకోగలిగింది.) ఇక మోడీ సొంత రాష్ట్రమయిన గుజరాత్ లో, మోడీ ఖాళీ చేసిన సొంత నియోజకవర్గం వడోదర సీటుని బీజేపీ దక్కించుకుంది కానీ, మేనెలలో సాధించుకున్న మెజారిటీని సాధించుకోలేక పోయింది. సార్వత్రిక ఎన్నికలలో 5.7లక్షల మెజారిటీ సాధించుకుంటే, ఇప్పుడు 3.3లక్షలలోపు మాత్రమే మెజారిటీని సాధించ గలిగింది. ఈ విషయంలో టీఆర్‌ఎస్ నేత కేసీఆర్, బీజేపీని వెక్కిరించారు కూడా.( తాను ఖాళీ చేసిన మెదక్‌లో టీఆర్‌ఎస్ దాదాపు పాత మెజారిటీనే నిలుపుకుంటే, మోడీ ఖాళీ చేసిన సీటులో పాత మెజారిటీని తెచ్చుకోలేక పోయిందని కేసీఆర్ అన్నారు.)
సార్వత్రిక ఎన్నికల తర్వాత, మోడీ ప్రభంజనానికి భారీయెత్తున చుక్కెదురయ్యింది ఇది రెండవ సారి. నెల క్రితం జరిగిన ఉప ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన రాష్ట్రాలు రెండు:కర్ణాటక, బీహార్. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగిన 10 సీట్లలోనూ నితిష్`లాలూల (జెడీయూ`ఆర్జేడీల) కూటమి ఆరు సీట్లను కైవసం చేసుకుని, బీజేపీకి నాలుగు మాత్రమే మిగిల్చింది. కర్ణాటకలోనూ అదే జరిగింది. మొత్తం మూడు సీట్లలో ఒక్కటి మాత్రమే అతికష్టం మీద ఒక్కటి మాత్రమే బీజేపీ గెలుచుకోగలిగింది. మిగిలిని రెంటినీ కాంగ్రెస్ కైవసం చేసుకొంది. కోల్పోయిన వాటిలో బీజేపీకి ప్రతిష్టాత్మకమైన బళ్ళారి సీటు కూడా వుంది.
నిజంగా దేశంలో బీజేపీ గెలవటానికి మోడీ ప్రభంజనమే కారణమయితే, అది ఎంతవేగంగా పుంజుకుందో, అంతే వేగంగా బలహీనపడటం మొదలయ్యిందని దేశంలో జరిగిన ఈ రెండు విడతల ఉప ఎన్నికలూ నిరూపిస్తున్నాయి. అంతే కాదు, ఈ రెండు విడతల ఉపఎన్నికలూ, రెండు భ్రమల్ని తొలగించాయి. మొదటి భ్రమ: దేశమంతా ‘గుజరాత్ నమూనా’ ను చూసే మోడీకి పట్టం కట్టాయి. రెండవ భ్రమ: యూపీలో అమిత్‌షా పాచికకు తిరుగులేదు. ‘గుజరాత్ నమూనా’కు అదే గుజరాత్‌లో మూడు నెలలు తిరగకుండానే చుక్కెదురయింది. ఇక ఇతర రాష్ట్రాలలో ఎలా నడుస్తుంది. ఉత్తరప్రదేశ్ అమిత్‌షా వేసిన పాచిక ఒక్కటే: ముజఫర్‌నగర్ అల్లర్లు సాకుగా చూపి, ముస్లింలకు వ్యతిరేకంగా బీసీల వోట్లకు గ్యాలం వేసి, ఆ వోట్లను అగ్రవర్ణ హిందువుల వోట్లతో కలపటం. కానీ మూడు నెలలు తిరగకుండానే బీసీలు మెల్లగా తిరిగి ఇతర బడుగు వర్గాల( ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు) చేరువయ్యాయని ఈ ఉప ఎన్నికలు నిరూపించాయి. బీసీ, ఎస్సీ, మైనారిటీల వోట్లు చీలకుండా వుండటానికి నెల క్రితం లాలూ`నితిష్‌లు వేసిన మంత్రాన్నే, ములాయం` మాయావతిలు వేరే విధంగా వేశారు. మాయవతి తన పార్టీ (బీఎస్సీ)ని ఉప ఎన్నికల బరిలో నిలబెట్టక పోవటం వల్ల, ఆమె వద్ద వున్న ‘ఎస్సీల’ వోట్లు ఎస్సీకి పడ్డాయి. అంటే, మళ్ళీ ‘మండల్’ రాజకీయాలు ‘మందిర్ ’ రాజకీయాలపైన ఆధిపత్యం చూపటం మొదలు పెట్టాయని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.