ఆయన పేరును బట్టి తమిళుడు అనుకొన్నారో ఏమో కానీ… కనీసం చనిపోయినపపుడు కూడా ఎవరూ నివాళి ఘటించలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఎవరో సంగీత కారులు మరణిస్తే బోరున ఏడ్చేసే మన తెలుగు సినిమా సెలబ్రిటీలకు మాండలిన్ శ్రీనివాసన్ అంటే ఎవరో కూడా తెలిసినట్టు లేదు. ఒక్క తెలుగు సినిమా సెలబ్రిటీ కూడా మాండలిన్ కు నివాళులు ఘటించలేదు.
ట్విటర్ వచ్చాకా ఈ నివాళులు ఘటించడం చాలా సులభమైన పని. ఆర్.ఐ.పి అనే ఒక్క మాటతో ఎంతో సానుభూతిని ప్రకటించేయవచ్చు. అయితే మాండలిన్ శ్రీనివాసన్ విషయంలో మన తెలుగు సినీ సెలబ్రిటీలకు అంత తీరిక లేకపోయింది. పిన్న వయసులోనే మరణించిన ఆయనకు ఒక్క తెలుగు ప్రముఖుడు కూడా నివాళి ఘటించలేదు.
అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే… మనవాళ్లను వెక్కిరిస్తున్నట్టుగా తమిళ సినిమా సెలబ్రిటీలు మాత్రం మాండలిన్ స్మరించుకొన్నారు. ఆయన గొప్పదనాన్ని గుర్తు చేసుకొంటూ మాండలిన్ ను మిస్సవుతున్నామని బాధపడ్డారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అయితే మాండలిన్ శ్రీనివాసన్ మరణం తనను కలవరపెట్టిందన్నాడు. యువకుడైన ఆ సంగీతకారుడి మరణం విషాధభరితమైన విషయం అని అభిప్రాయపడ్డాడు. పరలోకంలో మాండలిన్ కు దైవ కృప లభించాలని ఆకాంక్షించాడు.
ఇక తమిళ హీరో సిద్ధార్థ్ అయితే.. తాము చిన్నప్పటి నుంచి మాండలిన్ పేరును వింటున్నామని, తముచిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాండలిన్ శ్రీనివాసన్ ను ప్రతిభావంతమైన పిల్లాడిగా పరిచయం చేసే వాళ్లని మాండలిన్ తో ముడిపడిన అనుబంధాన్ని వివరించాడు. శ్రీనివాసన్ చివరి చూపు కోసం తమిళనాడు రాజకీయ, సినీ ప్రముఖులు క్యూ కట్టారు. డీఎంకే నేత స్టాలిన్, ప్రభుత్వం తరపు నుంచ ప్రముఖులు, డమ్మర్ శివమణి, గాయకుడు శంకర్ మహదేవన్ . నటి శోభన సహా అనేక మంది ప్రముఖులు ఈ తెలుగువాడి భౌతిక కాయానికి నివాళులు ఘటించి వెళ్లాడు. మరి తెలుగు సెలబ్రిటీ అజ్ఞానం ఏ స్థాయిలో ఉందో కానీ… ఎవరూ మాండలిన్ మరణం గురించి స్పందించింది లేదు. తమ ట్విటర్ ల ద్వారా ఏ ఒక్కరూ మాండలిన్ ను స్మరించలేదు. అయితే సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ దీనికి మినహాయింపు. మాండలిన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి వచ్చాడు దేవీ. అక్కడ కనిపించిన ఏకైక తెలుగువాడు ఈ ఒక్కడే!