ప్రస్తుతం అయ్యప్ప సీజన్ నడుస్తోంది. ఈ సీజన్‌లో సుమారుగా 6 కోట్ల మంది భక్తులు – వారిలో అత్యధికులు తమిళులు, తెలుగువారు – కొండకు వెళతారు. అంటే కేరళ జనాభాకు దాదాపు రెట్టింపు. ఇంతమంది ఒకేసారి వెళ్లడంతో అనేక రకాల యిబ్బందులు వస్తున్నాయి. వర్షాకాలం అప్పుడే పూర్తవడంతో రోడ్లు దెబ్బ తిని వుంటాయి. ఇక భక్తుల వాహనాల తాకిడికి అవి ధ్వంసమై పోతున్నాయి. పంపానదిలో మునక యాత్రికులకు చాలా ముఖ్యమైనది. భక్తుల తాకిడికి అది కలుషితం అయిపోతోంది.
పంపా యాక్షన్ ప్లాన్ అనే పేరుతో 2003లో మొదలుపెట్టిన ప్రాజెక్టు యిప్పటికీ పూర్తి కాలేదు. అలాగే శబరిమల మాస్టర్ ప్లాన్ అని 2012లో ప్రారంభించినది కూడా ఆగిపోయింది. శబరిమల వున్న ప్రాంతమంతా పెరియార్ నేషనల్ పార్క్ అనే రక్షిత వనప్రాంతంలోకి వస్తుంది. అక్కడ శాశ్వత ప్రాతిపదికన నీటివసతి కల్పించడం, టాయిలెట్లు కట్టడం, చెత్త తొలగించే వ్యవస్థ సమకూర్చడం, ఆసుపత్రులు నిర్మించడం – యివన్నీ వన్యసంరక్షణ చట్టానికి లోబడి చేయడం కుదరటం లేదు. ఈ సమస్యలపై 'మలయాళ మనోరమ' నవంబరు 4 న సదస్సు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరిస్తే శబరిమలను జాతీయ యాత్రాస్థలంగా ప్రకటిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే సూచన వచ్చింది.
Click Here For Great Andhra E-Paper
దానితోబాటు గర్భగుడి ఎదుట కదిలే ప్లాట్‌ఫారం ఏర్పాటు చేయాలని కూడా..! భక్తులు విధిగా ఎక్కవలసిన 18 మెట్లపై నిమిషానికి 90 మంది ఎక్కుతున్నారు. కష్టపడి ఎక్కినా దర్శనం కరువౌతోంది. మెట్లు ఎక్కగానే ఆ ప్లాట్‌ఫారం ఎక్కితే అదే సోపానం ఎదురుగా భక్తులను తీసుకెళ్లి దేవుణ్ని చూడడానికి వీలు కల్పిస్తుంది. శబరిమల వద్ద వున్న నీలక్కల్‌లో విమానాశ్రయం కట్టాలని, అక్కడే వాహనాల పార్కింగ్‌కు కూడా చోటు చూపాలని, అక్కణ్నుంచి శబరిమల కొండ దిగువన పంపాక్షేత్రానికి మోనోరైల్ నడపాలని మరో సూచన.
శబరిమలకు దారితీసే 17 ప్రధాన రహదార్లను నిర్మించడానికి ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కూడా సదస్యులు అన్నారు. ఈ సూచనలతో కేరళ మంత్రులు కొందరు నరేంద్ర మోదీని కలవగా, ఆయన 'నేనే శబరిమలకు నవంబరు నెలాఖర్లో వచ్చి చూస్తాను. ఈ లోపున మీరు వైష్ణోదేవి వద్ద ఎలాటి ఏర్పాట్లు వున్నాయో గమనించండి' అన్నారట. దానితో కేరళ ప్రభుత్వానికి ఉత్సాహం వచ్చింది. ప్రధాని శబరిమల వచ్చినపుడు జాతీయ యాత్రాస్థలంగా ప్రకటించాలన్న డిమాండ్, మాస్టర్ ప్లాన్ ముందు పెడదామనుకుంటున్నారు. ఆ ఘనత కాంగ్రెసు నేతృత్వంలోని రాష్ట్రప్రభుత్వానికి మొత్తం పోకుండా చూడాలని రాష్ట్ర బిజెపి శాఖ కూడా మరో నివేదిక అందజేయబోతోంది.
ఎమ్బీయస్ ప్రసాద్