దేవయాని ఖోబర్‌గాడే యింట్లోంచి జూన్ 23 న ఆ”మె పనిమనిషి సంగీతా రిచర్డ్స్ మాయమైన సంగతి తెలుసు. బయటకు ఎలా వెళ్లింది? అన్నదానిపై యిప్పుడు కొంత సమాచారం లభిస్తోంది. రుచిరా గుప్తా అనే ఆమె న్యూయార్కు యూనివర్శిటీలో ప్రొఫెసర్. ఆవిడ 'అప్‌నే ఆప్' అనే సామాజిక సంస్థ ఏర్పరచి అక్రమ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఆమె యింట్లో కూడా పనిమనిషి వుంది. ఆమె అనేదేమిటంటే – 'న్యూయార్క్‌లోని పనిమనుషులు ఒకరితో మరొకరు కలుస్తూంటారు. కష్టసుఖాలు చర్చించుకుంటారు. తమకు రావలసినది ఏమిటి, దక్కుతున్నదేమిటి యివన్నీ తెలుసుకుంటారు. నేను మా పనిమనిషి పేర బ్యాంకు ఎక్కవుంటు తెరిచాను. అంతేకాదు ఆమెకు లభించే హక్కులు, సౌకర్యాలు ఆమెకు అర్థమయ్యేట్లా హిందీలో రాసి కిచెన్‌లో పెట్టాను. ఇక్కడ రూల్సు ప్రకారం అలాగే చేయాలి.
''దేవయాని యిలాగ చేసినట్టు లేదనుకుంటా. సంగీత 2012 నవంబరులో యిక్కడకు రాగానే తనకు యిస్తున్న జీతం (నెలకు 575 డాలర్లు) తక్కినవారితో పోలిస్తే చాలా తక్కువని తెలుసుకుంది. దగ్గర్లో వున్న చర్చికి వెళుతూ వుండేది. అక్కడ ఒక పాకిస్తానీ పరిచయమైంది. ఆమెతో స్నేహం కుదిరి, తన కష్టాలు చెప్పుకోసాగింది. 2013 మార్చి ప్రాంతంలోనే న్యూయార్క్‌లోని కొందరు పనిమనుషుల మధ్య సంగీత కష్టాల గురించి చర్చ జరిగేదని మా పనిమనిషి చెప్పింది. ఈ పనిమనుషులు యింటర్నెట్ వాడుతూంటారు కాబట్టి ఇంకో రెండు నెలలు గడిచేసరికి న్యూయార్కులోని యావన్మంది పనిమనుష్యులకు సంగీత యిబ్బంది పడుతోందన్న వార్త చేరిపోయింది. ఇంత జరుగుతున్నా దేవయాని కానీ, భారతీయ అధికారులు కానీ మేల్కొనలేదు, దేవయానిని అక్కణ్నుంచి బదిలీ చేయలేదు. చివరకు యిలా పరిణమించింది.''
2013 జూన్ ప్రాంతంలో భారతదేశానికి బదిలీ చేస్తామని ఆఫర్ చేసినా దేవయాని వద్దని వుంటుందని భారత విదేశాంగ శాఖలో కొందరు అధికారులు వూహిస్తున్నారు. ఎందుకంటే ఆమె భర్త ఆకాశ్ సింగ్ రాథోడ్ న్యూయార్కులో ఫిలాసఫీ ప్రొఫెసరు. అతను అమెరికాలోని పుట్టాడు, స్థిరపడ్డాడు. ఈలోగా సంగీత తన ప్రయత్నాలు తను చేసుకుంది. రుచిరా గుప్తా పనిమనిషితో కూడా స్నేహం కుదిరింది. ఆమె వుండే అపార్టుమెంటు కాంప్లెక్సు వాచ్‌మన్ షబ్బీర్ పాకిస్తానీ వాడు. అతని సాయం కోరింది. దేవయాని యింట్లోంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడానికి నిశ్చయించుకున్నాక, యింట్లోంచి తన సామాన్లు ఒక్కోటి బయటకు చేరవేసి షబ్బీర్ దగ్గర దాచింది. జూన్ 23 న దేవయాని యింట్లోంచి పారిపోవడానికి యీ పనివాళ్లందరూ సాయపడ్డారు. ఇండియన్ కాన్సలేట్‌లో పని చేసే డ్రైవరు ఆమెను కాన్సలేట్‌కు చెందిన కారులోనే రుచిరా యింటికి తీసుకుని వచ్చి షబ్బీర్ దగ్గర సామాను కూడా కారులో వేసుకుని సంగీతను ఎక్కడికో తీసుకెళ్లి చేర్చాడు. ఎక్కడకి చేర్చాడు? అది ప్రస్తుతానికి రహస్యం! చూడబోతే అమెరికా కోర్టులో దేవయానిని విచారించేటప్పుడు యీ పనిమనుషులందరూ ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేట్టున్నారు.
-ఎమ్బీయస్ ప్రసాద్