ఎమ్బీయస్‌: భార్య తీర్చిదిద్దిన శశి కపూర్‌

 అందగాడిగా, పెద్దమనిషిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న శశి కపూర్‌ తన 79 వ ఏట యీ వారం మరణించాడు. కపూర్ల వంశానికి చెందినవాడు కాబట్టి స్టార్‌డమ్‌ ఆటోమెటిక్‌గా వచ్చి ఒళ్లో పడిందనుకుంటే పొరపాటు. వారసత్వాల్లో…

 అందగాడిగా, పెద్దమనిషిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న శశి కపూర్‌ తన 79 వ ఏట యీ వారం మరణించాడు. కపూర్ల వంశానికి చెందినవాడు కాబట్టి స్టార్‌డమ్‌ ఆటోమెటిక్‌గా వచ్చి ఒళ్లో పడిందనుకుంటే పొరపాటు. వారసత్వాల్లో ఉండే యిబ్బందులు అతనూ పడ్డాడు. చాలాకాలం విఫలనటుడిగా ఉండి, కిందామీద పడి లేస్తూ, పైకి వచ్చాడు. మన జగ్గయ్యగారిలా కథానాయకుడిగా కంటె మల్టీస్టారర్లలో సహనటుడిగా ఎక్కువ రాణించాడు. పెద్దగా విజయం సాధించని ఇంగ్లీషు సినిమాల్లోనూ నటించాడు. తను వేసే సినిమాల నాణ్యత నచ్చక నష్టపోతున్నా, తన కిష్టమైన భిన్నతరహా చిత్రాలు నిర్మించాడు. కపూర్‌ వంశస్తులందరూ తిండి, తాగుడు వ్యామోహంతో అందం, ఆరోగ్యం చెడగొట్టుకున్నారు. శశిని ఆ దారిన పడిపోకుండా ఆదుకున్నది అతని భార్య జెన్నిఫర్‌. ఆమె మరణానంతరం అతని జీవితం అల్లకల్లోలమై పోయింది. 

1938లో కలకత్తాలో అతను పుట్టేనాటికి తండ్రి పృథ్వీరాజ్‌ చాలీచాలని జీతంతో న్యూ థియేటర్స్‌లో నటుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి నాయనమ్మ బల్‌బీర్‌ రాజ్‌ అని  పేరు పెడితే తల్లికి నచ్చలేదు. శశి అని పిలిచేది. చివరకు అదే ఖాయమైంది. మరుసటి ఏడాది పృథ్వీరాజ్‌ బొంబాయికి మకాం మార్చాడు. అన్ని రకాల పాత్రలూ వేస్తూ పెద్ద స్టార్‌ అయ్యాడు. తన పిల్లలను వాళ్లంతట వాళ్లనే ఎదగమన్నాడు తప్ప సిఫార్సులు చేయలేదు. పెద్ద కొడుకు రాజ్‌ కపూర్‌ కూడా త్వరగానే అంది వచ్చాడు. కెరియర్‌ తొలి దశలోనే నిర్మాత, దర్శకుడు అయిపోయాడు. సాంఘిక సమస్యలపై సినిమాలు తీసే కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు.

రెండో కొడుకు శమ్మీ అన్నగారి అడుగుజాడల్లో మీసం పెట్టుకుని కొన్నాళ్లు నటించాడు. ఐదేళ్లపాటు అవస్థ పడ్డాక ''తుమ్‌సా నహీ దేఖా'' (1957) తో తన కంటూ ఒక స్టయిల్‌ ఏర్పడింది. యూత్‌కు ఐకాన్‌ అయ్యాడు. స్థూలకాయం వచ్చిపడడంతో అన్నగారిలాగానే త్వరలోనే హీరో వేషాలు మానేసి, కారెక్టరు పాత్రలకు మళ్లాడు. ఇక శశి – రాజ్‌ సినిమాలు ''ఆగ్‌'', ''ఆవారా''లలో బాలతారగా నటించాడు. ''సత్యం శివం సుందరం'' (1977) వరకు రాజ్‌ తన తర్వాతి సినిమాల్లో ఛాన్సు యివ్వలేదు. కాబట్టి యితని యాక్టింగ్‌పై అతనికి నమ్మకం లేదని తేలుతోంది. 

పృథ్వీరాజ్‌ సినిమాలలో వేస్తూనే రంగస్థలంపై నటించేవాడు. తన పేర పృథ్వీ థియేటర్స్‌ అని 1944లో ప్రారంభించి, ఊరూరూ తిరుగుతూ ప్రదర్శనలు యిచ్చేవాడు. అతని పిల్లలు ఆ థియేటర్‌ నిర్వహణలో పాలు పంచుకునేవారు, అవసరమైతే చిన్నా, చితకా వేషాలు వేసేవారు. శశికి చదువు అబ్బలేదు. 14 ఏళ్ల వయసులో చదువు మానేస్తానంటే తండ్రి 75 రూ.ల జీతంతో పృథ్వీ థియేటర్స్‌లో ఉద్యోగిగా చేరమన్నాడు.  నష్టాలు వచ్చి 1960లో పృథ్వీ థియేటర్స్‌ మూసేసేవరకు ఏడేళ్లపాటు రకరకాల హోదాల్లో పనిచేశాడు. అవసరమైనప్పుడు వేషాలూ వేశాడు. ఇదే సమయంలో అన్నగారు రాజ్‌ తన ఆర్‌ కె స్టూడియోలో వచ్చి సాయపడమనేవాడు.

అక్కడ లైటింగు వంటివి చూసేవాడంతే. ఓసారి పృథ్వీవాళ్లు ''దీవార్‌'' అనే నాటకం వేస్తూ ఉంటే చూడడానికి 22 ఏళ్ల జెన్నిఫర్‌ వచ్చింది. తెర వెనుక పనులు చూస్తున్న 18 ఏళ్ల శశి కళ్లల్లో పడింది. అతనికి బాగా నచ్చింది. ప్రదర్శన అయిపోయాక ఆమె వద్దకు వచ్చి, తనను తాను పరిచయం చేసుకుని, వింగ్స్‌లోకి తీసుకెళ్లి అన్నీ చూపించి, దగ్గర్లో ఉన్న చైనీస్‌ రెస్టారెంటుకి తీసుకెళ్లాడు. ఇద్దరి పరిచయాలు జరిగాయి. జెన్నిఫర్‌ తండ్రి జెఫ్రీ కెండాల్‌ రంగస్థల నటుడు. మన సురభి వాళ్లల్లా కెండాల్స్‌ది సంచార నటకుటుంబం. 'షేక్‌స్పియరానా' అనే నాటక కంపెనీ పెట్టుకుని, ఊళ్లు తిరుగుతూ ఇంగ్లీషు నాటకాలు వేసేవారు. కుటుంబసభ్యులందరూ ప్రదర్శనలో ఏదో ఒక విధంగా పాలుపంచుకుంటారు. జెఫ్రీ, అతని భార్య లారా. కూతుళ్లూ అందరూ నటులే. జెన్నిఫర్‌ పెద్ద కూతురు. నటనతో బాటు దుస్తులు, సెట్‌ ప్రాపర్టీస్‌ వగైరా చూసేది.  

శశితో ఆమెకు స్నేహం పెరిగింది. ఇలా వుండగా బెంగుళూరులో వాళ్ల నాటక కంపెనీ వారి ప్రదర్శనలో నటులు తక్కువ పడ్డారు. జెన్నిఫర్‌ తండ్రికి చెప్పి శశిని నటుడిగా తీసుకుని వచ్చింది. ఇతనికి ఇంగ్లీషు సరిగ్గా రాదు. ఆమె ఉచ్చారణతో సహా అన్నీ దగ్గరుండి నేర్పించింది. అప్పణ్నుంచి శశి పృథ్వీతో పాటు షేక్‌స్పియరానాలో కూడా వేషాలు వేస్తూ ఉండేవాడు. జెఫ్రీకి శశి ముందునుంచీ నచ్చలేదు. ప్రేమ పేరుతో తన కూతుర్ని తన నుంచి తీసుకుపోతున్నాడని తెలిసిన దగ్గర్నుంచీ అస్సలు నచ్చలేదు. కూతురంటే పిచ్చిప్రేమ అనే కాదు, ఆమె వెళ్లిపోతే తన కంపెనీ ఏమై పోతుందానన్న దిగులు కూడా. (చివరకు 1963లో మూతపడింది) జెన్నిఫర్‌ పరిస్థితి అర్థం చేసుకుంది. చివరకు శశివైపే మొగ్గు చూపింది. 1958 జులైలో తండ్రికి చెప్పి శశితో బాటు విడిగా వెళ్లిపోయింది. ఐదు నెలల విరామం తర్వాత శశి, జెన్నిఫర్‌ మళ్లీ కెండాల్స్‌తో కలిసి నటించసాగారు. శశి జెన్నిఫర్‌ల ప్రేమను శమ్మీ సమర్థించాడు.

శశి జాతకంలోనే ఇంగ్లీషు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని జ్యోతిష్కుడు చెప్పడంతో పృథ్వీ సర్దుకున్నాడు. ఆర్యసమాజ్‌ పద్ధతిలో పెళ్లి జరిగింది. పురోహితుడు హిందూ వైవాహిక ప్రమాణాలన్నీ ఇంగ్లీషులో  జెన్నిఫర్‌కి వివరించి చెప్పడంతో పెళ్లి మూడుగంటలు పట్టింది. జెన్నిఫర్‌కు మతం గురించి పట్టింపు లేదు. ఆమె చనిపోయాక అంత్యక్రియల్లో ప్రార్థనలు కూడా జరపవద్దంది. అయితే కపూర్‌ కుటుంబంలో కలిసిపోవడానికి వాళ్ల అత్తగారున్నంత కాలం ఆ కుటుంబ ఆచారాలన్నీ – కడవా చౌథ్‌తో సహా – పాటించింది. ఆమె గోమాంసం కాదు కదా, ఏ మాంసమూ తినదు. పూర్తి శాకాహారి. కునాల్‌ కడుపులో ఉండగా శశి బాతులను వేటాడడానికి వెళ్లబోయాడు. జంతుహింసను నిరసిస్తూ ఆమె ''నువ్వు ఓ పక్క నాశనం చేస్తూ ఉంటే, నేను యింకో పక్క ఎలా సృష్టించగలను? నువ్వు బాతులను చంపితే, నీ కొడుక్కి కూడా అదే గతి పడుతుంది జాగ్రత్త'' అంది. శశి బెదిరిపోయి, వేట మానేశాడు. ఇలాటి స్వభావం ఉన్న జెన్నిఫర్‌తో శశి తలితండ్రులకు ఏ రకమైన పేచీ రాలేదు. 

పెళ్లయిన తర్వాత శశి విడిగా వెళ్ల కాపురం పెట్టాడు. అప్పటిదాకా దాచుకున్నది 2 వేల రూ.లుంది. ఇద్దరికీ చెరో రూ.200 జీతం వచ్చేది. 1960లో శశి దంపతులకు మొదటి కొడుకు కునాల్‌ పుట్టాడు. వారి ఆదాయం పిల్లాడు పుట్టాక సరిపోయేది కాదు. పైగా పృథ్వీ థియేటర్స్‌ మూతపడుతోంది. ఇక తప్పని పరిస్థితుల్లో శశి సినిమాల్లో వేషాలకై ప్రయత్నించాడు. తండ్రి, అన్నలు మాలాగే నీ కష్టాలు నువ్వే పడు అన్నారు.  ''చార్‌ దివారీ'' (1961) అనేది అతని మొదటి సినిమా. కిషన్‌ చోప్డా దర్శకుడు. నందా హీరోయిన్‌. ఫ్లాప్‌. రెండో సినిమాగా మంచి ఛాన్స్‌ వచ్చింది. దర్శకనిర్మాత బిఆర్‌ చోప్డా తన తమ్ముడు యశ్‌ చోప్డాకు ''ధూల్‌ కా ఫూల్‌'' (1959) సినిమాను డైరక్టు చేసే అవకాశం యిచ్చాడు. అది హిట్టయింది. రెండో ఛాన్సుగా ''ధర్మపుత్ర'' (1961) యిచ్చాడు. యశ్‌ శశికి హీరోగా అవకాశం యిచ్చాడు.

మాలా సిన్హా హీరోయిన్‌. అది ఫ్లాప్‌. బిమల్‌ రాయ్‌ వంటి ప్రసిద్ధ నిర్మాత తన ''ప్రేమ పత్ర''లో శశికి అవకాశం యిచ్చాడు. సాధనా హీరోయిన్‌. అదీ ఫ్లాప్‌. పెద్ద పెద్ద బ్యానర్లలో నటించిన సినిమాలు కూడా యిలా ఫ్లాపయ్యేసరికి శశిని అదృష్టహీనుడిగా లెక్కకట్టింది సినీలోకం. సాధనతో ప్రారంభమైన మరో సినిమా రెండు రోజుల తర్వాత కాన్సిలయింది. శశి వెళ్లి రాజ్‌ కపూర్‌ వద్ద మొత్తుకున్నాడు. 'ఈ సినీమాయాబజారంటే యింతే, ఇలా చాలాసార్లు జరుగుతుంది. ఇది యింకా తొలి దెబ్బే'' అన్నాడు శశి కంటె వయసులో 14 ఏళ్లు పెద్దయిన రాజ్‌. 1962లో ''మెహందీ లగీ మేరే హాథ్‌'' వచ్చింది.

ఇస్మాయిల్‌ మర్చంట్‌, జేమ్స్‌ ఐవరీలతో  కలిసి శశి, లీలా నాయుడులతో ''ద హౌస్‌హోల్డర్‌'' అనే ఇంగ్లీషు సినిమా తీశారు. అవీ ఫ్లాప్‌. 1963లోనే వచ్చిన ''జబ్‌సే తుమ్హే దేఖా హై'', ''హాలీడే ఇన్‌ బాంబే'', ''యే దిల్‌ కిస్కో దూఁ'', 1964 నాటి బిమల్‌ రాయ్‌ సినిమా ''బేనజీర్‌'' అన్నీ ఫ్లాప్సే. కపూర్ల కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక తండ్రి, ముగ్గురు కొడుకులతో అఖ్తర్‌ మీర్జా ఒక కథ రాశాడు. అది అటుయిటు తిరిగి బిఆర్‌ చోప్డా చేతికి వెళితే యశ్‌కు యిచ్చి డైరక్ట్‌ చేయమన్నాడు. అదే ''వక్త్‌'' (1965). దానిలో శశి కపూర్‌కు, శర్మిలా టాగూరుకు సరసన వేషం యిచ్చాడు యశ్‌. ఏదో వేశాడు కానీ పేరు రాలేదు. అతని అన్నగార్లుగా వేసిన రాజ్‌ కుమార్‌, సునీల్‌ దత్‌, తండ్రిగా వేసిన బలరాజ్‌ సహానీలు పట్టుకుపోయారు. 

అదే ఏడాది వచ్చిన ''మొహబ్బత్‌ ఇస్కో కహతే హైఁ'', కెండాల్స్‌ కంపెనీ చరిత్ర ఆధారంగా తీసిన యింకో ఇంగ్లీషు సినిమా ''షేక్‌స్పియర్‌వాలా'' పోయాయి కానీ ''జబ్‌ జబ్‌ ఫూల్‌ ఖిలే'' మాత్రం సూపర్‌ హిట్‌ అయింది. అప్పటిదాకా ఏడుపుగొట్టు వేషాలు వేసిన నందా దీనిలో గ్లామరస్‌ వేషం వేసింది. పాటలు, కశ్మీరు అందాలు చాలా బాగుంటాయి. ఇతను గొప్పగా నటించాడని చెప్పలేం. ''హసీనా మాన్‌ జాయేగీ'' (1968) అని ప్రకాశ్‌ మెహ్రా తొలిసారి దర్శకత్వం వహించిన సినిమాలో మాత్రమే శశి బాగా నటించినట్లు అనిపించింది నాకు. ఈ దశలో అతను బిగుసుకుని పోయి నటించేవాడు. పాత్రలో యిమిడినట్లు ఉండేది కాదు. ఇంగ్లీషు నాటకాలు, సినిమాలు వేయడం వలన అండర్‌ప్లే చేస్తున్నాను అనుకునేవాడో ఏమో తెలియదు కానీ, నటించేటప్పుడు తనే ఎబ్బెట్టుగా, ఏమిటో యీ సినిమా, యీ పాత్ర బొత్తిగా అసహజంగా ఉంది అనుకుంటూ నటించినట్లు అనిపించేది. కన్విక్షన్‌ కనబడేది కాదు. 

జనాలకూ అలాగే అనిపించినట్టుంది. ''జబ్‌ జబ్‌..''కు ''హసీనా..''కు మధ్య వచ్చిన సినిమాలను హిట్‌ చేయలేదు. నందా తప్ప అతని పక్కన వేషం వేయడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. నిర్మాతలూ క్యూ కట్టలేదు. ఎందుకంటే హీరోగా అతనికి ఒక ఐడెంటిటీ అంటూ లేదు. ప్రత్యేకమైన మానరిజమ్స్‌ లేవు, ఫలానా పాత్ర అతనే వేయగలడు అనే పేరూ లేదు. పెద్దపెద్ద డైలాగులు చెప్పలేడు. ''హసీనా…'' తర్వాత నాసిర్‌ హుస్సేన్‌ వంటి దర్శకనిర్మాత ''ప్యార్‌ కా మౌసమ్‌'' లో ఛాన్సిచ్చి నిలబెట్టాడు. రాఖీ ద్విపాత్రాభినయం చేసిన సూపర్‌ హిట్‌ సినిమా ''శర్మీలీ'' (1971) తర్వాత శశి హీరోగా స్థిరపడ్డాడు. తిరుగు లేకపోయింది.

అప్పణ్నుంచి అలాఅలా వేషాలు వేసుకుంటూ పోయాడు. క్రమేపీ ఆక్వర్డ్‌నెస్‌ పోయింది. తను వేసే పాత్రలు నిజమని తాను నమ్మి, ప్రేక్షకులను నమ్మించగలిగాడు. హీరోగా ''ఆ గలే లగ్‌ జా'', ''చోర్‌ మచాయే శోర్‌'', ''ఫకీరా'' వంటి హిట్‌ సినిమాలలో వేయడంతో బాటు అమితాబ్‌ బచ్చన్‌తో సహనటుడిగా 16 సినిమాలు వేశాడు. అతని కంటె పెద్దవాడైనా అతని తమ్ముడిగా చాలా సినిమాల్లో వేశాడు. అమితాబే కాదు, అనేక మంది హీరోలతో కలిసి ఎటువంటి ఇగో సమస్యలు లేకుండా నటించాడు. టైముకి షూటింగుకి వచ్చేవాడు. రాత్రి పార్టీల గోల లేదు. బుద్ధిగా యింటికి వెళ్లిపోయేవాడు. ఇంట్లో ఏ పేచీ లేదు. 

దీనికంతా కారణం జెన్నిఫరే. ఆమె ఇతన్ని పెద్దగా తిననిచ్చేది కాదు, తాగనిచ్చేది కాదు. ఇంటిని చక్కగా తీర్చిదిద్దేది. పిల్లలను క్రమశిక్షణతో పెంచింది. శశి డబుల్‌ షిఫ్ట్‌లు, త్రిపుల్‌ షిఫ్టులు చేస్తూ డబ్బు తెచ్చి పోస్తూ ఉంటే దాన్ని మేనేజ్‌ చేసేది. సినిమా డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి వెళ్లమని ప్రోత్సహించింది. డబ్బు పోయినా ఫర్వాలేదు, మంచి సినిమాలు తీయాలని అతననుకుంటే సరేనంటూ వాటిలో పాలుపంచుకుని బాధ్యతలు తీసుకుంది. అతనికి ప్రాణప్రదమైన పృథ్వీ థియేటర్స్‌ను పునరుద్ధరించాలని సంకల్పిస్తే రూ. 20 లక్షల ఖఱ్చుతో 1978 నవంబరులో మళ్లీ కట్టించి, మరణపర్యంతం దాన్ని మేనేజ్‌ చేసింది. తమ ''36, చౌరంఘీ లేన్‌'' సినిమాలో ముఖ్యపాత్రలో అమోఘంగా నటించి తన ప్రతిభను చూపుకుంది.

 ''జునూన్‌''లో వివాహితుడైన శశి ప్రేమించిన యువతి తల్లిగా వేస్తే మర్చంట్‌-ఐవరీ వారి ''బాంబే టాకీస్‌'' (1970) సినిమాలో వివాహితుడైన శశితో ఎఫైర్‌ ఉన్న ప్రియురాలిగా వేసింది. శశి-జెన్నిఫర్‌ తీసిన  తొలి సినిమా ''జునూన్‌'' (1978) కష్టం మీద డబ్బు రాబట్టుకుంది. దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ అందరి నుండీ గొప్ప నటన రాబట్టాడు. శ్యామ్‌ బెనగల్‌ దర్శకత్వంలోనే మహాభారత కథ ఆధారంగా కార్పోరేట్‌ కుటుంబాల మధ్య కలహాలను చూపిన ''కలియుగ్‌'' (1980) రూ.10 లక్షల నష్టాన్ని తెచ్చింది. దానిలో శశి కర్ణుడి పాత్రలో చాలా మంచి నటన చూపాడు. అపర్ణా సేన్‌ దర్శకత్వంలో తీసిన ''36, చౌరంఘీ లేన్‌'' (1981) తో 24 లక్షలు పోయింది. కొడుకుని హీరోగా పరిచయం చేయడానికి తీసిన ''విజేత'' (1982) కూడా ఆడలేదు.

భారీగా తీసిన ''ఉత్సవ్‌'' (1984)లో శశి కూడా భారీ కాయంతో విలన్‌ పాత్రలో కనబడ్డాడు. పేరేమో రేఖకు వచ్చింది. ఇతనిది 50 లక్షలు పోయింది. అప్పట్లో మల్టీప్లెక్స్‌లు ఉండి ఉంటే, యీ సినిమాలకు యింత నష్టం వచ్చేది కాదు. బాగుందనే టాక్‌ వచ్చేలోపున సినిమాలు వెళ్లిపోయేవి. ఇక జెన్నిఫర్‌ పోయాక అమితాబ్‌, ఋషి కపూర్‌లు సహతారలుగా స్వీయదర్శకత్వంలో ఇండో-రష్యన్‌ వెంచర్‌గా తీసిన ''అజూబా'' (1991) అయితే మూడున్నర కోట్ల నష్టాన్ని మిగిల్చింది. పృథ్వీ థియేటర్స్‌ మళ్లీ నిర్మించడానికి, నిలబెట్టడానికి శశి, అతని కుటుంబం చాలానే కష్టపడ్డారు, పడుతున్నారు. 

జెన్నిఫర్‌కు కాన్సర్‌ వచ్చిందని 1983లో తెలిసింది. పై ఏడాదే పోయింది. అప్పటికి శశికి 45 ఏళ్లు. ఆమె పోవడంతో నిరాశలో మునిగిపోయి, అతిగా తాగసాగాడు, తినసాగాడు. ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్నాడు. ఏవో సినిమాలు, టీవీ సీరియల్స్‌ వేశాడు కానీ పెద్దగా చెప్పుకోదగ్గవి కావు. గత 20 ఏళ్లగా యింటిపట్టునే ఉంటున్నాడు. మధ్యలో కాస్త కోలుకుని పాతిక కిలోలు తగ్గాడు. 2002లో ఈజిప్టు వెళ్లి ఎవార్డు తీసుకున్నాడు. ఏది ఏమైనా జెన్నిఫర్‌ వెళ్లిపోయాక అతని జీవితం కళ తప్పింది. నటుడిగా అతను ''న్యూఢిల్లీ టైమ్స్‌'' (1986)లో జర్నలిస్టు పాత్రకు జాతీయ అవార్డు తెచ్చుకున్నాడు. కానీ దాన్ని జెన్నిఫర్‌ చూడలేదు. పద్మభూషణ్‌ (2011), ఫాల్కే ఎవార్డు (2015) సరేసరి. ఇంగ్లీషు సినిమాలతో సహా 116 సినిమాల్లో నటించిన శశి లివర్‌ సిరోసిస్‌తో డిసెంబరు 4న పోయాడు. ఆయన స్కూల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ మర్యాదస్తుడిగా, అభిరుచి గల నిర్మాతగా, నాటకరంగానికి కృషి చేసిన వ్యక్తిగా చాలాకాలం గుర్తుండిపోతాడు. (ఫోటో – శశి, జెన్నిఫర్‌ కపూర్‌, పిల్లలు)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
[email protected]